కింగ్ మేకర్

 సీజనల్ సమీక్షలు

కింగ్ మేకర్

                             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



    రాజకీయ జీవితాలు ఎలా ఉంటాయి, అధికారం కోసం రాజకీయ చదరంగం ఎలా మారణహోమంగా, వెన్నుపోట్ల తీరంగా మారుతుందో స్పష్టం చేసిన తాండవ్ ఈ 2021 జనవరి 15 న అమెజాన్ లో విడుదలై ముందే నుండే ప్రేక్షకుల్లో రేకెత్తించిన కుతూహలాన్ని నిలబెట్టుకోగలిగింది. సైఫ్ అలీ ఖాన్ ,డింపుల్ కపాడియా ముఖ్య పాత్రలుగా ఉన్న సీజన్ వన్ నిజంగా 2021 కి మంచి సీజన్స్ స్టార్టింగ్ ను ఇచ్చిందనడంలో సందేహం లేదు.

     తాండవ్ మొత్తం తొమ్మిది ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ ను మలచిన తీరు ప్రేక్షకులను వదలకుండా చూసేలా చేస్తుంది. మొదటి ఎపిసోడ్ లో దేశ రాజకీయ పరిస్థితిని పరిచయం చేస్తూ, కళాశాల స్థాయిని కూడా ప్రేక్షకులకు చూపిస్తూ మొదటి రాజకీయ పావును కదులుస్తారు. అప్పటికే మూడు సార్లు ప్రధానిగా చేసిన దేవకి నందన్ కొడుకు సమర్ ప్రతాప్ సింగ్(సైఫ్ అలీ ఖాన్). అప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. నాలుగో సారి కూడా దేవకి నందన్ పార్టీ జన్ లోక్ దల్ గెలుస్తుందని పక్కాగా అందరికి  తెలుసు.

     దేవకి నందన్ పెళ్ళి చేసుకోకపోయినా అతనితో 30 ఏళ్ళుగా దాదాపు భార్యగా ఉన్న వ్యక్తి అనురాధకిషోర్(డింపుల్ కపాడియా). ఈ సారి దేవకి నందన్ గెలిచిన తర్వాత అనురాధ కిషోర్ కొడుకు రఘును డిఫెన్స్ మినిస్టర్ చేయాలని దేవకి నందన్ అనుకుంటాడు. కానీ అదితిని చేయాలని సమర్ అనుకుంటాడు. తండ్రి బ్రతికి ఉండగా తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండదని గ్రహించిన సమర్ ప్రతాప్ సింగ్ తన తండ్రి తాగే మందులో అకోనైట్ అనే విషం కలిపి హత్య చేస్తాడు. దానిని హార్ట్ ఎటాక్ గా మారుస్తాడు.

     దేశ రాజకీయం ఓ వైపు నడుస్తూ ఉంటుంది. ఇంకో వైపు VNU అనే కాలేజ్ రాజకీయాలు కూడా నడుస్తూ ఉంటాయి. రైతులు చేస్తున్న  ప్రొటెస్ట్ లో ఆయుబ్,ఇమ్రాన్,సలీం లను చంపమని పోలీసులకు అనధికార ఆజ్ఞలు ఉంటాయి. ఆ ప్రొటెస్ట్ లో ఆయుబ్, సలీం లను చంపేస్తారు. అలాగే ఇమ్రాన్ ను అరెస్ట్ చేసి అతన్ని కూడా టెరరిస్ట్ గా నమ్మించి ఎన్ కౌంటర్ చేయాలనుకుంటారు. కానీ అతన్ని కాపాడుకోవడానికి అతని మిత్రుడైన శివశంకర్ తన స్నేహితులతో కలిసి చేసిన ప్రయత్నాలే అతన్ని రాజకీయాల వైపు నడిచేలా చేస్తాయి. ఓ పక్క దేవకి నందన్ మరణం,ఇంకో పక్క ఈ యువత పరిచయంతో మొదటి ఎపిసోడ్ ముగుస్తుంది.

              జన్ లోక్ దల్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ సమర్ తనకు ప్రత్యర్ధులైన వారిని వారికి వారే ఎలా తప్పుకునేలా చేశాడు అన్నది కీలకాంశంగా ఉంటుంది. పార్టీలో దేవకి నందన్ తో పాటు అంతే సీనియర్ గా ఉన్న వ్యక్తి గోపాల్ దాస్. అతను దేవకి నందన్ తర్వాత ప్రధాన మంత్రి అవ్వాలనుకుంటాడు.అది తెలుసుకున్న సమర్ తనకు అనుకూలంగా ఉన్న పార్టీ సభ్యుని చేత గోపాల్ దాస్ ఓ పక్క దేవకి నందన్ మరణిస్తే ఇంకో పక్క లాబీయింగ్ ఎలా చేస్తున్నాడో అన్నది స్పష్టం అయ్యేలా చేస్తాడు. దానితో అతని పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది.ఇంకో పక్క తమ ఫ్రెండ్ ఇమ్రాన్ ను కాపాడుకోవడానికి మీడియా సాయం కోరాలనుకున్న అప్పటికే ప్రధాన మంత్రి మరణం వార్తతో అవి ఇంకే విషయాలను పట్టించుకునే పరిస్థితిలో ఉండవు. ఇక దేవకి నందన్ అంత్యక్రియల దగ్గర అనురాధ ఎకోనైట్ అని రాసి ఉన్న కాగితపు ముక్కను సమర్ కు ఇస్తుంది. తనను ప్రధానమంత్రిగా తర్వాతి రోజు ప్రకటించకపోతే  అసలు విషయం అందరికి తెలియజేస్తానని హెచ్చరిస్తుంది. ఇక్కడితో రెండో ఎపిసోడ్ ముగుస్తుంది.

              సమర్ అనురాధను ప్రధానమంత్రిగా ప్రకటిస్తాడు. ఇక కాలేజీలో జరిగే విషయాలకు వస్తే జన్ లోక్ దల్ పార్టీలో ఉన్న కైలాష్ కుమార్ కాలేజీలో పని చేసే సంధ్యను తనతో వ్యక్తిగత సంబంధం ఉండటం వల్ల డీన్ ను చేస్తాడు. ఆమె భర్త జిగర్ కు సంధ్య విడాకుల నోటీస్ పంపిస్తుంది. జిగర్ కాలేజీ అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇమ్రాన్ ను విడుదల చేయించడానికి  ఆ రోజు జరిగినట్టే ఓ నాటకపు ప్రొటెస్ట్ ను అందులో చనిపోయిన ఇద్దరి గురించి కూడా ఓ వీడియో ద్వారా అందరికీ తెలిసేలా చేస్తాడు. అది వైరల్ అవుతుంది. ఆ వీడియో వల్ల ఇమ్రాన్ విడుదలవుతాడు.అతన్ని న్యూస్ లో చూసిన సమర్ తనకు చంద్రగుప్తుడు దొరికాడని అనుకుంటాడు. అప్పటికే ప్రధానమంత్రి అవ్వలేని సమర్ కు కింగ్ నుండి కింగ్  మేకర్ గా మే ఆలోచన రూపుదిద్దుకుంటుంది. ఇదే ఎపిసోడ్ లో మనకు ఎలా అనురాధకు ఎకోనైట్ విషయం తెలిసింది అనేది స్పష్టం చేస్తాడు. ఓ అజ్ఞాత కాల్ ద్వారా అకోనైట్ గురించి ఆమెకు తెలుస్తుంది.శివ స్నేహితురాలు సనా కు జిగర్ తో  సంబంధం ఉంటుంది.

     అనురాధ సమర్ కు ఏ పదవి ఇవ్వకుండా కేవలం ఓ అడ్వైజరి కమిటీ ప్రెసిడెంట్ గా ఉంచి అతని రాజకీయ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. సమర్ కు అన్నీ పనులు చేసే వ్యక్తి గుర్పాల్. సమర్ తన కాలేజీ స్నేహితుడైన జిగర్ ను కలుస్తాడు. అతన్ని తన పథకంలో భాగం చేస్తాడు. శివకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోయినా తన వైపుకు మళ్లించుకునే పథకమే అది. అప్పటి వరకు రాజకీయాల మీద ఆసక్తి లేకపోయినా చివరకు ఆ కాలేజీ లో ఓ పార్టీ తరపున వైస్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేస్తాడు శివ. ప్రెసిడెంట్ గా చేతన్ క్రాంతి, జాయింట్ సెక్రటరీ గా విశాల్ ఉంటారు. విశాల్ గుర్పాల్ తో కలిసి వెళ్తాడు. ఎప్పుడు డబ్బుల కోసం అతను చెప్పేవి చేసిన ఈ సారి ఓ రెండు రోజులు బయటకు రాకుండా ఉండమని గుర్పాల్ అతన్ని  ఓ చోట ఉంచుతాడు.

     జిగర్ ద్వారా సనా చేత విశాల్ ఫోన్ ను చేతన్ లైబ్రరీ డెస్క్ లో ఉంచి అతని మీద అనుమానం వచ్చేలా చేస్తాడు సమర్. ఆ తర్వాత చేతన్ అరెస్ట్ అవుతాడు. మళ్ళీ సమర్ విడుదల చేయిస్తాడు. సనాకు అలా చేయడం ఇష్టం లేకపోయినా తన చెల్లెలు అదా కొన్నేళ్ళ క్రితం తన బాయ్ ఫ్రెండ్ అయిన వ్యక్తి తిరుగుబాటిదారి అవ్వడం,అతను అరెస్ట్  అయ్యే సమయంలో అతను ఆత్మహత్య చేసుకునే సమయంలో ఆమె అక్కడే ఉండటంతో ఆమెను ఆ హత్యా నేరంలో ఇరికిస్తానని ఓ పోలీసు బెదిరిస్తూ ఉండటం,అతను 10 లక్షలు డిమాండ్ చేయడంతో దాని కోసం జిగర్ చెప్పినట్టు చేస్తుంది. తిరిగి వచ్చిన క్రాంతికి,శివకు మధ్య చీలికలు వస్తాయి.

     విశాల్ శవం ఆ కాలేజీ వెనుక దొరుకుతుంది. అతని మరణాన్ని సాకుగా చేసుకుని, జిగర్ స్నేహితుడిగా సమర్ ఆ కాలేజీకి వస్తాడు. శివను మెచ్చుకుని వెళ్తాడు. సనా ద్వారా విశాల్ కేసులో ఇన్వెస్టిగేషన్ కోసం శివ మళ్ళీ సమర్ ను కలిసేలా ప్లాన్ చేస్తాడు సమర్. శివ అడిగిన వెంటనే అనధికార ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఆ హత్య చేసింది చేతన్ క్రాంతి అనే నిరూపించి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇక అనురాధ అదితికి,కైలాష్ కుమార్ కు,ఇంకొందరికి ఎవరైతే సమర్ కు సన్నిహితులో వారికే ఇస్తుంది. దాని ద్వారా వారిని తన వైపు మళ్లించుకోవాలని ఆమె అనుకుంటుంది. ఇంకో పక్క గుర్పాల్ అకోనైట్ విషయం ఎవరు బయటపెట్టారో తెలుసుకోవడానికి ఆ డాక్టర్స్ ఇళ్లల్లో కెమెరాలు పెట్టి,ఇంకొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.

     తనకు సాయం చేసిన జిగర్ ను అతని భార్యతో కలపాలని నిర్ణయించుకుంటాడు సమర్. అప్పటికే సంధ్య తాను గర్భవతినని చెప్పడంతో, ఆ విషయం మీడియాకు తెలిసేలా చెయ్యడం,అప్పటికే కైలాష్ కు భార్య ఉండటంతో అతను తన పదవి,కుటుంబం కోసం సంధ్యను వదిలేస్తాడు. ఇంకో పక్క సనా తాను చేసింది తప్పుగా భావించి అసలు విషయం చెప్పాలనుకున్నా జిగర్ చెప్పవద్దని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత క్రాంతిని కూడా జైలులో కలిసి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ చెప్పలేకపోతుంది.

     గుర్పాల్ సమర్ తండ్రి హత్య చేయబడకముందే ఓ డాక్టర్ అతన్ని కాపాడటం కోసం అనురాధకు ఫోన్ చేసి చెప్పినా కావాలనే ఆ ప్రయత్నం ఆపలేదని స్పష్టం అవుతుంది. దానితో పాటు వారి దగ్గర అకోనైట్ పేరు తప్ప ఇంకే సాక్ష్యం లేదని స్పష్టం అవ్వడంతో గుర్పాల్ ,అనురాధ సెక్రటరీ అయిన మైథిలిను బెదిరించి, ఆ హత్య చేయించినవారికే కాదు, దానిలో భాగంగా ఉన్న వారికి కూడా పడుతుందని ఏదైనా సాక్ష్యం అనురాధకు వ్యతిరేకంగా ఇవ్వమని చెప్తాడు. అనురాధ తనకు దేవకీ నందన్ హత్య విషయం ముందే తెలుసు అని చెప్తున్న ఆడియో రికార్డింగ్ గుర్పన్ కు పంపిస్తుంది. దాని సాయంతో అనురాధను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసేలా చేస్తాడు. అనురాధ అనారోగ్య కారణాల ఆధారంగా అలా చేసినట్టు చేసేలా చేస్తాడు. సమర్ గోపాల్ ను తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రకటిస్తాడు.

     జన్ లోక్ దళ్ కు ఆహ్వానించినా శివ తన సొంత పార్టీ తాండవ్ ను స్టాపిస్తాడు. అదే పార్టీ పేరు మీదుగా నామినేషన్ వేస్తాడు,గెలుస్తాడు. సనా,క్రాంతి ఇద్దరు హత్య చేయబడతారు. అటు తాండవ్ స్థాపన,ఇటు సమర్ కింగ్ మేకర్ గా మారడం తో సీజన్ వన్ ముగుస్తుంది.

     రాజకీయ తంత్రంలో తప్పు-ఒప్పులు,మోసగించడం-మోసగించబడటం,గెలవడం-ఓడిపోవడం సర్వసాధారణం.అందులోనూ ఇక్కడ నాయకులకు అన్నింటి కన్నా ఎక్కువ అనుబంధం వారు ఉన్న పదవి,అది తెచ్చే అధికారం మీద మాత్రమే ఉంటుంది. సమర్ అలా మారడానికి కారణం అతని తండ్రి అడుగుజాడల్లో నడవటమే.ఇది కల్పితం అయినా మన రాజకీయ చరిత్రలు ఇంకా దారుణమైనవే. తల్లి కొడుకులు,తండ్రి కొడుకులు,మామా అల్లుళ్లు ..బంధం ఏదైనా అవి రాజకీయాలలో మాత్రం వర్తించవు. ఇక్కడ గెలవాలంటే ఎవరిని నమ్మకూడదు, ఎప్పుడు మనతో ఉండే మన ప్రత్యర్ధులు మనని దాటి పోకుండా  ఉండేందుకు వారిని అదుపులో ఉంచుతూనే ఉండాలి. ఇంతకు మించిన క్రూరమైన క్షేత్రం ఇంకేది ఉండదు కూడా!అజ్ఞాత రచయిత చెప్పినట్టు నిజం లేకపోతే నిజాన్ని సృష్టించి అయినా గెలవాలి,అదే రాజ్యతంత్ర సూత్రం. ఇక సీజన్ టూ కోసం వేచి చూస్తే తప్ప ఈ కింగ్ మేకర్ అడుగులు ఎటు కదులుతాయో,అసలు తన దగ్గర ఉన్న వారిని అదుపులో ఉంచుకోకుండా బయటి వ్యక్తిని ఎందుకు ఎన్నుకున్నాడో మనకు తెలియవు...మరి వేచి చూద్దాం!

                     *    *    *

    

    

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ