మారని మనస్తత్వాలు

 చదువరి

                మారని మనస్తత్వాలు

                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

  స్త్రీ పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలు కాలంతో పాటు మారుతున్నా, స్త్రీ మారే క్రమంలో ఉన్నప్పుడూ ఆమె చర్యలను ఆమోదించడం ఆమె కడుపున పుట్టిన బిడ్డలకు కూడా కొరుకుడు పడని అంశంగా కొన్ని సార్లు ఉంటుంది. దీనికి కారణం స్త్రీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో కష్టాలు ఎదురైనా సర్దుకుపోతూ జీవిస్తే ఆమెను సాధ్వీగా చూసేవారు కూడా ఆమె తన ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఆమెను హీనంగా చూసే ఆనవాళ్ళు ఎక్కడో అక్కడ కనిపించక మానవు. ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్న స్త్రీ జీవిత కేంద్రంగా డి.కామేశ్వరి గారు రాసిన నవలే  "అగ్ని పరీక్ష. "

            అర్చన,రావుల వివాహం జరిగాక ఉద్యోగరీత్యా వారు ఢిల్లీలో ఉంటూ ఉంటారు. రావు తల్లిదండ్రులు డాక్టర్లు అవ్వడం, వారి మంచితనం చూశాక రావు కూడా అలాంటి మనస్తత్వం కలవాడే అని పెళ్ళి చేసుకుంటుంది అర్చన. ఇంజనీర్ గా పని చేస్తున్న రావు కు ఉద్యోగరీత్యా ఎన్నో పార్టీలు ఉండటం,అక్కడికి అందరూ భార్యలను తీసుకువెళ్లడంతో అర్చనను కూడా తీసుకువెళ్ళక తప్పేది కాదు అతనికి. అర్చన అందగత్తె అవ్వడం వల్ల,అందరూ పార్టీలలో ఆమెకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల న్యూనతకు గురైన అతను ఆమెను ఇంటికి వచ్చాక అనుమానంతో చిత్రవధకు గురిచేసేవాడు.

            తర్వాత ఆమె గర్భవతి అవ్వడంతో,ఇక పార్టీల నుండి ఆ కారణంతో తప్పించుకోవడం వల్ల ఆమెకు అర్చన పుట్టి, కాస్త ఊహ తెలిసేవరకు ఆమె కాస్త బాగానే ఉంది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఆమె పార్టీలకు భర్తతో కలిసి వెళ్లాల్సి వచ్చింది. భర్త తనను అనుమానంతో బాధ పెడతాడని తెలిసి, రానని చెప్పినా బలవంతం చేసి న్యూ ఇయర్ డే పార్టీకి తీసుకువెళ్తాడు రావు. ఆ రోజు అందరూ పార్టీలో తాగి, అర్చనను కూడా బలవంతం చేయడంతో కాస్త వారి కోసం తాగినట్టు నటించి, కొందరితో డ్యాన్స్ చేయాల్సిన పరిస్థితిని తప్పించుకోలేక అలానే చేస్తుంది. కానీ ఇంటికి వచ్చాక ఆమె హింసించి, అర్థరాత్రి బిడ్డతో సహ ఇంటి బయటకు నెట్టేస్తాడు రావు.

            ఆ చీకటి రాత్రిలో అపార్ట్మెంట్ బయట అలానే చంటి బిడ్డతో కూర్చుని ఉన్న ఆమెను పక్క అపార్ట్మెంట్ లో ఉండే రాజేష్ చూసి,ఆమెను ఆహ్వానించినా మొదట నిరాకరించినప్పటికీ తన భర్త ఇక తలుపు ఆ రాత్రి తియ్యడని అర్థమయ్యాక అతనితో కలిసి అతని అపార్ట్మెంట్ కు వెళ్తుంది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన అర్చన ఆ మూడేళ్లు తాను ఎలా అతన్ని భరించిందో చెప్పి తర్వాతి ఉదయం అతనితో గట్టిగా చెప్పి బట్టలు సర్దుకుని బిడ్డతో సహా రాజేష్ సాయంతో తన పుట్టింటికి వెళ్లిపోతుంది.

            వెళ్ళిన ఆమె కొన్నాళ్ళకు రాజేశ్ కు ఉత్తరం రాస్తుంది. తనను ఎంతో కష్టపడి మళ్ళీ భర్త దగ్గరకు పంపాలని ప్రయత్నించినప్పటికీ కూడా తాను వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని అందులో రాస్తుంది. కానీ అందులో ఆమె చిరునామా ఉండదు. అప్పటికే మొదటి చూపులోనే ఆమెను ప్రేమించిన రాజేశ్ ఒకవేళ భర్త నుండి ఆమె విడిపోతే ఆమెను పెళ్లిచేసుకుందామనే నిర్ణయించుకుని ఉన్నాడు.

            ఆమె కోసం రెండేళ్ళు వెతికి వెతికి చివరకు ఓ ఫ్రెండ్ కు వీడ్కోలు చెప్పడానికి రెయిల్ ఎక్కించడానికి వచ్చినప్పుడు ఆమెను అనుకోకుండా కలుస్తాడు. ఆమె చిరునామా తీసుకుని మర్నాడు వెళ్ళి ఆమెను పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్తాడు. అత్తామామలు మంచి మనసున్న వారవ్వడంతో కొడుకుతో విడాకులు ఇప్పించి మరి ఆ వివాహానికి సహకరిస్తారు.అర్చన భర్త నుండి విడిపోయాక బి ఎడ్ చదువుకోవడానికి తన కూతురైన పూజను అత్తమామల దగ్గర ఉంచింది. ఆ తర్వాత రాజేశ్ ను వివాహం చేసుకున్నాక చదువు ఆ సంవత్సర మధ్యలో ఆగిపోతుందని తర్వాతి ఏడు తీసుకువెళ్దామని నిర్ణయించుకుంటుంది.

            కానీ ఈ లోపే అర్చన  గర్భవతి అవ్వడంతో మళ్ళీ వాయిదా పడుతుంది.అదే సమయంలో పూజను తరచూ చూడటానికి వచ్చే తండ్రి ఆమె మనసులో తల్లి మీద విషం నింపాడు. ఆమె కావాలని రాజేష్ ను పెళ్ళి చేసుకోవాలని పార్టీలో మగవాళ్ళతో తాగి ,తన అందం మీదున్న గర్వంతో  తనను బాధ పెట్టి ,చిన్న గొడవను సాకుగా చేసుకుని వెళ్లిపోయిందని ఆమె మనసులో నాటుకునేలా చేస్తాడు. పూజ మనసులో తల్లి పట్ల కోపం, ద్వేషం నిండిపోయేలా చేశాడు.

            తర్వాత అభిషేక్ పుట్టాక పూజను  తీసుకువెళ్దాం అని అర్చన అనుకునేసరికి ఆమె అత్తగారికి త్రోట్ క్యాన్సర్ రావడంతో ఆమె ఆఖరి కోరిక కోసం పూజను అక్కడే ఉంచేయాల్సి వస్తుంది. అలా పూజకు ఆమెకు మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అర్చన అత్తగారు మరణించాక పూజను ఆమె తన ఇంటికి తీసుకు వస్తుంది. అప్పటికే రావు కూడా ఇంకో వివాహం చేసుకున్నాడు.

            పూజ రాజేశ్ ను తన తండ్రిగా అంగీకరించదు.ఆఖరికి తన ఇంటి పేరు రాజేశ్ పేరు నుండి రావు ఇంటి పేరుకు బలవంతం మీద మార్పించుకుంటుంది పూజ. రోజు రోజుకి వారి మీద ద్వేషం పెంచుకుంటూ ఉంటుంది. తాత దగ్గరికి తిరిగి వెళ్దామనే పూజ ఆశ కూడా ఆయన కూడా మరణించడంతో పోతుంది. తన తండ్రిని తీసుకువెళ్లమని రాసిన తన భార్య ఒప్పుకోకపోవడం వల్ల రావు ఒప్పుకోడు. చివరకు ఆ కోపం అంతా అర్చన మీదే పెంచుకుంటుంది. పూజ ధోరణితో విసిగిపోయిన అర్చన కూడా ఆమెను పట్టించుకోవడం మానేసి హాస్టల్ లో చేర్పిస్తుంది. హాస్టల్ జీవితం పూజకు నచ్చుతుంది.

            ఆ తర్వాత సెలవుల్లో ఇంటికి వస్తుంది. అదే సమయంలో అర్చన పక్కింట్లోనే ఉండే రాజేశ్ కొలీగ్ మెహతా భార్య సునీతా కజిన్ అయిన నిఖిల్ తో ప్రేమలో పడుతుంది పూజ. తర్వాత కాలేజీలో చేర్పిస్తుంది అర్చన. కానీ నిఖిల్, పూజ మధ్య ప్రేమ ఉత్తరాల ద్వారా నడుస్తూ ఉంటుంది. ఆ విషయం అర్చన గమనించినా ప్రయోజనం లేకుండా పోతుంది. తనను పెళ్ళి చేసుకోమని బలవంత పెడితే నిఖిల్ ఆమెను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. తల్లిదండ్రుల మీద పంతంతో బట్టలు కూడా తీసుకోకుండా అతనితో వెళ్లిపోతుంది పూజ.

            నిఖిల్ తో ఆమె వైవాహిక జీవితం సజావుగా సాగదు. ఆమె ఊహలు ఏవి నిజం కావు. వాస్తవిక జీవితంలో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆమెకు తెలిసి వస్తుంది. రావులానే పూజను కూడా నిఖిల్ హింసిస్తూ ఉంటాడు.చివరకు ఆ బాధలు తట్టుకోలేక ఆమె తిరిగి పుట్టింటికే వచ్చేస్తుంది. నిఖిల్ అర్చన మీద అకారణంగా ద్వేషం పెంచుకోవడం వల్ల ఆమె మంచితనాన్ని పూజకు తెలిసి వచ్చేలా చేయడానికి , ఓ స్త్రీ ఎటువంటి పరిస్థితుల్లో భర్తను వదిలివేస్తుందో ఆమెకు తెలియజెప్పడానికే తాను అలా చేశానని నిఖిల్ చెప్తాడు. ఈ ఉదంతంతో మారిన పూజ రాజేష్ ను మనఃస్ఫూర్తిగా తన తండ్రిగా అంగీకరిస్తుంది ,తల్లి మనసును అర్ధం చేసుకుంటుంది. నిఖిల్ ,పూజ ఒకటవుతారు.       

             స్త్రీ జీవితంలో ఆమె పట్ల గౌరవంగా ప్రవర్తించడానికి సమాజం కొన్ని అర్హతలను నిర్ణయిస్తుంది. ఆ అర్హతల కోసం ఎంతోమంది స్త్రీలు బాధల్ని పంటి దిగువున భరించి రాజీ పడిపోతుంటారు. అటువంటి వారిని మంచివారని ,సహనశీలురని కీర్తిస్తూ వారిలా గడపటమే స్త్రీ జీవన గమ్యంలో ఉత్తమమనే భావనను కలిగిస్తారు. ఆ సంకెళ్ళు తెంచుకోవాలని స్త్రీ ప్రయత్నించిన ప్రతి సారి కూడా ఆమె ఎన్నో ఒడుదుడుకులు ,అవమానాలు ఎదుర్కోవాల్సిందే. పురోగమనంలో మనం ఎక్కడ ఉన్న స్త్రీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ ఆమెను నిందించే ప్రవృత్తి మాత్రం నేటికీ అంతం కాలేదు. 

               *    *     * 

         


Comments

  1. నా జీవితం తో పాటు ఎంతో మంది శ్రిలుజీవితాని మీరు చెప్పిన ప్రస్తితులు ప్రతిబింబాలు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ