ఆఖరి సంతకం

సినీ సంచారం

ఆఖరి సంతకం

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


 

          మనందరికీ మనవైన ఇల్లులు ఉంటాయి. దానిలో నివసించడం మనం భద్రతగా భావిస్తాం. కానీ అటువంటి పరిస్థితులు లేని సందర్భం మన జీవితంలో ప్రవేశించి ఓ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో ఓ తొమ్మిది నెలలు జీవితం గడపాల్సి వస్తే ఆ జీవితం ఎలా ఉంటుంది? ఈ అంశం ఆధారంగా స్టీవెన్ స్పిల్బర్గ్ దర్శకత్వంలో టాం హ్యాంక్స్ నాయకుడిగా 2004 లో కామెడీ డ్రామాగా వచ్చిన సినిమానే 'ద టెర్మినల్ .' వాస్తవానికి మెహ్రాన్ కరిమి నస్సేరి అనే ఇరానియన్ శరణార్ధీ కూడా ఫ్రాన్స్ లో ఉన్న చార్లెస్ డి గాల్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో 26 ఆగస్ట్ 1988 నుండి జులై 2006 వరకు అంటే ఎనిమిదేళ్లు అక్కడే జీవితం గడిపాడు. ఆయన ఆత్మకథ 2004 లోనే ' ద టెర్మినల్ మ్యాన్ 'పేరుతో ప్రచురించబడింది. ఒక్క టెర్మినల్ లో గడపటం అన్న విషయం తప్ప ఇతనికి ,మన సినిమాలోని కథా నాయకుడికి ఏ సంబంధం ఉండదు.

          విక్టర్ నవరోస్కీ క్రకోజియా(కల్పిత దేశం ) అనే దేశానికి చెందినవాడు. అతను జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానశ్రాయానికి వచ్చేసరికి అతని దేశంలో జరిగిన ప్రచ్చన్న యుద్ధం వల్ల దేశం లో మిలిటరీ కూప్ వల్ల ఆ దేశం యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. దానితో అతని పాస్ పోర్ట్ కు కూడా విలువ ఉండదు. విక్టర్ కు ఇటు అమెరికాలో ప్రవేశించడానికి అనుమతి ఉండదు, అటు తన దేశం వెళ్లడానికి లేదు.

        ఇక వేరే అవకాశం లేక అదే ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో జీవనం సాగిస్తూ ఉంటాడు విక్టర్. ఆ ఎయిర్ పోర్టుకు కస్టమ్స్ డైరెక్టర్ గా ఉన్న ఫ్రాంక్ డిక్సన్ ఎలా అయినా సరే విక్టర్ ను వదిలించుకోవాలనుకుంటాడు. కానీ విక్టర్ మాత్రమే ఎప్పుడు చట్టాన్ని అతిక్రమించేలా ప్రవర్తించడు, పారిపోవడానికి ప్రయత్నించడు కూడా. అక్కడ ఎయిర్ పోర్ట్ సిబ్బందిని మిత్రుల్ని చేసుకుంటాడు విక్టర్ . ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాడు.

          ఫ్లైట్ అటెండెంట్ గా ఉన్న అమిలియా తో కూడా అతనికి పరిచయం ఏర్పడుతుంది. అప్పటికే ఆమె ఓ పెళ్ళయిన వ్యక్తితో బ్రేక్ అప్ అవుతుంది. ఓ గోడను అతను రెనోవేట్ చేయడం చూసిన ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టర్ అతనికి ఆ ఎయిర్ పోర్ట్ రెనోవేషన్ పని అప్పగిస్తాడు. దాని తర్వాత సిబ్బంది కూడా సాయపడటం ,అందరికీ తలలో నాలుకలా ఉండటం వల్ల అందరికీ ఇష్టుడవుతాడు. కానీ డిక్సన్ కు మాత్రం అతన్ని ఎలా అయినా సరే వదిలించుకోవాలని ఉంటుంది.

          తన తండ్రికి జాజ్ సంగీతం అంటే ఎంతో ఇష్టమని, ఓ సారి హంగేరియన్ న్యూస్ పేపర్లో పడిన 57 మంది జాజ్ మ్యూజిక్ ట్రూప్ వారి ఆటోగ్రాఫ్స్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకోవడం మొదలుపెట్టడాని ఆఖరి వ్యక్తిది తప్ప అందరిదీ తీసుకున్నాడని ఆ తర్వాత మరణించాడని ,ఆ వ్యక్తి ఆటోగ్రాఫ్ కోసం తాను అమెరికా వచ్చానని చెప్తాడు విక్టర్ అమిలియాతో.

          తొమ్మిది నెలల తర్వాత విక్టర్ దేశమైన క్రకోజియా లో  ప్రభుత్వ పాలన వస్తుంది. అమిలియా తను బ్రేక్ అప్ అయిన వ్యక్తితో మరలా సంబంధం పెట్టుకుని అతనికి ఎమర్జెన్సీ వీసా తెప్పిస్తుంది. దాని మీద డిక్సన్ సంతకం ఉండాలి. దీనిని అదునుగా తీసుకున్న డిక్సన్ అతనికి సహకరించిన సిబ్బంది చేసిన తప్పులను చెప్తాడు. వారిలో గుప్తా అనే అతను ఓ హత్య చేసి భారతదేశం నుండి పారిపోయి వచ్చాడని తనకు తెలుసని అతన్ని కూడా ఇరికిస్తానని చెప్పడంతో తిరిగి తన దేశం వెళ్లిపోవడానికి సిద్ధపడతాడు. ఆ విషయం తెలుసుకున్న గుప్తా కావాలని ప్లేన్ కు ఎదురుగా నిలుచుని తాను సస్పెండ్ అయ్యే పని చేస్తాడు.

         విక్టర్ వెళ్ళి సంతకం తీసుకుందామని అనుకున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయమని సదరు అధికారులకు చెప్పినప్పటికీ కూడా వారు కూడా అతనికి సహకరిస్తారు. చివరకు ఆ సంతకం విక్టర్ సాధిస్తాడు. దీనితో సినిమా ముగుస్తుంది.

          వినూత్నమైన అంశాన్ని హాస్యభరితంగా మేళవించిన సినిమా ఇది. టాం హ్యాంక్స్ నటన కోసమైనా సరే ఈ సినిమా చూడాల్సిందే. మనిషికి జీవితంలో ఏదైనా సాధించడానికి ఎంత ఓపిక ఉండాలో కూడా చెప్పే సినిమా ఇది.

                            *      *     *

  

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ