ఇరుకు గదులు
చదువరి
ఇరుకు గదులు
-రచనశ్రీదత్త (శృంగవరపు
రచన)
మధురాంతకం నరేంద్ర గారి నవలల్లో ‘ఇరుకు
గదులు’ మానవ మనస్తత్వాలు ఎలా ఓ శైలికి పరిమితమైపోయాక మార్పుకు
సిద్ధం కాకుండా అలానే మిగిలిపోతాయో ఓ కుటుంబ కథగా స్పష్టం చేస్తుంది. ఈ నవలలో తమ తండ్రి
మరణం, ఆ తర్వాత తమకు ఉద్యోగాలు రావడంతో అతని కూతుళ్ళు ఎలా తమ
గదులకే పరిమితమై అదే జీవితంలో ఏ మార్పు చేసుకోకుండా, తమ చెల్లి
తన సంతోషం కోసం ఓ మార్పుకు సిద్ధపడినా దానికి కూడా అడ్డు పడాలని ఎలా ప్రయత్నించారు
? చివరకు వారి పరిస్థితులు ఏమన్నా మారాయా ? అన్నదాన్ని ఈ నవలలో ప్రధాన కథగా మలిచారు.
జగన్నాథం ఓ స్కూలు హెడ్ మాస్టర్ గా పని
చేసి, అనేకరకాలుగా సంపాదించి, ఓ సొంత
ఇంటిని కూడా కట్టుకున్నాడు. అతనికి ఐదుగురు ఆడపిల్లలు, ఒక
మగపిల్లవాడు. వారిని బాగా చదివించాడు. అతను మరణించేనాటికి ఏ కూతురి వివాహం కాలేదు.
శారద పెద్ద కూతురు. తర్వాత నీరజ, ఇందిర, భారతి. వీరు నలుగురు ఉద్యోగస్థులే. పద్మ ఇంటర్,
రమేశ్ ఎస్సెల్సీ చదువుతున్నారు.
మేనరికం
ఉన్నా ఈ ఆడపిల్లలంతా చదువుకోవడంతో
అవి కుదర్లేదు. వారికి వివాహ వయసు కూడా
దాటి పోయింది. వీరంతా ఉద్యోగాలు రాగానే తమ తమ గదుల్లో
ఉంటూ, తమదైన లోకంలో బ్రతుకుతూ ఉంటారు. అందరికీ వేరే మేకప్
సామాగ్రి, కుర్చీలు ఉంచుకుంటారు. తల్లికి మెస్ లో భోజనానికి
డబ్బులు ఇచ్చినట్టు తలా కొంత ఇస్తారు. రోజు వీరు చిన్న చిన్న విషయాలకు కూడా
గొడవపడుతూ ఉంటారు.
వీరిలో ఇందిరా సాహసి,
చొరవ ఉన్న యువతి. కులాంతర వివాహం చేసుకుని వెళ్ళిపోతుంది. ఆమె వివాహాన్ని ఇంట్లో
ఆమె అక్కలు ఆమోదించరు. తల్లి మనసులో ప్రేమ ఉన్నా అలానే దాచుకుంటుంది. భారతి
అగ్రికల్చర్ డిపార్టుమెంటులో పని చేస్తూ ఉంటుంది. అక్కడి మేనేజర్ శివరాం తన మీద
చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు కారణం మొదట్లో తెలియకపోయినా,తర్వాత
ఇందిరా భర్తకు శివరాం తమ్ముడు వరసని తెలుస్తుంది. అలా శివరాం ద్వారా ఇందిరను భారతి
కలుసుకోగలుగుతుంది.
ఇంట్లో ఆ విషయం తెలిసినప్పుడు పెద్ద
అక్కలైన నీరజ,శారద గొడవ చేస్తారు. ఓ రోజు శివరాం తనకు వచ్చిన
తనఖాను భారతికి చూపిస్తాడు. అందులో భారతితో శివరాం అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని
అందుకని అతని మీద చర్య తీసుకొమ్మని పై ఆఫీసరుకు వచ్చిన ఉత్తరం అది. ఆ చేతిరాత
శారదదే అని భారతి గుర్తించిన భారతికి బాధ కలుగుతుంది.తాము సంతోషంగా లేకపోవడంతో
చుట్టూ ఉన్న వారి మీద ద్వేషం పెంచుకుంటున్న వారి ప్రవృత్తులను గమనించిన భారతి ఆ
ఇరుకు గదుల నుండి బయటపడి శివరాంను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. భారతి తన
తర్వాతి చెల్లెలైన పద్మను కూడా ఆ ఇరుకు గదుల నుండి బయటపడమని ఉత్తరం రాస్తుంది.
మార్పు జీవితంలో సంతోషం కలిగిస్తే ఆ మార్పుకు
సిద్ధపడకపోతే ఒకే రకమైన జీవితం మనలో బాధను, నిర్లిప్తతను, తమ లానే అందరూ ఉండాలన్న ఆలోచనా శైలిని కూడా పెంపొందేలా చేస్తుంది. ఆ ఇరుకు
గదుల ఆలోచనల నుండి బయటపడితేనే మనిషి తన జీవితంలో
దాగి ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదించగలడు.
*
* *

Comments
Post a Comment