మరణం అంచుల్లో

 సినీ సంచారం

మరణం అంచుల్లో

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



           ఓ అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని దారుణంగా చంపే చర్యలు నేడు భారతదేశంలో మనం దిశ నుండి చూస్తూనే ఉన్నాము. కానీ ఆ సంఘటన కేవలం ఆ బాధితులకు,నిందితులకు మాత్రమే సంబంధించిన అంశం కాదు, వారి వారి కుటుంబాలకు కూడా సంబంధించినదే. యునైటెడ్ స్టేట్స్ లో సిస్టర్ గా ఉంటూ, ఓ లీడింగ్ అడ్వకేట్ గా ఉన్న హెలెన్ ప్రిజీన్ లూసియానా ప్రిజన్ లో మరణ శిక్ష అనుభవిస్తున్న ఎందరో దోషులకు వారి చివరి రోజుల్లో ఆధ్యాత్మిక చింతనను కలిగించే బాధ్యత కూడా తీసుకున్నారు. ఆ సమయంలో ఆమె ఎల్మో పాట్రిక్ సోనియర్ అనే అతనితో ఉన్న అనుభవాన్ని,అలాగే ఇతర మరణశిక్షలు అనుభవిస్తున్న దోషులను చూశాక, ఆ అనుభవంతో ఆమె డెడ్ మాన్ వాకింగ్ అనే పుస్తకాన్ని రాశారు. అది అమెరికాలో బెస్ట్ సెల్లింగ్ పుస్తకంగా  నిలిచింది. ఆ తర్వాత హెలెన్ మరణ శిక్షకు వ్యతిరేకంగా నిలబడి సర్వైవ్ అనే సంస్థను కూడా నెలకొల్పారు.ఆమె రాసిన ఆ  పుస్తకం ఆధారంగా 1995 లో టిమ్ రాబిన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే డెడ్ మ్యాన్ వాకింగ్. ఈ సినిమాలో సిస్టర్ హెలెన్ గా నటించిన సుసన్ సారడాన్ కు ఆస్కార్ పురస్కారం దక్కింది. ఈ సినిమాలో సోనియర్ గా షాన్ పెన్ నటించారు.

          ఈ సినిమాలో సోనేట్ పేరును మాథ్యూ పోన్స్లెట్ గా మార్చారు.పోన్స్లెట్ ,అతని మిత్రుడు కార్ల్ విటెల్లో తో కలిసి ఇద్దరు టీనేజర్స్ ను హత్య చేస్తారు. ఆ టీనేజర్స్ ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఓ రోజు రాత్రి అడవిలో వారిద్దరు కార్లో ఉండగా పోన్స్లెట్ ,విటెల్లో ఇద్దరు వారిని కారు నుండి బయటకు రమ్మని బెదిరించి ఆ అమ్మాయిని మానభంగం చేసి, ఆ తర్వాత ఇద్దరిని హత్య చేస్తారు. తర్వాత మూడు రోజులకు వారి శవాలు పోలీసులకు దొరకడం,వారిద్దరు అరెస్ట్ అవ్వడం జరుగుతుంది. విటెల్లో కు మంచి లాయర్ ఉండటం వల్ల అతనికి యావజ్జీవ శిక్ష, పోన్స్లెట్ కు మరణ  శిక్ష విధిస్తారు. ఆరేళ్లు శిక్ష అనుభవించాక  తన మరణ శిక్ష దగ్గర పడటంతో పోన్స్లెట్ ఎవరిని కలవాలో తెలియక సిస్టర్ హెలెన్ కు ఉత్తరం రాస్తాడు.తాను వారిద్దరిని హత్య చేయలేదని విటెల్లో ఆ హత్యలు చేశాడని చెప్తాడు. ఆ తర్వాత హెలెన్ అతని కోసం అతని కుటుంబాన్ని కూడా కలిసి పరోల్ బోర్డులో కూడా ప్రయత్నించినా ఫలితం ఉండదు.ఆ తర్వాత అతని మరణ శిక్ష వారం రోజుల్లో విధిస్తారు. చివరి ప్రయత్నంగా లై డిటెక్టర్ టెస్ట్ ద్వారా తాను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నం పోన్స్లెట్ చేసినా సరే అతను ఒత్తిడిలో ఉన్నాడని అందుకని ఆ లై డిటెక్టర్ ఫలితాలు సరిగ్గా లేవు అని అతని మరణ శిక్షను నిర్దారిస్తారు.

          ఈ సమయంలోనే సిస్టర్ అయిన హెలెన్ ఒక రేపిస్ట్ ను, హంతకుడిని సపోర్ట్ చేయడం ఎవ్వరూ హర్షించరు. కానీ సిస్టర్ గా తాను తన కర్తవ్యం కోసం అవేమీ పట్టించుకోదు హెలెన్. ఆమె హత్యకు గురైన అమ్మాయి,అబ్బాయి కుటుంబాలను కూడా కలుస్తుంది. వారి బాధను కూడా అర్ధం చేసుకుంటుంది.

          ఈ సమయంలోనే మొదటి నుండి అసహ్యం,కోపం, ద్వేషాలతో నిండి ఉన్న పోన్స్లెట్ ఆమెకు దగ్గరవుతాడు. తన కోసం ఆమె చేస్తున్న ప్రయత్నంతో తనకు మరణ శిక్ష పడే రోజు ఆమె ముందు నిజం ఒప్పుకుంటాడు. ఆ అబ్బాయిని తాను చంపానని, ఆ అమ్మాయిని తాను చంపలేదని చెప్తాడు. ఆ సమయంలో అతనికి నైతికంగా అతని పాప పరిహారం కోసం హెలెన్ అతనికి బైబిల్ లోని విషయాలు చెప్తూ అతనికి మరణ శిక్ష విధించేవరకు తోడుగానే ఉంటుంది. పోన్స్లెట్ మరణించే ముందు ఆ అమ్మాయి,ఆ అబ్బాయి తల్లిదండ్రులను క్షమాపణ అడుగుతాడు. ఆ తర్వాత అతనికి మరణ శిక్ష అమలవుతుంది. అతని ఫ్యూనరల్ కు అందరూ ఆఖరికి ఆ అమ్మాయి ,అబ్బాయి తరపు వారు కూడా హాజరువుతారు. ఇంతటితో సినిమా ముగుస్తుంది.

          కానీ ఈ సినిమాలో వాస్తవానికి కొన్ని మార్పులు చేశారు.  సోనేట్ తో కలిసి ఈ హత్యలు చేసింది అతని స్నేహితుడిగా ఈ సినిమాలో చూపించినా వాస్తవానికి అది చేసింది అతని తమ్ముడు ఎడ్డి. దానితో పాటు ఈ సినిమాలో అతనికి మరణ శిక్ష విషపు ఇంజెక్షన్ ఇచ్చి అమలుపరిచినట్టు చూపిస్తారు. వాస్తవానికి అది ఎలెక్ట్రిక్ చెయిర్ లో అమలుపరచబడింది.

          సోనేట్ ,ఎడ్డి ఇద్దరికీ మొదట మరణ శిక్ష విధించినప్పటికి,మళ్ళీ అపీల్ చేసినప్పుడు తన తమ్ముడు ఎడ్డి ఆ హత్యలు చేయలేదని, తానే ఆ హత్యలు చేశానని సోనేట్ ఒప్పుకోవడంతో అతనికి మరణ శిక్ష, అతని తమ్ముడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడింది. సోనేట్ ,ఎడ్డి అంతకు ముందు కూడా ఎంతో మంది లవర్స్ ఆ లవ్ స్పాట్ కు వచ్చినప్పుడు ఆ అమ్మాయిలను రేప్ చేసి ,ఆ తర్వాత వారిని వదిలేసేవారు. కానీ ఈ అబ్బాయి,అమ్మాయి విషయంలో ఎడ్డి నిగ్రహం కోల్పోయి వారిద్దరిని హత్య చేసినట్టు హేలన్ తో చెప్తాడు చివర్లో సోనేట్. ఇలా కొన్ని సినిమా కోసం మార్పులు చేసినప్పటికీ కూడా ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే మరణం అందరినీ బాదించే అంశమే కాదు,భయపెట్టే అంశం కూడా. మరణించబోయేవారికి ఆ భయం మరణించే వరకు ఉంటే, వారి మరణం తర్వాత వారు ఎటువంటి వారైనా సరే వారి సన్నిహితుల పై చూపే ప్రభావం ఎప్పటికీ ఉంటుంది.

          కోర్టు డ్రామా సినిమాలు చూస్తుంటే ముఖ్యంగా శిక్ష పడిన వారి మనస్తత్వం ఎలా ఉంటుంది ? ఎలాగూ శిక్ష పడింది కనుక వారు ఇంకా ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు ? మరణించే సమయం దగ్గర అయ్యేకొద్ది వారిలో పశ్చాత్తాపం ఎలా కలుగుతుంది వంటి కోణాలను ఈ సినిమాలో ఎంతో హృద్యంగా స్పృశించారు దర్శకులు టిమ్ రాబిన్స్. కోర్టు డ్రామా సినిమాల్లో కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.

 *     *     *

         

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ