ప్రలోభాల ముసుగు

 సినీ సంచారం

ప్రలోభాల ముసుగు

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          మలయాళ రచయిత వాసుదేవన్ నాయర్ రాసిన కథ దార్ -ఎస్ -సలాం ఆధారంగా1988 లో వచ్చిన సినిమానే అతిర్తికాల్. ఓ హిపోక్రైట్ మరియు నింఫో మ్యానియాక్ స్త్రీ గురించి రాసిన కథే ఇది. ఈ సినిమాలో మనిషికి ఉండే బలహీనతలు,అవి అతన్ని తన బాధ్యతల నుండి దూరమయ్యేలా ఎలా చేస్తాయో, ఎలా విచక్షణారాహిత్యంగా ప్రవర్తించేలా చేస్తాయో స్పష్టం చేస్తుంది.

          కేశవన్ అనే కాస్మెటిక్ సేల్స్ మ్యాన్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో తన భార్య, కూతురితో కలిసి ఉంటాడు. అతను లవ్ మీ అనే కాస్మెటిక్ ప్రొడక్ట్స్ కంపెనీలో సేల్స్ మ్యాన్ గా పని చేస్తూ ఉంటాడు. అతనికి అతని వృత్తి పట్ల అంకిత భావం ఉండదు. కానీ తన ఏరియా మేనేజర్ బలహీనత అయిన తాగుడును ఆసరా చేసుకుని తాను తప్పించుకుంటూ ఉంటాడు. కేశవన్ భార్య గర్భవతి కూడా. ఆమె తండ్రిని నుండి ఆమెకు ఆస్తిగా వచ్చిన కొబ్బరి తోట ఉండటం వల్ల, దానిని చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల కేశవన్ దానిని కూడా చూసుకుంటూ ఉంటాడు.

          లవ్ మీ ప్రొడక్ట్స్ గురించి రీతా అనే స్త్రీ ఓ న్యూస్ పేపర్లో ఫిర్యాదు చేయడం, దాని గురించి కేశవన్ ఏరియా మేనేజర్ తో చీవాట్లు తినడంతో ఆమెకు ప్రోడక్ట్ వేరేది ఇవ్వడానికి ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె భర్త రిటైర్డ్ మేజర్. వారు ఆఫ్రికాలో కొంతకాలం గడిపి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారని వారి మాటల్లో కేశవన్ కు అర్ధమవుతుంది.

          రీతూ అనాధల కోసం పని చేస్తూ ఉంటుంది. ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు కేశవన్. ఆ తర్వాత ఆమెను రెండో సారి కలిసినప్పుడు ఆమె అంగీకారం తెలుపుతుంది. ఆమెతో కలిసి గడపడానికి ఇస్నోఫిలియా  ఉన్నట్టు నటించి, దానికి డాక్టర్ రెండు నెలలు స్కూటర్ నడపవద్దన్నాడని, పట్నంలో ఉండమన్నాడని చెప్పి భార్యను ఒప్పించి పట్టణంలో ఓ లాడ్జిలో ఉంటూ ఉంటాడు.

          తనకు సెలవులైన శనివారం నాడు ఎప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నా సరే రీతూ అదే సమయంలో అతన్ని కలుస్తూ ఉండటంతో అతనికి ఇంటికి వెళ్ళడం కుదరదు. తర్వాతి శనివారం రీతూ ఫోన్ చేయగానే ఆమెను కలవడానికి బయల్దేరుతుంటే అతని భార్యకు నొప్పులు వస్తున్నాయని కబురు పంపించినా సరే తాను తర్వాత వస్తానని చెప్పి ఆమెను కలవడానికి వెళ్తాడు. అతను ఆమెను కలవడానికి వెళ్తుంటే రీతూ యాక్సిడెంట్ లో మరణించినట్టు తెలుస్తుంది. దానితో తను పూర్తిగా నిస్పృహకు గురవుతాడు. భార్య దగ్గరకు కూడా వెళ్ళడు ఆ బాధతో. ఆమె ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆమె భర్త జనరల్  ద్వారా అతనికి రీతూ గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి.      

          రీతూ ఎంతో మంది మగవాళ్ళతో సంబంధం పెట్టుకుందని, పైకి అనాథ ఉద్దారకురాలిగా కనిపించే ఆమె తన ఆఫ్రికా కూతుర్ని మాత్రం గది నుండి బయటకు రాకుండా నిర్బంధించిందని, దానికి కారణం ఆమె నల్లగా ఆకర్షణహీనంగా ఉండటం అని,అందుకే ఆమె గురించి తెలిసే తమ కొడుకు ఆమె మరణించాక కూడా చూడడానికి రాలేదని, అసలు తానే ఎన్నోసార్లు ఆమెను హత్య చేద్దామని అనుకున్నానని చెప్పి, భార్యను వదిలి ఆమె మరణించిందని బాధపడుతున్న కేశవన్ ని తిట్టి ఇంటి నుంచి గెంటేస్తాడు మేజర్.

          అప్పటికీ వాస్తవంలోకి వచ్చిన కేశవన్ తన బాధ్యతను గుర్తించి, తన భార్య దగ్గరకు వెళ్తాడు. అలా సినిమా ముగుస్తుంది. మనుషులకు అందం,ఆకర్షణ అనేవి ఉండటం సహజం. కానీ మనుషుల్ని ప్రేమించే కొద్ది వారి మీద ప్రేమ బాధ్యతగా కూడా మారుతుంది. ఆ బాధ్యతాయుతమైన  వ్యక్తిగా మారిన మనిషిని ఏ ఆకర్షణలు,ప్రలోభాలు ప్రభావితం చేయవు.

          రీతూను మొదటి సారి కలిసినప్పుడే ఆమె ఆకర్షణలో పడ్డాక, రెండో సారి ఆమె కార్ ట్రబుల్ ఇస్తే అతని బలహీనతను అప్పుడు కూడా గమనిస్తుంది రీతూ. ఈ సినిమాను గమనిస్తే కేశవన్ లో ఉన్న బలహీనతను ధృఢపరచుకున్నాకే ఆమె అతన్ని తనకు దాసోహం చేసుకుంటుంది. ప్రలోభాలు కేవలం బలహీనులకు మాత్రమే ఉన్న అవకాశం తప్ప అందరికీ కాదు. మలయాళీ సినీ శైలిలో ఉన్న సహజత్వం ఈ సినిమాలో కూడా ఉంది. విభిన్న సినీ వైవిధ్యాలను ఆస్వాదించేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

     *      *     *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ