యువ జీవితాలు
చదువరి
యువ జీవితాలు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
డాన్ బ్రౌన్ ,డేవిడ్ బల్దాసి,
జెఫ్రీ ఆర్చర్ లాంటి ఫిక్షన్ చదివేవారికి క్లాసిక్స్ చదవడం అంటే కొంచెం కష్టంగానే
అనిపిస్తుంది మొదట్లో. ముఖ్యంగా జేన్ ఆస్టిన్ నవలలు చదవడం మొదలుపెట్టడం అంటే బోర్
అనిపించేలా కూడా చేస్తుంది. క్లాసిక్ ఫిక్షన్ లో ఉండే శైలి మిగిలిన ఫిక్షన్లతో
పోల్చుకుంటే ఎంతో వైవిధ్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. క్లాసిక్స్ లో కథ చాలా
మెల్లగా ముందుకు నడుస్తూ ఉంటుంది.ఇక్కడ కథ కన్నా శైలికే ప్రాధాన్యత ఎక్కువ
ఉంటుంది. కానీ మిగిలిన ఫిక్షన్ లో మాత్రం కథ మలుపులతో ఎంత బాగా ముందుకు కదులుతుంది
అన్నదే ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకే మొదటి క్లాసిక్ పూర్తిగా చదవడం ఓ లక్ష్యంగా భావిస్తేనే పూర్తిచేయగలం. అలా
నేను చదివిన నా మొదటి క్లాసిక్ నవలే జేన్ ఆస్టిన్ రాసిన ‘నార్తెంగర్
అబే.’చదువుతున్న మొదట్లో బోరింగ్ గా అనిపించినా ముందుకు సాగే
కొద్ది ఆ రచనాశైలిని మెచ్చుకోక తప్పదు. ఈ నవల ‘కమింగ్ ఆఫ్
ఏజ్’ నవలల వర్గంలోకి వస్తుంది.అంటే యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు,అబ్బాయిల జీవితంలో వారు ప్రౌఢలుగా ఎదిగే క్రమంలో సంభవించే మార్పులను
చెప్పడం.
ఈ
నవలలో కథానాయిక క్యాథరిన్. ఆమె గురించి
చెప్పడంతో నవల మొదలవుతుంది. ఆమె బాల్యం నుండి పదిహేడేళ్ళు వచ్చేవరకు ఎటువంటి
అభిరుచులు కలిగి ఉందో,ఆమె ఎలా ఉండేదో చెప్తుంది రచయిత్రి. ఆమె 17
ఏళ్ళ వయసులో ఉన్నప్పుడూ తన ఇంటి పొరుగున ఉంటున్న ఎలెన్స్ కుటుంబం శీతాకాలంలో బాత్ పట్టణానికి అక్కడి
బాల్ డ్యాన్సులు, మరియు ఇతర ఎంటర్ టెయిన్మెంట్ కోసం వెళ్తూ
తమతో పాటు క్యాథరిన్ ను కూడా ఆహ్వానిస్తారు. వారితో వెళ్తుంది క్యాథరిన్.
అక్కడ
ఆమెకు మొదట హెన్రీ టిల్ని అనే యుక్త వయస్కుడు పరిచయమవుతాడు. ఆమెకు మొదటి సారి
అతన్ని కలిసినప్పుడే అతని మీద ఆసక్తి కలుగుతుంది. రెండో రోజు అతని కోసం బాల్ రూమ్
లో ఎదురు చూసినా అతను ఆమెకు కనిపించడు.ఆమెకు అదే సమయంలో తోర్పి కుటుంబం ఎలెన్స్
ద్వారా పరిచయం అవుతుంది. ఎలెన్స్ కు బాల్య స్నేహితురాలు మిసెస్ తోర్పి. ఆమె
కూతురైన ఇసాబెల్లా ఆమెకు అతి కొద్ది సమయంలోనే ప్రాణస్నేహితురాలు అవుతుంది.
వారిద్దరు కలిసి తమకు నచ్చిన పుస్తకాలు చదువుకోవడం, తమకు నచ్చింది
చేయడం చేస్తూ ఉంటారు. క్యాథరిన్ అన్న అయిన జేమ్స్, ఇసాబెల్లా
అన్న అయిన జాన్ ఇద్దరు స్నేహితులని కూడా
వారికి తెలుస్తుంది. క్రమ క్రమంగా జేమ్స్, ఇసాబెల్లా ప్రేమలో
పడతారు. జాన్ ఎంత క్యాథరిన్ ను ఇంప్రెస్ చేద్దామని ప్రయత్నించినా అతను ఆమెకు
నచ్చడు.
అదే
సమయంలో హెన్రీ తన చెల్లెలైన ఏలినర్ ,తండ్రి
తో తిరిగి బాత్ కు వస్తాడు. తాను ఎలా అయినా వారితో పరిచయం పెంచుకోవాలని
తాపత్రయపడుతుంది క్యాథరిన్. కానీ ఆ
ప్రయత్నాల్లో జాన్ పుల్లలు పెడుతూ ఉండటం వల్ల అవి ముందు బెడిసి కొట్టినా సరే
తర్వాత క్యాథరిన్ వెళ్ళి క్షమాపణ చెప్పడంతో ఆ అపార్ధాలు సమసిపోతాయి.
జేమ్స్
తాను ఇసాబెల్ ను ప్రేమించినట్టు తన తల్లిదండ్రులతో చెప్పి,వారిని
ఒప్పిస్తాడు. దానికి అతని తండ్రి వారు రెండున్నర్ర ఏళ్ళ తర్వాత సంవత్సరానికి
నాలుగు వందల పౌండ్లు ఇస్తానని చెప్తాడు. ఈ విషయం పట్ల ఇసాబెల్లా ఎంతో అసంతృప్తి
కలిగి ఉంటుంది. పైకి మాత్రం బాగానే కనిపిస్తుంది. ఓ పక్క జేమ్స్ ను
ప్రేమిస్తున్నట్టు ఉంటూనే అతను లేనప్పుడు అక్కడికి వచ్చిన హెన్రీ అన్న ఫ్రెడ్రిక్
తో సన్నిహితంగా ఉంటుంది. ఈ విషయం క్యాథరిన్ కు నచ్చదు.
ఆ తర్వాత ఇలినర్ తండ్రి తన కూతురికి తోడుగా
కొన్నాళ్లు ఉండటానికి తమ స్వస్థలమైన నార్థెంగర్ అబ్బే కు రమ్మని ఆహ్వానిస్తాడు.
ఎంతో సంతోషంతో ఆ ఆహ్వానాన్ని స్వీకరించి తల్లిదండ్రులకు ఆ విషయం ఉత్తరం ద్వారా
తెలిపి, వారి అనుమతి తీసుకుని వారితో కలిసి వెళ్తుంది క్యాథరిన్.
అక్కడ
ఏలినర్ ,క్యాథరిన్ ఎంతో సంతోషంగా ఉంటారు. హెన్రీ కూడా మధ్యమధ్యలో ఇంటికి వస్తూ
ఉంటాడు.అక్కడే వారి తల్లి అనారోగ్యంతో మరణించిందని, తండ్రి ఆ
గదిలోకి ఎవర్ని వెల్లనియ్యడని ఏలినర్ ద్వారా తెలుసుకుంటుంది క్యాథరిన్. హెన్రీ,క్యాథరిన్
ఒకరినొకరు ప్రేమించుకున్నా పైకి చెప్పుకోరు. ఆ తర్వాత జేమ్స్ తన చెల్లెలైన
క్యాథరిన్ కు తాను,ఇసాబెల్లా విడిపోయినట్టు రాస్తాడు.
ఫ్రెడ్రిక్ వల్లే విడిపోయినట్టు మొదట క్యాథరిన్ భావించినా అతను ఆమెను పెళ్లి
చేసుకునే ఉద్దేశ్యం కలిగి లేడని హెన్రీ ద్వారా తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఇసాబెల్లా
క్యాథరిన్ కు ఆమె అన్నాను తనతో కలపమని ఉత్తరం రాస్తుంది. ఇసాబెల్లా ద్వంద
ప్రవృత్తి అర్ధం చేసుకున్న క్యాథరిన్ ఇక జన్మలో ఆమె ఊసెత్తకూడదనే నిర్ణయం
తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏలినర్ తండ్రి క్యాథరిన్ ను వెంటనే ఇంటి నుండి
పంపించమని ఇలినర్ కు చెప్పడం, క్యాథరిన్ కు తన
తల్లిదండ్రులకు తెలియజేసే సమయం కూడా లేకపోవడం, అసలు ఏ కారణం
చేత తనను పంపిస్తున్నారో తెలియకపోవడం క్యాథరిన్ ను ఎంతో బాధిస్తుంది.
ఇంటికి
ఎంతో బాధతో తిరిగి వస్తుంది క్యాథరిన్. ఆమె వచ్చిన తర్వాత రోజు హెన్రీ ఆమె ఇంటికి వచ్చి తండ్రి తరపున
క్షమాపణ చెప్తాడు. జాన్ తన తండ్రిని బాత్ లో
కలిసినప్పుడు క్యాథరిన్ అలెన్స్ కుటుంబానికి సంతానం లేకపోవడం వల్ల వారి సంతానం ఆమెకే
వస్తుందని చెప్పడంతో ఆమె ఆస్థిపరురాలు అవుతుందనుకుని ఆమెను తన ఇంటికి ఆహ్వానించాడని,మళ్ళీ
ఆ తర్వాత క్యాథరిన్ ను ఇంటికి తిరిగి పంపించే ముందు రోజు పట్టణంలో కనిపించిన జాన్ మళ్ళీ తన తండ్రికి ఆమెకు ఆస్థి పెద్దగా లేదని చెప్పడంతో
తన తండ్రి అలా ప్రవర్తించాడని చెప్తాడు హెన్రీ. కానీ తాను మాత్రం ఆమెను ప్రేమించానని
క్యాథరిన్ తల్లిదండ్రులకు కూడా చెప్పి వారిని ఒప్పించి ,తర్వాత
తన తండ్రిని కూడా ఒప్పించాక వారి వివాహంతో ఈ నవల ముగుస్తుంది.
ఈ
నవలలో పదిహేడేళ్ళ అమ్మాయికి ఉండే ఊహాలు ,అభిరుచులు,ఆమె జరిగిన సంఘటనలను అనుసరించి ఎలా తన స్వంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటుంది ?ఎలా మొహమాటంగా ఉంటుంది? ఎలా స్నేహితుల కోసం పరితపిస్తుంది? వంటి అంశాలను స్పృశించారు జేన్ ఆస్టిన్. క్యాథరిన్ హెన్రీ ఇంటికి వెళ్ళినప్పుడు
అతని తల్లి మరణం గురించి తెలుసుకున్నాక ఆమెను హత్య చేసింది హెన్రీ తండ్రేనని అనుమానించడం, దానికి సాక్ష్యాలు దొరుకుతాయేమోనని చూడడం,ఆమె చివరకు
చూసినవి చాకలి పద్దులు కావడం వంటి సంఘటనలు యవ్వన వయసులో ఉన్న అమ్మాయిలు ఎలా మనుషుల
ప్రవర్తనను బట్టి వారి గురించి ఊహిస్తారో స్పష్టం చేస్తుంది.
జేన్
ఆస్టిన్ నవలలను కథలో మలుపుల కోసం అస్సలు చదవలేము,కానీ పాత్రలను పరిచయం
చేసే తీరు,వారి బలాలు -బలహీనతలు స్పష్టం చేసే తీరు కోసం మాత్రం
కచ్చితంగా చదవాలి. ఈ నవలలోని క్యాథరిన్ ,ఏలినార్ ,ఇసాబెల్లా ,జాన్ పాత్ర చిత్రణల
ద్వారా ఆమెకున్న ఈ నైపుణ్యం స్పష్టం అవుతుంది. ఈ నాలుగు పాత్రల్లో కూడా యువతలో ఉండే
గందరగోళం, పది విషయాల పట్ల ఆసక్తి కలిగి దేని మీద దృష్టి పెట్టలేకపోవడం, గంభీరంగా తన లోకంలో తాను ఉండటం,తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలని
పదే పదే ప్రయత్నించటం, అవకాశాన్ని బట్టి తమను తాము మార్చుకోవడం, స్నేహితులను ప్రాణంగా భావించటం వంటి లక్షణాలు ఈ పాత్రల్లో మనకు కనిపిస్తాయి.
ఇసాబెల్లాకు
ప్రేమకు-జీవితంలో సుఖంగా బ్రతకడానికి మధ్య ఏర్పడిన గందరగోళం,ఒకే
సారి ఆమె జేమ్స్ మరియు ఫ్రెడ్రిక్ లతో ఒకే రకమైన ప్రవర్తన్థో ప్రోత్సహిస్తూ ఉండటం అన్నది
ఓ రకమైన యువ వ్యక్తిత్వం. తల్లి మరణం, తండ్రి మరియు అన్నలతోనే
బ్రతకడం వల్ల ఒంటరిగా ఉన్న ఏలినార్ తనలోనే తానే గంభీరంగా ఉంటుంది. ఇది ఇంకో రకమైన యువ
వ్యక్తిత్వ వైవిధ్యం. తన గొప్పతనాన్ని క్యాథరిన్ ముందు నిరూపించుకోవడం కోసం పదే పదే
ఆమెను విసిగించే జాన్ వ్యక్తిత్వం కూడా అతి సహజమైనదే. మిగిలిన పాత్రలైన హెన్రీ ,ఫ్రెడ్రిక్ ,జేమ్స్ పాత్రల్లో పెద్ద వైవిధ్యం ఉండదు,మనం సాధారణంగా చూసే మామూలు పాత్రలలానే అనిపిస్తూ, కథను
ఈ పాత్రలు ముందుకు నడపటంలో ,కథలో ఓ సమన్వయం తీసుకురావడంలో ఇవి
సాయపడ్డాయి.
మనుషుల
మనసులను వివిధ పరిస్థితుల్లో స్పష్టం చేయడమే జేన్ ఆస్టిన్ నవలల ప్రత్యేకత. అందుకే కాలం
ఎంత ముందుకు పోతూ ఉన్నా ఆమె రచనలకు అదే ప్రాధాన్యత నేటికీ సజీవంగా ఉంది.
* *
*

Comments
Post a Comment