అతి మంచి భార్య

 చదువరి

            అతి మంచి భార్య

                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


            ఓ అతి మంచి భార్య తన భర్త తప్పులన్నిటిని క్షమిస్తూ, చివరకు తానే ఆ తప్పు చేయడానికి సిద్ధపడాలనుకున్నప్పుడు ,ఆ భర్తవీ తప్పులే కావని అనుకుని ఎలా తనను తాను మభ్యపెట్టుకుంటూ, భర్తతో అతి మంచిగా ఉంటూ అతని తప్పులకు పరోక్ష కారణంగా మారిందో స్పష్టం చేసే నవలే దాసరి శిరీష గారి దూర తీరాలు.

     సంధ్య రాజాను ప్రేమ వివాహం చేసుకుంటుంది, దాని కోసం అన్నల్ని ఎదిరిస్తుంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. సంధ్య ఓ ప్రైవేట్ కళాశాలలో  లైబ్రెరియన్ గా పని చేస్తూ ఉంటుంది. రాజా ఓ లెక్చరర్, రచయిత కూడా. రాజా సబ్జెక్ట్ అరుదైనది అయినా దానిని తీసుకునేవారిలో ఎక్కువమంది విద్యార్ధినులే. వారంతా ట్యూష కోసం రాజా ఇంటికి వచ్చేవారు. వారిలో అరుణ, సుమిత్ర కూడా ఉన్నారు. నిర్మల రాజా చెల్లెలు. రాజా పుస్తకాల్లో వెతుకుతున్నప్పుడు సంధ్యకు ఓ పుస్తకం దొరుకుతుంది. అందులో సుమిత్ర రాసిన కథ ఉంటుంది. అది కథ అనుకుని చదివినా అందులో ముఖ్య పాత్రలు మాత్రం రాజా, సంధ్య,సుమిత్ర అని గ్రహిస్తుంది సంధ్య. ఆ పుస్తకం ద్వారా సుమిత్రకు, రాజాకు మధ్య ఉన్న శారీరక సంబంధం,రాజా ఆమెకు గర్భస్రావం చేయించడం కూడా సంధ్యకు తెలుస్తుంది. అది చదివాక సుమిత్ర, అరుణ తన ఇంటికి వచ్చినా మాములుగానే ప్రవర్తిస్తూ ఉంటుంది సంధ్య.        

          సుమిత్ర తన కుటుంబ దైన్యత గురించి చెప్పడం, సంధ్య కరిగిపోవడం, రాజా కూడా కన్వీన్స్ చేయడంతో సుమిత్రకు ఎక్కడా ఆశ్రయం దొరకకపోవడం, ఆమె చదువుకు ఇబ్బందిగా ఉండటం వంటి సమస్యలతో ఉన్న ఆమెను మానవతా దృష్టితో తన ఇంట్లో ఉంచుకుంటుంది సంధ్య. ఓ వారం రోజుల నెపంతో అక్కడికి వచ్చిన సుమిత్ర అక్కడే రెండు నెలలు ఉండిపోతుంది. ఆ రెండు నెలల్లో సుమిత్ర బ్లాక్ మెయిలింగ్ మనస్తత్వం కూడా సంధ్యకు అర్ధమవుతుంది. ఆ ఇంటి చుట్టు పక్కల వారితో తను రాజా రెండో భార్యనని చెప్పుకుంటూ ఉంటుంది. అందరూ సుమిత్ర పట్ల సానుభూతి చూపిస్తూ ఉంటారు. తనను రచయితగా అమ్మాయిలు గుర్తించి, ప్రశంసించినప్పుడు వారితో సంబంధం పెట్టుకోవడం రాజా బలహీనత అని సంధ్యకు అర్ధమవుతుంది.

          సంధ్య పని చేసే కాలేజీలో రవుఫ్ అనే లెక్చరర్ ఉన్నాడు. మంచి సంస్కారం ఉన్న వ్యక్తి. ఓ సారి కాలేజీలో అమ్మాయిలను తీజింగ్ చేశారని గిరి బృందాన్ని హెచ్చరించడంతో గిరి తన బృందంతో కలిసి అతనికి వ్యతిరేకంగా సమ్మె చేస్తాడు. రవుఫ్ ను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. సంధ్య ఎంతో ధైర్యంగా సుజాత,రాధిక ,కాంతం వంటి లెక్చరర్లతో  నిలబడి ఆ సమస్యను పరిష్కరిస్తుంది.  రవుఫ్ కి ఈ ఉదంతంతో సంధ్య మీద ప్రేమ కలుగుతుంది. ఇంటి ఓనర్ సుమిత్ర గొడవ వల్ల ఇల్లు ఖాళీ చేయమంటాడు. సుమిత్రను కావాలంటే  యూనివర్సిటీ  ఇంటర్ వ్యూ కాల్ వచ్చేవరకు  ఆశ్రయం అయితే చూస్తానని, ఆ ఇంటి నుండి వెళ్ళిపోమ్మని చెప్తారు రాజా దంపతులు. అరుణను రమ్మని, ఆమె వస్తే ఆమె అనుమతితో వచ్చానని అందుకే ఆమె చెప్తే వెళ్ళిపోతానని చెప్పడంతో సంధ్య అరుణ దగ్గరకు వెళ్తుంది.

          అరుణ సుమిత్ర తన లవ్ లెటర్ ఒకటి ఉంచుకుని బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్తుంది. ఆమె లేకుండానే ఇంటికి వస్తుంది సంధ్య. సుమిత్ర మనస్తత్వం పూర్తిగా సంధ్యకు అర్ధమవుతుంది. సంధ్య,రాజా వేరే ఇంటికి మారిపోతారు. సుమిత్ర గొడవ చేసి వెళ్ళిపోతుంది.

          రాజాకు కాకినాడకు బదిలీ అవుతుంది. కాకినాడలో ఉంటూ వారానికొకసారి ఇంటికి వాస్తు ఉంటాడు. తర్వాత అరుణ ద్వారా అక్కడ రాజా సుమిత్రతో సంబంధం కొనసాగిస్తున్నాడని సంధ్యకు తెలుస్తుంది. దీనితో పాటు అక్కడ ఉంటున్న సంధ్య స్నేహితురాలు గిరిజ అక్కడ రాజా ఓ కొలీగ్ తో సంబంధం పెట్టుకున్నాడనే వార్తలు తన దృష్టికి వచ్చాయని రాస్తుంది. రాజా ఇంటికి సరిగ్గా రాకపోవడం, డబ్బులు పంపకపోవడం చేస్తాడు.

          రవుఫ్ ని సుజాత ప్రేమించినా కుటుంబ బాధ్యతలా రీత్యా కాకపోయినా సంధ్య మనసులో ఉండటం వల్ల ఆమెను తిరస్కరిస్తాడు. మొదట్లో అతను ఉత్తరాలు రాసినా సంధ్య సమాధానం ఇవ్వదు. క్రమేపీ రాజా ప్రవర్తన వల్ల రవుఫ్ అంటే సంధ్యకు ఇష్టం కలుగుతుంది. కానీ ఆ లోపే రవుఫ్ తను ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఆమెకు పెళ్ళయి భర్త వదిలేశాడని రాస్తాడు. ఎప్పుడైతే తనకు రవుఫ్ పై అబిమానం కలగడం మొదలుపెట్టిందో అప్పటి నుండి రాజా ప్రవర్తన సంధ్యకు తప్పుగా అనిపించదు. కానీ రవుఫ్ పెళ్ళితో కుప్పకూలిన సంధ్య భర్త రాజాతో తనకు కూడా మందు తెచ్చి పెట్టమని అడుగుతుంది. మనసులో బాధ ఉన్నా  సంస్కారంతో అభినందనలు తెలుపుతూ రవుఫ్ కు ఉత్తరం రాయలనుకోవడంతో నవల ముగుస్తుంది.

          రాజా ప్రవర్తనలో తప్పొప్పుల కన్నా ,సంధ్య ఉద్యోగిని -ఆస్తిపరురాలు కావడంతో ఆమెతో మంచిగా ఉండే ప్రయత్నం చేయడం,తన అతి మంచతనంతో సంధ్య ఆ తప్పుల్ని ప్రోత్సహించినట్టు పాఠకులకు అనిపించక మానదు.అలాగే సుమిత్ర లాంటి స్త్రీలు సాటి స్త్రీల అతి మంచితనాన్ని తమ అవసరాలకు ఎలా వాడుకుంటారో,మనిషికి ఎప్పుడు మంచితనం హద్దులు దాటినప్పుడు అది జీవితాన్ని ఎలా చిందరవందర చేస్తుందో, మంచి మాటలకు పొంగిపోయి క్షమిస్తూ ఉండే భార్యల దగ్గర భర్తలు ఎలాంటి ద్వంద ప్రవృత్తిని ప్రదర్శిస్తారో కూడా ఈ నవలలో స్పష్టం అవుతుంది. చివరి మాటగా చెప్పేదేమిటంటే మంచితనానికి కూడా హద్దులు ఉండటం ముఖ్యం!  

   *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!