సర్వైవల్

 సినీ సంచారం 

సర్వైవల్ 

                             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 

వైవిధ్య భరిత పాత్రలను ఎన్నుకోవడం  టాం హ్యాంక్స్ నటనా ప్రతిభకు నిదర్శనం. సినీ వర్గాల్లో సర్వైవల్ డ్రామా తీయడం సాహసమే అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆ సినిమాలోని చాలా సమయం కేవలం ఒక్క వ్యక్తి కేంద్రంగానే  నడపాలంటే ప్రేక్షకులకు ఎటువంటి బోర్ కొట్టకుండా ఆ జీవనాన్ని చూపించగలగాలి. అటువంటి  సర్వైవల్ డ్రామా కోవకు చెందిన సినిమానే 2000 లో వచ్చిన 'కాస్ట్ అవే .' 

1995 లో చక్ నోలాండ్ అనే వ్యక్తి ఫెడ్ ఎక్స్ లో పని చేస్తూ ఉంటాడు. అతని గర్ల్ ఫ్రెండ్ కెల్లీ. ఓ సారి మలేసియా లో ఉన్న  సమస్యలను పరిష్కరించమని అడగటం వల్ల చక్ అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతను వెళ్తున్న ఫెడ్ ఎక్స్ ప్లేన్ పసిఫిక్ సముద్రంలో క్రాష్ అవుతుంది. మిగిలిన వారు మరణించగా అతను మాత్రం ఓ దీవికి చేరుకుంటాడు. 

ఫెడ్ ఎక్స్ డెలివర్ చెయ్యాల్సిన ప్యాకేజీలు కూడా అక్కడికే కొట్టుకుని వస్తాయి. వాటితో పాటు అతనితో పాటు పయనించిన పైలెట్ శవం కూడా వస్తే దానిని పాతిపెడతాడు. అక్కడ ఆ ప్యాకేజీల్లో ఉన్న వాటిల్లో ఉపయోగపడే వాటిని వాడుకుంటాడు.అక్కడి సముద్రంలో ఉన్న జంతువులను ఆహారంగా చేసుకుని, అక్కడ ఎలాగో మంట  సృష్టించడం నేర్చుకుని జీవితం గడిపేస్తూ ఉంటాడు. మనిషి భరించలేనిది ఒంటరితనం. ఆ దీవిలో అతనొక్కడే ఉండటం వల్ల ఆ ఒంటరితనం నుండి తనను తాను కాపాడుకోవటానికి ఆ ఫెడ్ ఎక్స్ ప్యాకేజీల్లో ఉన్న ఓ వాలీ బాల్ నే  మిత్రుడిగా భావించి దానికి విల్సన్ అని పేరు పెట్టి తన ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

నాలుగేళ్ళు అక్కడే ఓ గుహలో విల్సన్ తో గడిపేస్తాడు చక్. తర్వాత ఓ బోట్ తయారు చేసుకుని విల్సన్ తో కలిసి ఎలాగో సముద్రాన్ని దాటే ప్రయత్నం చేస్తుండగా ఓ దగ్గరలో కార్గో కనిపించడంతో అతను రక్షించబడతాడు. తిరిగి తన నాగరికతకు వచ్చాక చక్ కు చాలా విషయాలు తెలుస్తాయి. తాను మరణించానని భావించిన కుటుంబం తనకు అంత్యక్రియలు కూడా చేసిందని ,కెల్లీ ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైందని కూడా తెలుస్తుంది. 

చక్ టెక్సాస్ లో ఆ వాలి బాల్ ప్యాకేజ్ తిరిగి ఇవ్వడానికి వెళ్తాడు. అతను వెళ్ళేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఆ డోర్ దగ్గర ఆ ప్యాకేజీ ఉంచి ,అదే తనను కాపాడిందని,థ్యాంక్స్ నోట్ పెట్టి అతను బయల్దేరి వెళ్తూ దారి కోసం వెతుక్కుంటూ ఉండగా ఓ అమ్మాయి అతన్ని గైడ్ చేస్తుంది. ఆ అమ్మాయి ట్రక్ కు , ఆ వాలి బాల్ ప్యాకేజ్ కు ఉన్న వింగ్ పెయింటింగ్ ఒకటే అని గమనిస్తాడు చక్ . ఆమె వైపు ఓ చిరునవ్వు నవ్వి తన గమ్యానికి సాగిపోవడంతో సినిమా ముగుస్తుంది. 

మనిషి  జీవితంలో ఎప్పుడో ఓ సారి ఒంటరే. కానీ ఆ ఒంటరితనాన్ని ఎవరు లేని అజ్ఞాత ప్రదేశంలో అనుభవించడమంటే అది చాలా కష్టమైన అంశమే. అక్కడ బ్రతకడానికైనా మనిషికి నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం ఉంది. వాటిని మనం సర్వైవల్ స్కిల్స్ అని అంటున్నా ,అవి మనిషికి జీవితంలో ప్రతి దశలో ఉపయోగపడేవే. 

                  *      *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!