మూసి ఉన్న కిటికీ

 సినీ సంచారం 

                         మూసి ఉన్న కిటికీ 

                               -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



          జీవితంలో ఏది మంచి ,ఏది చెడు అనే జడ్జిమెంట్లు ఉన్నంతకాలం మనిషి తన జీవితంలో మార్పులను అంగీకరించలేడు. మంచి -చెడు -నైతిక విలువలు ఏ మేరకు మనిషి జీవితాన్ని శాసిస్తాయి ? స్వేచ్చకు వాటికి మధ్య ఉన్న విభేధాల వల్ల మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి ? ఒకసారి మార్పును ఆహ్వానించడం మొదలుపెట్టాక వారి జీవితాలు ఎలా మారతాయో స్పష్టం చేసే సినిమానే 2000 లో వచ్చిన 'Chocolat.'ఇంగ్లీష్ రచయిత్రి జోన్ హారిస్ రాసిన నవలను అదే పేరుతో ఈ సినిమాగా చేయడం జరిగింది. 

వియన్నా తన ఆరేళ్ళ కూతురు అనుష్కా తో  ఓ ఫ్రెంచ్ గ్రామానికి రావడంతో సినిమా మొదలవుతుంది. వియన్నా జీవితం ఒక చోట స్థిరంగా ఉండే జీవితం కాదు. జీప్సిల శైలిలో ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు అక్కడ నుండి వేరే చోటుకు వెళ్ళే జీవితం వారిది. అంతకుముందు ఆస్ట్రేలియా ,ఇంకా కొన్ని యూరప్ దేశాలు తిరిగాక ప్రస్తుతం ఫ్రాన్స్ లో ని ఈ గ్రామానికి వస్తారు. 

ఆ గ్రామం మొత్తం ఆ మేయర్ ఆజ్ఞాల అనుసారంగా నడుస్తూ ఉంటుంది. అతను మత పరమైన వ్యక్తి. అతని అభిప్రాయాల ప్రకారం ప్రతి వారం కచ్చితంగా చర్చికి వచ్చి తీరాలి. వియన్నా వచ్చిన తర్వాత ఆమెను రమ్మని ఆహ్వానించినా సరే ఆమె నిరాకరిస్తుంది. దానితో ఆమె పట్ల ,ఆమె జీవిత శైలి పట్ల వ్యతిరేకత నింపుకున్న మేయర్ ఆమెతో ఎవరు సన్నిహితంగా మెలగకూడదని శాసిస్తాడు. ఆ సమయంలో ఆ గ్రామంలో ఈస్టర్ ముందు వచ్చే లెంట్ 41 రోజుల  ఉపవాసాలు నడుస్తూ ఉన్నాయి. 

అదే సమయంలో వియన్నా అక్కడ ఒక చాక్లటేర్  తెరుస్తుంది. మొదట విముఖత చూపించినా జనులు ఆమె  చాక్లటేర్ వైపు ఆకర్షించబడతారు. అదే గ్రామంలో ఉండే జోసెఫిన్ ను ఆమె భర్త శారీరకంగా  హింసిస్తున్న సమయంలో తనతో స్నేహితురాలిగా మెలుగుతున్న వియన్నా దగ్గరకు భర్తను వదిలి వచ్చేస్తుంది జోసెఫిన్. ఆ తర్వాత ఆమె కూడా చాక్లెట్లు ,చాక్లెట్ కేకులు తయారు చేసే పనిలో సాయంగా ఉంటుంది. 

అలాగే మేయర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పని చేస్తున్న చార్లీ తన కొడుకుతో జీవిస్తూ ఉంటుంది. ఆమె తన కొడుకును తన అదుపులో ఉండేలా చేస్తుంది. ఆ బాలుడు ప్రతి విషయం ఆమె అంగీకారం ప్రకారమే చెయ్యాలి. చార్లీ తల్లి ఆర్మండ్ వియన్నా కు ఇల్లు అద్దెకు ఇచ్చిన స్త్రీ. ఆమెకు దూరంగా తన కొడుకును ఉంచుతుంది చార్లీ. మొదట వియన్నాకు మంచి స్నేహితురాలవుతుంది ఆర్మండ్ . తర్వాత వియన్నా మంచితనం,కలుపుగోలుతనం వల్ల అందరూ ఆమె వైపే ఆకర్షించబడతారు. 

చార్లీ కొడుకు కూడా తన అమ్మమ్మకు ఈ  చాక్లటేర్  లోనే     సన్నిహితమవుతాడు .   జోసెఫిన్         భర్త  ఆమెను   శారీరకంగా  హింసించినందుకు అతన్ని మంచి మార్గంలో    పెట్టడానికి  అన్నీ    విధాలా ప్రయత్నిస్తాడు మేయర్ . జోసెఫిన్  భర్తకు ఒక కేఫే ఉంది. మారినట్టే    ఉన్నా అతను  ప్రవృత్తి           రీత్యా    మారడు.   ఉదయం  భార్యను క్షమాపణ అడిగి ,ఆమె రావడానికి నిరాకరించిందని  రాత్రికి ఆమె   మీద దాడి  చేసే ప్రయత్నం    చేస్తాడు .  కానీ వియన్నా   సాయంతో    ఆ    అపాయం     నుండి      బయటపడుతుంది   జోసెఫిన్. 

ఇదే సమయంలో  ఇంకొందరు  జీప్సిలు ఆ ఊరిలోకి   అడుగుపెడతారు. వారు తమ బోట్స్ లో జీవిస్తూ ఉంటారు. వారందరినీ బహిష్కరించమని మేయర్ ఆజ్ఞలు జారీ చేస్తాడు. వియన్నా మాత్రం వారితో సన్నిహితమగానే ఉంటుంది. వారిలో ఒకరైన రుక్స్ పట్ల ప్రత్యేక సాన్నిహిత్యం కలిగి ఉంటుంది. ఆర్మండ్ 70 వ పుట్టిన రోజు వియన్నా అందర్నీ ఆహ్వానించి రుక్స్ బోట్ లో సెలబ్రేట్  చేస్తుంది. మేయర్ ను మాత్రం ఆహ్వానించదు వియన్నా. ఇది జోసెఫిన్ భర్త మేయర్ కు చూపిస్తాడు . ఆ రాత్రి ఎవరు చూడకుండా ఆ బోట్స్ కు నిప్పంటిస్తాడు జోసెఫిన్ భర్త . 

ఆ పుట్టినరోజు  అయిన వెంటనే ఇంటికి మనవడు తీసుకు వచ్చాక ఆమె మరణిస్తుంది. అలా తాను కోరుకున్నట్టే ఎవరి మీద ఆధారపడకుండా మరణిస్తుంది ఆర్మండ్. ఆ తర్వాత జోసెఫిన్ భర్త మేయర్ దగ్గర తానే నిప్పంటించానని చెప్పడంతో అతన్ని ఆ ఊరి నుండి బహిష్కరిస్తాడు మేయర్. 

అక్కడి నుండి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న వియన్నా బయల్దేరిన సమయంలో వంట గదిలో ఆ గ్రామపు వారంతా ఈస్టర్ సండే కోసం చాక్లెట్ తయారు చేస్తూ ఉండటం చూసి ,వారంతా తనను ఎంతగా ప్రేమిస్తున్నారో ,వారి జీవితాల్లో తాను ఎలా మార్పు తెచ్చిందో తెలుసుకుని అక్కడే ఉండిపోవడానికి నిర్ణయించుకుంటుంది. ఆఖరికి చార్లీ కూడా వారైతో కలిసిపోతుంది. ఇది తెలుసుకున్న మేయర్ ఆ  చాక్లటేర్ ను నాశనం చేద్దామని వెళ్ళినప్పటికీ కూడా ఆ చాక్లెట్ రుచిలో మైమరచిపోయి అక్కడే నిద్రపోతాడు. 

ఉదయాన్నే అది చూసిన వియన్నా తాను ఎవరికి చెప్పానని మాట ఇస్తుంది. ఈ సంఘటనతో మేయర్ కూడా మారతాడు. ఆ ఈస్టర్ సండే సెలబ్రేషన్స్ తో సినిమా ముగుస్తుంది. 

    ఓ మనిషి  తన జీవితంలో  ఏ పనిలో     సంతోషం  అనుభవిస్తాడు     అన్నది  అతనికి  మాత్రమే      సంబంధించిన   విషయం. జీవన   శైలి     ఇలానే  ఉండాలి     అనే  నిబంధనలు  ఉన్నంతకాలం  మనిషి  మార్పును ,ఆ మార్పుతో    వచ్చే    నూతనత్వాన్ని    సంతోషాన్ని    ఆస్వాదించలేడు. ఆ మూసి     ఉన్న     కిటికీ  తెరిస్తేనే     మనిషి  జీవితంలో  అజ్ఞాతంగా      ఉన్న    సంతోషం  ఆహ్వానించబడుతుంది

                        *     *   * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!