అమరత్వం

  సినీ సంచారం

                        అమరత్వం

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)




స్త్రీల మధ్య  ముఖ్యంగా పురుషుడి కోసం తలెత్తే వివాదాలు ఎటువంటి పరిణామాలకైనా దారి తీయవచ్చు. దీనికి ఏ కారణాలైనా ఉండవచ్చు. స్త్రీ -పురుషులిద్దరిలో తాము ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం అంతా తేలికగా తీసుకునే విషయంగా అయితే ఉండదు. అలా ఇద్దరు స్త్రీల మధ్య ఓ  పురుషుడి కోసం తమ మరణం తర్వాత కూడా ఎలా ప్రవర్తించారో ,చివరకు వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరిగాయో తెలిపే సినిమానే 'Death Becomes Her.' ఈ సినిమా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కు ఆస్కార్ కూడా పొందింది.

            1978 లో మాడ్లీ యాష్టన్ తన స్నేహితురాలైన హెలెన్ ను తన నాటకానికి ఆహ్వానిస్తుంది. మాడ్లీ ఓ నటి.  హెలెన్ ఓ రచయిత్రి. ఆమె తన ఫియాన్సీ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఎర్నెస్ట్ ను కూడా  తీసుకువెళ్తుంది.అక్కడ మాడ్లీ ఎర్నెస్ట్ ను కావాలని ఆకర్షిస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటాడు ఎర్నెస్ట్.  అప్పటికే  తన బాయ్ ఫ్రెండ్స్ లో ఎంతో మంది అలాగే మాడ్లీ పట్ల ఆకర్షించబడటంతో ఎర్నెస్ట్ విషయంలో కూడా అదే జరగడం తట్టుకోలేకపోతుంది హెలెన్. ఏడేళ్ళ తర్వాత హెలెన్ డిప్రెషన్ ఓబిసిటిలతో సైక్రియాటిక్ హాస్పటల్లో ఉంటుంది.

ఇంకో ఏడేళ్ళ తర్వాత మాడ్లీ ఎర్నెస్ట్  బెవర్లీ హిల్స్ లో నివసిస్తూ ఉంటారు. కానీ మాడ్లీ కు యాక్టింగ్  కెరియర్  ఉండకపోవటం వల్ల ఆమె సంతోషంగా  ఉండదు. అలానే  ఎర్నెస్ట్ కూడా reconstructive mortician గా పని చేస్తూ ఉంటాడు. ప్లాస్టిక్ సర్జన్ గా ఉన్న అతను చనిపోయిన శవాలను  పబ్లిక్ లో చక్కగా  కనబడటానికి  చేసే ఎమ్బామింగ్ ప్రక్రియ చేసే సర్జన్ గా మిగులుతాడు.

హెలెన్ తన కొత్త పుస్తకం  విడుదల సందర్భంగా  మాడ్లీ ను  ఆహ్వానిస్తుంది. అదే సమయంలో ఆ పార్టీ కోసం స్పాకు వెళ్ళిన  మాడ్లీ కు అక్కడ ఒకతను ఆమె అందం కాపాడుకోవడం కోసం ఒకరిని కలవమని కార్డు ఇస్తాడు. ఆ పార్టీలో హెలెన్ ను చూసి షాకవుతారు మాడ్లీ ,ఎర్నెస్ట్ . ఆమె ఎంతో స్లిమ్ గా ,యవ్వనంగా ఉంటుంది ఆ యాభై ఏళ్ల వయసులో కూడా. అదే సమయంలో ఎర్నెస్ట్ ను కలిసిన  హెలెన్ అతనికి  భవిష్యత్తు లేకుండా పోవడానికి కారణం  మాడ్లీ అని చెప్పడం కూడా మాడ్లీ వింటుంది.

            అలా  నిరుత్సాహంతో ఉన్న మాడ్లీ తను సంబంధం పెట్టుకున్న యువకుడి దగ్గరకు వెళ్తే అతను తన వయసులో ఉన్న అమ్మాయితో సంబంధం పెట్టుకోవడం చూస్తుంది. అతను కూడా ఆమె లాంటి వయసు మళ్లిన స్త్రీతో గడపటం తనకు బాలేదని అవమానించడంతో ,ఆ అవమానభారంతో స్పాలో ఇచ్చిన కార్డులో ఉన్న చిరునామా దగ్గరకు వెళ్తుంది.

            అక్కడ ఉన్న లిస్లే అనే స్త్రీ తన వయసు 71 అయినప్పటికీ కూడా తాను యవ్వనంతో ఉండటానికి కారణం ఓ మ్యాజిక్ డ్రింక్ అని చెప్పడంతో అది తాగడంతో మాడ్లీ కూడా యవ్వనవతిగా మారిపోతుంది. ఈ లోపు ఎర్నెస్ట్ ఇంటికి వెళ్ళిన హెలెన్ అతన్ని మాడ్లీని హత్య చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇంటికి తిరిగి వచ్చిన మాడ్లీ తో గొడవ తలెత్తడంతో ఆమె మెట్ల మీద నుంచి పడిపోవడంతో మరణించినా ఆమె ఆ మ్యాజిక్ డ్రింక్ తాగడం వల్ల మళ్ళీ జీవిస్తుంది. ఈ విషయం హెలెన్ కు ఫోన్ చేసి చెప్తాడు ఎర్నెస్ట్. మ్యాడ్లీ మళ్ళీ బ్రతకటంతో అందులోనూ ఇంకా మెడ దగ్గర నొప్పి ఉండటంతో ఆమెను హాస్పటల్ కు తీసుకువెళ్తాడు ఎర్నెస్ట్.

            అక్కడ డాక్టర్లు ఆమె గుండె పనిచేయకపోయినా సరే ఆమె జీవించి ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఆమె స్పృహ తప్పడంతో ఆమె మరణించిందని భావించి ఆమెను మార్చురిలో ఉంచుతారు. ఆ విషయం తెలుసుకున్న ఎర్నెస్ట్ ఎలానో ఆమెను అక్కడ నుండి తప్పిస్తాడు. ఇంటికి వచ్చాక ఆమె శరీరాన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఎర్నెస్ట్.

            ఈలోపు అక్కడికి వచ్చిన హెలెన్ తో మాట్లాడుతున్న ఎర్నెస్ట్ ను చూసిన మాడ్లికి తనను చంపడానికి ప్రేరేపించిందని హెలెన్ అని తెలియడంతో ఆమెను షూట్ చేస్తుంది. కడుపులో తీవ్ర గాయం తగిలినా ఆమె కూడా అదే మ్యాజికల్ డ్రింక్ తాగడం వల్ల బ్రతికే ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు స్నేహితులౌతారు. ఎర్నెస్ట్ కు నచ్చక వారి జీవితం నుండి వెళ్ళిపోదామని నిర్ణయించుకుంటాడు.

            కానీ అతనితోనే మరణించినా  తమ శరీరాలను సౌందర్యంతో కాపాడుకునేలా చేయడం సాధ్యమని భావించి వారిద్దరూ అతనికి స్పృహ తప్పెలా చేసి లిస్లే దగ్గరకు తీసుకువెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక అమరత్వాన్ని నిరాకరించి ఎలాగో అక్కడి  నుంచి తప్పించుకుని బయటపడతాడు ఎర్నెస్ట్.

            37 ఏళ్ళ తర్వాత ఎర్నెస్ట్ మరణం తర్వాత ఏర్పాటు చేసే సంతాప సభకు హాజరవుతారు హెలెన్, మాడ్లీ. నిజంగా అమరత్వంతో జీవించడం అంటే తమ తరువాతి తరాల వారి మనసుల్లో జీవించడం అని ఆ సంతాప సభలో చెప్తారు. అప్పటికే భార్య, పిల్లలు ,మనవల్లతో జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాకే మరణిస్తాడు ఎర్నెస్ట్. కానీ మాడ్లీ ,హెలెన్ మాత్రం ఊడిపోతున్న తమ చర్మాన్ని కప్పి పెట్టుకుంటూ  అలా జీవనం కొనసాగిస్తూనే ఉన్నారని చూపించడంతో సినిమా ముగుస్తుంది.

            మంచి క్లాసిక్ సినిమాలు మీకు ఇష్టమైతే మాత్రం ఈ సినిమా తప్పకుండా చూడండి. ఈ సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా కచ్చితంగా చూడాలి.

  *      *    *

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!