ఎదురు తిరిగిన గాలి

 చదువరి 

                            ఎదురు తిరిగిన గాలి 

                                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన) 



తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియలో ఎంతో మంది రచయితలు తమదైన శైలితో సాగుతున్నారు. నవలా రచనలో వర్ణనల కన్నా కూడా కేవలం కథను రసవత్తరంగా నడిపించే శైలిలో రాయడం వల్ల ఎక్కువ మందికి వాటి పట్ల ఆసక్తి కలిగే అవకాశం ఉంటుంది. అటువంటి రచయితల్లో చందూ సోంబాబు కూడా ఒకరు. ఆయన నవలల్లో ''ఎదురు తిరిగిన గాలి " గొప్ప కథాంశం ఉన్న నవల కాకపోయినప్పటికీ కూడా కథను సుత్తి లేకుండా వెంట వెంటనే చదివింపజేసే శైలిలో రాశారు. ముఖ్యంగా రచయితలుగా తమదైన ముద్ర వేయాలనుకున్న వారికి ఎంతో కొంత ఆ మార్గంలో పయనించిన వారి శైలుల పట్ల అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రతి రచయిత రచనలో కచ్చితంగా వారి ముద్ర ప్రత్యక్షమవుతుంది. దానికి కథాంశంతో సంబంధం లేదు.ఈ నవల చిన్న నవల లేదా నవలిక. 

అనంత్ మేనమామ రామదాసు. అతను 15 ఏళ్లుగా తన ఊరిలో మకుటం లేని మహారాజు లా ప్రతి సారి పోటీ లేకుండా విజయం సాధిస్తూ, ఒకవేళ ఎవరైనా పోటీగా ఉంటే వారిని నాశనం చేసి మరి తన విజయాన్ని నిలుపుకుంటున్నాడు. అలా అతనికి బలైన వ్యక్తి కొడుకే చలపతి. అతని తండ్రి పతనమై ఆత్మహత్య చేసుకున్నాక వారి దశ మారిపోయింది. ఆ ఊరు వదిలి  తల్లి, చెల్లితో హైదరబాద్ వచ్చి ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ వారిని పోషిస్తూ ఉంటాడు చలపతి. తర్వాత అతని ఉద్యోగం పోతుంది. దానికి కారణం అతను పని చేస్తున్న ఫ్యాక్టరీలో ఒకతన్ని అన్యాయంగా ఉద్యోగం నుండి తీసివేసినందుకు అతనికి చలపతి సానుభూతి చూపించడమే దానికి కారణం. 

అనంత్  మేనమామ డబ్బులతో జల్సా చేసుకుంటూ సినిమాల్లో రాణిద్దామని హైదరబాద్ లో ఉంటాడు. అతనికి అమ్మాయిల జీవితంతో ఆడుకోవడం సరదా. అలా ఆడుకున్న వారిలో జ్యోతి అనే అమ్మాయి కూడా ఉంటుంది. కానీ తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె అతన్ని రౌడీలతో కొట్టించి ,అతని మీద మళ్ళీ పగ తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. 

దుర్గా చలపతి చెల్లెలు. ఆమెను కూడా అనంత్ మోసం చేస్తాడు. అనంత్ తన మేనమామ కూతురు శ్రీదేవి ని పెళ్లి చేసుకుంటే ఆస్తి వస్తుందని ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. కానీ రామదాసు తన రాజకీయ లబ్ది కోసం ఓ ప్లీడర్ అయిన శేషగిరికిచ్చి ఆమె వివాహం చేస్తాడు. ఆ తర్వాత రామదాసుకు ఎదురుగా నిలబడిన ఆదిశేషయ్యను చంపే ప్రయత్నం రామదాసు చేయబోతే అది తిరగబడి అతని మీదే ఆ ప్రయత్నం జరుగుతుంది. రామదాసు ఎన్నికల్లో ఓడిపోతాడు ,ఆదిశేషయ్య గెలుస్తాడు. జ్యోతి మాటల ద్వారా తాను మోసపోయానని తెలుసుకున్న దుర్గ అప్పటికే గర్భవతి అవ్వడంతో ఆత్మహత్య చేసుకుంటుంది. 

అప్పటికే ఇల్లు వదిలి కామ్రేడ్స్ తో కలిసిన చలపతి తన చెల్లెలి మరణానికి ప్రతీకారం తీసుకుందామని వెళ్ళేసరికి అనంత్ శ్రీదేవి మీద కూడా అఘాయిత్యం చేయబోతుంటే అతన్ని హత్య చేస్తాడు చలపతి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయటంతో నవల ముగుస్తుంది. 

ఇటువంటి కథాంశాలతో ఎన్నో సినిమాలు వచ్చేశాయి. కానీ నవలా శైలి సినీ స్క్రీన్ ప్లే ఒకేలా ఉండవు . కానీ ఈ నవలా శైలి మాత్రం సినిమాలకు అనుగుణంగా మార్చుకునే శైలిలో రాయబడింది. స్క్రీన్ ప్లే అడాప్షన్ సులభంగా ఉండే నవలలు ,కఠినంగా ఉండే నవలలు కూడా ఉంటాయి. పాఠకుడు శైలి ,అడాప్షన్ వంటి అంశాల పట్ల కూడా అవగాహన పెంచుకోవటానికి అందుబాటులో ఉన్న పుస్తకాలు చదవడం కూడా ఓ మంచి అలవాటే. 

                *     *    * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!