ఆశయం

 చదువరి

    ఆశయం

       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



   మాలతీ చందూర్ గారి నవలల్లో  కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవలహృదయ నేత్రి. స్వాతంత్ర్యం రాక ముందు కథ మొదలవుతుంది. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన గోపాలం బాల్యంలోనే అత్తయ్య రామలక్ష్మీ ప్రభావంచే  జాతీయోద్యమం వైపు ఆకర్షితుడవుతాడు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన అతన్ని తల్లిదండ్రులు అర్ధం చేసుకోరు. అత్త,మామ మరణించినా వారి ప్రభావం అతని మీద గాఢంగా ఉంటుంది. పెళ్లయినా సరే అదే ఉద్యమ స్పూర్తితో మూడు సార్లు జైలుకు వెళ్తాడు. మూడోసారి జైలు నుండి తిరిగి వచ్చినప్పుడు, భార్య ,కుటుంబ సభ్యులు అతని పట్ల ఎంతో ఆదరణ చూపుతారు. దానికి కారణం జాతీయవాది కనుక అతన్ని ఎన్నికల్లో నిలబెట్టడానికని అర్ధమవుతుంది. ఎన్నికల్లో గెలిచిన అతను మంత్రి అవ్వడు,ఇంకోసారి రాజకీయాల పట్ల ఆసక్తి చూపడు.

          గోపాలం బాల్యంలో చదువుకునే రోజుల్లో నందయ్య అనే హరిజన బాలుడు స్నేహితుడవుతాడు. దేశభక్తి ,తన కులం వారిని ఉద్దరించాలన్న అతని కసి రాజకీయాల్లోకి వచ్చాక మంత్రిగా ఎదగగానే నీరుగారిపోయి లంచగొండిగా మారడం కూడా గోపాలం గమనిస్తాడు. గోపాలం తమ్ముడు బుచ్చి బ్రిటిష్ వారి కొలువులో పని చేస్తూ ఉంటాడు.

          జాతీయవాదులకు  ప్రభుత్వం అయిదు ఎకరాల పొలం ఇస్తున్నా గోపాలం తీసుకోడు. అతని కొడుకు శ్రీనివాస్ తండ్రి ప్రభావంతో కామ్రేడ్స్ తో కలిసిపోతాడు. స్వరాజ్యం కోసం గోపాలం అహింసా మార్గాన్ని అవలంబిస్తే, ఆ స్వరాజ్యంలో సమానత్వం కోసం హింసను ఎన్నుకుంటాడు శ్రీనివాస్. భార్య దానికి కారణం గోపాలం అనే నిందించడంతో విసుగు చెంది పౌనార్ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు.

          ఓ సారి అర్జంటుగా రమ్మని కబురు పంపితే ఇంటికి వెళ్తాడు. అక్కడ కొడుకు ఓ కామ్రేడ్ ద్వారా తన పసి కూతురిని పంపిస్తాడు. అప్పటి నుండి ఆ పాప ఆలనా పాలనా గోపాలమే చూస్తాడు. గోపాలం తన తమ్ముడు బుచ్చి ఇంట్లో ఉండటం అతని భార్యకు ఇష్టం లేదని గ్రహించిన గోపాలం లో ఇన్కమ్ గ్రూప్ కింద హౌసింగ్ కాలనీలో ఓ ఇల్లు అలాట్ చేయించుకుంటాడు. ఆ పాపకు స్వరాజ్యం అని పేరు పెడతాడు.

          ఓ పత్రికలో సబ్ ఎడిటర్ గా గోపాలం పని చేస్తాడు. అప్పటికి ఎమర్జెన్సీ వస్తుంది. ఈ లోపు గోపాలం తల్లిని  బుచ్చి ఆమె నగల కోసం(గోపాలానికి ఇస్తుందేమోనని ) హత్య చేస్తాడు.ఆ కేసు విచారణకు రాదు. ఎమర్జెన్సీ ముగిసి,ఎన్నికలు జరిగినా ఇందిరా గాంధీ ఓడిపోతుంది. తర్వాత వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం పాలన మీద కాకుండా ఇందిరా గాంధీ తప్పుల మీద దృష్టి పెట్టడం వల్ల మళ్ళీ ఆర్నెళ్లకే ఎన్నికలొచ్చి మళ్ళీ ఇందిరా గాంధీ విజయం సాధించినా హత్యకు గురవుతుంది. ఇవి దేశ పరిస్థితులు.

          ఎమర్జెన్సీ సమయంలో తోటి విద్యార్ధిని మార్కుల కోసం పోరాడిన స్వరాజ్యం జైలు పాలవ్వడంతో ఆమె కోసం గోపాలం మళ్ళీ బుచ్చి దగ్గరకు వెళ్తాడు. బుచ్చి ఈ విషయం పట్ల నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ, తల్లి మరణ రహస్యాన్ని బయట పెడతానని గోపాలం అనడంతో మర్నాడు స్వరాజ్యంతో సహా మిగిలిన ఆరుగురు కూడా ఇంటికి వస్తారు.

          ఆ ఆరుగురికి కాలేజీ యాజమాన్యం టిసిలు ఇస్తుంది. జానకమ్మ గోపాలనికి కబురు పెట్టి చీరాలకు రమ్మని చెప్పి,అక్కడ ఉన్న రామలక్ష్మీ ఇంటిని అతనికి అప్పగిస్తుంది. స్వరాజ్యం ఆ ఇంటిని వృద్ధుల సంరక్షణకు మార్చాలనే నిర్ణయం తీసుకున్నాక,అందరూ అక్కడికి ప్రయాణం అవ్వడంతో నవల ముగుస్తుంది.

          మనుషుల్లో ఉండే స్వార్ధం, దేశభక్తి అన్న ముసుగు జీవితంలో ఎంత రాణించడానికి పనికి వస్తుందో తెలుసుకుని చాకచక్యంగా ప్రవర్తించలేక, నిజాయితీగా ఉన్న గోపాలం జీవితం చుట్టూ ఉన్న జీవితాల ద్వారా సమాజ స్వరూపాన్ని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు రచయిత్రి. నిజానికి దేశం కోసం పోరాడేవారికి కుటుంబ బాధ్యతల పట్ల ఉండాల్సిన బాధ్యత కూడా లోపిస్తుందేమో అనిపిస్తుంది కూడా. విభిన్నఅంశాలను వాస్తవికంగా రాయగల మాలతీ చందూర్ గారి నవలల్లో కచ్చితంగా చదవాల్సిన నవల ఇది.

  *     *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!