డబ్బు కోసం !

 చదువరి

డబ్బు కోసం !

      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



              మనుషులను డబ్బు ఎంతగానో ప్రభావితం చేస్తుంది. డబ్బు లేని వారు డబ్బు కోసం ఎలా ఆరాటపడటారో, అలాగే ఆ డబ్బు ఉన్నవారు, సంపాదించుకున్నవారు దాన్ని కాపాడుకోవడానికి అంతకు ఎన్నో రెట్లు శ్రమిస్తారు. మనిషికి తాను బతికే కాలం కొంతే అని తెలిసినా డబ్బు మీద వ్యామోహం ఉండని వారు అరుదు. అలా తమ డబ్బును కాపాడుకోవడం కోసం సంతానం విషయంలో మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో, డబ్బు కోసం మనుషులు ఎలా దిగజారిపోతారో తెలిపే నవల హోతా పద్మిని దేవి గారి ‘గడ్డి తినే మనుషులు.’  

          ఇది ప్రధానంగా మూడు కుటుంబాల కేంద్రంగా జరిగే కథ. భువనేశ్వరికి ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. చంద్రమౌళి-శైలజ, నీలిమ-రమాకాంత్, ప్రభాకర్-హరిత;వీరు భువనేశ్వరి కొడుకులు-కోడళ్ళు. జలజ కూతురు. వీరిలో హరితకు పెళ్ళయిన అయిదేళ్లకు కూడా పిల్లలు పుట్టక పోవడంతో, ఆ దంపతులు బయటి వారిని దత్తత తీసుకుంటే వారి ఆస్తి బయటి వారికి పోతుందని హరిత దంపతులకు నీలిమ నెలల బిడ్డను దత్తత తీసుకుంటే బావుంటుందనే ప్రతిపాదన జలజ చంద్రమౌళి ద్వారా తీసుకువస్తుంది. కానీ నీలిమ దంపతులు అంగీకరించకపోవడం,కన్నబిడ్డను ఆ తల్లి నుండి దూరం చేసే ప్రయత్నం హరిత చేయకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమవుతుంది.

          జలజ  కడుపుతో ఉన్న తన కూతురు రేఖకు పిల్లలు పుడితే వారిని అయినా హరిత దంపతులకు దత్తత ఇవ్వాలనే ప్రయత్నం చేసినా రేఖా మృతశిశువుకు జన్మనివ్వడంతో ఆ ప్రయత్నం కూడా బెడిసి కొడుతుంది. తర్వాత హరిత నెల తప్పి, కవలలకు తల్లవుతుంది. రేఖకు మరలా తల్లయ్యే అవకాశం ఉండకపోవటంతో ఆమె ఓ అనాధను దత్తత తీసుకుంటుంది.

          రెండో కుటుంబం వసుధ-వంశీలది.  వంశీ హఠాత్తుగా  మరణించడంతో  ఆమె తన తల్లి దగ్గర ఉంటుంది. ఆమెకో పాప, పేరు సాన్వి. లక్ష రూపాయల ఉద్యోగం ఆమెది. అయితే కోడలి నుండి తమ ఆస్తి లాక్కోవడానికి కూతురి కాపురం బాగోలేదనిఅబద్ధం చెప్పి ఆమె నుండి ఇన్సూరెన్స్ పది లక్షలు, ఇంకొన్ని కారణాలు చెప్పి బంగారం,కారు కూడా తీసుకుంటుంది ఆమె అత్త. ఆమె కుతంత్రాలు వసుధా గ్రహించలేకపోతుంది.ఆమెతో సహోద్యోగిగా పనిచేస్తున్న స్వామినాథన్ తో వసుధ అతన్ని ఇష్టపడుతుందని,అలాగే వసుధకు అతను ఇష్టపడుతుందని  వసుధ అత్త చెప్తుంది. ఇదంతా ఆమెకు పునర్వివాహం అయితే కొడుకు ఆస్తి ఆమెకు చెందదని. ఇవన్నీ తెలుసుకున్న ఆమె మామ వసుధకు అన్యాయం జరగకూడదని యాభై లక్షలు,వంశీ పేరున ఉన్న ఇంటి డాక్యుమెంట్లు ఆమెకు ఇచ్చి,అత్తతో జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తాడు.

          మూడో కుటుంబం రవి-వైష్ణవిలది. రవి,వైష్ణవిలకు సంతానం లేకపోవడం వల్ల ఆమె అత్తగారు ఆస్తి బయటకు వెళ్ళకూడదని వైష్ణవి ఆడపడుచు అయిన వసుంధర కొడుకు అయిన పదో తరగతి చదివే బాలును వారి దగ్గరా ఉంచేలా చేస్తుంది. తల్లి,నాయనమ్మ గారాబం వల్ల బాలు చదువు మీద ఆసక్తి చూపించడు. దానితో పాటు ప్రోగ్రెస్ రిపోర్టులో సంతకం ఫోర్జరీ చేయడం,పరీక్షల్లో  స్లిప్పులు పెట్టడం,ఆ విషయాలు రవికి చెప్పారనే కోపంతో ఓ మాస్టారి మీద దాడి చేసే ప్రయత్నం చేయడంతో రవి నిశ్చయించుకుని  బాలును వసుంధర దగ్గరకు అతడిని పంపేస్తాడు.

          ఈ నవలలో ఓ రకంగా ఆలోచిస్తే ఎవరికి వారికి తాము సంపాదించుకున్న డబ్బు తమ కుటుంబానికే ,తమ రక్తానికే పరిమితమవ్వాలనే ఆలోచన ఉండటం సహజంగానే అనిపించినా, ఆ పరిస్థితులు లేనప్పుడూ విశాలంగా ఆలోచించే ధోరణి కూడా లేకపోవడం శోచనీయం. డబ్బు మనిషి అవసరాలను తీర్చాలే తప్ప, ఆ డబ్బు మనిషి దుఃఖాలకు కేంద్రం కాకూడదు.

  *      *     *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!