విధి ప్రతికూలత

 చదువరి

                      విధి ప్రతికూలత

                          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



        మనుషుల  జీవితాల్లో సుఖాంతం అయ్యే కథలకు చాలాసార్లు మనుషులే అవరోధాలుగా మారతారు.కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రం విధి కారణమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్న ఒకతను ప్రేమించిన ఇద్దరు అమ్మాయిలను ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోయాడో తెలిపే నవల రతన్ ప్రసాద్ గారి నవలే 'ఎప్పటికీ  మీకేమి కాను'. కేవలం పరస్పర ఇష్టం ఉన్నంతమాత్రాన అది వివాహంతో సుఖాంతం అవ్వాల్సిన అవసరం లేదని, అది ఎటువంటి పరిస్థితుల్లో అయిన విచ్చిన్నం అయ్యే సందర్భాలు ఎక్కువేనని ఈ నవల స్పష్టం చేస్తుంది.

        అనాథ అయిన శేఖర్ ను రామ్మూర్తి పెంచుతాడు. అతనికి హరిత,గోపాల్ అనే పిల్లలు. హరితను శేఖర్ ఇష్టపడతాడు. ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక చెబ్దామనుకుంటాడు.కోటీశ్వరుడైన తన స్నేహితుడైన శ్రీనివాసరావుకి ఉత్తరం రాసి అతన్ని హైదారాబాద్ పంపుతాడు రామ్మూర్తి. తన స్నేహితుడు నరేశ్ ఇంట్లో ఉంటాడు శేఖర్. శ్రీనివాసరావును కలుస్తాడు. అలా శ్రీనివాసరావు, ఆయన కూతురు నీరజ, నరేశ్ సన్నిహితులవుతారు.

        శేఖర్ పరీక్షలు రాసి బ్యాంకు ఉద్యోగం సంపాదిస్తాడు. ఆ ఆనందంతో ఇంటికి వెళ్తాడు. హరితను పెళ్ళి చేసుకోవాలనుకున్న విషయం రామ్మూర్తికి చెప్పాలనుకుంటాడు. అప్పుడు ఆయన తన అన్న విషయం చెప్తాడు.కృష్ణమూర్తి తన అన్న అని, అమ్మాయిల వ్యసనపరుడని, అతను ఓ అమ్మాయితో లేచిపోతే,ఆమె చివరికి అతన్ని వదిలేసింది. ఆ తర్వాత ఓ రాత్రి ఓ పసికందును తమ చేతిలో పెట్టి తన బిడ్డను, ఓ స్త్రీ ద్వారా తను మారానని, ఆమె మరణించిందని, క్యాన్సర్ తో తన మరణం కూడా సమీపంలో ఉందని అందుకే ఆ బిడ్డను చూసుకొమ్మని రామ్మూర్తి,వర్ధనమ్మల చేతిలో పెట్టాడని ఆ బిడ్డే శేఖర్ అని చెప్తాడు. శేఖర్ హృదయం పగిలిపోతుంది.

        తర్వాత గోపాలం పెళ్ళి మేనరికంలో జరుగుతుంది. నరేశ్ హరితను ఇష్టపడుతున్నాడని చెప్పడం వల్ల వారి వివాహం కూడా జరిపిస్తాడు శేఖర్ రామ్మూర్తి దంపతుల అభీష్టంతో. వాళ్ళు వచ్చేసరికి దూరపు బంధువు ఆస్తి వల్ల కోటీశ్వరుడైన శ్రీనివాసరావు,ఆ వారసుడు తిరిగి రావడం వలన దశ మారిపోతుంది. అంతకాలం ఆస్తిని చూసుకున్నందుకు ఓ ఇంటిని ఆయనకు ఇస్తారు.

        నీరజ కూడా శేఖర్ బ్యాంకులో ఉద్యోగం సాధిస్తుంది. నీరజ, శేఖట్ లు ప్రేమించుకుంటారు. కానీ శేఖర్ పెళ్లయ్యేవరకు కొన్ని నియమాలతో ఉండాలనుకోవడం,మనసులోని భావాలను సరిగ్గా చెప్పకపోవడం వల్ల అతన్ని అపార్ధం చేసుకుని సెక్షన్ ఆఫీసరైన మురళీకృష్ణను పెళ్ళి చేసుకుంటుంది నీరజ. ఆ వ్యధతో శేఖర్ రెండు నెలలు సెలవు పెట్టి ఇంటికి వెళ్తాడు. అప్పటికే రామ్మూర్తి గారు ఆఖరి నిమిషంలో ఉంటారు. ఆయన మరణించిన వెంటనే వర్ధనమ్మ కూడా మరణిస్తుంది.

        తర్వాత అతనికి వైజాగ్ ట్రాన్స్ఫరైంది అని తెలుసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. పెళ్ళయిన శేఖర్ నే ప్రేమించడం వల్ల మురళీకృష్ణతో నీరజ నిర్లిప్తంగా ఉంటుంది. దానితో అతను కూడా నిరాసక్తంగా ఉంటాడు. నీరజ వైజాగ్ లో ఉన్న శేఖర్ కి తనకి అతనంటే ఇష్టమని, అతని కోసం వచ్చేస్తానని రాస్తుంది. ఈ ఉత్తరంతో పాటు శేఖర్ కు ఇంకో ఉత్తరం వస్తుంది. అది నీరజ పెళ్ళి కుదిర్చిన రాజారామ్ నుండి, ఆ వివాహబంధాన్ని నిలపమని.

        న్యాయబద్ధంగా విడాకులు తీసుకున్నాక తను వివాహం చేసుకుంటానని, అప్పటికీ రెండేళ్ళు పడుతుంది, దానికి ఇంకో ఆరు నెలలు ఉంది కనుక అప్పటి వరకు భర్తతో ఉండమని లేఖ రాస్తాడు శేఖర్.తర్వాత తనను భర్తతో కలపడానికే అతను ఆరు నెలల సమయం తీసుకున్నాడని అర్ధమవుతుంది నీరజకు. మురళీకృష్ణ ప్రేమను కూడా అర్ధం చేసుకుంటుంది. మనసు మార్చుకుంటుంది. అదే విషయం శేఖర్ కు లేఖ ద్వారా తెలియపర్చడంతో నవల  ముగుస్తుంది.

        ఈ నవలలో శేఖర్ పాత్ర ఓ విశిష్ట పాత్ర.మనిషి తాను అనుకున్న వాటికి ఎంత గాఢంగా కోరుకున్నా దైవానుగ్రహం లేకపోతే అది సాధ్యం కాదని అతని జీవితం పాఠకులకు స్పష్టం చేస్తుంది.

                           *      *     * 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!