పుస్తక లోకం

 పుస్తక లోకం

                                ఫిబ్రవరి -2021

                                -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          ఫిబ్రవరిలో  నేను పుస్తకాలు చదవడంలో ఓ వినూత్న పద్ధతిని అవలంబించాను. నిజం చెప్పాలంటే  ఓ అలవాటుగా పుస్తకాలు చదవడం కొన్నిసార్లు విసుగును కూడా తెప్పిస్తుంది. జనవరిలో అలా ఆపకుండా చదివాక ఫిబ్రవరిలో విసుగనిపించినా సరే నేను పుస్తకాలు చదివే స్పీడ్ మాత్రం పెరిగినట్టు నాకు అనిపించింది.ఈ ఫిబ్రవరిలో నేను క్లాసిక్స్,థ్రిల్లర్స్,స్పిరిచ్యువల్ ఫిక్షన్,కామెడీ ఆంగ్లంలో చదివాను.వీటితో పాటు ఓ రెండు తెలుగు పుస్తకాలు కూడా చదివాను. క్లాసిక్స్ ఎక్కువ సమయం తీసుకునే మాట నిజమే కానీ అవి చదివే కొద్ది పుస్తకాలు చదవడానికి ఉండాల్సిన ఓపిక అయితే పెరుగుతుంది. తెలుగు చదివేటప్పుడు నాకు ఏది ఇబ్బంది అనిపించదు కానీ ఆంగ్ల పుస్తకాల్లో మాత్రం చాలా సార్లు పోయిన నెల మీకు చెప్పినట్టే పుస్తకాలు కొన్ని పేజీలు చదువుతూ,వాటిని మధ్యలో మారుస్తూ అయితే ఈ నెలలో కూడా చేశాను. బహుశా అంత లీనమయ్యే అలవాటు ఏర్పడాలంటే కనీసం ఇంకొన్ని నెలలు పట్టవచ్చేమో! ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫిబ్రవరి పుస్తకలోకం మీ కోసం.

1)Lady Chatterley's Lover-D.H.Lawrence

      ఇంగ్లాంగ్ జీవనాన్ని ప్రతిబింబించే రచయితల్లో లారెన్స్ కూడా ఒకరు. ఈయన రాసిన ఈ లేడి చాటర్లిస్ లవర్ నవల వివాదాస్పదమైనది. ఇందులో భర్త యుద్ధానికి వెళ్ళి శరీరమంతా చచ్చుబడటం వల్ల అతని భార్య వారి దగ్గర పని చేసే అతన్ని ప్రేమించడం,అతనితో వెళ్ళిపోవడం కథాంశం అయినప్పటికీ, ఈ నవలలో ఎప్పుడు కథ కన్నా కూడా వాదనలు,మనుషుల మనస్తత్వాలు స్పష్టం చేస్తూనే,ఈ నవలలో ముఖ్య పాత్రధారి అయిన కోని పనివాడితో సంబంధం పెట్టుకున్నప్పటికీ తన ఆత్మగౌరవం గురించి ఆలోచించటం, ప్రేమకు ,శారీరక అవసరాలకు,మనిషి ఆత్మ గౌరవానికి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా ఈ నవల చర్చిస్తుంది.

2)Jude-The Obscure-Thomas Hardy

 థామస్ హార్డి కూడా ఇంగ్లాండ్ జీవనాన్ని ప్రతిబింబించే క్లాసిక్ నవలలు ఎన్నో రాశారు. ఆయన రాసిన ఈ నవలలో ఓ పల్లెటూరిలో అనాధగా ఉంటూ, ఓ బంధువు దగ్గర పనులు చేస్తూ పెరిగిన ఓ బాలుడు పట్టణం వెళ్ళి, చదువుకోవాలని కన్న కలలన్నీ కూడా ఇద్దరు స్త్రీలు ఎలా ధ్వంసం చేస్తారో రచయిత కథగా మలిచారు. ఇది ఓ పెద్ద నవల. అందులోనూ క్లాసిక్ నవల. ఈ నవల చదువుతుంటే మనిషి తాను అనుకున్నది సాధించడానికి ఆఖరి అడుగు వరకు వెళ్ళినా సరే ప్రలోభాలు అతన్ని ఎలా అక్కడి నుండి కిందికి దిగజారుస్తాయో స్పాషత్మ్ చేస్తుంది.

3)The Good Earth-Pearl S.Buck

          బక్ గొప్ప రచయిత్రి. చైనాలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వారి జీవన విధానం,పరిస్థితుల పట్ల ఉన్న అవగాహనతో రాసిన ఈ నవల తప్పకుండా చదవాల్సిన నవల. చైనాలోని ఓ చిన్న ఊరిలో ఓ సాధారణ పేద రైతుగా ఉన్న ఒక వ్యక్తి చివరకు అక్కడి ఊరినే శాసించే గొప్పవాడిగా ఎలా ఎదిగాడో,అతను భూమి మీద పెంచుకున్న ప్రేమ అతన్ని ఎలా మార్చిందో,యుద్ధాలు-కరువులు అతని జీవితాన్ని,కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసాయో,చివరకు తాను కూడా ఆ ఊరిలో గొప్ప వాడిగా ఎదిగినా అతని కొడుకులు ఎలా మారారో, అందరి మీద జాలి చూపించిన అతను భార్య పట్ల ఎందుకు తగు స్థాయిలో ప్రేమను పంచలేక,ఆమెకు తగు గౌరవం ఇవ్వకుండా ఆమె అసంతృప్తితో చనిపోయే పరిస్థితులు ఎలా కల్పించాదో కథగా ఈ నవల రాయబడింది. గొప్ప నవలకు ఉండాల్సిన అంశాలు ఏమిటి అనే ప్రశ్నకు ఒకానొక సమాధానం ఈ నవల.

4)The Celestine Prophecy-James Redfield

          మనిషి ఎన్నో అసంతృప్తులతో జీవితం గడుపుతున్నాడు. పెరులో దొరికిన ఓ తాళపత్రంలో మనిషి సంతోష జీవనానికి ఉన్న తొమ్మిది సూత్రాలు ఉన్నాయి. వాటిని తమ మతానికి వ్యతిరేకంగా భావించిన చర్చ్ ,ప్రభుత్వం దానిని ఎవరికి తెలియకుండా చేయాలని ప్రయత్నిస్తుంది.ఈ నవలలోని నాయకుడు అనుకోకుండా  దీని గురించి ఓ స్నేహితురాలి ద్వారా తెలుసుకుని దాని కోసం బయల్దేరతాడు. ఆ సూత్రాలు తెలుసుకునే క్రమం నిజంగా చాలా అద్భుతంగా రాయబడింది. మనకు నేడు ఉన్న ఆర్థిక వ్యవస్థ నుండి దీనిని ఆధ్యాత్మిక ఏకనామిగా మార్చే ప్రక్రియ,మనిషి తనకు సంతృప్తినిచ్చే పనే చెయ్యడం,తనను తాను తెలుసుకోవడం ఇలా ఎన్నో ఉన్నాయి ఈ నవలలో. 1990ల్లో వచ్చిన ఈ నవల అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది.

5)The Visitor-Chauncey G.Parker

 ఈ నవలలో కథా నాయకుడు తనకు తన పూర్వీకుల నుండి సంక్రమించిన ఇంట్లో ఉంటూ తన భార్య,పిల్లల దగ్గరకు వీకెండ్స్ లో వెళ్తూ ఉంటాడు. అతని ఇంట్లో ఓ ఎలుక నివాసం ఉంటుంది. దాని వల్ల అతను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం,దాని వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో,తన మానసిక ప్రశాంతతను,ఉద్యోగ ప్రగతిని కూడా ఎలా కోల్పోతాడో,చివరకు ఆ ఎలుక వల్ల ఆ ఇంటిని ఎలా అమ్మేసే స్థాయికి వస్తాడో అన్నదే ఈ నవలాంశం. ఈ నవల నాకు ఎంతగానో నచ్చింది. తన బ్రతుకు తెరువు కోసం బ్రతికే ప్రాణి, ఎలా మనిషి మీద కక్ష సాధించుకోవాలనుకుంది అన్నది ఈ నవలను ఎంతో ఆసక్తికరంగా చదివింపజేస్తుంది.

6)The Feast Of Roses -Indu Sundareshan

          చారిత్రక నవలలు చదివింపజేసేలా రాయడం అన్నది నిజంగానే ఎంతో కష్టమైన అంశం. కానీ భారతీయ చారిత్రక రచయితల్లో ఇందు సుందర్శన్ గారు విశిష్ట రచయిత్రి. మొఘల్ సామ్రాజ్యంలోని ముగ్గురు స్త్రీలు ఎలా ఆ రాజ్యంలో ముఖ్య పాత్రను పోషించారో అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఆవిడ తాజ్ ట్రయాలజీరాశారు. ఇందులో రెండో నవలే ద ఫీస్ట్ ఆఫ్ రోజేశ్.

          ఓ విధవ,ఓ ఆడ పిల్లకు తల్లి అయిన మెహరున్నీసా జహంగీర్ ఆఖరి భార్య అయ్యి,ఎలా అతని పేరున 16 ఏళ్ళు రాజ్య పాలన చేసి నూర్జహాన్ అయ్యిందో స్పష్టం చేసే నవల ఇది. ఆమె ఉపయోగించిన రాజ్య తంత్రాలు,అధికారం కోసం ఎలా తనను తాను ఎప్పుడు బలవంతురాలిని చేసుకుంటూ వచ్చిందో ఈ నవల చదువుతుంటే ఓ స్త్రీ ఎలా చరిత్రను మారుస్తుందో కూడా స్పష్టం అవుతుంది.

7)The Mystic Masseur-V.S.Naipul

          నోబెల్ పురస్కారం పొందిన నైపుల్ నవలల్లో హాస్యం ఎక్కువ. ఆయన రాసిన ఈ నవలలో ఓ స్కూల్ టీచర్ స్థాయి నుండి,మసాజ్ చేసే వ్యక్తిగా,ఓ మిస్టిక్ గా, రచయితగా,రాజకీయవేత్తగా ఈ నవలలోని కథానాయకుడు ఎదిగాడో,అతని జీవన క్రమాన్ని  హాస్యంగా చెప్పడమే ఈ నవల. ఇది ఓ క్లాసిక్ కామెడీ. ఎవరికైనా అర్ధం అయ్యే బాష ఈ నవలను చదివింపజేస్తుంది.

8)Pop goes the weasel-James Patterson

          ఇప్పటి వరకు జేమ్స్ పాటర్సన్ నవలలు నేను ఏం చదవలేదు.కానీ ఆయన నవలల ఆధారంగా వచ్చి గొప్ప హిట్స్ అయిన కిస్ ద గర్ల్స్’,’ఎలాంగ్ కేమే స్పైడర్ సినిమాలు మాత్రం చూశాను. నవలా శైలి కోసం ఈ నవల చదివాను. దాదాపు ఆరు వందల పేజీలు ఉన్న ఈ నవలను ఒక్క రోజులోనే పూర్తి చెయ్యగలిగానంటే దానికి కారణం ఎంత సులభమైన పదాలు,కథ బాగా నడిపించగలగడం. కథ మొత్తం చదివాక ఏముందిలే అనిపిస్తూనే చదివేటప్పుడు చదివింపజేసే శైలి పాటర్సన్ ది. పాటర్సన్ నవలలు అలెక్స్ సిరీస్ లో ఓ క్రమంలో సాగుతాయి. ఇది అలెక్స్ సిరీస్ లోదే.క్రైమ్ థ్రిల్లర్స్ ఎలా ఆసక్తికరంగా మారతాయి అనే విషయం ఇలాంటి రచయితల నవలలు చదివితే స్పష్టం అవుతుంది.

9)The Case of bigamous Spouse-Erl Stanley Gardener

          దాదాపు తెలుగు సాహిత్యంలో డిటెక్టివ్ నవలలు రాసే అందరూ కచ్చితంగా చదివే నవలలు గార్డెనర్ వి. ఈయన డిటెక్టివ్ నవలలు ఎంతో ఆసక్తిగా సాగుతాయి. రెండు పెళ్ళిళ్ళు వేరే పేర్లతో చేసుకున్న వ్యక్తి, ఎలా తన నిజం బయటపడేసరికి తన భార్య మిత్రురాలిని హత్య చేయాలనుకున్నాడో,ఆ తర్వాత ఆ స్నేహితురాలికి సంబంధం లేకుండానే అతని హత్య నేరంలోనే ఎలా ఇరుక్కుందో చెప్పే నవల ఇది.

10)మోదుగు పూలు -దాశరధి రంగాచార్య

          అందరికీ ఈ నవల గురించి తెలిసిందే.బహుశా నేను ఇంత కాలం వరకు చదివి ఉండను. నిజాం పాలనలో మనుషుల కష్టాలు స్పష్టం చేసే నవల ఇది. ఓ ఇంగ్లీష్ పేపర్ ఊర్లోకి తీసుకురావడంతో మొదలైన రఘు విప్లవం క్రమక్రమంగా అహింసతో మొదలై చివరకు హింసతో ఎలా ముగిసిందో ఈ నవల చెప్తుంది. ఈ నవల చదవాల్సిందే తప్ప నాలుగు వాక్యాల్లో చెప్పేది కాదు.

11)రాబందులు -రామచిలకలు -వాసిరెడ్డి సీతాదేవి

          వాసిరెడ్డి గారి నవలల్లో నేను ఇంతకుముందే ఉరి త్రాడు’,’మరీచిక’,’వెన్నెల మండుతోంది’,’మట్టి మనిషి’,’మానిని మనసువంటి నవలలు చదివాను. ఏ అంశం మీద నవల రాసినా సరే పాత్ర చిత్రణలో సీతాదేవి గారి పాత్రలు ఆత్మగౌరవం కోసం పోరాడే పాత్రలు. ఉన్న ఆస్తి అమ్మి కూతుర్ని చదివించిన తండ్రి  కలలను ఆ కూతురు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా నిజం చేసిందో,తండ్రి మార్గంలో నడిచి సమాజానికి సేవ చేసే వృత్తిని ఎన్నుకుని ఎన్ని పాట్లు పడిందో చెప్పే నవల ఇది.

          ఇందులోని ప్రతి నవల సమీక్ష నేను రాశాను. అందుకే వీటి గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది.చదవడం మంచి అలవాటు అనే విషయం మనందరికీ తెలిసిందే.కానీ వివిధ రచయితలవి చదువుతుంటే మనకు మనుషుల మనస్తత్వాలే కాదు సమాజ నిర్మాణాలు కూడా స్పష్టం అవుతాయి.

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!