ఏది ఊతం ?

 చదువరి

ఏది ఊతం ?

     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



  మనిషి జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనిషి అవగాహనకు,మనిషి అంచనాలకు అందకుండా జరిగిపోతూ ఉంటుంది. జీవితంలో ఒక్కో పరిస్థితి ఒక్కోసారి భయపెట్టినా సరే ఆ తర్వాత జీవితంలో అదే పరిస్థితి మనిషిలోని గట్టిదనానికి,ధైర్యానికి ఊతాన్నిస్తుంది. అలా తన జీవితం గురించి సుందరి చెప్పడంతో మొదలవుతుంది స్వాతి శ్రీపాద గారి ఎక్కడినుంచి ...ఇక్కడిదాకా..నవల. కొన్ని నవలలలో మలుపులు వాస్తవిక జీవితంలో తలెత్తే ఆటంకాల నుండే జన్మిస్తాయి. మనిషి జీవితం చుట్టూ ఒక్కోసారి సంతోషాన్నిచ్చే, ఇంకొక్కసారి దుఃఖంతో నింపే సంఘటనలు మనుషుల ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండా జరిగిపోతునే ఉంటాయి. అటువంటి జీవితమే సుందరిది కూడా.

          సుందరి తల్లి సీతారత్నం. ఆమె కుటుంబం కూడా పెద్దది. ఆమె మేనత్తకు పిల్లలు లేకపోవడంతో పెద్దన్నను పోరి మరి తనతో దత్తత కాకపోయినా పెంచుకోవడానికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్లే ముందే తన ఇంటిని తన తదనంతరం సీత పేరు మీద రాసి మరి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తుంది. సీతకు సంగీతంతో పాటు చదువు కూడా చెప్పిస్తుంది.కానీ రెండేళ్ల తర్వాత మేనత్త ఆరోగ్యం దెబ్బ తినడంతో సీత రాతే మారిపోతుంది. అదే సమయంలో చెల్లెల్ని అంతకుముందు పట్టించకోని సీత బాబాయి కూడా అక్కడికి వచ్చి ఆమె మేనత్తను మొదట మంచి చేసుకోవడానికి ప్రయత్నించి అది కుదరకపోవడంతో ఆమె భర్తను మచ్చిక చేసుకుంటాడు. ఆ తర్వాత సీత తర్వాత కూతుళ్లకు కూడా పెళ్లీడు రావడంతో సీత పెళ్లి సంగతి అడగడానికి వచ్చిన సీత తండ్రిని అవమానిస్తాడు ఆయన బావమరిది. దానితో కూతుర్ని అక్కడి నుండి తీసుకువెళ్ళి ఆమెకు పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి.

          ఆ తర్వాత సీత మేనత్త మరణించాక ఆమె భర్తను మంచి చేసుకున్న సీత బాబాయి వాళ్ళ ఆస్తి తన కొదుక్కు దక్కేలా చేసుకుంటాడు. ఆ తర్వాత సీతకు రాసిన ఇల్లును సీత భర్త అమ్మేస్తాడు. సీతకు పెళ్లయ్యాక చాకిరి,పిల్లలతోనే సరిపోతుంది. భర్తకు కుటుంబం పట్ల బాధ్యత లేకపోవడం,ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుండి పట్టణానికి మారడం,అయిదురు ఆడపిల్లలు,ఇద్దరు మగపిల్లల మధ్య పుట్టిన సుందరి తన జీవితంలో ప్రత్యేకంగా ఏమి ఆశించే పరిస్థితి ఆమె కుటుంబ వాతావరణం ఆమెకు కల్పించలేదు.

          అలా ఆ కుటుంబంలో పెరిగిన సుందరికి తన తండ్రి బాధ్యతారాహిత్యం,అతన్ని వెనకేసుకొచ్చే తల్లి మనస్తత్వం బోధపడవు.ఆమె పెద్దక్కకు చదువు లేకపోవడం వల్ల, కట్నం ఇచ్చే పరిస్థితి లేకపోవడం వల్ల అంతగా బాగుండని ఓ టీచర్ తో 1116 రూపాయల కట్నంతో పెళ్ళి కుదిరిన తర్వాత తండ్రి ఎక్కడికో వెళ్ళిపోతాడు.ఎప్పుడు రెండు,మూడు నెలలు ఇల్లు పట్టకుండా తిరగడం అతనికి అలవాటే అయినా సరే ఇంత ముఖ్యమైన సమయంలో అతను అలా వెళ్లిపోవడం ఎవరికి అంతు చిక్కదు. వెయ్యి రూపాయలు సుందరి ఉద్యోగం చేయడం వల్ల తన జీతంతో ఇచ్చినా మిగిలిన డబ్బు కోసం అక్కడే పట్టుబట్టడంతో పెళ్లికొచ్చిన వారు తలా పది రూపాయలు ఇవ్వడంతో జరిగే పరిస్థితి వస్తుంది. అక్క పెళ్ళి చూశాక సుందరి తన జీవితంలో తనను తానుగా చూసి వివాహం చేసుకునేవాడినే చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.

          సుందరితో పాటే ఆఫీసులో పని చేసే రమణ ఆమెను మనఃస్పూర్తిగా ఇష్టపడతాడు. సుందరి కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఓ సారి అతనికి అనారోగ్యంగా ఉండడంతో అతన్ని హాస్పటల్ కు తీసుకువెళ్ళి ఆ రాత్రంతా అతనితో అక్కడే ఉండిపోతుంది. సుందరి తల్లిదండ్రులు ఆమెను అపార్ధం చేసుకుని ఇంటి నుండి పంపేయ్యడంతో రమణ ఆమెను వివాహం చేసుకుంటాడు.

          వారికి కవలలు పుడతారు. రమణకు బాల్యం నుండే మధుమేహం ఉండటం వల్ల,అతనికి సరైన వైద్యం చేయించకపోవడం వల్ల ,అతని మందులకు మూడు వాంతులు ఖర్చైనా రమణ సుందరికి దక్కడు. ఆ తర్వాత కూతుర్లైన సుధ,సుమ లను చదివించుకోవడం కోసం అమెరికాకు  బేబీ సిట్టర్ గా వెళ్తుంది సుందరి. కొంతకాలానికి పిల్లలని తన దగ్గరకు తెచ్చుకుని, ఓ ఇల్లు ,కారు ,ఉద్యోగం అమర్చుకుని పిల్లల్ని పేరున్న కాలేజీలో చదివిస్తుంది. సుందరి సోషల్ వర్కర్ గా పని చేస్తూ ఉంటుంది.

          ఈ నవలలో మనుషుల మనస్తత్వాలు బహిర్ముఖమవుతాయి. తల్లిదండ్రులైనా  పిల్లల్ని తమ మాట విన్నంతవరకే ప్రేమిస్తారు. మనుషుల మధ్య అవసరాలే బంధాలను నడిపిస్తాయి తప్ప,రక్త సంబంధాలు కాదు. మనిషిలో ధైర్యం,ఆత్మవిశ్వాసం జీవితంలో ఎదుర్కున్న ఇబ్బందుల నుండే జన్మిస్తాయి. ఈ నవల చదువుతుంటే కథ సాధారణమైందే అయినా, సుందరి తన కథను తాను చెప్పుకునే క్రమంలో ఆమె జీవితంలో మన జీవితం కూడా ఏదో ఒక కోణంలో తప్పక కనిపిస్తుంది. మనిషి భావోద్వేగాలు -అవసరాల గురించి స్పష్టం చేసే నవల ఇది.

                         *     *    *

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!