పార్వతీ ప్రతీకారం

 చదువరి

             పార్వతీ ప్రతీకారం

                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          ప్రముఖ హాస్య రచయిత  మునిమాణిక్యం  నరసింహారావు గారి కుమారుడైన మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య మురయా అనే కలంపేరుతో సుప్రసిద్ధులు. సమాచార ప్రసార మంత్రిత్వశాఖలో ఫిలిం పబ్లిసిటీ ఆఫీసర్‌గా పని చేసిన ఈయన రచనలు ఎన్నో పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆయన నవలల్లో 'పార్వతీ  ప్రతీకారం' ఓ ప్రత్యేకమైన నవల. 1970 ల కథా కాలంలో ఆనాడు యువతి యువకుల ఆలోచనలతో పాటు, దేశభక్తి ని కూడా మేళవించి , ఓ స్త్రీ తనకు పరాభవం ఎదురైతే దానికి ప్రతీకారం కూడా దేశ భక్తిని ప్రకటించడం ద్వారా ఎలా తీర్చుకున్నదో తెలిపే నవలే 'పార్వతీ ప్రతీకారం.'

            ఈ నవలాంశంలో ముఖ్య పాత్రలు మోహన్ ,పార్వతి ,కామేశ్వరి ,వనజ. మోహన్, కామేశ్వరి, వనజా డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు. మోహన్ మంచి వాక్పటిమ ,దేశ రాజకీయ పరిస్థితుల పట్ల,సమకాలీన ప్రతి అంశం పట్ల ఎంతో అవగాహన కలవాడు. చదువులో కూడా క్లాస్ ఫస్ట్. అతని తెలివి తేటలు చూసి అతన్ని వనజా ప్రేమిస్తుంది. కామేశ్వరి మోహన్ ను వనజకు పరిచయం చేస్తుంది. నాటి నుండి అతన్ని అభిమానిస్తూ, ప్రేమిస్తూ ఉంటుంది వనజ.

            అందరితోనూ స్నేహంగా మెలిగే మోహన్ వనజ తో   కూడా స్నేహంగానే ఉంటాడు. ఆమె పుట్టినరోజు పార్టీకీ ఆహ్వానిస్తే వెళ్తాడు. ఆమెకు ట్యూషన్ చెప్పమంటే చెప్తాడు. కామేశ్వరి తల్లి మంచి గాయకురాలు. ఆమె కామేశ్వరి సొంత తల్లి కూడా కాదు. తల్లి చెల్లెలు. కామేశ్వరి కోసం ఎన్నో నిందలు సాహిస్తూ ఆమెను పెంచుతూ ఉంటుంది. కామేశ్వరి ద్వారా ఆమె పిన్ని పంకజమ్మ గాత్రం ద్వారా తెలుసుకున్న మోహన్ పట్టు పట్టి మరి ఆమె చేత పాదించుకుని మరి వింటాడు. తర్వాత త్యాగరాజ ఉత్సవాలు జరపాలని నిర్ణయించుకున్న పంకజమ్మ గారికి తన తండ్రి సాయంతో పాటు వనజ తండ్రి సాయం, ఊరి పెద్దల సాయం కూడా అందేలా చేస్తాడు మోహన్. వనజ మోహన్ ను పార్కుకు తీసుకువెళ్లి తన ప్రేమను వ్యక్తపర్చిన దానికి అతను ఏమి సమాధానం ఇవ్వడు. మనసులో ప్రేమ ఉన్న తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

            ఆ తర్వాత అతని ట్యూషన్ వల్ల వనజ మంచి మార్కులు తెచ్చుకుంటుంది. త్యాగరాజ     ఉత్సవాలకు ఎంతో పేరు వస్తుంది.సంగీతాన్ని ఆ ఊరిలో ఇంకా అభివృద్ధి పరచడానికి కామేశ్వరి తల్లి  తన ఇంటిని సంగీత కళాశాలగా మార్చి తాను వేరే చోటు ఇల్లు అద్దె తీసుకుని కామేశ్వరితో ఉంటుంది. వనజ తండ్రి ,మోహన్ తండ్రి అందరూ ఆ ఊరిలో సంగీతం నేర్చుకునేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. పంకజమ్మ అందరికీ నేర్పుతూ ఉంటుంది. పనులతో బిజీ అయిపోయిన మోహన్ వనజా ఇంటికి గతంలోలా తరచూ వెళ్లలేకపోయేవాడు.

            పార్వతి మోహన్ మేనత్త కూతురు. ఆమె తండ్రి కాశ్మీర్ లో నివసించేటప్పుడు జరిగిన పాకిస్తాన్ దురాక్రమణలో ఆమె కుటుంబాన్ని కోల్పోయి,మానభంగానికి కూడా గురై ఎలాగో ప్రాణాలు నిలుపుకోగలుగుతుంది. నాటి నుండి తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారంగా దేశానికి యుద్ధంలో సహకరించి మరి శత్రువులను మట్టుపెట్టాలని నిర్ణయించుకుంటుంది.

            కామేశ్వరికి కూడా ఎంతో సహకారం అందిస్తూ ఉంటుంది పార్వతి. ఆమెకు ఓ జీవన ఆధారం కూడా కల్పించడానికి ప్రణాళిక వేస్తుంది. ఆమె సలహాపైనే కామేశ్వరి చదువైపోయాక  మిలిటరీ నర్స్ గా జాయిన్ అవుతుంది.

            వనజ డిగ్రీ అయ్యాక మెడిసిన్ లో జాయిన్ అవుతుంది. మోహన్ మిలిటరిలో జాయిన్ అవుతాడు. మోహన్ వనజ కు లేఖ రాస్తాడు ,ఆమెను తాను కూడా ప్రేమిస్తున్నానని. పార్వతి తన కార్యసాధన కోసం అక్కడి నుండి విదేశాలకు వెళ్లిపోతుంది. తన అందాన్ని ఎరగా మార్చి విదేశీ రహస్యాల్ని సేకరించి, మిలిటరిలో ఉన్న మోహన్ శత్రు స్థావరం పై దాడి చేయలేకపోవడానికి కారణం మధ్యలో ఓ రాడార్ కేంద్రం ఉండటం వల్ల అవ్వడం వల్ల తాను ఎలా అయినా శత్రువుల దృష్టిని మరలిస్తానని ఈలోపు దానిని పేల్చి శత్రువుల్ని మట్టుబెట్టమని పాత ద్వారా మెసేజ్ పంపిస్తుంది పార్వతి.

            అది అర్థం చేసుకున్న మోహన్ తానొక్కడే ముందు విమానంలో బయల్దేరతాడు. పార్వతి చేతిలో హ్యాండ్ బాంబ్స్ తో శత్రువులను పేల్చి వారి దృష్టి మరలిస్తుంది. రాడార్ కేంద్రాన్ని ప్లేన్ తో పేల్చి తాను కూడా ఆ ప్రయత్నంలో మరణిస్తాడు మోహన్. పార్వతి కూడా ఆ పనిలోనే మరణిస్తుంది. అలా వారిద్దరి మరణం తర్వాత ఆ మిలిటరీ బృందం శత్రువుల మీద విజయం సాధించడంతో నవల ముగుస్తుంది.

            నవలలో బాషా, ఒక్కో పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత ,కథాంశం నవలను చదివింపజేస్తాయి. మురయా (రఘునాథ యాజ్ఞవల్క్య) గారి రచనా సంఖ్యలు తక్కువే అయినా రాసిన అంశాలు మాత్రం కచ్చితంగా చదవాల్సినవే. తెలుగు సాహిత్యం చదవడటం మీకు ఇష్టమైతే ఈ రచన కూడా తప్పక చదవండి.

   *     *     *

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ