మేఘాలలో నడక
సినీ సంచారం
మేఘాలలో నడక
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
ఈ ప్రపంచంలో ప్రతి దానికి
ఒక్కో మూలం ఉంటుంది. ముఖ్యంగా ప్రాంతీయ సినిమాల్లో అంతర్జాతీయ
సినిమాల మూలాలు ఎక్కడో ఓ చోట అయినా
కనిపించక మానవు. అలా మన
తెలుగులో వచ్చి బాక్సాఫీసు
విజయాలు సాధించిన 'బావగారు బాగున్నారా ?' సినిమా మూలాలు
ఉన్న సినిమానే కియాను
రీవ్స్ నటించిన 'A Walk In
The Clouds.' మూల సినిమాలో
ఎన్నో మార్పులు చేసాకే
బావగారు బాగున్నారా కొత్త
రూపు తీసుకుంది.
రెండవ
ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా వెళ్ళిన పాల్ సట్టన్ ఆ యుద్ధం ముగిసిన తర్వాత శాన్
ఫ్రాన్సిస్కో కు భార్యతో తిరిగి మామూలు జీవితాన్ని గడపడానికి వస్తాడు.అతను
యుద్ధంలో ఉన్నప్పుడూ ప్రతి రోజు భార్యకు ఉత్తరాలు రాసినప్పటికి ఆమె మొదటి కొన్ని
రోజుల తర్వాత ఏవి చదవలేదని అతనికి అర్ధమవుతుంది. యుద్ధం ముందు పాల్ ఒక ట్రావెలింగ్
సేల్స్ మ్యాన్. అతన్ని చాక్లెట్లు క్యాలిఫోర్నియా రాజధాని అయిన సాక్రిమెంటో కు
పంపిస్తుంది అతని భార్య.
ట్రెయిన్
లో అతనికి విక్టోరియా పరిచయం అవుతుంది. అనుకోకుండా వారిద్దరూ ఆ తర్వాతి బస్ లో
కూడా కలుసుకుంటారు. ఆ బస్ లో విక్టోరియాను కొందరు ఏడిపిస్తుంటే వారి నుండి
కాపాడతాడు పాల్ . కానీ అతన్ని ,వారిని బస్ డ్రైవర్ బస్
దింపేస్తాడు. అతను ఆ తర్వాత విక్టోరియా
దిగిపోవడం గమనిస్తాడు.
తన
కుటుంబం ఉండేది ఆ దగ్గర్లో అని, అక్కడే వారికి వైన్ యార్డ్
ఉందని చెప్తుంది విక్టోరియా. విక్టోరియా ఏడుస్తూ ఉండటం చూసి కారణం అడిగితే తాను
అప్పటికే తన ప్రొఫెసర్ వల్ల గర్భవతి అని ఆ విషయం తన తండ్రికి తెలిస్తే తనను
చంపేస్తాడని చెప్తుంది. ఆమెను ఆ సమస్య నుండి బయట పడేయ్యడానికి తను ఆమె భర్తగా ఓ
రెండు రోజులు ఉంటానని చెప్పి ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్తాడు పాల్.
విక్టోరియా
తండ్రి ఆల్బర్ట్ తనకు తెలియకుండా వివాహం చేసుకోవడం ,అందులోనూ
ఓ అనాధను పెళ్లి చేసుకోవడాన్ని ఆమోదించడు. ఓ రెండు రోజుల తర్వాత సేల్స్ మ్యాన్ లా
వెళ్ళినట్టే వెళ్ళి ఇక తిరిగి రాకూడదనే పాల్ నిర్ణయించుకున్నప్పటికీ ఆల్బర్ట్
తండ్రి అయిన డాన్ పెడ్రో అతన్ని వెళ్లనివ్వకుండా తమ వైన్ హార్వెస్టింగ్ పండగలో
అతన్ని భాగం చేస్తాడు. అలా క్రమక్రమంగా వారి ఆచార వ్యవహారాలలో పాల్ కూడా ఓ భాగం
అవుతాడు. ఈ క్రమంలోనే విక్టోరియా ,పాల్ ల మధ్య ప్రేమ
పుడుతుంది.
ఆల్బర్ట్
వారి పెళ్లి అందరి ముందు మళ్ళీ చేయడానికి నిర్ణయిస్తాడు. కానీ తన భార్యకు అన్యాయం
చేయకూడదనే ఉద్దేశ్యంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు పాల్. ఇంటికి తిరిగి వెళ్ళిన
పాల్ కు అతని భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం ,పాల్ ని
డైవోర్స్ అడగటం జరుగుతుంది. ఆ పేపర్స్ మీద సంతకం చేసి సంతోషం గా విక్టోరియా ఇంటికి వెళ్తాడు పాల్.
తిరిగి
వచ్చిన పాల్ కు ఆల్బర్ట్ కు మధ్య జరిగిన వాగ్వివాదంలో ఆల్బర్ట్ తన చేతిలో ఉన్న దీపాన్ని
విసరడంతో ఆ ద్రాక్ష తోట అంతా తగలబడిపోతుంది. ఎంత రక్షించడానికి ప్రయత్నించినా సరే
అంతా నాశనమైపోతుంది. కానీ పాల్ తనకు మూల మొక్క అని డాన్ పెడ్రో చెప్పిన మొక్క
దగ్గరికి వెళ్ళి దాని మూలాలు ఇంకా బ్రతికే ఉంటాయేమోనని దానిని తీసుకుని ఆల్బర్ట్
కు ఇస్తాడు. ఇంకా బ్రతికే ఉందని ,అతని ధైర్యాన్ని మెచ్చుకుని
అతన్ని అంగీకరిస్తాడు ఆల్బర్ట్. అలా ఆ ఇంట్లో అతని స్థానం కుటుంబ సభ్యుడిగా
సుస్థిరమవడంతో ఈ సినిమా ముగుస్తుంది.
ఇకపోతే
దీని ఆధారంగా తెలుగులో వచ్చిన 'బావగారు బాగున్నారా ?'
సినిమాలో మాత్రం అనేక మార్పులు చేశారు. దీనికి కారణాలు మనం గమనిస్తే
ప్రతి ప్రాంతంలో కొన్ని నైతిక విలువలు, ఆ ప్రాంతం ఆమోదించే
సంఘటనలు కొన్ని ఉంటాయి. అందుకే ఆ మార్పులు తప్పనిసరి అయ్యి ఉండవచ్చు. ఇక్కడ
విక్టోరియా పాత్రకు ఒక చెల్లెలిని జోడించి,ఆమె తో ప్రేమ
-పెళ్లి తో సినిమా ముందుకు సాగుతుంది. ఆంగ్లంలో ముఖ్య పాత్ర అయిన విక్టోరియా పాత్ర
తెలుగులోకి వచ్చేసరికి సైడ్ పాత్రగా మిగులుతుంది. అలాగే అక్కడ పాల్ కు ముందే
వివాహమవ్వడం అన్న విషయాన్ని కూడా ఇక్కడ మార్చారు.
దీనికి
కారణం మన సంస్కృతిలో భార్యాభర్తలు ఇంకొకరిని ప్రేమించినందుకు పెళ్లి చేసుకున్న
వారిని విడిచిపెట్టడం అన్న అంశాన్ని ప్రేక్ష్హకులు ఆమోదించకపోవచ్చు. అందుకే అటు
పాల్ పాత్రకు భార్య ఉండదు ,ఇటు ప్రేమించి గర్భవతి అయిన అక్క
పాత్రను కూడా చివరకు ఆ ప్రేమించిన
వ్యక్తితోనే పెళ్లి అయ్యేలా కథను మలచడం, ఆ క్రమంలో చివరకు ఆ
చెల్లిని ,నాయకుడిని కలపడంతో సినిమా ముగుస్తుంది.
ఇంకో ముఖ్య అంశమేమిటంటే ఈ ఆంగ్ల మూల సినిమాను
చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా పాల్ పాత్రకు మాత్రమే ఎక్కువ నాయకత్వతత్వం ఇచ్చిన
దాఖలాలు కనబడవు. ఈ సినిమాలోని దాదాపు పాత్రలన్నీ వాటి పాత్రల్ని పోషిస్తూ ఉంటాయి.
హీరోయిజం కన్నా కూడా కథను అనుసరించడం ఈ సినిమాల ప్రత్యేకత.
వాస్తవానికి
ఈ ఆంగ్ల సినిమా కూడా 1942 లో వచ్చిన ఇటాలియన్ సినిమా అయిన 'Four
Steps in The Cloud' సినిమా మూలాలతో నిర్మించబడిందే. ఇటువంటి
సినిమాలు చూడటం వల్ల సంస్కృతుల్లో ఉండే వైవిధ్యం ,ప్రేక్షకుల
ఆమోద విలువలు వంటి ఎన్నో అంశాలు ప్రపంచ -ప్రాంతీయ సినిమాల మధ్య ఉండే వ్యత్యాసాలకు
ఎలా కారణమవుతాయో స్పష్టం అవుతుంది.
* * *

Comments
Post a Comment