మలుపులు
చదువరి
మలుపులు
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
స్త్రీ-పురుషుల
మధ్య సంబంధాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో తెలియజెప్పే నవలికే స్వాతి శ్రీపాద గారి ‘చిరుజల్లు
కురిసేనా?’ ఈ నవలలో ఉన్న ముఖ్య పాత్రలు ఇద్దరు స్త్రీలు,ఇద్దరు పురుషులు. వారికి తమ ఆపోజిట్ జెండర్ పట్ల ఉండే
అభిప్రాయాలూ,వారి అనుభవాలు వారి జీవితాల్ని ఎలా మలుపులు తిప్పయో
కూడా ఈ నవలిక స్పష్టం చేస్తుంది.
సుధీర, రమణ ప్రేమించుకుని, ఇంట్లో
ఎవరికి చెప్పకుండా పెళ్ళి చేసుకుంటారు. దాంతో
ఇంట్లో వారికి దూరమవుతారు. పెళ్ళయిన తర్వాత ఇద్దరు ఉద్యోగస్థులే కావడం వల్ల జీవితం
సజావుగానే సాగుతుంది. సుధీర తండ్రికి ఆమె మీద కోపం తగ్గదు. కానీ సుధీర తల్లి మాత్రం
కుటుంబ అవసరాలకు, ఆమె చెల్లెళ్ల పెళ్ళిళ్ళకు అడిగి తీసుకుంటూనే
ఉంటుంది. రమణ కూడా తన కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూనే ఉంటాడు.
సుధీర గర్భవతి అవుతుంది. అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ
అవ్వడం వల్ల గర్బాశయం కూడా తొలగించాల్సి రావడంతో ఆమెకు మళ్ళీ గర్భం వచ్చే అవకాశం ఉండదు.
రమణ ఆమెను బాగా చూసుకుంటాడు. మనసులో మాత్రం అతనికి తండ్రి కాలేననే చింత ఉంటుంది. కొన్నాళ్ళకు
ఆ విషయం రమణ తల్లికి చెప్తాడు. రమణకు ఇంకో పెళ్ళి చేయడానికి ఒప్పుకోమని సుధీరకు చెప్తుంది
ఆమె. కానీ రమణ మాత్రం ఒప్పుకోడు. కొన్నాళ్ళకు రమణ కనిపించకుండా పోతాడు.
ఓసారి సుధీరకు ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు
కలిగి ఉన్న ఐదారు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటుంది. వేసుకున్నాక ,ఎందుకు
ఆ పని చేశాను? అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే పక్కింటి తలుపు
తట్టి,హాస్పటల్లో చేర్పించమని అడుగుతుంది. అక్కడ హాస్పటల్లో డాక్టర్
సుశాంత్ తో ఆమెకు పరిచయం ఏర్పడుతుంది. అది స్నేహంగా మారుతుంది. ప్రతిరోజూ ఒకరినొకరు
చూసుకోకపోతే భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. సుధీర తన గతం సుశాంత్ తో చెప్తుంది.
సుశాంత్ అనాథ. అయినా అనధాశ్రమ ధర్మకర్తలు బాగా
చదివించటంతో డాక్టర్ అయ్యాడు.కాలేజీ సమయంలో శకుంతలకు చదువు చెప్తూ, ఆమెకు
సెకండ్ ర్యాంక్ వచ్చేలా చేస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అతను తన ప్రేమను వ్యక్తపర్చినప్పుడు
ఆమె అతన్ని అనాథ అని అవమానించి తిరస్కరిస్తుంది. అప్పుడు సుశాంత్ ఆత్మహత్యా ప్రయత్నం
చేస్తాడు. అందుకే తన లానే అదే ప్రయత్నం చేసిన సుధీర మీద అతను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు.
సమీర బాగా డబ్బున్న వాళ్ళ అమ్మాయి. తల్లి పురిట్లో బిడ్డను సమీర తండ్రికే వదిలి వెళ్ళిపోతుంది. దానితో
జీవితం మీద ఏర్పడిన నిస్పృహను స్త్రీల మీద కసిగా మార్చుకుని రోజుకో అమ్మాయితో గడుపుతూ
ఉంటాడు. ఆ అపరాధభావనతో కూతురైన సమీరాను బాగా గారాబం చేస్తాడు. దానితో ఆమె పెంకిలా తయారవుతుంది.
సినిమాలు చూసి లేచిపోవడంలో ఉన్న థ్రిల్ అనుభవించాలని
కోరుకుంటుంది. అలా ఓ ఆటో డ్రైవర్ తో లేచిపోయి జల్సా తీరిపోయాక ,నాలుగునాళ్ళయ్యాక
అతను వదిలేశాక తండ్రికి ఫోన్ చేస్తే, మొదట విసుక్కున్నా తర్వాత
తీసుకువెళ్తాడు. తర్వాత ఆమెకు ఎయిడ్స్ ఉందని తెలుస్తుంది. సుశాంత్ ఉన్న హాస్పటల్ లోనే
ఆమెను చేర్పిస్తారు. తన కూతురి గురించి బాధ పడుతున్న ఆ తండ్రి కోసం ఆమెను వివాహం చేసుకుంటాడు
సుశాంత్. ఆమెను బాగా చూసుకుంటాడు. కొన్నాళ్ళకు ఆమె తండ్రి మరణిస్తాడు. ఇంకొన్నాళ్ళకు
ఆమెకు నెగటివ్ వచ్చినా, ఓ ఆపరేషన్ వల్ల నడుం కొండ భాగం చచ్చుబడిపోతుంది.
అప్పటి నుండి ఆమెను కన్నబిడ్డలా చూసుకుంటాడు సుశాంత్.
సుశాంత్, సుధీరలు
పెళ్ళి చేసుకోకపోయినా శారీరకంగా ఒకటవుతారు. అలా అని సుశాంత్ సమీరను నిర్లక్ష్యం చేయడు.ఇలా
ఈ నవలిక ముగుస్తుంది.
ఈ నవలికలో సుశాంత్ పాత్రలోని ఓ కోణం అంటే అతను
ఓ ఎయిడ్స్ రోగిని పెళ్ళి చేసుకోవడం అన్నది వాస్తవంలో తక్కువగా అవకాశం ఉన్న అంశమే అయినప్పటికీ, మిగిలిన
అన్ని ఉదంతాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నవే. నేటి రోజుల్లో ఆర్థిక స్వావలంబన నిర్ణయాధికారాన్ని
ప్రతి ఒక్కరికీ ఇచ్చింది కానీ, ఎప్పటికీ ఏ స్వేచ్చ కూడా జీవితంలో
జరగబోయే సంఘటనలను మాత్రం శాసించలేదు అనే అంశం మన కర్మ సిద్ధాంతం చెప్పినా కొన్ని సార్లు
కొన్ని జీవితాలు చూసినప్పుడు ,కొన్ని నవలలు చదివినప్పుడు వాస్తవమే అనిపిస్తుంది. మీకు లైట్ రీడింగ్ అంటే
ఇష్టమైతే ఈ నవలిక తప్పక చదవండి.
* * *

Comments
Post a Comment