బాధ్యత ఎవరిది ?
చదువరి
బాధ్యత ఎవరిది ?
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
మాలతీ చందూర్ గారి నవలల్లో స్త్రీల జీవితంలోని ఎన్నో కోణాలు ఆవిష్కృతమవుతాయి. అవి బలహీనతలైనా ,బలాలైనా సరే మాలతీ గారు మాత్రం తన నవలల్లో ఆ వాస్తవాన్ని చిత్రీకరించడానికి వెనుకాడలేదు. అలా స్త్రీలలో ఉండే రక్త బంధం పట్ల అనురక్తి ,పెంచిన మమకారం వల్ల హృదయంలో జన్మించే ప్రేమల మధ్య సాగే ప్రచ్చన్న యుద్ధాన్ని చిత్రీకరించిన నవలే రాగ రక్తిమ.
అనసూయ ,రామారావు
భార్యా భర్తలు. అనసూయ కాలేజీలో లెక్చరర్ అయితే, రామారావు
ప్లీడరు. ఆ దంపతులు ఆస్తిపరులు. వారికున్న ఒకే ఒక్క లోటు పిల్లలు లేకపోవడం. అనసూయ
తాత తరపు నుండి తమ్ముడు వరస అవుతాడు శాస్త్రి. అనసూయ ఒక్కర్తే కూతురు అవ్వడం వల్ల
శాస్త్రి అనసూయ వాళ్ళింట్లో ఉండి డిగ్రీ
చదువుకోవడం వల్ల అనసూయ అతన్ని సొంత తమ్ముడిలానే ఆదరిస్తుంది.
శాస్త్రి
ఉండేది తాడేపల్లి గూడెంలో. అతని భార్య లలిత. వారికి రమేశ్ ,వసంత
పిల్లలు. వసంత ముద్దు పేరు చిట్టి. గుంటూరు వచ్చినప్పుడల్లా ఆ దంపతులు పిల్లలతో
సహా అనసూయ వాళ్ళింట్లోనే ఉండేవారు. చిట్టి అలా అనసూయ కు చాలా దగ్గర అయ్యింది. ఓ సారి
పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుంటే లలితకు నొప్పులు రావడంతో ఆమెను అనసూయ ఇంటికి
తీసుకువెళ్తాడు శాస్త్రి. ఆ తర్వాత అక్కడ ఓ పదిహేను రోజులు ఉన్న తర్వాత ఆమె కవల
పిల్లలని ప్రసవిస్తుంది. అదే సమయంలో చిట్టి అనసూయకు, రామారావుకు
బాగా అలవాటైపోతుంది.
చిట్టిని
పెంచుకుంటామని అడిగినప్పుడు శాస్త్రి దంపతులు అభ్యంతర పెట్టరు. దానికి కారణం
వారికి ఆర్థిక స్థితిగతులు. అలా మూడేళ్లకే చిట్టి అలా అనసూయ పెంపుడు కూతురు
అవుతుంది. లలిత పద్ధతులు ,అనసూయ పద్ధతులు వేరు. లలిత పిల్లలను ఎప్పుడు
మందలించదు.వారికి అడిగినవన్నీ ఇచ్చి బాగా
గారాబం చేస్తుంది, కోపం వస్తే బాదేస్తుంది. అందుకే ఇంట్లో
ఎవరు క్రమశిక్షణతో ఉండరు.
పుట్టిన
కవలలు ఓ ఆడపిల్ల ,మగపిల్లాడు కావడం వారికి లక్ష్మి ,రాము అని పేర్లు పెడుతుంది లలిత.అనసూయ పెంపకంలో ఎంతో క్రమశిక్షణతో
పెరుగుతుంది చిట్టి. ఆ తర్వాత లలితకు సుందరి ,బుజ్జి పుడతారు.
అప్పుడప్పుడు చిట్టిని కొన్ని రోజులు ఉంచుకోవడానికి పంపమని లలిత రాసినప్పుడల్లా
తనకు ఇష్టం లేకపోయినా చిట్టి మీద తనకు ఆ అధికారం లేదనుకుని అయిష్టంగానే పంపిస్తూ
ఉంటుంది అనసూయ. లలిత కూతురైనా చిట్టిని తన స్వంత కూతురిలా చూసుకుంటూ, శాస్త్రి కుటుంబానికి అవసరమైనప్పుడల్లా ఆడుకుంటున్నా సరే మనసులో మాత్రం
అనసూయ మీద కోపం పెంచుకుంటుంది లలిత.
చిట్టి కి
కూడా వయసు పెరిగే కొద్ది సొంతంగా ఆలోచించుకోగల శక్తి అలవడినప్పటి నుండి తను కూడా
తన తోబుట్టువులతో గడపాలనే కోరిక బలపడుతూ ఉంటుంది. అలా సెలవులకు వెళ్ళినప్పుడల్లా
మొదటి రెండు రోజులు ఎలానో ఉన్నా తర్వాత అక్కడ ఆ మనుషులతో ,ఆ
పరిసరాలతో ,శుభ్రతా లేని ఆ కుటుంబంలో ఇమడలేకపోతుంది చిట్టి.
రమేశ్ పెద్ద వాడైనప్పటికీ కూడా లలిత గారాబం వల్ల చదువు వంటబట్టదు. రమేశ్ తనకు
నచ్చిన అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుంటాడు. రమేశ్ అత్తగారు ధనవంతురాలు అవ్వడం
వల్ల ఇల్లరికం ఉంటూ ,ఓ ఫ్యాన్సీ కొట్టు పెట్టి వ్యాపారం
చేస్తూ ఉంటాడు.
చిట్టి
ఎమ్మే పూర్తి చేస్తుంది. అనసూయ చిన్ననాటి స్నేహితురాలు ,డాక్టర్
అయిన జానకీ బాయ్ మేనల్లుడు ప్రభాకరం కూడా మెడిసిన్ చదివాడు. అతనికి ,చిట్టికి బాల్యం నుండి పరిచయం ఉంది. చిట్టి పరీక్షలు అయిపోయాక వేసవిలో
ఇద్దరికీ వివాహం చేద్దామని నిర్ణయిస్తారు. అటు లలితా ,ఇటు
అనసూయ అందరూ ఆ పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చి
శాస్త్రి మరణిస్తాడు.
ఆ సమయంలో
తన కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలని
నిర్ణయించుకున్న చిట్టి ప్రభాకర్ తో పెళ్లి వాయిదా వేసి తాడే పల్లి గూడెం లో తన
కుటుంబంతో ఉండిపోతుంది. అక్కడే ఓ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా జాయిన్ అయ్యి రాము
-లక్ష్మి ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చే వరకు రెండున్నర్ర ఏళ్ళు అలా వారి కోసం
కష్టపడుతుంది. ఆ కుటుంబంలో మిగిలిన వారిని ఎంత మార్చాలని ప్రయత్నించినా సరే అది తన
వల్ల కాదని ,అక్కడ ఎవరికి తన అవసరం లేదని ,తల్లికి
ఎవరో ఒకరు డబ్బు తెచ్చి పడేస్తే పిల్లలకు ఇచ్చి గారాబం చేయటమే తప్ప కుటుంబం
పట్టదని తెలుసుకుంటుంది. అప్పటికే లక్ష్మి ప్రేమించిన వ్యక్తితో వివాహానికి
సిద్ధమవుతుంది. రాము సుందరి ,బుజ్జి బాధ్యతలు స్వీకరిస్తాడు.
ఇక తన అవసరం నిజంగా ఉన్న అనసూయ ,రామారావు ,ప్రభాకర్ దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుని ఉత్తరం రాస్తుంది ప్రభాకర్ కు
. అలా చిట్టి తన మామూలు జీవితంలోకి వెళ్లిపోవడంతో నవల ముగుస్తుంది.
ఎవరు
ఎవర్ని సంస్కరించలేరని ,బాల్యంలో పిల్లల పట్ల పరిసరాల ప్రభావాలు
ఎంతో గాఢంగా ఉంటాయని ,కన్న పిల్లలను ప్రేమ పేరుతో అతి గారాబం
చేయడం వల్ల వారు ఎంత
పతనమైపోతారో, ఆ పిల్లల పట్ల కన్న
పెంచిన ప్రేమల పట్ల ఎటువంటి ప్రచ్చన్న యుద్ధం జరుగుతుందో కూడా ఈ నవలలో స్పష్టం
చేశారు మాలతీ చందూర్ గారు. వాస్తవిక కోణాల్ని ఎన్నో జీవితాల పరిశీలనతో స్పష్టం
చేసే నవల ఇది.
చిట్టి
బాధ్యతలు తీసుకున్నా సరే ఆమెను గౌరవించని మనస్తత్వాలు, మనుషుల
మనసుల్లో ఉండే స్వార్ధాలు, అవి తల్లి బిడ్డల మధ్య కూడా
ఉంటాయని , బాధ్యతలు స్వీకరించినంత మాత్రాన మిగిలిన వారు
మారతారు అని ఆశించడం అసాధ్యమని , పెంపక లోపంలో వచ్చిన
కుసంస్కారాలు ఎప్పటికీ పోవని ఈ నవల స్పష్టం చేస్తుంది.
* *
*

Comments
Post a Comment