మెడికల్ ట్రయల్స్

 సినీ సంచారం

మెడికల్ ట్రయల్స్

                         -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలుగా ఉండగలరా? ఈ ప్రశ్నకు సమాధానమే The Constant Gardener Trust. ఆఫ్రికన్ దేశాల్లో ఉన్న పేదరికం వల్ల అక్కడి పౌరుల ఆరోగ్య సదుపాయాలు సక్రమంగా కొంతమేరకు ఉండాలంటే మల్టీ నేషనల్ ఫార్మాసూటికల్ కంపెనీలు ఇచ్చే సబ్సిడీలు కావాల్సిందే. వైద్యం ఓ వ్యాపార సాధనంగా మారిన ఈ పరిస్థితుల్లో ఉచితంగా వైద్య సబ్సిడీలు అందించే దాతృత్వం ఆ ఫార్మా సూటికల్ కంపెనీలకు మాత్రం ఎందుకు ఉంటుంది? ఆఫ్రికన్ పౌరుల మీద హెచ్ ఐ వి ఎయిడ్స్ తల్లుల నుండి పిల్లలకు సంక్రమించకుండా ఉండేందుకు మందు కనుగొనడానికి కావల్సిన మానవ ప్రయోగాలన్నీ కూడా ఆఫ్రికాలోనే జరిగాయి. మెనిజిటిస్, ఎయిడ్స్ , లింగ మార్పిడి ,బలవంతపు గర్భనిరోధం ఇటువంటి ప్రయోగాలన్నిటికి  బలయ్యింది ఆఫ్రికా అనడంలో అతిశయోక్తి లేదు. 1990 ల్లో ట్యూబర్ కులోసీస్  డ్రగ్ ట్రయల్స్ కోసం జరిగిన మానవ ప్రయోగాల ఆధారంగా జాన్ లీ కార్ రాసిన 'The Constant Gardener' నవల ఆధారంగా అదే పేరుతో వచ్చిన సినిమా ఇది.ఆఫ్రికాలో హెచ్ ఐ వి ఎయిడ్స్ ఎక్కువగా ఉన్న సమయంలో  ఈ సినిమా తీస్తున్న సమయంలో ఆఫ్రికన్ పరిస్థితులు చూసి కదిలిపోయిన  ఆ సినిమా సభ్యులు 'Constant Gardener Trust' ను ఆ సినిమా విడుదల అయ్యాక ఏర్పాటు చేసి, దాని ద్వారా  సినిమా తీసిన ప్రాంతాలైన కిబెరా ,లాయింగలని స్లమ్ ఏరియాల్లో ప్రైమరీ స్కూల్ ను ,మంచి నీతి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బహుశా అసలైన సినీ హీరోలు వీరేనేమో!

          జస్టిన్ బ్రిటిష్ డిప్లొమాట్లలో కింది స్థాయి ఉద్యోగి. అతని పోస్టింగ్ కెన్యాలో. అతని భార్య టెస్సా టూర్కానా దగ్గర హత్యకు గురవుతుంది. ఆమెతో పాటు వెళ్ళిన డాక్టర్ ఆర్నాల్డ్ అనే బ్లాక్ డాక్టర్ మరియు ఆమె కొలీగ్ ఆమెను హత్య చేసి ఉంటాడని మొదట భావించినప్పటికీ కూడా అదే రోజు అతను కూడా హత్యకు గురయ్యాడని తర్వాత తెలుస్తుంది. తన భార్య ఎందుకు హత్య చేయబడింది? అసలు ఆమె ఏం చేసింది ? అన్న విషయం  తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు జస్టిన్.

          ఆమ్నేస్టి  ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థలో చురుగ్గా ఉన్న సభ్యురాలు టెస్సా. ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల కోసం పోరాడుతుంది. టెస్సా మొదట జస్టిన్ ను ప్రేమ వివాహం చేసుకున్నాక అతన్ని  తనను కూడా ఆఫ్రికా తీసుకువెళ్ళమని బలవంతపెట్టి మరి వెళ్తుంది. కెన్యాలో మనుషుల మీద  జరుగుతున్న డ్రగ్ ట్రయల్స్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆమె అక్కడికి వెళ్లాలన్న నిర్ణయం తీసుకున్న విషయాన్ని భర్త దగ్గర రహస్యంగా ఉంచుతుంది.దానికి కారణం అతను అపాయాల్లో పడకూడదని.ఆమె ఆ డ్రగ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్న సమయంలోనే ఆమె ,ఆమె కొలీగ్ ఇద్దరు హత్యకు గురవుతారు. 

          తన భార్య మరణం గురించి శోధిస్తున్న సమయంలో ఆమె ఎందుకు హత్యకు గురైందో చివరకు కనుక్కోగలుగుతాడు. డైప్ ర్యాక్సీ డ్రగ్ ట్రయల్స్ ఆఫ్రికాలో జరుగుతుండటం వల్ల సంభవిస్తున్న మరణాల గురించి టెస్సా ఓ రిపోర్ట్ తయారు చేసిందని, ఆస్టిన్ మిత్రుడు మరియు అతనికన్న హై పొజిషన్ లో ఉన్న శాండీ కు ఆ రిపోర్ట్ ఇచ్చిందని ,అతనేదో చేస్తాడని నమ్మినప్పటికీ ,అతను తన కన్నా హై పొజిషన్ లో ఉన్న ఆఫీసర్ అయిన పెలిగ్రీన్ కు అది పంపడం ,అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రిపోర్ట్ బయటకు వెళ్ళకూడదని, టెస్సా కదలికలపై అతన్ని నిఘా వేసి ఉంచమని  ఆదేశిస్తూ ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం టెస్సా చేతికి వస్తుంది. ఈ సమస్య పరిష్కరించబడలంటే ఆ డ్రగ్ ట్రయల్స్ అక్కడ ఆపేసి ,మళ్ళీ డ్రగ్ ను డిజైన్ చేయాలని  టెస్సా కోరుతుంది. కానీ దాని వల్ల మిలియన్ల డాలర్లు నష్టమని భావించిన వారంతా ఆమెను హత్య చేశారని ఆస్టిన్ కు అర్ధమవుతుంది. మొదట ఆ హత్యను టెస్సా కొలీగ్ ఆర్నాల్డ్ మీదకు మల్లిద్దామని ప్రయత్నించినప్పటికీ అతని శవం కూడా దొరకడం ,అతను గే అని తెలియడంతో అతను చేయలేదని స్పష్టం అవుతుంది.

          ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్న క్రమంలో అతన్ని హత్య చేసే ప్రయత్నంలో ఉంటారు.అతనుఅన్నీ కనుక్కున్న తర్వాత టెస్సా మరణించిన చోటుకు వచ్చి మరణాన్ని ఆహ్వానిస్తాడు. అతన్ని అలా హత్య  చేస్తారు. ఆ తర్వాత జస్టిన్ లాయర్ శాండికీ పెలిగ్రీన్ రాసిన ఉత్తరం  బయటపెట్టడంతో  ఈ స్కామ్ బయటపడటంతో ఈ సినిమా ముగుస్తుంది. మెడికల్ ట్రయల్స్ కు  బలైన ఆఫ్రికా ఆధారంగా తీసిన ఈ సినిమాలోని  ఉదంతాలు కాల్పనికం అయినప్పటికీ ఆఫ్రికాలో ఈ ట్రయల్స్ జరిగిన మాట మాత్రం వాస్తవమే. పేదరికం ఓ దేశాన్ని తమ పౌరుల ప్రాణాల్ని సైతం బలి చేసే స్థితికి ఎలా తీసుకువెళ్తుందో నిదర్శనమే ఈ సినిమా.

         *     *    *

           

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ