ప్రేమించే తండ్రి

 సినీ సంచారం

          ప్రేమించే తండ్రి

                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



            జె.కె. రౌలింగ్  హ్యారీ పాటర్ నవలలను సినిమాలుగా మలచి దర్శకుడిగా ప్రేక్షకుల దృష్టిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  అమెరికన్ దర్శకులు క్రిస్ కొలంబస్ అంతకు ముందు తీసిన మరో అద్భుతమైన సినిమానే మిసెస్ డవుట్ ఫైర్. ఇదే సినిమా స్పూర్తితో తమిళంలో 1996 లో అవ్వాయ్ షణ్ముఘై అనే సినిమా కొన్ని మార్పులతో,అదే తెలుగులో భామనే సత్యభామనే పేరుతో వచ్చింది. ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన పాత్రకు స్పూర్తి మిసెస్ డవుట్ ఫైర్ సినిమాలోని ప్రముఖ హాస్య నటులు రాబిన్ విలియమ్స్ పాత్రే. కొన్ని ప్రాంతీయ సినిమాల మూలాలు ఆంగ్ల సినిమాల్లో ఉండటం ఒక పరంపరగా కూడా మారింది నేడు. ప్రేక్షకులను కదిలించే అంశమైతే అది దాని ఒరిజినాలిటీని అరువు తెచ్చుకున్నా సరే విజయం సాధిస్తుంది అనడానికి నిదర్శనమే తమిళ్ లో  మిసెస్ డవుట్ ఫైర్ స్పూర్తితో వచ్చిన సినిమా ప్రేక్షాదరణ పొందడం. భార్యాభర్తల మధ్య వచ్చిన  అపార్ధాల వల్ల పిల్లల మీద ప్రేమ మాత్రం ఆ తల్లిదండ్రులకు ఏ మాత్రం తగ్గదు. అటువంటి ఓ తండ్రి తన బిడ్డలతో కలిసి గడపటానికి చేసిన ప్రయత్నాలనే హాస్య సినిమాగా మలిచారు క్రిస్  కొలంబస్. అనీ ఫిన్ అనే రచయిత్రి రాసిన నవలను అదే పేరుతో మిసెస్ డవుట్ ఫైర్ సినిమాగా మలిచారు.

          డేనియల్ ఓ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. అతని భార్య మిరిండా. వారికి ముగ్గురు పిల్లలు. పిల్లల పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ డేనియల్ కు ఆర్థిక స్థిరత లేదని, అతనితో జీవితం బాధ్యతారాహిత్యంగా ఉంటుందని  భావించిన మిరిండాకు అదే సమయంలో డేనియల్ ఉద్యోగం పోవడం అన్నది బలమైన ఊతాన్నిస్తుంది. అతనికి విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కోర్టు అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల మిరిండాకే కస్టడీ ఇస్తుంది. డేనియల్ కు ఓ ఉద్యోగం, ఉండడానికి ఏదో ఒక ఇల్లు ఉంటేనే అతనికి కూడా కలిపి జాయింట్ కస్టడీ ఇచ్చే అవకాశం ఉంటుందని కోర్టు తేల్చేస్తుంది.

          డేనియల్ ఓ టీవి స్టేషన్ లో షిప్పింగ్ క్లర్కుగా ఉద్యోగంలో చేరతాడు. అదే సమయంలో తన పిల్లలని చూసుకోవడానికి మిరిండా ఓ హౌస్ కీపర్ కోసం చూస్తుందని తెలిసి అతను ఓ వృద్ధురాలైన  స్త్రీగా వేషం వేసుకుని తనను తాను డవుట్ ఫైర్ గా పరిచయం చేసుకుని ,మిరిండాను మెప్పించి ఆ ఇంట్లో హౌస్ కీపర్ గా చేరతాడు. మొదట్లో అతని క్రమశిక్షణ వల్ల పిల్లలకు నచ్చకపోయినా ఆ తర్వాత వారికి దగ్గరవుతాడు. వంటతో సహా అన్నీ పనులు చేస్తాడు.

          డేనియల్ పని చేస్తున్న టీవి స్టేషన్ సీఈఓ అతని నైపుణ్యాన్ని గమనించి అతన్ని డిన్నర్ కు ఆహ్వానిస్తాడు. అదే సమయంలో అదే చోట మిరిండా పుట్టిన రోజు పార్టీ కూడా ఉండటం, ఆ రెండింటిని ఎలాగో నెట్టుకొస్తున్న క్రమంలో మిసెస్ డవుట్ ఫైర్ తన భర్త డేనియల్ అని మిరిండాకు తెలిసిపోతుంది. కోర్టు కూడా అతను అలా వేషం వేసుకుని వెళ్ళడాన్ని సమర్ధించదు. దానితో పూర్తి కస్టడీ మిరిండాకే అప్పగిస్తుంది.

          డేనియల్ ఉద్యోగ స్థాయి పెరిగి,మళ్ళీ ఓ షో చేసే అవకాశం వస్తుంది. అతను మిసెస్ డవుట్ ఫైర్ పేరుతో షో మొదలు పెడతాడు. అతనిలో వచ్చిన మార్పు,అతను తమ దగ్గరికి డవుట్ ఫైర్ గా ఉన్న రోజులు అన్నింటిని గమనించి మిరిండా అతనితో జాయింట్ కస్టడీకి ఒప్పుకుంటుంది. మిసెస్ డవుట్ ఫైర్ షో లో ఓ అమ్మాయి రాసిన ఉత్తరానికి డేనియల్ తల్లిదండ్రులు విడిపోయినా సరే ప్రేమ మాత్రం ఉంటుందని జవాబివ్వడం,అది మిరిండా  పిల్లలతో సహా చూడటంతో సినిమా ముగుస్తుంది.

          దేశాల సంస్కృతి ఏదైనా సరే కొన్ని బంధాలు మాత్రం ఎవరినైనా కదిలిస్తాయి. హాలీవుడ్ సినిమాలంటే గొప్ప సాంకేతికత,యాక్షన్ ,అడ్వెంచర్ ,సైన్స్ ఫిక్షన్ మాత్రమే అని అనుకునే వారికి మానవ భావోద్వేగాలను ఎక్కువ డ్రామాతో కాకుండా వాస్తవికంగా నడిపే సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయనడానికి ఈ సినిమా ఓ నిదర్శనం.ఇదే సినిమా ప్రాంతీయ సినిమాగా రూపొందించే సమయానికి ఉన్న డ్రామా ఈ సినిమాలో కనిపించదు. సినిమా స్థాయి పెరగాలంటే డ్రామా అవసరమే కానీ వాస్తవికత అంత కన్నా అవసరం అన్న సూత్రాన్ని ఎప్పుడో పట్టుకున్నారు కనుకనే విదేశీ సినీ స్థాయిలో మూస ఫార్ములాలు పెద్దగా కనిపించవు. ఈ సినిమా మేకప్ వర్గంలో ఆస్కార్ ను దక్కించుకుంది. రాబిన్ విలియమ్స్ జీవితం విషాధంతమైనా సరే అతను ఎంత సున్నిత హాస్యాన్ని పండించగలడో ఈ స్నిమా స్పష్టం చేస్తుంది. ఓ ఫీల్ గుడ్ సినిమా చూసే మూడ్లో మీరు ఉంటే తప్పక ఈ సినిమా చూడండి.

                  *      *      *

 

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!