జీవన దర్పణం
చదువరి
జీవన దర్పణం
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
సిడ్నీ
షెల్డన్ నవలల్లో ఎప్పుడు అంతిమ మలుపులే
కీలకం. అది ఓ క్రైమ్ థ్రిల్లర్ అయినా, మామూలు వ్యక్తుల
జీవితలైనా సరే చివరి వరకు మామూలుగా నడిచే కథ కూడా చివరిలో ఊహించని మలుపులతో
పరిగెడుతూ ఉంటుంది. ఆయన నవలల్లో ‘A Stranger In The Mirror’
సినిమాల్లో స్టార్స్ అవ్వాలని కష్టపడి ఎటువంటి కుటుంబ నేపథ్యం,ఐశ్వర్యం లేకుండా ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి జీవితాలు
ఏమయ్యాయో స్పష్టం చేస్తుంది. 1976 లో వచ్చిన ఈ నవల సిడ్నీ షెల్డన్ నవలలు
రాస్తున్న తొలి కాలంలో వెలువడింది. ఇదే
నవల 1993 లో టెలివిజన్ సినిమా గా వచ్చింది.
ఈ
నవల గొప్పతనం అంతా కూడా మనుషుల మనస్తత్వాలు సమయాన్ని,
వారి గత అనుభవాలని అనుసరించి ఎలా మారతాయో అంతర్లీనంగా చెప్పడంలో ఉంది. ముఖ్యంగా
టాబి టెంపుల్ పాత్ర చిత్రణ ఈ నవలకు పెద్ద ఆకర్షణ. టాబి టెంపుల్ తల్లిదండ్రులు ఓ
మాంసపు కొట్టు నడుపుకుంటూ బ్రతికేవారు. టెంపుల్ తండ్రి మాట మొదట్లో తల్లి
అనుసరించినా అతను భార్య తెచ్చిన కట్నాన్ని మాంసపు కొట్ల మీద పెట్టి మొహమాటంతో అప్పులు
ఇచ్చి నష్టాలతో నడుస్తున్న సమయంలో అతని భార్య ఆ వ్యాపారాన్ని తన సొంత నిర్ణయాలతో
ఎదిగేలా చేసి కుటుంబాన్ని నిలబెడుతుంది. టాబి పుట్టాక అతని మీద తల్లి ప్రభావం
ఎక్కువ ఉంటుంది. తల్లిని మెప్పించడానికి ఎప్పుడు ప్రయత్నించేవాడు టాబి.
తన
కొడుకు ఏదో ఒక రోజు గొప్ప వాడు అవుతాదని భావించేది ఆ తల్లి. టాబి యవ్వన వయసులో హై
స్కూలులో తనతో పాటు చదువుతున్న అమ్మాయిలతో శారీరక సంబంధాలు పెట్టుకునేవాడు. అతని
అమాయకపు కళ్ళకు పడని ఆడపిల్ల ఉండేది కాదు. వారిలో ఓ అమ్మాయి గర్భవతి అవుతుంది.
దానితో స్కూలు యాజమాన్యం ఆ ఇద్దరు తల్లిదండ్రులను పిలిపించాక,టాబిని
ఆ ఆపద నుండి తప్పించడానికి అతని తల్లి టాబి ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడని మాట
ఇస్తుంది. ఇంటికి వచ్చాక టాబిని అక్కడి నుండి పారిపోయి గొప్పవాడు కమ్మని, ఆ అమ్మాయి కోసం అతని భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్తుంది. బాల్యం
నుండే నటుడు కావాలనే కోరిక ఉన్న టాబి హాలీవుడ్ లో అడుగు పెడతాడు. అక్కడ ఎంతో
దుర్భరమైన జీవితాన్ని గడుపుతాడు.
ప్రతి
చిన్న స్టేజ్ షో మొదలుకుని,నైట్ క్లబ్బుల్లో కూడా తన ప్రతిభను
ప్రదర్శిస్తూ ఉంటాడు. తన కడుపు నింపుకోవడం కోసం ఇంకేన్నో పనులు కూడా చేస్తూ
ఉంటాడు. టాబికి ఉన్న ఒకే ఒక్క గొప్ప నైపుణ్యం ఇతరులను అనుకరించి,వారిని అవమానిస్తూనే హాస్యం చేయడం.ఆ తర్వాత తల్లి మరణించడంతో టాబి
మానసికంగా ఎంతో క్రుంగిపోతాడు.తన విజయం గురించి ఎన్నో కలలు కని అవి నెరవేరకముందే
ఆమె మరణించడం అతనిలో ఓ శూన్యం ఏర్పడుతుంది. అతనిలో మానసికంగా ఒంటరితనం పేరుకుపోతూ
ఉంటుంది.
ఎన్నో ఏళ్ళు అలా గడచిపోయాక అతను ఓ యాక్టింగ్
స్కూల్లో కూడా చేరతాడు. ఎలాగో తన తంటాలు పడి ఆ సమయంలో గొప్ప ఏజెంట్ గా ఉన్న
క్లిప్టన్ లారెన్స్ దృష్టిలో పడతాడు. నాటి నుండి అతని భవిష్యత్తు మారిపోతుంది.
నాటి
నుండి తనను తాను మెరుగుపరచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రేక్షకుల దృష్టిలో
పడతాడు. కానీ అమ్మాయిల బలహీనత ఉన్న అతను ఎంతో మంది అమ్మాయిలతో సంబంధాలు
పెట్టుకుంటూ ఉంటాడు. అవన్నీ ఒక రాత్రి సంబంధాలే. వారిలో మిల్లీ అనే అమ్మాయి కూడా
ఉంటుంది. ఆల్ అనే ఒక హోటల్ ఓనర్ కు ఎప్పటి నుండో సంబంధం ఉన్న మిల్లీని అతను భార్యతో
గొడవల వల్ల వదిలించుకునే మార్గం కోసం అన్వేషిస్తూ ఉన్న సమయంలో టాబి గురించి
తెలియడం వల్ల అతన్ని బెదిరించి మరి వారిద్దరికి వివాహం అయ్యేలా చేస్తాడు.
టాబికి
వ్యక్తిగతంగా ఆ వివాహం ఇష్టం లేకపోయినా భయంతో చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమెకు వీలైనంత
దూరంగా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత ప్రసవం సమయంలో ఆమె మరణించడంతో టాబి
స్వేచ్చజీవి అవుతాడు.
టాబి
ఓ విచిత్రమైన వ్యక్తి. వృత్తి పరంగా నటించే పద్ధతిలో కూడా ఇతరులను అపహాస్యం చేయడం,
అనుకరించడంలో ఉండటం వలన అతని మనస్తత్వం కూడా ఒంటరితనం వల్ల వైరుధ్య మిశ్రమంలా
ఉంటుంది. ఎవరితోనూ కలవకుండా తనదైన ప్రపంచంలో స్వార్ధంగా ఉండే టాబి ఓ మనిషి అయితే, తనకు నచ్చిన వ్యక్తి తనకు పోటీ అయినా వారి అభ్యున్నతి కోసం ప్రోత్సహించి
టాబి పూర్తిగా ఇంకో మనిషి. క్రమక్రమంగా టాబి ఎంతో ఎత్తుకు ఎదిగినా, అతని జీవితమంతా ఒంటరితనం. అమ్మాయిలతో అతనికి ఉన్నవి తాత్కాలిక సంబంధాలే
ఎవరితోనూ భావోద్వేగపరమైన అనుబంధం లేదు. ఆఖరికి టాబి అంతర్ముఖంగా ఎంతో న్యూనతతో
ఉండే వాడంటే అతను చేసే ఏ షూటింగ్ లో నైనా ఆఖరికి కొత్త నటులైనా అతన్ని పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా సరే ఎంతో బాధ పడే వాడు. ఎవరైనా తనని పట్టించుకోకపోతే
తట్టుకోలేని వ్యక్తిగా టాబి మారిపోయాడు. క్లిప్టన్ లారెన్స్ ఎందరో సినీ స్టార్స్
కు ఏజెంట్ గా ఉన్నా, అతన్ని తనకు మాత్రమే ఏజెంట్ గా ఉండేలా
చేస్తాడు. అలా తనకంటూ ఎవరో ఉన్నారనుకోవడంలో మనశ్శాంతి పొందేవాడు.
ఇక
టెక్సాస్ లో ఓ ఊరిలో పుట్టిన జోసెఫిన్ కథ కూడా టాబి కథతో పాటే మొదలవుతుంది. టాబి
పుట్టిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత
పుడుతుంది. ఆమె పుట్టినప్పుడు ఆమె తండ్రి మరణించడంతో ఆమె వల్లే అతను మరణించాడని
భావించిన తల్లి అదే భావనను జోసెఫిన్ మెదడులో కూడా నాటేలా చేస్తుంది. వారుండే
ప్రాంతంలో ఆయిల్ ద్వారా ధనవంతులైన కుటుంబాలు కూడా ఉండేవి. వారి ఇళ్ళలో వారి
పిల్లలతో తిరుగుతూ ఉన్న జోసెఫిన్ కు వారిలో ఓ కుటుంబంలో ఉన్న డేవిడ్ అనే అబ్బాయి
మీద బాల్యం నుండే ఇష్టం ఏర్పడుతుంది. జోసెఫిన్ యవ్వనంలో అందగత్తెగా తయారవుతుంది.
యవ్వనంలో
జోసెఫిన్ ఉండగా విదేశాల నుండి తిరిగి వచ్చిన డేవిడ్ మళ్ళీ ఆమెతో ప్రేమలో పడటం,వారిద్దరు
వివాహం చేసుకుందాం అని అనుకున్న సమయంలో డేవిడ్ తల్లి ఆ పెళ్లి జరగకుండా ఉండటానికి
తన అనారోగ్యాన్ని సాకుగా చేసుకుని అతనికి
సిస్సీ అనే తమ స్థాయికి సరిపోయే అమ్మాయితో వివాహం జరిగేలా చెయ్యడంతో మనసు
విరిగిపోయిన జోసెఫిన్ తాను నటి అవ్వాలన్న కోరికతో హాలీవుడ్ కు వచ్చేస్తుంది.డేవిడ్
జరిగింది ఆమెకు తెలియజేద్దామని ప్రయత్నించినా సరే ఆమె అప్పటికే అక్కడి నుండి
వెళ్ళిపోవడంతో ఆమెకు అసలు విషయం చెప్పలేకపోతాడు.
హాలీవుడ్
కు వెళ్ళిన జోసెఫిన్ తన పేరును జిల్ కాసిల్ గా
మార్చుకుంటుంది.ఆమె పయనం ఎంతో
కష్టమైపోతుంది. ఆమె అనుకున్నంత సులభంగా ఆమెకు ఏ అవకాశం రాదు. ఆమెకు వచ్చే చిన్న
చిన్న అవకాశాలు కూడా ఆమె శరీరాన్ని అర్హతగా పరిగణించి వచ్చేవే తప్ప ఆమె ప్రతిభను
అనుసరించి మాత్రం కాదు. ఆమె వాటినే వినియోగించుకుంటూ చిన్న చిన్న అవకాశాల్లో
చేస్తూ ఉంటుంది. వాటితో పాటు ఆమె పొట్ట కూటి కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటుంది.అలా
కాలం గడిచిపోతున్న సమయంలో ఆమె టాబి టెంపుల్ చేస్తున్న ఓ సినిమాలో ఆమెకు ఓ చిన్న
పాత్ర ఉంటుంది. దానిలో నటించిన ఆమెను తొలిసారిగా చూస్తాడు టాబి.కానీ ఆమె అతని పట్ల
ఏ శ్రద్ధ చూపించదు. దానితో ఆమె పట్ల అతనికి కుతూహలం పెరుగుతుంది.
కానీ
తన పాత్రలు నిలుపుకోవాలంటే కాస్టింగ్ ఏజెంట్స్ తో మంచిగా ఉంటే బావుంటుంది కానీ
అందరితో కాదని అనుకున్న జిల్ టాబి
ప్రాధాన్యతను గుర్తించదు. దానితో ఆమె పట్ల
అధిక ఆసక్తి పెంచుకుంటాడు టాబి. ఆ క్రమంలో అతని గురించి ఓ అంచనాకు వచ్చిన జిల్
అతనికి ఆసక్తి కలిగేలా అతను తన చుట్టూ తిరిగేలా ప్రవర్తిస్తూ ఉంటుంది. అతను ఇచ్చిన
ఖరీదైన బహుమతులు,డబ్బు కూడా తిరస్కరిస్తుంది. ఆమె మిగిలిన
వారితో అవకాశాల కోసం ఎలా ప్రవర్తిస్తుందో అందరికీ తెలిసినప్పటికీ టాబి టెంపుల్ కు
తెలిస్తే తమను ఏం చేస్తాడో అన్న భయంతో ఎవ్వరూ అతనికి ఆమె గురించే చెప్పే ధైర్యం
చెయ్యరు. డేవిడ్ భార్య మొత్తానికి అతనికి విడాకులు ఇస్తుంది.ఎలా అయినా మళ్ళీ
జోసెఫిన్ కు జరిగింది చెప్పి ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న అతనికి ఆమె టాబిని
వివాహం చేసుకోవడం పెద్ద షాక్ ఇస్తుంది.
టాబిని
పెళ్ళి చేసుకున్న తర్వాత జిల్ తనను ఎవరైతే నిరాకరించారో వారి మీద అతని ద్వారా కక్ష
తీర్చుకుంటూ ఉంటుంది. అలానే క్లిప్టన్ ను కూడా టాబి నుండి దూరం చేస్తుంది. జీవితమే
ఎంతో హాయిగా,సంతోషంగా గడిచిపోతున్న
క్రమంలో టాబికు ఓ ఫిల్మ్ ఫెస్టివల్ మధ్యలో అనారోగ్యం వచ్చి శరీరం
చచ్చుపడటంతో, వారి జీవితాలు తారుమారవుతాయి.అతను చనిపోతాడని
అందరూ భావించిన సమయంలో అతన్ని ఎంతో కష్టపడి మామూలు మనిషిని చేస్తుంది జిల్. దానితో
ఆమెకు ఎంతో పేరు వస్తుంది.మళ్ళీ టాబి బిజీ అవుతాడు.
కానీ
మళ్ళీ అతనికి అదే అనారోగ్యం తిరగబెడుతుంది. అదే సమయంలో డేవిడ్ మళ్ళీ ఆమెను
కలుస్తాడు. టాబి అప్పటికే ఆమె కన్నా దాదాపు ఇరవై ఏళ్ళు పెద్ద వాడు,దానితో
పాటు ఈ సారి అతను కోలుకోవడం అసాధ్యమే అని గ్రహించిన జిల్ కు డేవిడ్ ను వివాహం
చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. కానీ డాక్టర్లు టాబికి శరీరం చచ్చుపడినా గుండె
ధృఢంగా ఉండటం వల్ల ఇంకో ఇరవై ఏళ్ళు బ్రతికే అవకాశం ఉందని చెప్పడంతో అతన్ని ఎలా
అయినా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న జిల్ అతన్ని స్విమ్మింగ్ పూల్ లో
నర్స్ లేని సమయంలో తోసి హత్య చేసి దానిని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తుంది. కానీ
ఆమె మనఃసాక్షి మాత్రం ఎప్పుడు అపరాధ భావనతోనే ఉంటుంది.
టాబి
మరణం తర్వాత జిల్, డేవిడ్ వివాహం చేసుకోవాలని
నిర్ణయించుకుంటారు. అప్పటికే క్లిప్టన్ కెరియర్ అంతా నాశనం అవుతుంది. ఒకప్పుడు
ఎంతో వైభవంగా బ్రతికిన అతను జిల్ అతన్ని టాబి నుండి దూరం చేసినప్పటి నుండి ఏమి
లేని వాడిగా మిగిలిపోతాడు.టాబి మరణం గురించి విన్న అతనికి అది జిల్ చేసిన హత్య అని
అర్ధమవుతుంది.
జిల్
,డేవిడ్ షిప్ లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.జిల్ డేవిడ్ కోసం
ఎదురు చూస్తూ ఉంటుంది. డేవిడ్ వచ్చాక అతనికి ఆ షిప్ లో ఉన్న ప్రొజెక్షన్ రూమ్ లో
ఎవరికి తెలియకుండా క్లిప్టన్ గతంలో జిల్ చేసిన ఓ పోర్న్ సినిమా చూపించడంతో ఆమెకు
కూడా చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు డేవిడ్. ఆ విషయం క్లిప్టన్ ద్వారా
తెలుసుకున్న జిల్ ఇక తన జీవితంలో ఏమి లేదనుకుని అదే నీళ్ళల్లో దూకి ఆత్మహత్య
చేసుకుంటుంది.
టాబి
మొదటిసారి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడూ దాదాపు అతను కోలుకోవడం అసాధ్యమైన
పరిస్థితులు ఉన్నప్పటికి అతని మీద ప్రేమతో ఆ రోగాన్ని జయించేలా చేసిన జిల్ రెండో
సారి అసలు ప్రయత్నించకపోగా అతన్ని హత్య చేయడం,కాలంతో పాటు మారే మనుషుల
మనస్తత్వాలను స్పష్టం చేస్తుంది.టాబి ద్వారా తనకు అవకాశాలు ఇవ్వని వారి మీద కక్ష
సాధించి,తన జీవితాన్ని అతనితో సంతోషంగా గడపవచ్చని
నిర్ణయించుకున్న జిల్ మొదటిసారి తనకు ఇంకా
ఎవరూ లేకపోవడం వల్ల టాబిని బ్రతికించే ప్రయత్నం చేసింది.కానీ రెండో సారికి ఆమె
జీవితంలోకి మళ్ళీ డేవిడ్ రావడంతో టాబి అవసరం లేదని ఆమె భావించింది.దానితో అతన్ని
మొదట ప్రేమించిన ఆమె అతన్ని హత్య చేసే వరకు వెళ్ళింది. ఇది కాలం-పరిస్థితులు ఆమె
జీవితంలో తెచ్చిన మార్పులు.
మనిషి
జీవితం ఎక్కడ మొదలైనా సరే,ఎంత ఎదిగినా సరే,ప్రేమించే
వారు లేకపోతే వారి జీవితాలు ఎలా ముగుస్తాయో,సినిమా లోకంలో
ఎన్ని కష్టాలుంటాయో స్పష్టం చేసే నవల ఇది.
*
* *

Comments
Post a Comment