నేనేమనుకుంటానంటే ....
నేనేమనుకుంటానంటే ....
(పార్ట్ -1 )
-రచనశ్రీదత్త (శృంగవరపు
రచన)
'తెలుగు
సాహిత్య సోపానం’ వాట్సప్ బృందంలో సాహితీ మిత్రుల రచనలపై స్పందిస్తున్న సందర్భంలో
కొన్ని అలా నా స్పందనలో అంతర్లీనంగా కలిసిన నా భావ వీచికలు మీ కోసం
1)బంధాలు-అనుబంధాలు,అపార్థాలు-అపోహాలు,కీర్తికిరీటాలు, అథఃపాతాళాలు,పుట్టుకలు-మరణాలు,విజయాలు-ఓటములు.....వీటి వెనుక ప్రయత్నకాలమెంతైనా కానీ వాటిని నిలబెట్టే
క్షణం ఒక్కటే.ఆ క్షణంలో తనపై తనకు నియంత్రణ కలవాడే విజ్ఞుడు.
2)ప్రస్తుతం ప్రపంచం ప్రతి కోణంలో
మోడ్రనైజ్ అవుతుంది.అది పరికరాలకే పరిమితం కాకుండా,అనుబంధాలకు
విస్తరిస్తూ ఉంది.మనుషులు ఎవరితో మామూలుగా మాట్లాడినా సరే,తమ
స్థానం ఓ మెట్టు దిగుతుందనే దృక్పథాన్ని ఏర్పరచుకోవడం,ఎంత
వరకు అవసరమో అంతవరకే ఉండాలి అన్న నియమాన్ని పాటించడం వంటివి,క్రమక్రమంగా
మనిషిని నిర్లిప్తంగా మారుస్తూ,తనను మాత్రమే ప్రేమించే
అమూల్యమైన బంధాలను కూడా అదే లిస్టులో చేర్చుకుని ముందుకు సాగడం వల్ల ...దానిని
నాగరికత అనాలో...ఏమనాలో తెలియదు !
3) ఓ కవి ఎందుకు
రాస్తాడు?ఎందుకు రాయాలి?అనే ప్రశ్నలు వెయ్యి మంది కవులకు
ఇచ్చినప్పుడు తమదైన ఉనికి ప్రతి కవి కలిగి ఉంటాడు.కవిత ఒక ప్రక్రియే కావచ్చు,కానీ భావాల్ని-బాధల్ని-కోపాన్ని-నిర్లక్ష్యాన్ని-జీవితపు లాస్యాన్ని
....దేనిని కవి స్పృశించినా సరే అది ఆ కవి ప్రత్యేకతను చూపాలి.అదే 'కవులు ఊరికే రాయరు' అనే అంశం పట్ల స్పష్టత
వస్తుంది.రచయితల పట్ల పుంఖానుపుంఖాలు రాస్తూనే ఉంటారు అనే భావన ఆ రంగంలో
లేనివారికి ఉండవచ్చు,కానీ అదే సాహిత్యంలో భాగం అయ్యేవారు
మాత్రమే ఈ మూలభావాన్ని అర్థం చేసుకోగలరు.
4) మనుషుల వల్ల
కలిగే బాధలు,ఎవరూ లేరన్న నిస్పృహ,ఓ
ప్రయోజనాన్ని కలిగిస్తూ నిత్యం నమ్ముకోదగ్గ ఒకే ఒక స్నేహం పుస్తకం
మాత్రమే.జీవితంలో ఉండే ఎన్నో డిసప్పాయింట్ మెంట్స్ ,మన ఆశలకు
దూరంగా ఉండే నిజ జీవితం,ఈ ఘర్షణలో కోల్పోయే మనశ్శాంతి,పరిస్థితి ఏదైనా పుస్తకం ఇచ్చే సంతృప్తి
స్నేహాన్ని సైతం మరిపిస్తుంది.
5) ప్రకృతి వరాలైన
ఎన్నిటినో మనం సాధారణంగా అనుభవిస్తాం తప్ప,అది వరమని గుర్తించం.కానీ
అలా గుర్తించే దృష్టిని అలవర్చుకోవడంలో సకల అంశాల పట్ల ఆశావాదాన్ని నింపుకునే
ఆస్కారం ఉంది.
6) మనమేంటి?మనకు
ఎవరున్నారు?ఎవరుంటారు?అన్నవి విషాధం
నర్తించి,ఒంటరి అయ్యేవరకు ఎరుగం.ఎంత ఏడ్చినా,మనఃక్షోభ అనుభవించినా సరే మనిషి తన జీవితాన్ని సాగించాల్సిందే.ఈ
జీవితంలోని అన్ని అంకాలకు అర్థాలు వెతకలేదు,కారణాలు శోధన
చేయలేము.ఏమీ అర్థం కానీ తనంతో జీవితంలో ముందుకు అడుగులు వేయాల్సిందే.
7) స్త్రీ జీవితం
నటనారంగంలో మాత్రం 'బొమ్మ'ను పోలే
ఉంటుంది.అవకాశాలు-అభిమానులు' తప్ప నడవాల్సిన ముళ్ళ దారి
గురించి ఆలోచించనవ్వవు.ఆ ముళ్ళను తొలగించి మామూలు బాటలో నడవనివ్వవు.మనిషుల్లో ఉన్న
బలహీనతలు ఒక్కోసారి ఒక్కోసారి లాభాన్ని చేకురేలా చేస్తాయి.ఇది 'గేమ్ ఆఫ్ లైఫ్ ' అంతే.
8) మనం బాగుండటం
కోసం ఏం చేయాలో తెలియక ఏదైనా చేయాలి అనే తపనతో మనిషి తోవ తప్పి సంచరించే స్వార్థ
జీవియై జీవిస్తాడు.మనిషిని వ్యక్తిగతంగా మంచి,చెడుల పట్ల మానిటర్ చేసే సెల్ఫ్ సిస్టమ్ ఉంటే బాగుండునేమో!
9) కుల-మత రహిత
సమాజం కోసం పయనించాలని అభ్యుదయవాదులు గళమెత్తుతూనే ఉన్నారు.నాటి మనుషులకు అధికారం
ఓ బలహీనత.ఆ అధికారాన్ని చలాయించడానికి మతాన్ని ఓ ఆయుధంగా మలచుకున్నారే తప్ప,ఇంకా
దాని వల్ల మానవ సమానత్వం సిద్ధించింది ఎప్పుడు?మతం అనేది
అభిప్రాయమైతే,మనుషులుగా వివిధ అభిప్రాయాలు వ్యక్తపరిచే
స్వేచ్ఛ మనకు ప్రజాస్వామ్యంలో ఉండనే ఉంది.అది అభిప్రాయం మాత్రమే కాదు,దానిని మాత్రమే ఆమోదించాలనే నిర్భంధం కూడా.
10 ) చిన చేపను పెద
చేప ఆక్రమించడం ప్రగతి అయినా,సైన్స్-మానవ సంబంధాల మధ్య ఓ గీత
గీయాలేమో!లేకపోతే రాబోయే తరాల్లో మనుషులు మాట్లాడుకోకుండా,చూసుకోకుండా,ఒంటరి దీవుల్లా బ్రతుకుతూ అదే ప్రగతిగా పరిణమించే తరుణం కూడా రావచ్చు.అందుకనే
ముఖ్యంగా మనుషులు-మానవ సంబంధాలను సరిగ్గా మానిటర్ చేసే 'మానవ
స్పర్శ'తో కూడిన ప్రగతి కూడా అనివార్యం.
11 ) ఇది
బలవంతునికి-బలహీనునికి మధ్య జరిగే సమరం.'ఆర్ట్ ఆఫ్ వార్ 'లో ముఖ్య సూత్రం కూడా శత్రువు ఆదమరచి ఉన్నప్పుడూ,ముందు
నుండే బలహీనంగా ఉన్నట్టు శత్రువును నమ్మిస్తూ,అప్పుడు
ఊహించని రీతిలో దెబ్బ కొట్టడం.మీ 'రాకాసి అల' ప్రస్తుతం కరోనా నుండి మన జీవితంలోని అన్ని పరిస్థితులకు వర్తిస్తుంది.ఏం
జరిగినా సరే,మన బలహీనతలు-బలాల గురించి యుద్ధం చేసే శత్రువుకు
తెలియపరచకుండా,ఎప్పటికప్పుడూ కొత్త వ్యూహాలు మారిస్తేనే ఈ 'రాకాసి అల'ల లోకంలో బ్రతకగలం.
12) ఎన్నో భయాలు
వెంటాడే సమయంలో కూడా మనిషికి తనను తాను రక్షించుకోవడానికి ఓ ఆయుధం కావాలి.అక్షరం
గొప్ప ఆయుధం.ఎందుకంటే సృష్టికర్త ప్రజ్ఞ
రూపాన్ని తీసుకుని అక్షరాలు ప్రపంచమంతా
పయనిస్తాయి.
మన ఆలోచనలే భయాలైన క్షణంలో మనలోని
ధైర్యం అక్షరాల్లా కదనరంగంలో పరుగు పెడుతుంటే భయాల లోకం నుండి ఆ అక్షరాల లోకంలో
కొంతకాలం సేదతీరవచ్చు.
13 ) 'మూఢ నమ్మకాలు-మూఢ భక్తి-మూఢ అభిమానం'....అసలు మనిషి ఇంకొకరి అభిప్రాయం మీదో,నమ్మకాల మీదో, వ్యక్తుల మీదో విశ్వాసం పెంచుకుంటూ,తన విచక్షణను ఎందుకు అవి పాలించేలా చేస్తాడో అర్థం కానీ అంశం.'బ్రెయిన్ వాషింగ్ 'అయినా మన బుర్రను,మన జీవితాన్ని పక్క వారి ఆలోచలు-ఆశయాల కోసం ఎందుకు వెచ్చిస్తారో? ఆ పెంచేవారికన్నా,ఆ ప్రభావంలో పడేవారే మూలం.ఎందుకంటే వీరి కాకపోతే ఇంకొకరు...జీవితంలో తమను తాము నమ్ముకోనివారే,తమ విలువలను విశ్వసించనివారే,అలా మూఢ ప్రభావంలో ఉంటారు.నా మటుకు నేనైతే ఆ పెంచిన వారిని కాదు,అలా పెరగడానికి ఇష్టపడేవారే ఆ మూఢత్వ పుట్టుకకు కారణమని అనుకుంటున్నాను.'మూఢత్వం' ముడి సరుకైతే,కొనే వారు లేకపోతే,దానిని ఎవరు మాత్రం అమ్మగలరు?
14 ) అర్థం కానీ
తత్వంలో అనంతం ఉంది.కానీ అర్థం చేసుకోవాలంటే ఆ అగ్ని రగలాలి. ఆ పరిస్థితులు
ఎదురైతే తప్ప మిత్రులు-శత్రువులతో మనం ఎలా తలపడతామో చెప్పలేము.గమనించి,వేచి
చూసి,మనిషి అంతరంగ సాక్షియై అప్పుడు కదా మాయలు కల్పించి,మారుతూ,దేనికి చలించకుండా అప్పుడు కదా 'నేను ఉన్నాము' అని నీకు చెప్పేది
15 ) జీవిత అర్థాన్ని,ప్రయోజనాన్ని
తెలుసుకోవాలనే ఆలోచన అన్వేషణగా మొదలైనప్పుడు మనిషి 'ఆధ్యాత్మిక
తత్వం' వైపు పయనించడం నిజమైన భక్తి.కానీ అలా పయనించకపోతే
ఏమౌతుందో అన్న భయంతో అనుకరిస్తూ,అనుభవానికి దూరమైతే ఈ
సృష్టిలోని అతి గొప్ప విశ్వ శక్తిని,గురువులు చూపించే
మార్గాన్ని ఏ వ్యక్తి పాటించలేడు.
వ్యక్తిలోని బలాలు-బలహీనతల
ఆధారంగానే 'భక్తి'కి 'మూఢత్వానికి
మధ్య ఉన్న రేఖ చెరిగిపోయి వ్యత్సాసం గమనించలేనంతగా మమేకమై,మనుషుల్లో
ఆ భావన పట్ల నమ్మకాన్ని సడలిస్తాయి.
16 ) అన్ని రకాల
పూలు....ఓ పువ్వును చూడగానే సుగంధపరంగా మిగిలిన వాటితో పోటీ పడలేకపోయినా పువ్వుకి ప్రకృతి ఒనగూర్చిన సౌందర్యం మాత్రం మనల్ని
ఆహ్లాదపరుస్తుంది.ఆ పువ్వుల నవ్వులు మన మనసులోని భావాల్ని,మన
భావోద్వేగాలకు ప్రతీక.మల్లెపూవు సుగంధం,వేప పువ్వు వెటకారం,జిల్లేడు పువ్వు జుగుప్స...ఇంక
బిడియం,కవ్వింపు....ఎన్నో భావాలు.వాటిని చూసే దృష్టిని బట్టి,ఒక్కో భావం వాటికి ఆపాదించబడుతుంది.ఆ పూలు సూర్యాస్తమయ సమయానికి దండగా
మారాయి.వైరుధ్యాలున్నా ఓ చోటే కలిసిపోయాయి.మనిషి అస్తమించినా అంతే....ఓ చోట అందరూ
ఏకమవ్వాల్సిందే.
17 ) అక్షరాల కర్షకుడి
మెదడులో ఏ ప్రక్రియ విత్తనాన్ని అయినా ఆహ్వానించే సంస్కృతి ఏ మేరకు ఉందన్నది
పక్కనపెడితే,'మెచ్చే అంశాలు-మెచ్చని అంశాలు' అన్న
వలయంలో తిరుగాడూతూ,దానిని దాటిన ప్రపంచంలో ఎన్ని విస్తృత
కోణాలు ఉన్నాయో చూసేవారు కొందరే.మనిషి తనకున్న వ్యక్తిగత అభిప్రాయాలు,విలువల ఆధారంగా అక్షరాలనూ తూచినంత కాలం ఆ అక్షరాలు ఆదరణ లేని సిరా
సృష్టిలానే మిగిలిపోతాయి.
వ్యక్తులు-సమాజిలు ఏవైనా సరే
అన్నిటిని చూడగల దృక్కోణాన్ని అలవర్చుకోవాలి.అప్పుడే సాహిత్యంలో వస్తు విస్తృతి
పెరుగుతుంది.
18 ) పల్లెటూర్లంటే
అందరికి ఇష్టం.కానీ అందరికి అభివృద్ధి పేరిట పట్నంలో నివసించడమే ఇష్టం.కానీ హాలీడే
స్పాట్లలా,ప్రశాంతత చిహ్నాలుగా మళ్ళీ పల్లెటూర్లనే
చెప్పుకుంటాం.పట్టణాల్లో జరిగితే ప్రగతి అంటాం,పల్లెటూర్లలో
అదే ప్రగతి పయనిస్తే మాత్రం గగ్గోలు పెడతాం.బహుశా మనుషులందరికి ప్రగతి పథంలో
నడుస్తున్న ప్రదేశాల్లోనే ఉండాలని ఉంటుంది.
ప్రకృతా?ప్రగతా?
అన్న ప్రశ్న ఉదయిస్తే నేడు చాలా వరకు మనుగడ వైపే
పయనిస్తున్నారు.అలాంటప్పుడు 'అప్పటి రోజులే బావున్నాయి'
అని అనుకోవడానికి బావుంటుందేమో కానీ పట్టణాలలో లానే ప్రగతిని ఆశించే
పల్లెలను తప్పు పట్టడం సరి అయినది కాదేమో!'ప్రగతి-పచ్చదనం'
మధ్య ఓ గీత ఉంటుంది.అది పోటీ రేసులో పడి చెరిగిపోతూ ఉంది.ఈ విషయంలో
ఎవరిని తప్పు పట్టలేం. మనిషి మనుగడ సాగించాలి...అంతే!!!
19) మనం చేయగలిగే
పరిస్థితుల్లో ఉండి చేస్తూనే మనసులో అయిష్టాన్ని పెంచుకున్నా,నిజమైన
స్నేహంలో ఆర్థిక అవసరాలే కాదు అడగకుండా
ఆత్మీయ అవసరాలు తీర్చే మిత్రులున్నప్పుడు మన సంకుచిత్వం అంతరించి ఆత్మీయత
విస్తరిస్తుంది.
20 ) మధ్య వచ్చిన
దూరాన్ని,చెప్పలేక మిగిలిపోయిన ఊసుల్ని ....
మాటల్లో మార్చి,తరాలన్నింటికి
మాట్లాడటానికి తర్కాలు-నిరూపించుకోవడాలే కాదని,మామూలుగా కూడా
మాటలని నారేయ్యాలని చక్కగా చెప్పారు.
మాట విలువ మాటల్లేనప్పుడే
స్పష్టమవుతుంది.మాటల్లేకుండా మిగిలిన శూన్యాన్ని మాటల శబ్దంతో నింపాలి
21 ) ఈ సృష్టిలో ఏ
భేధం లేకుండా అందరిని సమ దృష్టితో ఆహ్వానించే మరణాన్ని,తప్పించుకోనూ
లేము,అలా అని ఆహ్వానించలేము.ఇలాంటి పరిస్థితుల్లో అది సహజమని,ఎప్పుడో వస్తుందని,వచ్చేప్పుడు భీకరంగా కాకుండా
స్నేహ స్వర్శతో ఏ బాధ కలుగకుండా సంతోషంగా తీసుకుపొమ్మని కోరుకోవడం తప్ప.
22) బాలలకు విలువలు-విజ్ఞానం అందించేలా విద్యా వ్యవస్థ
సంపూర్ణమైతేనే వారు సమాజంలో మంచి పౌరులుగా మనగలరు.ఆటలపాటలతో పాటు సమాజంలోని
అవినీతి,వాస్తవిక పరిస్థితులను
అర్థమయ్యేలా విద్య,పెంపకం ఉండాలి.
23) బాషల విషయంలో
ప్రాధాన్యతలు నేడు వృత్తులకే పరిమితమవ్వడంతో మాతృబాష విలువను జీతాలతో తూచడం వల్ల
కూడా నేడు ప్రాధాన్యత తగ్గుతున్న పరిస్థితి.మాతృబాష నేర్చుకోవడం బాధ్యతగా భావించేవారు తక్కువ.నేడు ఏదైనా
వృత్తి-జీతాలకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది.
24) మాటే మంత్రము.ఈ
సృష్టిలో అద్భుతమైనది మాట.'నొప్పించక,తానొవ్వక'
శైలిలో మాట్లాడేవాడే ఈ సమాజంలో నెగ్గుకురాగలడు.మన మాటలు మన
అమాయకత్వానికి ప్రతీకలైనా ప్రమాదమే,మన అతిశయానికి చిహ్నాలైనా
ప్రమాదమే,అందుకే మాట
మన భావోద్వేగాలకు,మన మనఃస్థితులకు కూడా సమన్వయకర్తలా
ఉండాలి.అవసరం మేరకు అందరితో,సన్నిహితులతో మనసు నిండే మేరకు
మాట పెగలకపోతే అదే దూరాలను శాశ్వతం చేస్తుంది.ఆలోచనలకు రూపమిచ్చేది మాటే.ఆలోచనలను
స్పష్టం చేసేది మాటే.ఆలోచనలను కార్యంగా మార్చేది మాటే.బంధాలు-అనుబంధాలు,అపోహాలు-అపార్థాలు దాని చలువే.
25) ప్రేమతో
పిలిచేవారు,ప్రేమించేవారు జీవితంలో అరుదు.అదే జీవితపు
వాస్తవం.నలుగురి కోసం ప్రేమను,అభిమానాన్ని నటిస్తూ,ఆ నలుగురు మంచివారని పొగడాలనే తపనతో ఏదైనా చేయడానికి వెంపర్లాడే మనుషుల
మధ్య ప్రేమ కోరుకునే మనిషికి సాంత్వన ఎక్కడ?అది తెలిసినా
గుర్తించనట్టు ఉంటే మనశ్శాంతి.కొన్ని నిజాలను పరిశీలన చేస్తే మనఃక్షోభ తప్ప ఏమీ
ఉండదు.
26 ) మీరు ఏంటీ అన్నది
తెలుసుకోండి అనే ప్రశ్నే మానసిక,తత్వ శాస్త్రాలకు పునాది.మానసికంగా
మనమేంటి అన్నదే మనల్ని విశ్వ శక్తిలో ఓ
అణువును చేస్తుంది.జీవితం పట్ల,పరిస్థితుల పట్ల,మన పట్ల,మన ఆలోచనల పట్ల మన ఎరుకే మన జ్ఞానము.
27 ) ప్రజాస్వామ్య
దేశంలో బానిసత్వం అన్నదే ప్రజలే ఎన్నుకుంటున్నారనుకుంటా!
మన జీవన విధానమేదైనా కానీ మన
ఆలోచనల్లో స్వేచ్ఛగా జీవించాలన్న తపన,అమ్ముడుపోమనే ధైర్యం
ఉండాలి.కానీ రాజ్యపాలనకు,తమ జీవితాలకు ప్రత్యక్ష సంబంధం
ఉందని భావించని ప్రజలు ఏదో ఓటులే అనుకునే నిర్లిప్తమైన వినిమయ వస్తువుగా
మారుస్తారు.
28 ) స్త్రీ చైతన్యం
తన జీవితం నుండే జన్మించాలి.సమస్యలు-పరిస్థితులు ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయో,ఆమె ఎలా
ప్రతిస్పందిస్తుందో అదే ఆమె జీవితాన్ని నిర్ణయిస్తుంది.సమాజం తన నియమాలకు లోబడని
వారిని ఆమోదించదు,కానీ సాంఘిక దృక్పథం కన్నా తన జీవితపు
గమ్యానికి ఆమె ప్రాధాన్యత ఇవ్వగలిగితేనే ఆమె విద్య ఆమెకు ఆయుధమవుతుంది.
29 ) .అసలు
దేనిని అమ్ముతున్నారో,ఎందుకు అమ్ముతున్నారో తెలియని
పరిస్థితి.బ్రిటీషు వారి నుండి వ్యాపార సంబంధాలు రాజకీయ సంబంధాలుగా మారి,చివరకు మనుషుల శ్రమే ఉత్పత్తిగా మారిందంటే,దేశాన్ని,వనరులను,పౌరులను కూడా వివిధ రూపాలలో అమ్మారనే.నేడు
రూపాంతరం చెందిన సంస్కృతిలో పరోక్ష అమ్మకాలెక్కువ.
మనుషుల సృజన,వనరులు,ఆలోచనలు కూడా అమ్మదగ్గ సరుకులే ఇక్కడ.అమ్ముకోవడం ఒకవేళ వ్యక్తిగత స్థాయిలో
ఇష్టపడి,సమాజ స్థాయిలో వ్యతిరేకిస్తే అది సమస్యే.రంగాల
వారిగా,ఆలోచనల వారిగా,ఇలా స్థాయిల వారి
అమ్మకాలు జోరుగా సాగుతూ ఉన్నా,ఏ స్థాయిలో ఎలా ఎదుర్కోవాలి
అన్నదే ప్రశ్న.ఓ ఆలోచన సమిష్టి స్థాయి కార్యాచరణగా మారడం కూడా సమస్యే.
30 ) ఎన్నో ఆలోచనలు,ఎన్నో
ఆశయాలు,ఎన్నో విప్లవాలు పురుడు పోసుకునేది ఇక్కడే.భావ
దారిద్ర్యం,సంకుచిత దృక్కోణాల నుండి స్వేచ్ఛ ఇక్కడే
లభిస్తుంది.
మనుషుల నమ్మకాలు శాస్త్రీయతను
సంతరించుకునేది ఇక్కడే.ఓ ఆలోచనను విచక్షణతో నిర్ణయించే ప్రజ్ఞ అలవడేది విద్యాలయంలోనే.
31) మన అజ్ఞానాన్ని
ఒప్పుకోవాలంటే మన భయాలు,మొహమాటాలు,సంకుచిత
ఆలోచనలు అడ్డు వస్తాయి.తెలియని విషయాన్ని తెలియదు అని ఒప్పుకోవడం మన నిజాయితీకే
ప్రతీక కాదు,సమస్యలను ఎదుర్కొనే మన దృక్కోణానికి చిహ్నం కూడా. తెలియని
స్వరానికి,తెలిసిన స్వరానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఆ విషయం పట్ల
అవగాహన ఉన్నవారు ఎలాగూ గ్రహించగలరు.కాకపోతే విజ్ఞత కొద్దీ అది వ్యక్తపరచరు అంతే.ఏ
ఆమోద అభిప్రాయం కోసం ప్రాకులాడతామో అది శుద్ధ దండగ అని తెలిసాక,ఒప్పేసుకుంటే ఈ ప్రయాసలన్నీ తప్పును కదా!!
32) లోతుగా ఆలోచిస్తే
ప్రపంచమంతా 'తెలుసు-తెలియదు'
ఈ విరుద్ధ పదాల మధ్య రణంతోనే సాగుతూ ఉంటుంది.'ఏదో
తెలుసు అని నిరూపించుకోవాలన్న తపన కొందరిదైతే,ఏం తెలియదన్న
విషయాన్ని కప్పి పుచ్చాలనే ఆరాటం ఇంకొందరిది',తెలియనిది
ఆవిష్కరించేది కొందరైతే,తెలిసినది కనుగొనేవారు ఇంకొందరు,కాకపోతే ప్రథమంగా ఏం తెలుసు,ఏం తెలియదు అన్న విషయం
మీదైతే స్పష్టత ఉండటం అవసరం.జీవిత గమ్యానికి అదే ప్రథమం.
33 ) స్త్రీ అయినా,పురుషుడైనా
వారి ఆలోచనలు,భయాలు,బలహీనతల ఆధారంగా
వారి జీవన విధానాలు ఏర్పడతాయి.అసలు మహిళాదినోత్సవ ఉత్సవాలు ఎందుకు? అన్న ప్రశ్న వస్తే,స్త్రీ సాధికారతను అంతర్జాతీయ
స్థాయికి తీసుకువెళ్ళడమే అని కొందరు,ఇలా అయినా స్త్రీ ప్రతిభ
వెలుగులోకి వస్తుందని ఇంకొందరు...ఇలా ఎవరి దృక్కోణాలు వారివి.కానీ సమాజంలో జీవన
స్థాయిని అనుసరించి,వారి మనస్తత్వాల ఆధారంగా వారితో
సమాజంలోని వివిధ స్థాయిల వారు ప్రవర్తిస్తారు.మీరు రాసినట్టు ఆధునికత-ఆర్థిక
స్వాతంత్ర్యం స్త్రీని తన ఖర్చులు-జీవన విధానాన్ని స్వేచ్ఛగా నలుపుకోగలిగే
స్థాయిని ఏర్పరచినా,ముఖ్యంగా ఆర్థిక వ్యత్యాసాలే స్త్రీని
జీవితంలో బలహీనురాలిని చేస్తున్నాయి.ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న స్త్రీలైనా సరే
తమకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్న స్త్రీలను అదే స్థాయిలో గౌరవించగలరా?ఇది స్త్రీల వైపు మనం చూస్తున్న సమాజంలోని ఆర్థిక అంతరాలు జీవన విధానాలనే
కాదు,గౌరవాలను కూడా మార్చేస్తాయి కొన్ని సార్లు. తమను తాము
తక్కువగా భావించే స్త్రీలు సర్దుకుపోతూ ఉంటారు.అదే సమస్య.
34) జ్ఞానం జీవితంతో
పాటు క్రమంగా పరిపూర్ణం చేసుకునేది.జ్ఞానానికి నిర్వచనం నిర్ధిష్టంగా లేకపోయినా,వ్యక్తిగత
జీవితాల ఆధారంగా వ్యక్తులు స్పష్టం చేసుకునే సత్యాలే జ్ఞానం కొన్నిసార్లు.జ్ఞానం
విడి అంశం కాదు,జీవితంలో అనుభవించే ,గమనించే
కొత్త భావనల సమ్మేళనం.మనందరికి జీవితాన్ని మన పరిస్థితులకనుగుణంగా నడుపుకోగల
జ్ఞానం ఉంది.బహుశా దానిని క్లిష్ట పదార్థంగా పరిగణంచడం వల్లే అది బ్రహ్మ పదార్థం
అయినట్టుంది!!!
35) జీవితంలో మనిషి
పుట్టినప్పటినుండి ప్రతి దాని కోసం ఆరాటపడుతూ,పోరాడుతూ సాధిస్తూనే
ఉండటమే జీవితవిజయంగా భావిస్తూ ఆ రేసులో సాగుతూనే ఉంటాడు.కానీ ఏది శాశ్వతమన్నదానికి
సమాధానం మనలోని జ్ఞానజ్యోతి మాత్రమే.అన్ని తెలిసినవాడే మనిషి.అయినా ఆరాటాలు,తాపత్రయాలు తప్పనిసరి.అవి లేకపోతే జీవితంలో ఏం చేయని స్థితిలో
పిచ్చెక్కిపోతాడు మనిషి.ఈ రెండు మనఃస్థితుల పట్ల సమన్వయం వహించడం అంత సులభం
కాదు.అయినా ఆ పయనంలో సంపూర్ణమవ్వడం జీవితం.
36 ) సమానత్వ
సిద్ధాంతాలు కొంతమేరకు స్త్రీలను గందరగోళపరచినా మాట వాస్తవమే.ఆ ప్రక్రియలో
పురుషులలా ఉండాలనే ఆలోచనా శైలి కూడా పుంతలు తొక్కింది.ఆ క్రమంలో
సమానత్వం-అభ్యుదయానికి నిర్వచనం కొన్ని సార్లు బాధ్యతారాహిత్యంగా కూడా దారి
తీసింది.కానీ స్త్రీ అంటే మమతల కొలువు,అనురాగాల వల్లి వంటి
ఆభరణాలలో దిగేసే దేవతలా కాకుండా,ఆమె ఈ మార్పును
కోరుకుంటుందని గుర్తించి,ఆమెకు అవకాశం ఇచ్చి,ఆమె నిజంగా బాధ్యతను విస్మరిస్తే భర్తగా,బంధువుగా,నేస్తంగా సరిదిద్దే మగవాళ్ళు అరుదే.ప్రతి మార్పులో,ప్రతి
ప్రగతి నడకల్లో దుష్ప్రభావాలు వెల్లువెత్తినప్పుడు,అది
సమాజంలో సందిగ్ధత నింపకుండా సమన్వయ రీతిలో ఆలోచించి,బ్యాలెన్స్
ని నిలిపేవారు లోపించమే,ఇలా ప్రతి ప్రగతిలో నష్టాలకు,కష్టాలకు కారణమవుతుంది.కఠినమైన నిజమే అని ఒప్పుకోక తప్పదు.
* * *
Comments
Post a Comment