ఆధిపత్యం

 చదువరి

        ఆధిపత్యం

             -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



      సిడ్నీ షెల్డన్ నవలల్లో చదివింపజేసే స్పీడ్ ఉంటుంది. దానితో పాటు నవల మూలం మాత్రం ఏదో ఒక ఆలోచింపజేసే అంశం ఉంటుంది. హత్యా మిస్టరీల వెనుక మూలాలను ఎన్నుకోవడంలో సిడ్నీ షెల్డన్ కు విభిన్నత ఉంది. ఎప్పుడు ఒకే మూలం ఉండకుండా చూసుకోవడమే ఆ విశిష్టత. దాదాపు ఆయన నవలలన్నీ ఏదో ఒక హత్యను చేధించే వైపు పయనించినా సరే దానికి కారణాలు మాత్రం ఒకసారి యుద్ధం,ఇంకోసారి ప్రకృతి,మరోసారి అధికారం,ఇంకోసారి ఆవిష్కరణలు ఇలా పాఠకులను చదివింపజేసే మూలాలను ఎన్నుకుంటూనే వాటిని ఎంతో సాధారణంగా రాస్తూనే,అసాధారణ మలుపులతో  ఉంటాయి ఆ నవలలు. ప్రపంచవ్యాప్తంగా ఓ  సంస్థలో పని చేసే వారు హత్య చేయబడుతూ ఉంటారు.వారి హత్యల మిస్టరీని ఇద్దరు స్త్రీలు ఎలా ఛేదిస్తారు అన్న అంశంతో  సిడ్నీ షెల్డన్ రాసిన నవలే ‘Are  you afraid of the dark?’

          న్యూయార్కులో  రిచార్డ్ స్టీవెన్స్ ,పారిస్ లో మార్క్ హారిస్, బెర్లిన్ లో ఫ్రాంజ్  వెర్బ్రూగ్,డెన్వర్ లో గారి రేనాల్డ్స్  విచిత్ర పరిస్థితుల్లో మరణిస్తారు. అవి యాక్సిడెంట్స్ లా కనిపిస్తాయి. కానీ వీరు నలుగురు పని చేసే కంపెనీ ఒకటే. అదే కింగ్స్ లీ అంతర్జాతీయ సంస్థ.  వీరిలో రిచార్డ్ స్టీవెన్స్ భార్య డయానా స్టీవెన్స్ ఓ పెయింటర్. అలాగే  మార్క్ హారిస్ భార్య కెల్లీ ఓ మోడల్. వీరిలో ఒకరు ఈఫిల్ టవర్ మీద నుండి పడిపోతే,ఇంకొకరు డ్రగ్స్ మాఫియా తో సంబంధం ఉండి మరణించినట్టు అందరూ భావించేలా ఈ హత్యలు చేయబడతాయి. తన భర్త రిచార్డ్ కు గొప్పగా సెర్మని చేయాలనుకున్న  డయానాకు ఎప్పుడైతే తన భర్త శవాన్ని తనకు తెలియకుండానే  దహన సంస్కారాలు చేశారని తెలుస్తుందో అప్పుడే కాస్త అనుమానం వస్తుంది. ఆ తర్వాత డయానాను, కెల్లీని కింగ్స్ లీ సంస్థ అధినేత అయిన టానర్ కింగ్స్ లీ తనను కలవమని ఆహ్వానిస్తాడు. వారిద్దరు అక్కడికి వెళ్ళాక వారిద్దరితో విడిగా మాట్లాడి ఏదైనా అవసరం ఉంటే తనకు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చని తన బిజినెస్  కార్డ్ ఇస్తాడు. ఆ  మీటింగ్ తర్వాత డయానా,కెల్లీ కలుసుకుంటారు. తమ భర్తలను ఎవరో హత్య చేశారని,అది ఎలానో తెలుసుకోవాలని డయానా అన్నప్పుడూ కెల్లీ పెద్దగా ఆసక్తి చూపించదు.

      ఇక్కడ కెల్లీ,డయానా నేపథ్యాలను షెల్డన్ మనకు పరిచయం చేస్తాడు. డయానా ఓ మాఫియా లీడర్ ఓ హత్య చేయడాన్ని చూసి అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది. అక్కడ ఆమె గురించి మనకు అలా పరిచయం చేస్తాడు రచయిత. ఇక కెల్లీ గురించి మాత్రం ఆమె గతంతో పరిచయం చేస్తాడు. కెల్లీ తల్లి ఓ బొర్డింగ్ హౌస్ ను నడుపుతూ మగవారితో సంబంధాలు పెట్టుకుంటూ జీవితం గడుపుతూ ఉంటుంది. అలా ఆమె తల్లితో గడపడానికి వచ్చిన ఓ వ్యక్తి ఆమెను ఎనిమిదేళ్ళ వయసులో రేప్ చేయడంతో అప్పటి నుండి కెల్లీకి సెక్స్ అన్నా, చీకటి అన్నా  భయం. ఆ  తర్వాత ఆమె తల్లి ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. ఆ పెంపుడు తండ్రి ఎప్పుడు కెల్లీని ఏ విషయం లోనూ ప్రోత్సహించడు. తనకు సమయం దొరికినప్పుడల్లా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు చదువుతూ ఉంటుంది కెల్లీ. ఆ సమయంలో ఆమెకు లైబ్రెరియన్ మోడల్ అవ్వడానికి తగిన సమాచారం ఇస్తుంది.తల్లిదండ్రుల నుండి అలా వెళ్ళిపోయి ఆమె మోడల్ గా  ఎదుగుతుంది.

          ఇక  ప్రస్తుతానికి వస్తే ఆ తర్వాత నుండి కెల్లీ,డయానాలా మీద హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇద్దరు ఒకటై తమ ప్రాణాలు కాపాడుకునే  ప్రయత్నంలో ఎన్నో నిజాలు తెలుసుకుంటారు. తమ భర్తల లానే మరణించిన వారి వివరాలు కనుక్కుంటారు. ఇక కింగ్స్ లో కంపెనీ విషయానికి వస్తే టానర్ అన్న ఆండ్రూస్. ఆండ్రూస్ గొప్ప శాస్త్రవేత్త. తన తెలివితో  ప్రపంచంలో ఆకలిని అంతం చేయాలని ఎందరికో సేవ చేయాలని కింగ్స్ లీ గ్రూప్ ను తన తమ్ముడు  టానర్ తో మొదలుపెడతాడు. అన్న చేసే సేవా కార్యక్రమాలు టానర్ కు నచ్చవు. తమ కంపెనీను గొప్ప వ్యాపార సంస్థ చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆండ్రూస్ పరిశోధనలకు నోబుల్ ప్రైజ్ వస్తుంది. అదే సమయంలో మిలిటరీ ఆండ్రూస్ చేసిన పరిశోధనను ఉపయోగించి కొన్ని ప్రయోగాలు చేయడానికి టానర్ ను ఆహ్వానిస్తుంది. టానర్ ఆండ్రూస్ ను ఒప్పిస్తాడు. ఆ పరిశోధనలు జరుగుతున్న సమయంలో  ఆండ్రూస్ మాస్క్ కు రంధ్రం ఉండేలా చూస్తాడు టానర్. దాని వల్ల       పరిశోధనలో   జరిగిన ప్రమాదం వల్ల ఆండ్రూస్ కు మతి స్థిమితం తప్పుతుంది. దానితో అతనిలో జీనియస్  మరణిస్తాడు.ఇక  కంపెనీ  టానర్  ఆధిపత్యంలోకి వస్తుంది. అప్పటి  నుండి దానిని గొప్ప వ్యాపార సంస్థగా మారుస్తాడు. తాను ప్రేమించిన  పాలిన్ గొప్ప మీడియా టైకూన్ ను పెళ్ళి చేసుకుని సెనేటర్ గా కూడా ఎదుగుతుంది. ఆమెతో రహస్యంగా సంబంధం కొనసాగిస్తూనే తన కంపెనీ కూడా ఎదిగేలా చూసుకుంటాడు  టానర్. ప్రస్తుతం సెనేటర్ భర్త మరణించడంతో ఇక టానర్,ఆమె వివాహం చేసుకోవాలనుకుంటారు.

          వాతావరణాన్ని నియంత్రించే ప్రైమా ప్రాజెక్ట్ చేస్తున్న టానర్ దాని ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సృష్టించి వివిధ దేశాల్ని తన ఆధిపత్యంలో ఉంచుకోవాలనే పథకంతో ఇదంతా చేస్తూ ఉంటాడు. వాతావరణం మీద పరిశోధనలు చేస్తున్న ఎవరైనా సరే తారసపడితే  వారిని తన కంపెనీలోకి ఎక్కువ జీతంతో ఆహ్వానించడం,వారు తిరస్కరిస్తే వారిని హత్యలు చేయించడం చేస్తూ ఉంటాడు. ఆ విషయం చివరకు తెలుసుకున్న రిచార్డ్ ,మార్క్ ఈ  విషయాన్ని సెనేటర్ దృష్టికి తీసుకు వెళ్లాలనుకుంటారు. ఆ సాయంలోనే వారిని విభిన్న పరిస్థితుల్లో హత్యలు చేయిస్తాడు టానర్. ఈ విషయం తెలుసుకున్న  కెల్లీ,డయానా ఇవన్నీ సెనేటర్ కు తెలియజేయాలని వెళ్తే ఆమె వారిని టానర్ కు అప్పగిస్తుంది. ఆ సమయంలో వారిని హత్య చేయమని అప్పగిస్తే, ఆ సదరు హంతకుడు వారి మీద మోజు పడటంతో  అతని నుండి తెలివిగా ఇద్దరూ తప్పించుకుంటారు.

          అసలు ప్రైమా ప్రాజెక్ట్ గురించి ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచుతాడు టానర్. కానీ తప్పించుకున్న కెల్లీ,డయానా ఆ వార్తను మీడియా అందరికీ పంపి,దానిని టానర్ తరుపున ఆహ్వానంగా మలచడంతో ప్రైమా ను నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు టానర్. దానిని చూస్తూ సమయానికి రిమోట్ నొక్కమని చెప్పి తాను అప్పటికే ప్రైమా-2 రహస్యంగా ఫ్రాన్స్ లోని దీవుల్లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నుండి మళ్ళీ చేద్దామని పాలిన్ తో కలిసి ప్రైవేట్ ప్లేన్ లో పారిపోదామని బయల్దేరతాడు.అదే సమయంలో ప్రైమ్ ప్రాజెక్ట్ సాయంతో ఎక్కడైనా వాతావరణాన్ని నియంత్రించగల శక్తి ఉండటంతో ఆండ్రూస్ దానిని నాశనం చేసే ముందు వారెక్కిన ప్లేన్ దగ్గర మంచు కురిసేలా చేస్తాడు. దానితో ప్లేన్ క్రాష్ అయ్యి ఆ ఇద్దరూ మరణిస్తారు. ఆ తర్వాత ఆ బిల్డింగ్ నాశనం చేసే క్రమంలో ఆండ్రూస్ కూడా మరణిస్తాడు.

          ప్రకృతిని నియంత్రించి ప్రపంచాధిపత్యం పొందాలన్న ఆలోచనతో దాని మీద ఎందరో పరిశోధనలు చేశారు.కానీ నేటి వరకు అది పూర్తి స్థాయి లో సఫలీకృతం కాకపోవడం వల్ల దేశాల మధ్య ఈ మాత్రం సామరస్యం అయినా మిగిలి ఉంది.అదే లేకపోతే ఈ పాటికి ఆ ఆధిపత్యం పొందిన దేశం మిగిలినా దేశాలను పూర్తిగా తన బానిసలుగా మార్చుకునేది. అలాంటి పరిస్థితికి నేటి సాంకేతికత ఎదగకపోవడం మన అదృష్టమే.

                      *    *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ