నాటవుట్
సినీ సంచారం
నాటవుట్
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
మనిషి
ఎప్పుడు మరణిస్తాడు ?ఎన్నిసార్లు మరణిస్తాడు? భౌతికంగా ఒక్కసారే అన్నది సమాధానం అయినప్పటికీ మనిషి బ్రతికున్నంత కాలం
సంతోషంగా,జీవితం పట్ల ఆశతో ఉండనంత కాలం కూడా మరణంతో సమానమే . అలాంటి ఓ
కొడుకుని వృద్ధ్యాప్యంలో అతని తండ్రి ఎలా మారుస్తాడు? జీవితం
పట్ల ఆసక్తి ఎలా కలిగిస్తాడు? అన్న కథాంశంతో 2018 లో అమితాబ్
బచ్చన్, ఋషి కపూర్ లు ప్రధాన పాత్రలుగా వచ్చిన సినిమానే 102
నాటవుట్.
బాబు
(ఋషి కపూర్ )కి 75 ఏళ్ళు. అతని తండ్రి దత్తాత్రేయ(అమితాబ్ బచ్చన్ )కు 102 ఏళ్ళు.
బాబు ఎప్పుడు ప్రతి విషయానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ,వృద్ధాప్యం
వచ్చిందనే దిగులుతో,చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. అతని
తండ్రికి 102 ఏళ్ల వయసులో ఓ కోరిక కలుగుతుంది. చైనాలో 118 ఏళ్ళు బ్రతికిన ఓ
వ్యక్తి రికార్డు తాను బ్రేక్ చేయాలని నిర్ణయించుకుని, ఆ
విషయం తన కొడుకుకి చెప్తాడు.
అన్నేళ్లు
ఇంకా బ్రతకాలంటే తన చుట్టూ సంతోషకరమైన,ఆహ్లాదకరమైన వాతావరణం
ఉండాలని,బాబులా దిగులుగా ఉండే వారితో ఉంటే తాను ఆ రికార్డ్
బ్రేక్ చెయ్యలేనని చెప్తాడు. దానికి పరిష్కారంగా ఓ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కొడుకుని
చేర్పిస్తానని చెప్తాడు. దానికి ఇష్టపడని బాబు దాని నుండి తప్పించుకోవడం కోసం తండ్రి
చెప్పినట్టే చేస్తానని చెప్తాడు.
చనిపోయిన
బాబు భార్య అయిన చంద్రికకు ప్రేమలేఖ రాయడం మొదటి పనిగా ఇస్తాడు. తర్వాత పనిగా
మొక్కలు పెంచడం,ఆ తర్వాత పనిగా బాబు తన బాల్యంలో చదువుకున్న స్కూల్ కు
పంపడం,బాబు తన కొడుకైన అమోల్ తో కలిసి వెళ్ళే చర్చ్ కు
పంపించడం చేస్తాడు. తర్వాత బాబు ఎప్పుడు వెళ్ళే హాస్పటల్ కు రోజు అదే పనిగా
వెళ్లకుండా ఉండటం, బాబు తన 10 ఏళ్ల వయసు నుండి వాడుతున్న
దుప్పటిని మార్పించడం వంటివి చేస్తాడు. ఇవన్నీ కూడా బాబు కొత్తదనాన్ని,మార్పును జీవితంలో ఆహ్వానించేలా చేసే దృకోణాన్ని అతనిలో ఏర్పడేలా
చేస్తాడు.
బాబు
కొడుకు అమోల్. అతన్ని విదేశాలు పంపడం కోసం తాను సంపాదించినదంతా ఖర్చు చేస్తాడు
బాబు. కానీ విదేశాలకు వెళ్ళిన తర్వాత తన తండ్రిని గురించి అసలు పట్టించుకోడు
అమోల్.బాబు భార్య చంద్రిక అవసాన దశలో అల్జీమర్స్ తో ఉన్న సమయంలో కూడా అతన్ని
కలవరించినా ఆమెను కూడా చూడటానికి రాడు. ఆఖరికి ఆమె మరణించినా రాడు.
అమోల్
మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న తన కొడుకుని చూసిన దత్తాత్రేయ తన కొడుకుకి నిజం మరింత
స్పష్టం చేయడానికి అప్పటి వరకు రాని కొడుకు ఆస్తి కోసం ఎలా వస్తాడో ఓ ఫోన్ కాల్
ద్వారా నిరూపిస్తాడు. తర్వాతి టాస్క్ గా అమోల్ రాగానే అతన్ని వెనక్కి తిరిగి
పంపించేయాలని చెప్తాడు దత్తాత్రేయ. కానీ తన కొడుకుని తాను వదులుకోనని స్పష్టం చేసి,
ఆ ఇల్లు తన తాత నుండి తండ్రికి, ఆ తర్వాత తండ్రి నుండి తనకు
వస్తుంది కనుక తనకు వచ్చేది తన కొడుక్కి ఇస్తానని అందుకు ఒప్పుకోకపోతే తండ్రి మీద
కోర్టులో కేసు వేస్తానని హెచ్చరిస్తాడు బాబు.
ఆ
సమయంలో తనకు ఉన్న బ్రెయిన్ ట్యూమర్ గురించి చెప్తాడు దత్తాత్రేయ. తాను మరణించేలోపు
తన కొడుకుని సంతోషం గా ఉండేలా చేయాలనుకుని చేశానని చెప్తాడు. తన కొడుకు గురించి
మళ్ళీ ఆలోచించుకుంటాడు బాబు. కేవలం ఆస్తి కోసం తప్ప దేని కోసం అతను రాడని
అర్ధమవుతుంది బాబుకు. అతన్ని ఎయిర్ పోర్టు నుండే తిరిగి వెళ్ళిపోమ్మని
చెప్తాడు బాబు. ఆ తర్వాత కొంత కాలానికి దత్తాత్రేయ మరణిస్తాడు. కానీ తండ్రి
మరణించినా తండ్రి అందించిన స్పూర్తి మాత్రం అతనితో ఉండిపోతుంది అన్న సందేశంతో సినిమా ముగుస్తుంది.
* * *

Comments
Post a Comment