భార్య ప్రేమికుడు
చదువరి
భార్య ప్రేమికుడు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
19 వ
శతాబ్దపు రచయిత అయిన డి.హెచ్.లారెన్స్ తన నవలలైన సన్స్ &లవర్స్, రెయిన్ బో,ద లేడి
చాటర్లీస్ లవర్ వంటి నవలలతో సంచలన రచయితగా మారారు. ఆయన రచనల్లో స్త్రీ-పురుషుల
మధ్య ఉండే లైంగిక భేధాలు,వారి కోరికల్లో ఉండే వ్యత్యాసాలు, వారి భావోద్వేగ ఆరోగ్యం,మనిషి తన మనసులో దాచుకున్న
ఎన్నో భావాలను నిర్భయంగా బయటపెట్టే పాత్రలను తన నవలల్లో చిత్రీకరించారు.ఆయన రచనలకు
ఏనాడూ దక్కాల్సిన గౌరవం అయితే దక్కలేదు.
ఆయన చనిపోయాక కూడా ఆయనను ఓ పొర్నోగ్రాఫర్ గా తన సామర్ధ్యాలను వ్యర్ధం చేసుకున్నా
వ్యక్తిగా భావించిన వారే ఎక్కువ. కానీ తర్వాత ఆయన నవలలకు ప్రాముఖ్యత
పెరిగింది.నేటి ఆధునిక యుగంలో అయినా నాటి కాలంలో అయినా మనిషి లైంగికత గురించి
అభిప్రాయాలను స్వచ్చందంగా వెలిబుచ్చడాన్ని ఆమోదించే సంస్కృతి అయితే లేదు. ఆయన
నవలల్లో ఎంతో వ్యతిరేకతను పొందిన నవల ‘ద లేడి చాటర్లీస్ లవర్.’2015
లో ఈ నవల సినిమాగా కూడా వచ్చింది.
ఈ నవలలో కథానాయిక అయిన కోని పెరిగిన వాతావరణంలో ఎంతో స్వేచ్చ ఉంది. ఆమె,ఆమె అక్క హిల్డా ఇద్దరు పెళ్ళికి ముందే తమ వయసు వారితో తాత్కాలిక సంబంధం
కలిగి ఉన్నారు. వారిద్దరికి అదేమీ ప్రధాన అంశంగా అనిపించలేదు. తర్వాత వారిని
పట్టించుకోలేదు కూడా. 1917 లో 23 ఏళ్ళ వయసులో కులీన వర్గానికి (అరిస్టోక్రాటిక్ )
చెందిన క్లిఫర్డ్ చాటర్లిని వివాహం చేసుకుంటుంది. వివాహమైన నెల తర్వాత యుద్ధానికి
వెళ్ళిన క్లిఫర్డ్ యుద్ధంలో తన పొట్ట కింది భాగం నుండి శరీరం అంతా చచ్చుబడి తిరిగి
వస్తాడు.
వ్రాగ్
బై లోని తమ రాజరిక కోటలో క్లిఫర్డ్ ,భార్యా,సేవకులతో ఉంటాడు. ఆ సమయంలో అతను రచయితగా మారతాడు. వ్రాగ్ బై చుట్టుపక్కల
అంతా కూడా బొగ్గు తవ్వకాలు ఎక్కువ.వాటికి తరతరాలుగా క్లిఫర్డ్ వంశం అధికారులుగా
వ్యవహరిస్తూ ఉంది. క్లిఫర్డ్ రచయితగా మారాక ఎంతో మంది మేధావులు ఆ కోటకు వచ్చి తమ
అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. వారిని చూశాక కోనికి మగవాళ్ళు ఎవరు కూడా తమ
మనుసులో ఉండేది బయటపెట్టరని అనుకుంటూ ఉంటుంది.క్రమక్రమంగా క్లిఫర్డ్ ,కోని ల మధ్య అగాధం ఏర్పడుతూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మైఖేల్
అనే నటుడితో ఆమె సంబంధం పెట్టుకున్నా పెళ్లి మాట ఎత్తేసరికి అతను ఆమెను కావాలనే
మానసికంగా గాయపరుస్తాడు. ఆ ఉదంతం తరవాత కోని అనారోగ్యానికి గురవుతుంది. ఆమెను
వైద్యులకు చూపించడానికి,ఆమెకు వాతావరణంలో మార్పు
తీసుకురావడానికి క్లిఫర్డ్ కు బోల్టన్ అనే మధ్యవయసు నర్సును ఏర్పాటు చేసి హిల్డా
కోనిని తనతో పాటు తీసుకువెళ్తుంది.కొన్ని రోజులు అక్కడ గడిపి తిరిగి వస్తుంది
కోని.
కోని తిరిగి వచ్చాక కూడా క్లిఫర్డ్ కు ఆమెకు మధ్య
ఉన్న అగాధం పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు కోని మీద ఎక్కువ ఆధారపడే క్లిఫర్డ్
ఇప్పుడు బోల్టన్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటాడు. అదే సమయంలో క్లిఫర్డ్ ఎస్టేట్ కు గేమ్
కీపర్ గా మెల్లర్ వస్తాడు.అతని పట్ల క్రమక్రమంగా ఆకర్షితురాలవుతూ ఉంటుంది కోని.
అతన్ని కొన్ని సార్లు ఇష్టపడకుండా,కొన్ని సార్లు ఇష్టపడుతూనే
అతనితో సంబంధం పెట్టుకుంటుంది కోని.
క్లిఫర్డ్
తనకు కొడుకు పుడితే బావుంటుందని,కానీ ఆ బిడ్డ ఎవరికి పుట్టినా తమ మధ్య
ప్రేమకు అడ్డు రానంతవరకు తనకు సమ్మతమేనని చెప్తాడు. ఆ తర్వాత క్లిఫర్డ్ సంతాన
పరంగా అసక్తుడవ్వడం వలన తన ఆధిపత్యాన్ని ఆ ప్రాంతంపై చూపించడానికి ప్రయత్నాలు
ప్రారంభిస్తాడు. అక్కడ ఉన్న బొగ్గు గనులన్నీ తవ్వించి వాటి ద్వారా విద్యుత్ శక్తి
ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకుంటాడు.
మెల్లర్
సైన్యంలో పని చేసి వచ్చినవాడు. అతని మొదటి భార్య ఇంకొకరితో సంబంధం పెట్టుకుని
అతన్ని వదిలేస్తుంది. కోని అడిగిన మీదట అతను తన వైవాహిక జీవితం గురించి కూడా ఆమెతో
చెప్తాడు. మెల్లర్ తన భార్య ఫోటోను కోని ముందే అగ్నిలో కాల్చేస్తాడు. కోని చెప్పిన
మీదట ఆమెకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు మెల్లర్. ఆ తర్వాత అతని ద్వారా
బిడ్డను కనాలని నిర్ణయించుకుంటుంది కోని. క్లిఫర్డ్ మనసులో తన కన్నా తక్కువ వర్గాల
పట్ల సదాభిప్రాయం లేకపోవడం వల్ల ఓ హాలీడే ట్రిప్ కి వెనిస్ వెళ్ళి అక్కడ ఎవరితోనే
కన్నట్టు భర్తను నమ్మించాలని నిర్ణయించుకుంటుంది.అలా హిల్డాతో కలిసి వెనిస్
వెళ్తుంది కోని.
ఆమె
అక్కడ ఉన్నప్పుడూ మెల్లర్ భార్య తిరిగి వస్తుంది.తాను అతనికి విడాకులు ఇవ్వనని
స్పష్టం చేస్తుంది. దానితో పాటు అతను ఉండే కాటేజీలో ఓ స్త్రీ పెర్ఫ్యూమ్ ఉండటంతో
అతను ఓ స్త్రీతో సంబంధం కూడా పెట్టుకున్నాడని ఆమె ప్రచారం చేస్తుంది. ఆ కాటేజీలో ఓ
పుస్తకం కోని పేరు మీద ఉంటుంది. మెల్లర్ కు ఆమెతో కూడా సంబంధం ఉందని ఆమె ప్రచారం
చెయ్యడంతో మెల్లర్ ను ఉద్యోగంలో నుంచి తీసేస్తాడు క్లిఫర్డ్. దానితో పాటు అతని
భార్య పట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని
నిర్ణయించుకుంటాడు.ఆ విషయం తెలిసిన ఆమె అక్కడ నుండి పరారవుతుంది.
వెనిస్
లో ఉన్న కోనికు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. ఆమె క్లిఫర్డ్ నుండి విడాకులు కోరుతూ
ఉత్తరం రాస్తుంది. కానీ క్లిఫర్డ్ మాత్రం తన దగ్గరకు వచ్చి మాట్లాడితే తప్ప ఏది
తేల్చలేనని స్పష్టం చెయ్యడంతో అక్క హిల్డాతో కలిసి అక్కడికి తిరిగి వెళ్తుంది.
క్లిఫర్డ్ కు తాను మెల్లర్ వల్ల గర్భవతిని అయ్యానని చెప్తుంది కోని. క్లిఫర్డ్
ఆమెకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తాడు. అతన్ని వదిలేస్తుంది కోని.
కోని
తన అక్కతో కలిసి ఉంటుంది. మెల్లర్ ఓఫార్మ్ లో పని చేత్శు విడాకుల గురించి ఎదురు
చూస్తూ ఉంటాడు. ఇద్దరు త్వరలో కలుసుకోబోతామన్న ఆశతో ఉండటంతో నవల ముగుస్తుంది.
ఈ
నవలలో స్త్రీ-పురుషుల మధ్య సెక్స్ వారి జీవితాలను,భావోద్వేగాలను ఎలా ప్రభావితం
చేస్తుంది అన్న అంశంతో పాటు మనుషుల ఆలోచనల్లో గొప్పదనం ఎంత వరకు పరిమితం వంటి ఎన్నో
అంశాలు వాదనలుగా మలచబడ్డాయి.ఈ నవల నిషేధానికి కారణం ఈ నవలలోని పాత్రలన్నీ కూడా తమ లైంగికత
పట్ల ఓ భావాన్ని కలిగి, వాటిని స్వేచ్చగా వెలిబుచ్చే అధికారం
ఉండడం వల్లే అనుకుంటా. నేటి ఆధునిక యుగంలో ఇదే నవలను మనో విశ్లేషణ నవలగా దర్శించవచ్చు.ఏ
దేశమైనా సరే స్త్రీ తన జీవితంలో లైంగిక స్వేచ్చను ఆశిస్తే ఆమెను ఆమెను ఆమోదించే సంస్కృతి
విదేశాల్లో కూడా అప్పుడు లేదని ఇటువంటి నవలలు స్పష్టం చేస్తాయి. ఇది సమకాలీన అంశమైనప్పటికీ
కూడా నాడు లేని బావ పరిధి నేడు ఉండటం వల్ల ఈ నవల తర్వాత ప్రసిద్ధి పొందింది.
* * *

Comments
Post a Comment