వెంటాడిన నేరం
చదువరి
వెంటాడిన నేరం
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
కొమ్మూరి
సాంబశివరావు గారి రచనల్లో అన్నీ దాదాపు అపరాధపరిశోధక నవలలే. ప్రతి నవలలో ఒక్కో
హత్యా మూలంతో కథను అతి తక్కువ పేజీల్లో ఎంతో వేగంగా నవలను నడిపిస్తూ ఉంటారు.
తెలుగు సాహిత్యం చదవాలని అనుకునేవారు మొదట ఆసక్తిని పెంచుకోవడం కోసం తప్పకుండా
కొమ్మూరి సాంబశివరావుగారి నవలలు చదవాల్సిందే. ఆయన నవలల్లో ‘నక్కి
దాక్కుంది’ లో ఓ హత్యా నేరాన్ని చూసిన అమ్మాయి జీవితం ఎన్ని
మలుపులు తిరిగిందో అన్న అంశాన్ని ఎంతో ఆసక్తికరంగా రాశారు.
గణేశన్ ఓ దొంగసారా రవాణా,జూదం
వంటి అక్రమమైన వ్యాపారాలు చేస్తూ ఉంటాడు.అతనికి తన రౌడీల బృందం కూడా ఉంది. గణేశన్ దగ్గర నల్లతంబి పని చేస్తూ ఉండేవాడు. నల్లతంబి ఓ సారి గణేశన్
దగ్గర చేస్తున్న దొంగసారా రవాణాలో పట్టుబడి జైలుకు వెళ్తాడు. ఆ సమయంలో అతని భార్య
జలజతో గణేశన్ సంబంధం పెట్టుకుంటాడు. డబ్బు,చీరలు,విలాసాలు బాగా ఉండటంతో గణేశన్ చూడటానికి బాగుండకపోయినా,అనుమానంతో హింసించినా అతనితోనే ఉంటుంది జలజ. నల్లతంబి జైలు నుండి
విడుదలయ్యాక కూడా జలజ దగ్గరకు రాడు. గణేశన్ దానికి కారణం అని జలజకు కూడా తెలుసు.
గణేశన్ కుడిభుజం
జనార్ధన్, ఎడమ భుజం గణేశన్ తమ్ముడు రాఘవన్. జలజ
రెండేళ్ళు గణేశన్ తో ఉన్నాక విలాసాల మీద
ఆసక్తి పోయి స్వేచ్చగా బ్రతకాలన్నా అలా చేస్తే చంపేస్తానని
గణేశన్ హెచ్చరిస్తాడు.అదే సమయంలో
జనార్ధన్,జలజ పరస్పర ఆకర్షితులవ్వడంతో జనార్ధన్ తో కలిసి
విడిగా కాపురం పెడుతుంది జలజ. అప్పటివరకూ ఒకే జట్టుగా ఉన్న గణేశన్,జనార్ధన్ దీనితో
బద్ధవిరోధులవుతారు. ఓసారి జలజతో జనార్ధన్ సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో గణేశన్ వారిద్దరిని కాల్చి చంపేస్తాడు. ఆ
హత్యను సులోచన అనే 20 ఏళ్ళ అమ్మాయి చూస్తుంది.
సులోచన
ఓ ప్రైవేట్ కంపెనీలో టైపిస్ట్. తల్లి
లేదు. తండ్రి శేషగిరి. తర్వాత సులోచన ఈ హత్య చూసిన విషయాన్ని ధైర్యంగా సాక్ష్యం
చెప్పడంతో గణేశన్ కు ఉరి శిక్ష పడుతుంది. దానితో కోర్టులోనే సులోచనను చంపుతానని
శపథం చేస్తాడు గణేశన్. నల్లతంబి, రాఘవన్ గణేశన్ సంపాదించిన సొమ్ము ఎక్కడ ఉంచాడు ?ఎలా
సొంతం చేసుకోవాలి? అని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో జైలు
నుండి విడుదలైన మునుస్వామి గణేశన్ తనను పంపాడని, సులోచనను
చంపితే ఆ డబ్బు వారికి దక్కేలా చేస్తానని చెప్పమన్నాడని చెప్తాడు.
ఆ
డబ్బు కోసం సులోచనను చంపడానికి పథకం వేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ. సులోచన రోడ్డు
దాటుతున్న సమయంలో వెనుక నుండి తోసినా, ఎవరో పెద్దాయన కాపాడతాడు.
ఇంటికి వచ్చి బయట నుండి కత్తి చూసిన సులోచన అరవడంతో అక్కడికి హత్య చేయడానికి
వచ్చిన వారు పరారవుతారు. సులోచన జరిగినవి పోలీసులకు చెప్పడంతో ఆమెకు రక్షణ ఏర్పాటు
చేస్తారు. ఓ రోజు నల్లతంబి,రాఘవన్ పథకం ప్రకారం సులోచన
ఆఫీసుకు ఆమె తండ్రి హాస్పటల్ లో ఉన్నాడని కాల్ చేయించడంతో కంగారులో రక్షణగా ఉన్న పోలీసులకు కూడా చెప్పడం
మర్చిపోయి ఆమె ఆగి ఉన్న టాక్సీ లో వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్న నల్లతంబి, రాఘవన్ ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించబోతుంటే రిటైర్డ్ ఇన్స్పెక్టర్ అటువైపు రావడంతో సులోచన అక్కడి నుండి
బయటపడగలుగుతుంది. తర్వాత పోలీసు రక్షణపై నమ్మకం కోల్పోయిన సులోచన తన ఆఫీసులో మాట్లాడి బెంగుళూరు బ్రాంచికి బదిలీ చేయించుకుని ఒక్క తండ్రికి తప్ప
ఇంకెవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది.
ఆఫీసులో
ఎంత ప్రయత్నించినా సులోచన ఎక్కడికి వెళ్ళింది తెలియకపోవడంతో ఓ రిజిస్టర్డ్ పోస్టు ఆమె పేరున నల్ల తంబి
బృందం పంపిస్తారు. ఆ పోస్ట్ మాన్ తెలిసిన వాడే కావడం వల్ల ఆమె బెంగుళూరు అడ్రస్
ఇచ్చి రిడైరెక్ట్ చేయమని ఆమె తండ్రి చెప్తాడు. ఆ తర్వాత పోస్ట్ మాన్ కు మత్తుమందు
ఇచ్చి ఆ అడ్రస్ తీసుకుంటారు. ఆ రిజిస్టర్డ్ పోస్టులో తండ్రి మరుసటి రోజు బెంగుళూరు
వస్తున్నట్టు సమాచారం ఇస్తారు. అది అందిన వెంటనే హాస్టల్ లో ఉంటున్న సులోచన
హాస్టల్ వ్యాన్ లో మరుసటి రోజు తండ్రిని తీసుకురావడానికి బయల్దేరుతుంది. అదే
సమయంలో నల్లతంబి మెల్లగా డ్రైవర్ ను మాటల్లో పెట్టి వ్యాన్ ఎక్కుతాడు. ఆ డ్రైవర్ ఆ ప్రమాదాన్ని
గ్రహించి ఆమెను కాపాడతాడు. అలా ఆ ఆపద నుండి కూడా బయటపడుతుంది సులోచన.
ఈ అపాయం నుండి తప్పించుకోవడానికి పెళ్ళొక్కటే
మార్గమని భావించిన సులోచన పేపర్లో వచ్చిన ప్రకటన చూసి రెండో పెళ్ళి వాడైన
గోవర్ధనాన్ని పెళ్ళి చేసుకుని సిరిమంగళం అనే పల్లెటూరికి వెళ్ళిపోతుంది.
అనుమానస్థుడు,వ్యసనపరుడు అయిన
గోవర్ధనం శారీరకంగా సులోచనను హింసిస్తూ ఉంటాడు.
ఆ ఊర్లో హోటలు నడుపుతున్న రామయ్య వార్తల
ద్వారా ఆమె రహస్యాన్ని తెలుసుకుని, తనకు లొంగిపొమ్మని
లేకపోతే ఆమె భర్తకు చెప్తానని బెదిరిస్తూ ఉంటాడు.
ఆ
ఊర్లో ఉండే శ్రీకాంత్ (డాక్టర్ ) ని చూడగానే సులోచన ఇష్టపడుతుంది. నల్లతంబి,రాఘవన్
శేషగిరి దగ్గరకు వెళ్ళి అతన్ని హత్య చేసి సులోచన పంపిన ఉత్తరం ద్వారా ఆమెను
చంపడానికి వేషాలు మార్చుకుని బయల్దేరతారు. దానితో పోలీసులు అలర్ట్ అవుతారు.
వారిద్దరిని పట్టుకోవడానికి పోలీసులు వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో దార్లో
కనిపించిన నల్లటంబిని ఓ పోలీస్ ఆఫీసర్ కాల్చేస్తాడు.ఇక రాఘవన్ ఒకక్దే బయల్దేరతాడు.
రైలు దిగి దాక్కుని వెళ్తూ ఉంటాడు.సినీ నటులైన అమరేంద్ర,భారతిలను
కార్ లిఫ్ట్ అడిగి, రామయ్య హోటల్ దగ్గర దిగి,సులోచన గురించి వాకబు చేస్తారు. ఈ లోపు అక్కడికి
ఇంకో సినీ జంట కూడా వస్తుంది. వారందరినీ బెదిరించి తానే రాఘవన్ అని కూడా చెప్తాడు.
అంతకుముందు
రాత్రే గోవర్ధన్ తో విసిగిపోయిన సులోచన శ్రీకాంత్ దగ్గరకు వెళ్ళి అతనికి
జరిగినదంతా చెప్తుంది. అప్పటికే ఓ తూటా దిగిన రాఘవన్ అమరేంద్రను శ్రీకాంత్ కోసం
పంపిస్తాడు,ఒకవేళ అతను ఎదురుతిరిగితే భారతిని చంపేస్తానని
హెచ్చరించి. అక్కడికి వచ్చిన శ్రీకాంత్ సులోచనను కాపాడే మార్గం గురించి ఆలోచిస్తూ
ఉంటాడు. ఈ లోపు పోలీసులు రక్షణ కోసం వస్తారు. మొత్తానికి శ్రీకాంత్ చాకచక్యం వల్ల
సులోచన ఆ ప్రమాదం నుండి బయటపడుతుంది. రాఘవన్ మీద విచారణ మొదలవుతుంది.అప్పటికే
గణేశన్ ను ఉరి తీస్తారు. శ్రీకాంత్,సులోచనలు భార్యాభర్తలుగా
మారతారు.
కథలో
ఉన్న మలుపులు నవలను చదివింపజేస్తాయి.ఆంగ్లంలో ఉన్న ఎన్నో డిటెక్టివ్ నవలల శైలి వీటిల్లో
కనిపించినా చదివింపజేసే నవలలు ఎన్నో రాసిన ఘనత కొమ్మూరి సాంబశివరావు గారిది. ముఖ్యంగా
తెలుగులో అపరాధ పరిశోధక నవలల పట్ల ఆసక్తి ఉన్నవారు తప్పక చదవాల్సిన రచయిత ఆయన.
*
* *

Comments
Post a Comment