తప్పు వర్సస్ తప్పు

 చదువరి

తప్పు వర్సస్ తప్పు

     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          ప్రతి మనిషి తప్పు చేయడానికి వెనుక ఎన్నో కారణాలు,పరిస్థితులు ఉంటాయి.అలాగే మనిషికి తాను చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతూనే ఉంటాయి. తప్పు చేయకుండా తనను తానే శిక్షించుకుంటున్న పరిస్థితి లో ఉన్న తన భార్యను ఓ తప్పు స్వచ్చందంగా చేసే స్త్రీ జీవితాన్ని ఉదాహరణగా చూపి ఎలా ఆమెలో అపరాధభావాన్ని పోగొట్టాడు అన్నదే వసుంధర గారి ఆడపడచునవల.

          భానుప్రకాష్ కంపెనీలో ఓ ఉద్యోగి గౌతమ్,అతని భార్య ముక్త. వారిది మధ్యతరగతి జీవితం. ముక్తకు చాలా వైభ్వంగా ఉండాలనే కోరిక. భానుప్రకాష్ భార్య సంధ్య. ఆమె చిన్నతనంలో  బావ పెళ్ళి చేసుకుంటానంటే లొంగిపోతుంది. అతను పెళ్ళి చేసుకోడు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న  సంధ్యను వాళ్ళింట్లో అద్దెకుంటున్న భానుప్రకాష్ అర్ధం చేసుకుని వివాహం చేసుకుంటాడు.

          అయినా సంధ్యలో తప్పు చేశాననే అపరాధ భావం తొలిగిపోదు. అప్పుడు భానుప్రకాష్ తెలిసీ తెలియని వయసులో జరిగిన సంఘటనకు కుమిలిపోతున్న ఆమెతో హోదా,వైభవం కోసం కావాలని అలా చేసే స్త్రీలు ఉన్నారని నిరూపిస్తే అపరాధ భావం తొలగించుకుంటావా అని అడిగిన భర్తతో సరేనంటుంది. దానికి ఆమె ముక్తాను ఎన్నుకుంటుంది.

          భర్త చెప్పినట్టే  మొదట్లో ముక్త భాను ప్రకాష్ తో సంబంధం పెట్టుకోవడానికి సిద్ధపడకపోయినా భర్త పదోన్నతుల కోసం సిద్ధపడుతుంది. అంతకుముందు అదే ముక్త ఓ పేరంటానికి  సంధ్య దగ్గరకు వచ్చిన పావనిని  ఛీదరించుకుంటుంది. పావని పెళ్ళి కాకముందే గర్భవతి అవుతుంది. ఆమెకు అబార్షన్ చేయించిన డాక్టరే  ఆమెను అర్ధం చేసుకుని వివాహం చేసుకుంటాడు. తర్వాత ముందు ఆమెను మోసం చేసిన వ్యక్తి రేప్ చేయబోతే పోలీస్ కంప్లెయింట్ ఇస్తుంది. అలా ముక్త ద్వారా భార్య పడుతున్న మనఃక్షోభను పోగొడతాడు భానుప్రకాష్. ముక్త తనకు ఆడపడచే (ఆడతనం+పడచుదనం) అని ఆమె కోసం నటించానని చెప్తాడు భానుప్రకాష్.

          ఈ నవల చిన్నదే కానీ మనిషిలో ఉండే అపరాధభావం మనఃసాక్షికి సంబంధించినదే తప్ప బాహ్య ప్రపంచంలో దానికి పెద్ద ప్రాముఖ్యత లేదని స్పష్టం చేస్తూనే,ఏ మనిషి అయినా తప్పు చేశాను అని అనుకుంటే అది అతనికి తప్పుగా మారుతుందే తప్ప పరిస్థితులకు లోబడి లొంగిపోయే వ్యక్తి తప్పుల్ని కూడా తేలికగానే తీసుకుంటాడని,అపరాధభావం వల్ల జీవితంలో సంతోషం నాశనం అవుతుంది తప్ప పరిష్కారం కాదనే అంతర్లీన అంశాన్ని ఎంతో చక్కటి అంశంగా రాశారు వసుంధరగారు.ఈ వినూత్న నవల మనిషిలో అంతర్ముఖంగా ఉన్న ఎన్నో కోణాలను మనకు పరిచయం చేస్తుంది.

     *    *    *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ