ఎవరిది మోసం ?

 చదువరి

ఎవరిది మోసం ?

       -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


                    పోల్కంపల్లి శాంతాదేవి గారి నవలల్లో జీవన సహచరి మనుషులలో అంతర్లీనంగా ఉండే ఆకర్షణలు, నిజమైన ప్రేమను కొందరు అన్వేషిస్తే ఇంకొందరు సౌఖ్యాలను అన్వేషిస్తూ ప్రేమను కోల్పోయి,సంతోషాన్ని కోల్పోయి జీవితాన్ని ఎలా దిగజార్చుకుంటారో,కానీ వారిని ప్రేమించిన వారు మాత్రం వారి పట్ల ఎటువంటి ఉదాత్తతను కలిగి ఉంటారో స్పష్టం చేస్తుంది.

          పుష్ప ఓ పల్లెటూరిలోని కంసాలి కూతురు. రోజు ఎదురు మేడలో ఉండే పూలు పూజ కోసం కోసుకుంటూ ఉంటుంది,ఆ తోటమాలి అనుమతితో. ఆ ఇంటి యజమాని,భార్య,కొడుకు వస్తారు. పూల కోసం వెళ్ళిన పుష్ప అక్కడ జమీందారు కొడుకు రజనీకాంత్ తో  ప్రేమలో పడి, ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు. వారి వివాహానికి జమిందారి కుటుంబం ఒప్పుకోదు. తను స్వంతంగా ఓ ఉద్యోగం సాధించి వచ్చి ఆమెను తీసుకువెళ్తానని  పుష్ప తండ్రికి హామీ ఇచ్చి వెళ్తాడు. ఆ హామీ వల్ల ఆమెకు వేరే వివాహం చేయడు ఆమె తండ్రి.

          నెలలు గడుస్తున్నా అతను తిరిగి రాడు. అప్పటికే గర్భవతి అయిన పుష్పకు ఆమె తండ్రి అబార్షన్ చేయిస్తాడు. అప్పుడు రజనీ తిరిగి వస్తాడు.అప్పటికే అది పల్లెటూరు అవ్వడం వల్ల తను రాసిన ఉత్తరం వారికి అందలేదని అర్ధమవుతుంది. ఇంకో పల్లెటూరిలో టీచరుగా ఉద్యోగం సంపాదిస్తాడు రజనీ. పుష్పతో సహా అక్కడికి వెళ్తాడు. జమిందారిణిగా ఐశ్వర్యం అనుభవించవచ్చని ఆశపడిన పుష్పకు ఈ జీవితం నచ్చదు.

          వారికి ఎదురింట్లో ఉండే జమీందారు ఇంట్లో వారితో పుష్పా గడుపుతూ ఉంటుంది. వాళ్ళ కొడుకు వెంగల్రావుకు వివాహమైనా అతని భార్య పుట్టింట్లోనే ఉంటుంది. పుష్పకు అతను చీరలు తెచ్చిస్తాడు. తన భార్యకు విడకులిచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు. ఒప్పుకుంటుంది పుష్ప. వారి మాటలు రజనీ కూడా వింటాడు.

          తర్వాత  రజనీ తల్లి ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. అయినా వెళ్ళడు అతను. దానితో పుష్ప చిర్రుబుర్రులాడుతుంది. దానితో ఆమెకు దూరంగా వేరే ఊరికి బదిలీ చేయించుకుని వెళ్ళిపోతాడు అతను. అతను లేకపోతే వెంగల్రావు ఉన్నాడనుకుంటుంది పుష్ప.

          తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్తాడు రజనీ. తమ వ్యాపారం చూసుకోమని చెప్తే తండ్రి పూర్తి విశ్రాంతి తీసుకునేవరకు ఉద్యోగం చేస్తానని చెప్తాడు. అతని ఉద్యోగ జీవితంలో కొలీగ్ అయిన సుధ అతన్ని ప్రేమిస్తుంది. అతని గతం గురించి చెప్పినా అతని నిరాడంబరత్వాన్ని ఇష్టపడుతుంది ఆమె. రజనీ తల్లిదండ్రులు కూడా ఈ వివాహానికి ఒప్పుకుంటారు. అప్పుడు రజనీ ఆమెను ఓ కోరిక కోరతాడు. పుష్పకు వయసు ఉన్నంతకాలం బాగానే ఉంటుందని, తర్వాత వృద్ధాప్యంలో ఆమె ఎదురైతే,ఆమెకు మనిషిగా ఆశ్రయం ఇవ్వాలని. దానికి సుధ సంతోషంగా  ఒప్పుకుంటుంది.

          జీవితంలో ప్రేమ కథల్లో అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేయటం అన్నది కనిపించే విషయం. కానీ నిజమైన కపటం మనిషి కోరికల్లో ఉంటుంది. ఈ నవలలో పుష్ప పాత్ర అటువంటిదే.ఆమె పెరిగింది పేద కుటుంబంలో,రజనీ కాంత్ పుట్టింది ఐశ్వర్యంలో. ఆ ఐశ్వర్యాన్ని తన ప్రేమ,వ్యక్తిత్వం కోసం రజనీ వదులుకోగలిగినా ఆ సౌఖ్యాలను ఆశించిన  పుష్ప మాత్రం వాటి మీద వ్యామోహంతో భర్తనే వదులుకోగలిగింది. మనిషి మనసులో ఉండే కోరికలే మనిషిని ఇంకో మనిషికి మోసం చేసేలా చేస్తాయి. ప్రలోభాలే ముఖ్య కారణం తప్ప,అంతస్థులు కాదు అన్న విషయం ఈ నవలలో అంతర్లీన అంశంగా ఉంది. జీవితం ఎటువంటిదైనా ఊహల్లో నుండి వాస్తవానికి రాకపోతే ఆ భ్రమలే ఆ మనిషిని శలభంలా మాడ్చేస్తాయని ఇది స్పష్టం చేస్తుంది.

   *    *    *

 

 

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ