ఏ దారి ?
చదువరి
ఏ దారి ?
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
వాసిరెడ్డి
సీతాదేవి గారి నవలల్లో నిషేధానికి గురైన నవల మరీచిక. సమాజంలోని అసమానతల పట్ల,మనుషుల
మనుసుల్లో ఉండే హిపోక్రసీ పట్ల విముఖత ఏర్పరచుకున్న ధనవంతుల కుటుంబానికి చెందిన ఇద్దరు
అమ్మాయిలు సమాజం వ్యతిరేకించే రెండు మార్గాలు ఎంచుకోవడం వల్ల వారి జీవితాలు చివరకు
ఏమయ్యాయి అనే అంశమే ఈ నవల.
జ్యోతి,శబరి
ధనవంతుల పిల్లలు. సమాజంలో ఉన్న హిపోక్రసీ,అసమానతలు ఇద్దరికి
నచ్చవు. దీని నుండి బయటపడటానికి శబరి హిప్పీ సంస్కృతిని ఎన్నుకుంటుంది. డ్రగ్స్ కు
బానిసై,తల్లిదండ్రులకు తాను చనిపోతున్నట్టు ఉత్తరం రాసి
మిగిలిన హిప్పీలతో కలిసి వెళ్ళిపోతుంది. డ్రగ్స్ ,ఓపెన్
సెక్స్ కూడా సమాజం నుండి పారిపోవడమే అని శబరికి అనిపిస్తుంది. అనవసరంగా
వచ్చాననుకుని,తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటూ,బిచ్చమెత్తుతూ హిప్పిగా కొనసాగుతుంది.
జ్యోతి
కూడా ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటానికి విప్లవకారులతో కలుస్తుంది. ఆమె తమ్ముడు
కూడా అదే దారి ఎంచుకుని అరెస్టవుతాడు. విప్లవంలో భాగంగా పీడితుల్ని బాధించి
భూస్వాముల్ని చంపే ప్రక్రియ కూడా ఉంటుంది. అలా ఓ దాంట్లో వీరి గురించి ముందే
పసిగట్టిన ఆ భూస్వామి పోలీసులకు చెప్పడం వల్ల జ్యోతి ప్రేమించిన సత్యం ఆమెను
కాపాడటానికి బలవుతాడు. ఆ స్పూర్తితో ఆమె ముందుకు సాగుతుంది అని చెప్పడంతో నవల
ముగుస్తుంది.
హిపోక్రసీ,సమాజంలోని
అసమానతలకు దూరంగా బ్రతుకుదామనుకున్న ఇద్దరు యువతులు దాని కోసం అవలంభించిన రెండు
పద్ధతుల్లో కూడా వాటి నష్టాలు వాటికి ఉన్నాయి. విప్లవంలో కూడా కొందరు ఏజెంట్లుగా
మారి శత్రువులకి సాయం చేస్తారు.ఒకవేళ ఒకర్ని చంపినా, వారి
వంశం అదే పద్ధతిలో అదే దౌర్జన్యం కొనసాగిస్తుంది తప్ప ఆ అక్రమాలకు అంతం ఉండదు.
సీతాదేవి
గారి అన్నీ నవలల్లో కూడా ఏదో ఓ మూల సమాజంలోని అన్యాయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. ‘వెన్నెల
మండుతోంది’ నవలలో కూడా ముఖ్య పాత్ర ఇలా సమాజంలో జరిగే అన్యాయాల్ని
ఎదిరించాలనుకునే పాత్రే. అంశం ఒకటే అయినా ఆ మార్గాలు అవలంభించాక వారి జీవితాలు ఎలా
మారతాయో కూడా వాస్తవికంగా చిత్రీకరించడం వల్ల సమాజపు ఇంకో కోణాన్ని పాఠకులు వీక్షించగలుగుతారు.
హిప్పీ
వ్యవస్థ సమాజంలో జరిగే వాటిని మరచిపోయి పారిపోయే ప్రక్రియ అయితే,కామ్రేడ్
గా మారడం అన్నది కొన్నిసార్లు మానవత్వాన్ని మరచి ప్రవర్తించాల్సిన ప్రవృత్తిని ప్రవేశపెట్టే
మార్గం కూడా అవుతుంది. ఇందులో ఏది మంచి మార్గం కాకపోవచ్చు,కానీ
ఏమి చేయకుండా నిర్లిప్తంగా ఉండటం కంటే ఏదో చేసి ప్రయత్నించి,ఓడిపోయే
వారి జీవితాలు కూడా మన చరిత్రల్లో ఎన్నో సంచలనాలు సృష్టించాయి. అవగాహన,ఐకమత్యం ఉన్న ఏ మార్గమైనా ఎప్పుడో ఓ సారి విజయం సాధిస్తుంది.కానీ మధ్యలో ప్రలోభాలకు
లోనయ్యే కొందరి కుయుక్తులు ఎంతటి గొప్ప ఆశయాన్నైనా చెల్లాచెదురు చేస్తాయి. ఈ నవలలో
శబరి నిజం తెలుసుకునేసరికి ఆమె తన పూర్వపు జీవితానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
జ్యోతి తాను వెళ్ళే మార్గంలో కొందరు వెన్నుపోటు దార్లు ఉన్నా ఎటువంటి పరిస్థితిని అయినా
ఎదిరించి సాధించాలనే ఆశయంతో ముందుకు కదిలింది.
వాసిరెడ్డి
సీతాదేవి గారి నవలల్లో కచ్చితంగా చదవాల్సిన నవల ఇది. ఎందుకంటే ఈ నవల ప్రశ్నిస్తుంది,సమాధానాలు
కూడా ఇస్తుంది కనుక.
* * *

Comments
Post a Comment