కంఫర్ట్ జోన్

 సీజనల్ సమీక్షలు

కంఫర్ట్ జోన్

          -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          2020లో వచ్చిన వెబ్ సిరీస్ లో హాస్య ప్రధానమైనది పంచాయత్.ఓ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్  ప్లేస్మెంట్స్ రాణి పరిస్థితుల్లో రాజస్థాన్ లోని ఓ పల్లెటూరిలో పంచాయత్ సెక్రటరీగా వెళ్ళి,అక్కడి వారితో కలవలేక ఎలా ఇబ్బందులు పడ్డాడో హాస్యంగా తీసిన వెబ్ సిరీస్ ఇది.

          అభిషేక్ కు ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ప్లేస్మెంట్ రాదు.ఇక ఏ ఉద్యోగం లేని పరిస్థితుల్లో పంచాయత్ సెక్రటరీ గా మాత్రమే ఉన్న ఆఫర్ ను తిరస్కరించలేక ఇష్టం లేకపోయినా రాజస్తాన్ లోని ఫులేరా అనే ఊరికి వెళ్తాడు.ఆ గ్రామంలో ఓ స్త్రీ ప్రధాన్ అయినప్పటికీ కూడా అతని భర్తే అన్నీ నడిపిస్తూ ఉంటాడు.పేరుకు మాత్రమే ఆమె ప్రధాన్ తప్ప మొత్తం అన్నీ చూసుకునేది ఆమె భర్తే.

          అభిషేక్ అక్కడికి వెళ్ళేసరికి ప్రధాన్ భర్త,డిప్యూటీ ప్రధాన్,ఓ అసిస్టెంట్ వస్తారు. ప్రధాన్ ఆ ఆఫీసు తాళం ఎక్కడో పోగొట్టడం వల్ల, దానిని పగలగొట్టి మరి వెళ్ళడంతో అభిషేక్ మొదటిరోజు ఫులేరా లో  మొదలవుతుంది.అభిషేక్ క్యాట్ పరీక్షలకు కూడా సిద్ధం అవుతూ ఉంటాడు ఆఫీసు తర్వాత. ఆ గ్రామంలో ప్రతి రాత్రి పవర్ కట్ ఉండటం వల్ల ఎమర్జెన్సీ లైట్ తెచ్చుకుని దాని వెళ్తురులో చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పంచాయత్ కు సోలార్ లైట్స్ గ్రామంలో పెట్టాల్సిన ప్రాజెక్ట్ వస్తుంది.ఆ మీటింగ్ లో ప్రధాన్ ఇంటి దగ్గర,ప్రముఖుల ఇళ్ల దగ్గర పెట్టాక,ఓ లైట్ ఆ ఊరంతా భూతం అని భయపడే ఓ చెట్టు దగ్గర కూడా ఒకటి పెట్టాలనే నిర్ణయం జరుగుతుంది. ఆ చెట్టు దగ్గర పెడితే ఓట్లు తనకే వస్తాయని ప్రధాన్ ఆశిస్తాడు. కానీ ఆ చెట్టు మిస్టరీ అభిషేక్ ఛేదిస్తాడు. అవన్నీ పుకార్లే తప్ప నిజం కావని తేలిపోతుంది. దానితో మిగిలిన ఓ లైటును మొత్తానికి పంచాయత్ ఆఫీసులో పెట్టడానికి  నిర్ణయం జరుగుతుంది.

          అభిషేక్ తనకు అనువుగా ఉండటానికి ఓ మంచి కుర్చీ తెచ్చుకుంటాడు. అది చూసిన ప్రధాన్ ఆ కుర్చీ వల్ల అతను తన కన్నా అధికుడు అవుతాడేమోనని  భయపడుతూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు తాను అలాంటి కుర్చీ తెచ్చుకున్నా ఇద్దరు సమానం అవుతారు తప్ప తాను అధికుడు కాలేనని ఆలోచిస్తాడు. అదే సమయంలో ఆ ఊరిలో ఒకరింట్లో పెళ్ళి ఉండటంతో ఖాళీ లేకపోవడం వల్ల పంచాయత్ ఆఫీసులో పెళ్ళికొడుకుకు విడిది ఏర్పాటు చేస్తారు. అక్కడ అభిషేక్ కు కూడా కొన్ని పనులు అప్పగించడం వల్ల అప్పుడు పెళ్లికొడుకుకు,అతనికి మధ్య కొన్ని విభేధాలు ఏర్పడతాయి. ఆ గొడవ సర్దడానికి అభిషేక్ కుర్చీ ఆ పెళ్లికొడుక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ తర్వాత రోజు ప్రధాన్ తన కుర్చీ అభిషేక్ కు ఇచ్చి,అభిషేక్ అంతకు ముందు తెచ్చుకున్న కుర్చీ లాంటి దాన్ని మరునాడే పట్నం నుంచి తెచ్చుకుంటాడు.

          అభిషేక్ కు బిడిఓ నుండి ఫ్యామిలీ ప్లానింగ్ కు సంబంధించిన కొన్ని నినాదాలు ఆ ఊరిలో పెయింట్ చేయించవలసిందిగా ఆజ్ఞలు వస్తాయి.వాటిని పెయింట్ చేయించాక కొన్ని నినాదాలు ఆ ఊరిలో ఎందరికో ఇద్దరి కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల అవి అభ్యంతరకరంగా ఉండటం వల్ల ప్రధాన్ వద్దని సూచిస్తాడు.కానీ పై ఆఫీసర్ల ఒత్తిడి వల్ల వేయించినా చివరకు వారు కూడా వద్దనడంతో ఆ సమస్య అలా సమసిపోతుంది.

          తన స్నేహితులందరు వీకెండ్స్ లో పార్టీలు చేసుకుంటూ ఉంటే తాను మాత్రం ఇలా ఈ గ్రామంలో ఒంటరిగా ఉండిపోవటంతో విసుగు చెందిన అభిషేక్ ఓ రాత్రి బీర్ తెచ్చుకుంటాడు. ఆ రోజు రాత్రి తలుపు వెయ్యడం మర్చిపోవడం వల్ల ఆ ఆఫీసులో ఉన్న మానిటర్ దొంగిలించబడుతుంది. దాని గురించి ఫిర్యాదు ఇవ్వడం,ఇన్వెస్టిగేషన్ లో అభిషేక్ ను అనుమానించడం కూడా జరుగుతుంది.ఒంటరిగా ఫీల్ అవుతున్న అభిషేక్ ను ప్రధాన్ ,అతని బృందం తమలో ఒకరిగా చేర్చుకుని బాగా చూసుకుంటారు. మానిటర్ ను అందరం కలిసి కొంత డబ్బు వేసుకుని మరలా కొందామనే నిర్ణయం కూడా తీసుకుంటారు. చివరకు మానిటర్ ను దొంగిలించన అతనే ఆ మానిటర్ ను ఆ ఆఫీసు ముందు పెట్టేసి దానిని టీవి అనుకుని దొంగిలించానని కాదని తెలిసేసరికి అక్కడే పెట్టేస్తున్నానని ఓ కాగితంలో రాసి అక్కడే పెడతాడు.

          తర్వాత  క్యాట్ ఎగ్జామ్ కోసం ఫోటోలు దిగడానికి అభిషేక్ పక్క ఊరికి అసిస్టెంట్ అయిన వికాస్ తో కలిసి వెళ్తాడు.అక్కడ ఓ గ్యాంగ్ వారితో గొడవ అవుతుంది. ఆ ఫోటోగ్రాఫర్ కూడా వారి ఊరి వాడే అవ్వడం వల్ల ఆ ఫోటోలు ఇవ్వడు. దీని కోసం గొడవ పడటం ఎందుకని అభిషేక్ ఆఫీసులోనే వైట్ బ్యాక్ గ్రౌండ్ తో ఫోటో దిగుదామని అనుకున్నా,ఆ రాత్రి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి రెచ్చగొడతారు. దానితో తర్వాతి రోజు ప్రధాన్ బృందంతో కలిసి వెళ్ళినా,చివరకు అభిషేక్ వారందరినీ కాపాడతాడు.అప్పటి నుండి అభిషేక్ అంటే వారు భయపడతారు.

          తర్వాత ప్రధాన్ కూతురు రింకీకి 20 లక్షలు కట్నం అడిగే సంబంధం వస్తుంది. అభిషేక్ అభిప్రాయం అడిగినప్పుడు తాను కట్నం తీసుకొనని చెప్తాడు. ప్రస్తుతం 20 వేల జీతం కనుక తీసుకోవడం లేదనే అభిప్రాయంతో ఉన్నా జీతం పెరిగినా,వేరే పెద్ద ఉద్యోగం వచ్చినా తీసుకోవచ్చేమో అంటే తాను ఏ పరిస్థితుల్లోనూ తీసుకోనని అభిషేక్ స్పష్టం చేస్తాడు. అభిషేక్ ఆ పరీక్షల్లో పాస్ అయితే తన కూతుర్ని అతనికిచ్చి పెళ్ళి చేద్దాం అనుకుంటాడు బిర్జు.(ప్రధాన్ భర్త)

          తర్వాత  ప్రధాన్ గా ఉన్న మంజు దేవి ఇంటికి సంతకాల కోసం వెళ్తాడు అభిషేక్.పక్క ఊరిలో కూడా మహిళా ప్రధాన్ ఉందని కానీ ఆమె ఆఫీసుకు వచ్చి అన్నీ పనులు చూస్తుందని చెప్తాడు అభిషేక్.దానితో తనను ఎవరు ప్రధాన్ లా చూడటం లేదనుకున్న మంజు దేవి దగ్గరలో ఉన్న రిపబ్లిక్ దినోత్సవం నాడు తాను జాతీయ గీతం పాడి,జెండా ఎగరేయ్యాలని నిర్ణయించుకుంటుంది. అభిషేక్ ఆమెకు జాతీయ గీతం నేర్చుకునేందుకు సాయం చేస్తాడు.

          రిపబ్లిక్ దినోత్సవం నాడు ఇన్స్పెక్షన్ జరుగుతుంది.మంజుదేవి ఆ రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం వల్ల ఆ రోజు అభిషేక్ కు సస్పెన్షన్ కూడా తప్పుతుంది. అభిషేక్ క్యాట్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతాడు. నిరుత్సాహంగా ఆఫీసుకు తిరిగి వస్తాడు. ఆ ఊరిలో ఏం ఉత్సాహపరిచే అంశం లేదని అతను అనుకుంటున్నప్పుడు రింకీ (ప్రధాన్ కూతురు)అతనికి ఎదురవ్వడంతో ఈ సీజన్ ముగుస్తుంది.

   హాస్యాన్ని ఎన్నో రకాలుగా పండించవచ్చు. పట్టణంలో పెరిగిన అభిషేక్ ,పల్లెటూరి వాతావరణంలో వారితో ఇమడలేక,తనదైన షెల్ లో ఉండిపోవడం,తనను ప్రజలు మంచిగా అనుకోవడం కోసం,వారి ఓట్ల కోసం ఆరాటపడే బిజ్ను ,ఇలా మనిషి తనదైన కంఫర్ట్ జోన్ ను దాటి బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడే సాధకబాధకాలే ఈ సీజన్-1 లో హాస్యాన్ని పండిస్తూనే మనల్ని ఎమోషనల్ కూడా చేస్తాయి.

 *   *   *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!