దృష్టి

 చదువరి

దృష్టి

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          సుంధర కలంపేరుతో ఎన్నో విభిన్న నవలలు రాసిన జొన్నలగడ్డ రామలక్ష్మి,జొన్నలగడ్డ రాజగోపాలరావు దంపతుల అద్భుత రచనా సృష్టిలో అస్పృశ్య నయనాలు కూడా ఓ విభిన్న అంశమే. మనిషి తాను అధికంగా ప్రేమించే అంశాలను కూడా ఏ పరిస్థితుల్లో వాటిని ప్రేమించలేడు అంటే అవి సహజమైనవి కానప్పుడే అనే ఓ కోణాన్ని ,ఇంకో వైపు మనిషి వ్యామోహాల వైపు మాత్రమే దృష్టి సారిస్తే ఎన్నో అమూల్యమైనవి కోల్పోవల్సి వస్తాయి అనే అంతర్లీన సందేశ దృక్కోణాన్ని ఇంకో వైపు సారించి రాసిన నవల ఇది.

          సుమలత అందగత్తె. మధ్యతరగతి  కుటుంబంలో జన్మించిన ఆమెకు తన అందం మీద గొప్ప నమ్మకం.డబ్బు,అందమైన కళ్ళు ఆ  రెండే ఆమెకు ఇష్టమైనవి. ఆమె మేనత్త ధనవంతురాలు. సుమలతను తన దగ్గర ఉంచుకుని బియ్యే చదివిస్తుంది. అలా ఆమె దగ్గర సుమలతకు వైభవం అలవాటవుతుంది.

          కాలేజీలో తెలుగు లెక్చరర్ కి అందమైన కళ్ళు ఉండటంతో ఆయన వైపు చూస్తూ ఉంటుంది.అతను ఆమెను ప్రేమిస్తాడు.ఆమె కుటుంబం గురించి తెలుసుకుని, పెళ్లి సంబంధం మాట్లాడటానికి పంపుతాడు.ఆమె చదువు పూర్తయ్యేవరకు వేచి చూస్తానని చెప్పినా,అతను ధనవంతుడు కాకపోవడం వల్ల ఆ పెళ్ళికి ఒప్పుకోదు. సినిమా హాలులో పరిచయమైన శేషగిరి ఆమెను ప్రేమిస్తాడు.ఆమె స్నేహితురాలు అరుణ ద్వారా ఆమె గురించి తెలుసుకుని, తాను ఎనిమిది వందల జీతగాడు అయినప్పటికీ ధనవంతుల బిడ్డనని అబద్ధం చెప్తాడు.తర్వాత ఆమెకు నిజం చెబ్దామని అనుకుంటాడు.అతని కళ్ళను,డబ్బును ప్రేమిస్తుంది సుమలత.వీరి ప్రేమ విషయం సుమలతకు తెలుస్తుంది.

          అతని వివరాలు కనుక్కుని,మంచివాడని,ఉద్యోగస్థుడని  తెలుసుకుని వారిద్దరికీ వివాహం చేయించాలనుకుంటుంది సుమలత అత్త.కానీ అతను ఉద్యోగస్థుడని తెలిసాక ఆ సంబంధం కూడా తిప్పికొడుతుంది సుమలత.తర్వాత ఉద్యోగం పేరుతో హైద్రాబాద్ లో రెండేళ్ళు ఉంటుంది.

          హఠాత్తుగా ఓ ధనవంతుడైన యువకుడు ఆమె పని చేస్తున్న బ్యాంకుకి వచ్చి ఆమెను పెళ్ళి చేసుకుంటానని,ఆమెను నమ్మించడం కోసం ఆమె పేరున అప్పటికప్పుడు లక్ష రూపాయలు డిపాజిట్ చేయడం వల్ల అతనితో ఆమె వివాహం జరిగిపోతుంది.కానీ అతని కళ్ళు ఆమెకు నచ్చవు.ఆమెకు కొడుకు పుడతాడు. ఓ రోజు భర్త డైరీలో శేషగిరి ఫోటో చూస్తుంది.

          శేషగిరికి యాక్సిడెంట్ అయ్యి కళ్ళు పోవడం,వాటిని ఆమె భర్తకు అమర్చడం,దానికి ప్రతిఫలంగా సుమలతను పెళ్ళి చేసుకోవాలని,ఆమెకు తన కళ్ళు,సంపద ఇష్టమని కోరడంతో ఆమెను అతను వివాహం చేసుకున్నాడని,ఆ నేత్రదానం అయ్యాక శేషగిరి ఆత్మహత్య చేసుకుని మరణించాడని తెలుసుకుని ఆమె కదలిపోతుంది. అప్పటిదాకా తనకు ఎంతో ఇష్టమైన కళ్ళను అస్పృశ్య నయనాలుగా చూసిన ఆమె, ఇకనుంచి ప్రేమించిన భర్తను కూడా ఒప్పుకోలేదు.

          ఆమె జీవితంలో ప్రేమించిన కళ్ళు ఇంకొకరివి అయ్యాక ఆమె ఇష్టపడలేకపోయింది,ఆమె ఎంతో ఇష్టపడిన అదే మనిషి కూడా డబ్బు లేకపోవడం వల్ల ఆమెను పొందలేకపోయాడు.మనిషి జీవితంలో ఓ ఇష్టాన్ని ఇంకో ఇష్టంతో ముడిపెడితే ఏదో ఒక దాన్ని త్యాగం చేయక తప్పదు.అలా చేశాక త్యాగం చేసింది ఎప్పుడో ఓ సారి అమూల్యంగా కనిపిస్తుంది. దానితో అసంతృప్తి తప్పదు. కారణాలు లేని ప్రేమ మాత్రమే మనిషికి సంతోషాన్ని ఇస్తుంది.

               *    *   *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

అనుభూతుల మజిలీ