ఐరన్ బటర్ ఫ్లై

 చదువరి

                ఐరన్ బటర్ ఫ్లై

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          మామూలు గ్రామంలో పేదరికంలో జన్మించి, పుట్టుకతో తల్లిని కోల్పోయి, పుట్టినప్పటి నుండి తనను పట్టించుకోని తండ్రి పెంపకంలో ఓ బోర్డింగ్ హౌస్ లో అతనితో పాటు ఉన్న ఓ అమ్మాయి తన జీవితపు ఆశయం అయిన రియల్ ఎస్టేట్ బిల్డర్ ఎలా అయ్యింది అన్న అంశంతో 1992 లో సిడ్నీ షెల్డన్ రాసిన నవలే ‘The Stars Shine Down.’ రియల్ ఎస్టేట్ రంగం కేవలం మగ వాళ్ళకే సంబంధించింది అని భావించే వారికి ఆ స్త్రీ తన విజయంతో ఎలా ఎదిగి ఐరన్ బటర్ ఫ్లై గా తన ముద్ర వేసుకుందో తెలిపే నవలే ఇది.

          లారా జన్మించేనాటికే తల్లి మరణించింది. ఆమె తండ్రి ఇంటి బాధ్యతలను పట్టించుకోని వ్యక్తి. అంతా తన తలరాత అని,తనకు కష్టాలే ఉన్నాయని భావిస్తూ దానికి లారాను కూడా నిందిస్తూ ఉంటాడు. ఆమె తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడూ తండ్రి చేసే పనిని ఆమె చేయడం ప్రారంభిస్తుంది. ఆ బోర్డింగ్ హౌస్ తో పాటు ఇంకొన్ని బోర్డింగ్ హౌస్లు ఉన్న మెక్ కు ఆ బోర్డింగ్ హౌసుల నుండి అద్దెలు వసూలు చేసి పెట్టడమే ఆమె తండ్రి చేసే పని. తండ్రి కన్నా ఆ పని మెరుగ్గా చేసేది లారా. ఆ బోర్డింగ్ హౌస్ కు ఉండటానికి వచ్చిన కాన్ నుండి రియల్ ఎస్టేట్ గురించి మొదటిసారి విన్న లారా తాను ఎలా అయినా సరే రియల్ ఎస్టేట్ బిల్డర్ అవ్వాలని నిర్ణయించుకుంటుంది.

          ఆమె ఉంటున్న  బోర్డింగ్ హౌస్ లో ఉంటున్న మెక్ స్వీన్ ఆమె ఆశయాన్ని గుర్తిస్తాడు.ఆమెకు రియల్ ఎస్టేట్ గురించి కొంత అవగాహన కల్పిస్తాడు.ఆ బోర్డింగ్ హౌస్ యజమాని అయిన ఆలీస్టర్  స్థలాన్ని చూసిన ఆమె దానితో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెడుతుంది. దానికి కావల్సిన లోన్ తన బ్యాంక్ ద్వారా మాట ఇప్పిస్తానని చెప్పిన ఆలీస్టర్  దానికి ప్రతిఫలంగా ఆమె శరీరాన్ని కోరతాడు. తన ఎదుగుదల కోసం దానికి తల ఒంచుతుంది ఆమె. ఆ స్థలంలో నిర్మాణం కూడా మొదలవుతుంది.కానీ చివరి రోజుల్లో నిర్మాణ సంస్థ కొన్ని పనుల వల్ల కొంత సమయం తీసుకుంటామని చెప్తారు. మెక్ స్వీన్ ఇదంతా ఆలీస్టర్  చేసిందని,అతను తెలివిగా ఆ నిర్మాణం డిసెంబర్ 31 కల్లా అవ్వకపోతే అది ఆలీస్టర్  కు తిరిగి దక్కేలా లారతో అగ్రిమెంట్ చేత సంతకం చేయించుకుంటాడు  ఆలీస్టర్ . మెక్ స్వీన్ ఆ నిర్మాణ సంస్థ కూడా ఆలీస్టర్  కు సంబంధించిందే అని,అతను పథకం ప్రకారం ఆమెకు అది దక్కకుండా చివరి వరకు ఆశ కల్పించి, చివర్లో ఆమెకు దక్కకుండా చేయాలని చూశాడని చెప్తాడు.

          కానీ ఆమె కష్టాన్ని అర్ధం చేసుకున్న బోర్డింగ్ హౌస్ లో ఉంటున్న వర్కర్స్ ఆ పని పూర్తి చేస్తారు.ఆమె దాని ద్వారా సంపాదించిన మూడు మిలియన్ డాలర్లతో ఆ ఊరు వదిలి చికాగో వెళ్తుంది. అక్కడ ఆమె హవార్డ్ కెల్లర్ అనే బ్యాంకర్ సాయంతో ఆమె రియల్ ఎస్టేట్ బిల్డర్ గా ఎదుగుతుంది. అక్కడ విజయాన్ని సాధించాక న్యూయార్కుకు వెళ్ళి అక్కడ క్యామరూన్ (లారా క్యామరూన్ లారా పూర్తి పేరు)ఎంటర్ ప్రైజెస్ స్థాపిస్తుంది. అక్కడ ఆమె ఓ వర్కర్ మీద చెయ్యి చేసుకోవడంతో ఆమె ఆపదలో ఉన్న సమయంలో అనుకోకుండా ఆమె పాల్ మార్టిన్ అనే మాఫియా నాయకుడితో సంబంధం ఏర్పడుతుంది.

          కెల్లర్ ఆమె మీద ఆశలు పెంచుకుంటాడు. పాల్ మార్టిన్ మాట మీద ఓ కాసినో బిడ్డింగ్ మీద కొంటుంది.ఆమె ఆ తర్వాత ఫిలిప్ అనే పియానిస్ట్  తో ప్రేమలో పడుతుంది.అతన్ని వివాహం చేసుకుంటుంది. ఆ సమయంలో పాల్ ను పూర్తిగా పట్టించుకోదు.అదే సమయంలో ఆ కాసినో బిడ్డింగ్లో అవకతవకలు జరిగాయని,పాల్ తో ఆమె మాట్లాడిన కాల్స్ కూడా ఉన్నాయని తేల్చడంతో పాల్ తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే తన జీవితం అయిపోయినట్టే అని భావించిన ఆమెకు అనుకూలంగా సాక్ష్యం చెప్పి ఆమెను ఆపద నుండి గట్టెకిస్తాడు. అదే సమయంలో ఆమె భర్త ఫిలిప్ మీద హత్యా ప్రయత్నం జరగడం,ఆ హత్య కెల్లర్ చేసే ప్రయత్నం చేయడం వంటి ఉదంతాలు ఆమె జీవితం మీద ఎంతో ప్రభావితం చేసినా ఆమె ఆగకుండా ఆమె తన రియల్ ఎస్టేట్ రంగంలో  ముందుకు వెళ్ళే పయనాన్ని మళ్ళీ మొదలుపెట్టడంతో నవల ముగుస్తుంది.

          ఈ నవలలో లారా పాత్ర అనుకున్నది సాధించడానికి ఏ రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధంగా ఉండే స్త్రీ పాత్ర. అలాగే ఓడిపోయినా మళ్ళీ లేచి పరిగెత్తే పోలిక. ఎన్ని అడ్డంకులు వచ్చిన అనుకున్న పనిని వదిలిపెట్టని పాత్ర. తన పని నెరవేరడం కోసం ఎంత దూరం అయినా వెళ్ళే పాత్ర. అదే విధంగా తన సంస్థలో పని చేసే వారినే తన కుటుంబంగా భావించే పాత్ర. అలాగే ఆమె సంస్థలో ఆమెకు పిఏ గా పని చేసిన ఆమె లారా గురించి తెలుసుకుని ఆమె జీవితాన్ని గురించి రాసే ప్రయత్నంలో ఎంతో నిర్దాక్షణ్యంగా  ఆ పబ్లిషర్ ను అణచివేసే పాత్ర. విజయ శిఖరాలు అధిరోహించిన తర్వాత గర్వంతో మిడిసిపడే పాత్ర. అలానే అందరూ ఉన్న ఎవరిలేని ఒంటరితనాన్ని అనుభవించే పాత్ర కూడా. ఇలా ఆమెలోని అన్నీ కోణాలు మనుషులు తమ జీవన గమనంలో ప్రదర్శించే అన్నీ ప్రవర్తనలకు నిదర్శనాలు. సిడ్నీ షెల్డన్ రాసే శైలిలో ఉండే చదివింపజేసే  రచనా నిర్మాణం తప్పకుండా ఈ నవలను చదివింపజేస్తుంది.

                *    *     * 

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!