అకారణ అసూయ

 చదువరి

అకారణ అసూయ 

-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          మాదిరెడ్డి సులోచన గారి నవలల్లో మధ్యతరగతి జీవితాలు,వాటిలో ఉండే అసంతృప్తులు,వాటి వల్ల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయి అనే అంశాలు ఎక్కువ మూలాలుగా ఉంటాయి. సులోచన గారి నవలల్లో అంతము చూసిన అసూయ లో అకారణంగా తన కన్నా ఆర్థికంగా కింది స్థాయిలో ఉన్న వ్యక్తి పట్ల పెంచుకున్న అసూయ వారిద్దరి జీవితాల్ని ఎలా నాశనం చేసిందో స్పష్టం చేస్తుంది.

          అనిత,రవీంద్ర అన్నాచెల్లెళ్ళు. వారి తల్లిదండ్రులు ధనవంతులు.వారి తండ్రి ప్లీడరైన రంగనాధరావు. వారి ఇంటి పైన శంకరరావు కుటుంబం అద్దెకు ఉంటుంది. శంకరరావు భార్య సుభద్ర, చెల్లెలు శాంత,తల్లి ధనమ్మ. శాంత,అనిత ఒకే కాలేజీలో చదువుతూ ఉంటారు. శాంత కుటుంబ పరిస్థితుల వల్ల ట్యూషన్లు కూడా చెప్తూ ఉంటుంది. ఆమె అన్న హెడ్ మాస్టరు.ఉన్న రెండు చీరలతో కాలేజీకి వెళ్ళే శాంతను చూసి అనిత అవహేళన చేస్తూ ఉంటుంది.శాంత మీద అనిత అకారణంగా అసూయ పెంచుకుంటుంది.

          అనిత అమ్మతో శాంత ఎంతో మంచిగా ఉంటుంది. ఇంట్లో అన్న పిల్లలకు చదువు చెప్తూ,బయటి పిల్లలకు ట్యూషన్లు చెప్తూ,అప్పుడు మిగిలిన సమయంలో చదువుకుంటూ ఉంటుంది శాంత. రాత్రిళ్ళు లైట్ వేసుకుని చదువుకోవడానికి వదిన అనుమతి లేకపోవడంతో బయటి లైటులో కూర్చుని ఆమె చదువుకుంటున్నప్పుడు రవీంద్ర వచ్చి ఆమెతో మాట్లాడుతున్న సమయంలో శాంత కళ్ళల్లోకి ఓ పురుగు వెళ్ళడంతో రవీంద్ర దానిని ఊదుతున్న సమయంలో రహస్యంగా అనిత ఫోటో తీస్తుంది.

          శాంతకు ఓ రెండో పెళ్లివాడైన అతనితో పెళ్ళి కుదుర్చుతాడు ఆమె అన్న శంకరరావు. ఆ పెళ్ళి కొడుక్కి తాను రహస్యంగా తీసిన ఫోటోను పంపి ఆ పెళ్ళి చెడగొడుతుంది అనిత. విషయం తెలుసుకున్న  రవీంద్ర శాంతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు.మొదట్లో ఆమె మీద విముఖత ప్రదర్శించినా,ఆమె మంచితనానికి ముగ్దులై అత్తామామలు ఆమెను ప్రేమగా చూసుకుంటారు.

          అనితను బాల్యం నుండి బావ శేఖరానికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. అది వారిద్దరికి కూడా ఇష్టమే. కానీ ఇల్లరికానికి శేఖరం ఒప్పుకోడు. కానీ తోబుట్టువులాంటి శాంత నచ్చజెప్పటంతో ఒప్పుకుంటాడు.కానీ శాంత చెప్పడం వల్ల అతను ఒప్పుకోవడంతో  అనిత అతనితో పెళ్ళికి ఒప్పుకోదు. ఈ లోపు రవీంద్రకు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళే అవకాశం రావడంతో అతను అక్కడికి వెళ్తాడు. తర్వాత శాంతకు అపర్ణ పుడుతుంది.

          అనితకు వివాహమవుతుంది. శేఖర్ ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటాడు. శాంత రేడియోలో పాటలు పాడుతూ ఉంటుంది. తర్వాత అనితకు అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. అక్కడ ఉన్న అన్న రవీంద్ర మనసు చెడగొడుతుంది. శేఖర్ తో శాంతకు అక్రమ సంబంధం ఉందని,అందుకే తనను పెళ్ళి చేసుకోలేదని చెప్తుంది.ఆమె మాటలు నమ్మిన రవీంద్ర శాంతను ఇంటి నుండి వెళ్ళిపోమ్మని, అపర్ణను తన తల్లిదండ్రుల దగ్గర వదిలెయ్యమని గట్టిగా ఉత్తరం రాస్తాడు.

          అక్కడి నుండి వెళ్ళిపోయిన శాంత ఓ చిన్న ఉద్యోగం చేసుకుంటూ తన జీవితం గడుపుతూ ఉంటుంది. రవీంద్ర ఓ అమెరికా అమ్మాయిని పెళ్ళి చేసుకుని వస్తాడు.కానీ ఆమె స్వేచ్చా ధోరణిని సహించలేకపోతాడు.ఆమె ఓ మగపిల్లాడిని కన్నాక అక్కడే వదిలి వెళ్ళిపోతుంది.అనిత చివరకు పశ్చాత్తాపపడి అన్నకు నిజం చెప్తుంది.అప్పటికే శాంత ఆరోగ్యం క్షీణించి మరణిస్తుంది.దానితో చేసిన తప్పుల భారంతో అనిత పిచ్చిది అవుతుంది.

           నవలలో అసూయకు కారణం లేదు. మనస్తత్వ రీత్యా పెంచుకున్న అసూయ అందరి జీవితాల్ని నాశనం చేసింది. ప్రేమ,ద్వేషం,అసూయ ఏ భావోద్వేగం పెంచుకోవడానికైనా మనుషుల మనస్తత్వాలే దోహదం చేస్తాయి తప్ప కారణాలు కాదు. మనిషిలో కారుణ్య భావం లోపిస్తే అది ఎన్ని దారుణాలకు దారి తీస్తుందో ఈ నవల స్పష్టం చేస్తుంది.

                       *    *    *

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!