కూలిన కలలు

 చదువరి

కూలిన కలలు

                                                     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          ఆంగ్ల క్లాసిక్ నవలల్లో ప్రసిద్ధి చెందినవి ఎక్కువగా ఇంగ్లాండ్ జీవనాన్ని ప్రతిబింబింపజేసేవే.జేన్ ఆస్టిన్,థామస్ హార్డి,డి.హెచ్.లారెన్స్ వంటి రచయితలు  ఇంగ్లాండ్ కాల పరిస్థితులకు తగ్గట్టుగా మానవ ప్రవృత్తి,పరిస్థితుల గురించి ఎంతో చక్కటి కథాంశాలతో రాశారు. థామస్ హర్డి నవలా శైలిలో ముఖ్యంగా క్లాసిక్ నవలల్లో మిగిలిన రచయితల కన్నా కూడా కథను కాస్త వేగంగానే నడిపిస్తాడు.తన నవలల్లో మానవుల మనఃస్థితులు కూడా ప్రతిబింబింపజేసేలా విశ్లేషణను ఓ పక్క,ఆలోచింపజేసే కోణాలు ఇంకో పక్క కచ్చితంగా ఉండేలా రచనలు చేయడంలో ఆయన సిద్ధహస్థులు.ఆయన రచనల్లో ‘Jude The Obscure’ అనే క్లాసిక్ నవల ఓ విభిన్నమైన నవల. ఓ వ్యక్తి జీవితంలో కలలు-కళలు ఎలా ధ్వంసం అయ్యాయో, దానికి అతని బాధ్యత,పరిస్థితుల ప్రభావం ఎంత మేరకు ఉందో అన్న  విషయాన్ని చెప్పి చెప్పకుండా చెప్తూనే పాఠకుల్ని ఆలోచనల్లో పడేస్తుంది ఈ నవల.

          జూడ్ ఫాలే మేరిగ్రీన్ అనే పల్లెటూరిలో ఉండేవాడు. అతని తల్లిదండ్రులు మరణించడం వల్ల అతని బంధువైన డృసెల్లా దగ్గర పెరుగుతాడు.ఓ రైతు దగ్గర పక్షులు,కీటకాలు ధ్వంసం చేయకుండా డృసెల్లా అతన్ని పనిలో పెడుతుంది. అదే ఊరిలో ఉన్న రిచార్డ్ ఫిల్లట్సన్ అనే స్కూల్ మాస్టర్ ఆ ఊరి నుండి పక్కనే ఉన్న క్రైస్ట్ మినిస్టర్ అనే పట్టణానికి బదిలీ మీద వెళ్ళిపోతాడు. రిచార్డ్ వల్లే జూడ్ కు చదువు మీద ఆసక్తి కలుగుతుంది. తాను ఆరాధించే రిచార్డ్ ను అక్కడి నుండి వెళ్లిపోయే ముందు ఎందుకు వెళ్లిపోతున్నారని అడిగితే యూనివర్సిటీలో చదవడానికని అని సమాధానం ఇస్తాడు. దానితో జూడ్ మనసులో అక్కడికి వెళ్తే గొప్ప చదువులు చదువుకుని గొప్ప వ్యక్తిగా మారవచ్చనే అభిప్రాయం దృఢపడుతుంది.

          జూడ్  అక్కడికి వెళ్ళడానికి సంసిద్ధం అవ్వాలని నిర్ణయించుకుని గ్రీక్ మరియు ల్యాటిన్ నేర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.క్రైస్ట్ మినిస్టర్ పట్టణం వైపు తన గ్రామం నుండి చూస్తూ తాను ఎప్పటికైనా అక్కడికి వెళ్ళి తాను విద్యాపరంగా ఎంత సాధించాలనే ఆశయంతో ఉంటాడు. అదే ఊరిలో డాక్టరుగా ఉన్న విల్బర్ట్ ను తనకు గ్రీక్ మరియు ల్యాటిన్ వ్యాకరణ పుస్తకాలు కావాలని అడిగితే తనకు పెషంట్లు వచ్చేలా చేస్తే తాను అలానే ఇస్తానని మాట ఇచ్చి తప్పుతాడు ఆ వైద్యుడు. ఆ తర్వాత రిచార్డ్ ద్వారా తెప్పించుకుంటాడు జూడ్. అలా తనకు తానుగా నేర్చుకుంటూనే తన ఆంటీ దగ్గర పని చేస్తూ ఉంటాడు. తాపీ మేస్త్రిగా ఏడుగుతాడు ఈ క్రమంలో జూడ్. ఓ వైపు పని చేస్తూ,ఇంకో పక్క చదువుకుంటూ,ఇంకో పక్క క్రైస్ట్ మినిస్టర్ పట్టణానికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బును దాచుకుంటూ ఉంటాడు. అలా అతను యూనివర్సిటీకి వెళ్ళి ఎలా అయినా చదువుకోవాలని కలలు కంటున్న సమయంలో అతను అరబెల్లా అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

          అరబెల్లా తల్లిదండ్రులు పందుల వ్యాపారం చేస్తూ ఉంటారు.అతన్ని ఎలా అయినా పెళ్ళి చేసుకోవడానికి అరబెల్లా తాను గర్భవతినని అబద్ధం చెప్పి పెళ్ళి చేసుకుంటుంది. దానితో చదువును పక్కన పెట్టి,దాచుకున్న డబ్బు అంతా సంసారానికి వెచ్చిస్తాడు జూడ్. కానీ ఆమె విలాసాలాకు అతను సంపాదించేది సరిపోదు. దానితో అతన్ని వదిలి ఆమె వెళ్ళిపోతుంది. అటు అతని చదువు,ఇటు అతని వివాహం రెండు వైఫల్యాలుగానే మిగిలిపోతాయి. అరబెల్లా తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది.

          అరబెల్లాతో వివాహమైన మూడేళ్ళ తర్వాత జూడ్ క్రైస్ట్ మినిస్టర్ పట్టణానికి వెళ్తాడు.అక్కడ తాపీ మేస్త్రీగా పని చేస్తూ ఉంటాడు.అక్కడే అతనికి కజిన్ అయిన సూను కలుస్తాడు. ఆమెను కలవవద్దని,వారి కుటుంబాల్లో పెళ్ళి కలిసి రాలేదని, ఈ ఆశలు పెంచుకోవద్దని డ్రసెల్లా అతన్ని హెచ్చరిస్తుంది.ఆ తర్వాత సూను కలిశాక ఆమెతో అతనికి పరిచయం కూడా పెరుగుతుంది. ఆ తర్వాత రిచార్డ్ ను కూడా కలుస్తారు. రిచార్డ్ ఇంకా స్కూల్ మాస్టర్ గానే ఉండిపోయాడనే విషయం జూడ్ కు నిరాశను కలిగిస్తుంది. జూడ్ ద్వారా రిచార్డ్ స్కూల్ లోనే సూ టీచర్ గా చేరుతుంది. సూను జూడ్ ప్రేమిస్తాడు. సూ కూడా అతనితో స్నేహంగానే ఉంటుంది. కానీ ఓ కచ్చితమైన మనస్తత్వం లేని సూ తన కన్నా ఎంతో పెద్దవాడైన రిచార్డ్ ను పెళ్ళి చేసుకుంటుంది. కానీ అతనితో సంతోశంగా ఉండదు. మళ్ళీ అతని నుండి విడిపోయి అప్పటికే క్రైస్ట్ మినిస్టర్ నుండి పక్క పట్టణానికి వెళ్ళిపోయినా జూడ్ దగ్గరకు వస్తుంది.

          ఈ రెండు వివాహాల వల్ల జూడ్ తన విద్య కలకు పూర్తిగా దూరమవుతాడు.అదే సమయంలో అక్కడికి వచ్చిన అరబెల్లా జూడ్ వల్ల తనకు ఓ కొడుకు పుట్టాడని, అతను ప్రస్తుతం తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడని, తాను ఇంకో పెళ్ళి చేసుకోబోతుంది కనుక అతన్ని చూసుకోమని చెప్తుంది. సూ కూడా అంగీకరించడంతో ఆ బాబును తమ కొడుకులానే సూ,జూడ్ ప్రేమిస్తారు. జూడ్  కు అరబెల్లా నుండి ,సూ కు రిచార్డ్ నుండి విడాకులు వస్తాయి. సూ మళ్ళీ జూడ్ ను వివాహం చేసుకోవడానికి ఇష్టపడదు. తమ మనసులు కలిసినప్పుడు వివాహం అవసరం లేదని చెప్తుంది. ఆ తర్వాత సూ,జూడ్ లకు ఇద్దరు పిల్లలు పుడతారు.

          రిచార్డ్ అలా సుకు విడాకులు ఇచ్చి,ఆమె ప్రేమించిన వ్యక్తితో ఆమెను పంపడంతో అతని ఉద్యోగం,సమాజంలో పరపతి కూడా దెబ్బతింటుంది.

           ఆ తర్వాత జూడ్ కు ఆరోగ్యం బాగుండకపోవడం వల్ల సూ బ్రెడ్ తయారు చేసి,అమ్ముతూ కుటుంబాన్ని నడుపుతుంది. ఇక ఆ సమయంలో జూడ్ ,సూ పిల్లలతో కలిసి క్రైస్ట్ మినిస్టర్ కు తిరిగి వస్తారు.ఉండటానికి చోటు లేక లాడ్జింగ్ కోసం వెతికినా ఇద్దరు పెళ్ళి చేసుకోకపోవడం వల్ల,పిల్లలు ఉండటం వల్ల ఇల్లు దొరకడం కష్టమైపోతుంది. చివరకు ఓ చోట దొరికినా దానిలో సూ,పిల్లలు మాత్రమే ఉండటానికి అనుమతి ఉంటుంది. జూడ్ మొదటి కొడుకైన లిటిల్ తమ వల్ల తమ తల్లిదండ్రులకు కష్టాలు అని భావించి సూ జూడ్ దగ్గరకు వెళ్ళిన సమయంలో మిగిలిన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటనతో సూ పూర్తిగా కదిలిపోతుంది.జూడ్ తో కలిసి ఉన్నా మానసికంగా అతనికి పూర్తిగా దూరమైపోతుంది.

          తాను రిచార్డ్ కు మాత్రమే భార్యనని, అతని దగ్గరకు తిరిగి వెళ్లిపోతానని చెప్పి అలాగే అతని దగ్గరకు వెళ్ళిపోతుంది సూ. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన పెళ్ళి చెడిపోవడంతో తిరిగి మళ్ళీ జూడ్ ను మోసం చేసి వివాహం చేసుకుంటుంది. ఆ పేలి తర్వాత జూడ్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. చివరి సమయంలో సును చూడాలని కోరుకుని ఆమె దగ్గరకు వెళ్తాడు. కానీ ఆమె మీద అతనికి మనసు విరిగిపోతుంది.అక్కడి నుండి తిరిగి వచ్చిన కొంతకాలానికే అతని ఆరోగ్యం దెబ్బతిని జూడ్ మరణిస్తాడు.

          థామస్ హార్డి నవలల్లో చివరి నవల ఇది. మనిషి ఎన్ని ఉన్నత కలలు కన్నా, ఎంత పరిస్థితులతో పోరాడినా సరే, తనకున్న అన్నీ బలహీనతలు వదులుకుని, దేన్ని తన బలహీనతగా,అడ్డంకిగా మారకుండా చూసుకుంటే తప్ప అతను పరిస్థితులను అధిగమించి ఎదగలేడనే అంతర్లీన సందేశంతో ముగిసే ఈ నవల చివరకు కన్నీళ్లు పెట్టిస్తుంది. చదువు కోసం ఎంతో తపన పడి, మొదటి వివాహంలో దెబ్బ తిన్న జూడ్ ,మళ్ళీ సు మరో వివాహం చేసుకుని తిరిగి వచ్చాక కూడా మళ్ళీ అదే వలయంలో చిక్కుకుని అలాగే ఆ వలయంలో భ్రమిస్తూనే మరణించాడు. అతనితో పాటే అతని కలలు,ఆశయాలు కూడా మరణించాయి.

          మనిషిలో ఉండే ఒంటరితనం అతని బలహీనతగా మారి అతనిలో ఉన్న బలాన్ని ఎలా హరింపజేస్తుందో ఇందులో జూడ్ పాత్ర స్పష్టం చేస్తే, తమ మనస్తత్వాల్లోని విభిన్నత ఎవరి మీద ఏ ప్రభావం చూపినా,లెక్క చేయకుండా తమ గురించి మాత్రమే ఆలోచించే పాత్రలు ఆరబెల్లా,సూ లు. నవలలో కేవలం అరబెల్లా మాత్రమే వక్రంగా,సూ మీద కొన్ని పరిస్థితుల్లో సానుభూతి కలిగినా మొత్తం మీద పరిశీలిస్తే జూడ్ తన జీవితాశయాన్ని వదులుకోవాల్సిన ఉదాత్తత ఎవరి ప్రవృత్తిలోనూ లేదనే స్పష్టం అవుతుంది.

          వివాహాన్ని కేవలం సమాజానికి మాత్రమే సంబంధించిన చిహ్నంగా భావించి అది జూడ్ తో వద్దని వాదించి, అతనితో కొంతకాలం జీవితం గడిపాక, అతన్ని మధ్యలో సూ వదిలేస్తే ,జూడ్ ను మొదటి నుండి తన అవకాశానికి తగ్గట్టు ఆడించిన పాత్ర అరబెల్లాది. ధృడమైన చిత్తం లేని జూడ్ ఇద్దరి చేతుల్లో కీలు బొమ్మ అయ్యాడు. అతను చదువుకున్న చదువు అతనికి జీవితంలో  మాత్రం ఉపయోగపడలేదు. కొన్ని జీవితాలు అంతేనేమో!

          *     *    *

         

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!