భూమి

 చదువరి

                     భూమి

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          పెర్ల్ ఎస్ బక్ రచనల్లో ద గుడ్  ఎర్త్ విశిష్టమైన నవల. బక్ మిషినరీల కూతురు అవ్వడం వల్ల ఆమె అమెరికన్ అయినప్పటికీ కూడా  తన జీవితంలో ఎంతో కాలం చైనాలో కూడా గడిపారు.అక్కడి పరిస్థితుల,ఆచారాల,సంప్రదాయాల పట్ల బక్ కు ఉన్న అవగాహన, ప్రపంచం పట్ల ఉన్న విస్తృత పరిశీలన కోణం ఈ గుడ్ ఎర్త్ నవలలో స్పష్టం అవుతుంది. ఈ గుడ్ ఎర్త్ కు కొనసాగింపుగా తర్వాత ఇంకో రెండు నవలలు కూడా వచ్చాయి. ఈ నవలలో చైనాలో ఉన్న సంప్రదాయాలు,పరిస్థితులు,మనుషుల్లో పరిస్థితులతో వచ్చే మార్పులు,కరువు కాటకాలు-సంపదలు,యుద్ధాలు  మనుషులను ఎలా మారుస్తాయి?వంటి ఎన్నో అంశాలు కూడా అంతర్లీనంగా ఉన్నాయి. అమెరికన్ రచయిత్రుల్లో నోబెల్ పురస్కారం పొందిన మొదటి మహిళా రచయిత్రి బక్. ఈ 'ద  గుడ్ ఎర్త్' నవలకు 1932 లో పుల్టిజర్ పురస్కారం దక్కింది. ఇది ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన క్లాసిక్ నవల.

          వాంగ్ లూంగ్ అనే ఓ పేద రైతు చైనాలోని ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. అతను పెళ్ళి వయసుకు వస్తాడు. ఈ నవలా కాలంలో చైనాలో మార్పులు ఓ పక్క,ఇంకో పక్క తమ ఆచారాలకు కట్టుబడే సమాజం ఇంకో పక్క ఉన్నాయి. వాంగ్ ఉంటున్న ఆ ఊరిలో హాంగ్ హౌస్ అనేది గొప్పవారి ఇల్లు. అక్కడ జమీందారులు ఉండేవారు.వారి దగ్గర ఎందరో స్త్రీ బానిసలు కూడా ఉండేవారు. వాంగ్ ఆ బానిసల్లో వయసులో ఉన్న ఓ లాన్ అనే స్త్రీను కొనుక్కుని వివాహం చేసుకుంటాడు.ఆమె అందంగా లేకపోయినా పట్టించుకోడు. అతని తండ్రి కూడా అందంగా ఉన్న స్త్రీలు బానిసలుగా ఉంటే ఆ జమీందారుల ఉంపుడుకత్తెలుగా  మారతారే తప్ప బాధ్యత ఉన్న భార్యలు కాలేరని, తమకు కావాల్సింది కుటుంబానికి పిల్లలు అందించి,కుటుంబ బాధ్యత పంచుకునే స్త్రీ మాత్రమే అని అందం గురించి ఆలోచించవద్దని తండ్రి హితబోధ చేస్తాడు.అలా ఓ లాన్ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది.

          నాటి నుండి వాంగ్ తో కలిసి ఓ లాన్ అన్నీ బాధ్యతలు పంచుకుంటుంది. ఓ పక్క ఇంటి పనులు చేస్తూనే పొలం పనులు కూడా చేస్తుంది భర్తతో కలిసి. కొన్నాళ్ళకు వాంగ్ కు ఓ కొడుకు పుడతాడు. అదే సమయంలో హాంగ్ హౌస్ లో జమీందారు స్త్రీల వ్యసనంతో,అతని భార్య మత్తు పదార్ధాలకు బానిస కావడంతో వారి ఆస్తులు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. తన కష్టంతో ఎదిగిన వాంగ్ వారి నుండి కొంత భూమి కొనుక్కుంటాడు. వాంగ్ పొలం వాతావరణం అనుకూలించడంతో బాగా పండుతుంది. దానితో లాభాలు వస్తాయి. ఓ లాన్ ఇంకో కొడుకును కంటుంది. వాంగ్ కుటుంబ సంపద అతని బాబాయి కంటిలో పడుతుంది. ఏ పని చేయకుండా, సోమరులుగా ఉన్న వారికి కూడా సమాజానికి భయపడి వాంగ్ సాయం చేయాల్సి వస్తుంది.

          వాంగ్ భార్య ఇంకో కూతుర్ని కంటుంది. ఇదే సమయంలో ఆ ప్రాంతం అంతా కరువు వస్తుంది. వాంగ్ కుటుంబం కూడా కొన్నాళ్ళకు ఆ కరువు బారిన పడక తప్పదు.ఆ సమయంలోనే ఓ లాన్ మళ్ళీ గర్భవతి అవుతుంది. అక్కడ కరువు ఎంత దారుణంగా ఉంటుందంటే  మనుషులు ఏది దొరికినా తినే పరిస్థితుల్లో ఉంటారు. ఆఖరికి మనుషులు మనుషుల్ని కూడా తినే పరిస్థితుల్లో,ఎవరైనా ధనికులు ఉంటే దోచుకు తినే పరిస్థితుల్లో ఉంటారు. వాంగ్ ఇంటిని కూడా అతని బాబాయి చెప్పుడు మాటలు విని ఉన్న కొన్ని గింజలను ఆ ఊరి వారు దోచుకుంటారు. అదే సమయంలో అందరి ఆకలి కుటుంబంలో తీరని పరిస్థితుల్లో తాను జన్మనిచ్చిన రెండో కూతుర్ని పుట్టగానే హత్య చేస్తుంది ఓ లాన్. ఆకలి ఎటువంటి పనులు మనిషి చేత చేయిస్తుందో ఈ పరిస్థితులు స్పష్టం చేస్తాయి.

          ఆ పరిస్థితుల్లో అక్కడి నుండి దక్షిణాన ఉన్న పట్టణానికి కుటుంబంతో కలిసి వలస వెళ్ళిపోతాడు వాంగ్. అప్పటి వరకు నేల మీద బ్రతికిన వాంగ్ కుటుంబం అక్కడ ఎలా బ్రతికాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ వాంగ్ ఇద్దరు కొడుకులు ,భార్య ,కూతురు అడ్డుక్కుంటూ సంపాదిస్తూ ఉంటారు. వాంగ్ ఆ పని చేయలేక ఓ రిక్షాను అద్దెకు తీసుకుని దాని మీద కొంత సంపాదిస్తూ ఉంటాడు. ఆ తర్వాత క్రమంగా వాంగ్ కొడుకులు దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారు.

          అక్కడ యుద్ధం వచ్చిన పరిస్థితుల్లో ,అక్కడ కూడా కరువు కబళించబోతున్న సమయంలో అక్కడ పేద వారు ధనవంతుల కుటుంబాలను దోచుకుంటున్న సమయంలో వాంగ్ కూడా ఓ ఇంట్లో డబ్బు అలానే సంపాదిస్తాడు.అతని భార్య కూడా ఓ ఇంట్లో నగలు దొంగతనం చేస్తుంది. తమకున్న కూతుర్ని బానిసగా అమ్మి వచ్చిన డబ్బుతో తమ ఊరికి తిరిగి వెళ్ళిపోదామనుకున్న వాంగ్ కు అలా డబ్బు,నగలు దక్కడంతో అక్కడి నుండి స్వస్థలానికి చేరుకుంటాడు. వాంగ్ తిరిగి వచ్చాక తన దగ్గర ఉన్న డబ్బుతో మళ్ళీ హాంగ్ కుటుంబం నుండి మళ్ళీ నేల కొంటాడు. ఆ ఊరిలోనే పెద్ద ధనవంతుడిగా మారతాడు. ఆ ఊరిలో ధనవంతుల్ని  బందిపోటు దొంగలు దోచుకుంటున్న సమయం అది. అతని సంపదను చూసిన అతని బాబాయి భార్య,కొడుకు తో తిరిగి అతని దగ్గరకు వస్తాడు. బాబాయి కూడా బందిపోట్లలో ఒకడని తెలుసుకున్న వాంగ్ ఇక తప్పని పరిస్థితుల్లో వారిని తన ఇంట్లో ఉంచుకుంటాడు. ఓ లాన్ కవలలకు (అబ్బాయి ,అమ్మాయి )జన్మనిస్తుంది.

          వాంగ్ ఆ ఊరిలో ఉన్న లోటస్ అనే వేశ్యతో సంబంధం పెట్టుకుంటాడు. తర్వాత ఆమెతో అతని సంబంధం గాఢంగా మారాక ఓ లాన్ దొంగతనం చేసి దాచుకున్న రెండు ముత్యాలను కూడా ఆమె నుండి తీసుకుని లోటస్ కు ఇస్తాడు. ఆ తర్వాత తన పిన్నితో మంతనాలు జరిపించి లోటస్ ను కొనుక్కుంటాడు.ఆమె కోసం తన ఇంట్లోనే ప్రత్యేకంగా భవనంలా కట్టిస్తాడు.ఆమెకు సకల సౌకర్యాలు ఉండేలా చూస్తాడు. లోటస్ తనతో పాటు హనాగ్ కుటుంబంలో పెద్ద బానిసగా ఉన్న స్త్రీని కూడా తనతో పాటు తెచ్చుకుంటుంది.లోటస్ రాకతో ఓ లాన్ పూర్తిగా స్థబ్దుగా మారిపోతుంది. వాంగ్ పెద్ద కొడుకును,రెండో కొడుకును చదివిస్తాడు.వాంగ్ పెద్ద కూతురుకు మనస్థిమితం సరిగా ఉండదు. లోటస్ పీచ్ అనే బానిసను వాంగ్ ద్వారా కొనుక్కుంటుంది.వాంగ్ కూడా ఈ ప్రక్రియలో ఎందరో బానిసలను కొంటాడు.

          వాంగ్ పెద్ద కొడుకు క్రమేపీ లోటస్ వైపు ఆకర్షితుడవుతాడు. అందుకనే అతన్ని పట్టణానికి పంపేస్తాడు. ఓ లాన్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింటుంది. ఆ తర్వాత ఆమె మరణించే లోపు పెద్ద కొడుకు వివాహం చేయమని పట్టుబట్టడంతో అలానే జరిపిస్తాడు. ఆ తర్వాత ఆమె మరణిస్తుంది.ఆమె మరణించిన తర్వాతి రోజే వాంగ్ తండ్రి కూడా మరణిస్తాడు.  తర్వాత పెద్ద కొడుకు సలహాపై హాంగ్ కుటుంబాపు కోటను అద్దెకు తీసుకుంటాడు వాంగ్. తన సొంత ఇంట్లో బాబాయి,పిన్నిలను ఉంచుతాడు.వారి కొడుకు ఆర్మీలో చేరతాడు. వాంగ్ వారికి ఎక్కువ మోతాదులో మత్తు పదార్ధాలు ఇస్తాడు.

          వాంగ్ పెద్ద కొడుకు విలాసవంతుడు. రెండో కొడుకు పొదుపరి. వాంగ్ పెద్ద కొడుకు పట్నపు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రెండో కొడుకు పల్లెటూరి అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. వాంగ్ మొదటి కొడుకు చదువుకున్న వాడిగా, రెండో కొడుకు వ్యాపారవేత్తగా ఉంటారు. మూడో కొడుకును తనలా రైతును చేద్దామని నిర్ణయించుకుంటాడు. కానీ వాంగ్ పెద్ద కొడుకు ఆ నిర్ణయాన్ని అతనికే వదిలెయ్యమని చెప్పడంతో మూడో కొడుకుకే నిర్ణయాన్ని వాంగ్ వదిలేస్తాడు.

          ఆ తర్వాత వాంగ్ బాబాయి మరణిస్తాడు. వాంగ్ బాబాయి కొడుకు తిరిగి వస్తాడు.అతనితో పాటు మిలిటరీ వాళ్ళు కూడా వస్తారు. వారికి పీచ్ నచ్చుతుంది.కానీ వాంగ్ ను వేడుకోవడంతో అతను దయ తలచి ఆమెను వారి నుండి తప్పించడానికి ఆమెకు రోగాలున్నాయని చెప్పమని సలహా ఇవ్వడంతో దానిని పాటించి వారి బారి నుండి తప్పించుకుంటుంది పీచ్. వాంగ్ రెండో కూతురు మీద కూడా అతని బాబాయి కొడుకు కన్ను పడటంతో ఆమెను కూడా పెళ్లి చేసి పంపేస్తాడు వాంగ్.వాంగ్ కుటుంబంలో ఉన్న బానిసల్లో పీచ్ గొప్ప అందగత్తె. తర్వాత కొంత కాలానికి వాంగ్ బాబాయి కొడుకు,అతనితో పాటు వచ్చినవారు వెళ్ళిపోతారు. వాంగ్ మూడో కొడుకు కూడా పీచ్ ను ఇష్టపడతాడు.పీచ్ వాంగ్ ను ఇష్టపడుతుంది.పీచ్ తో వాంగ్ కు క్రమేపీ శారీరక సంబంధం ఏర్పడుతుంది.దీనివల్ల లోటస్ కు,వాంగ్ కు మధ్య విభేధాలు వస్తాయి. వాంగ్ తన తర్వాత తన పెద్ద కూతురు పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించి ,తాను లేకపోతే ఆమెను ఎవరు పట్టించుకోరని భావించి పీచ్ ను నమ్మి,ఒకవేళ తానుచనిపోతే తన పెద్ద కూతురికి విషం ఇచ్చి చంపమని చెప్తాడు వాంగ్.తర్వాత వాంగ్ మూడో కొడుకు సైనికుడిగా మారడానికి ఇంటి నుండి వెళ్ళిపోతాడు.

          ఆ తర్వాత వాంగ్ కు తనకు కూడా అంతిమ ఘడియలు వచ్చాయని తెలుసుకుని తన సొంత ఇంటికి కొందరు పని వాళ్ళతో ,పీచ్ తో ,పెద్ద కూతురితో కలిసి వెళ్ళిపోతాడు. తన తండ్రికి ఉన్న నేలను అమ్మి పంచుకోవాలని ఇద్దరు కొడుకులు నిర్ణయించుకుంటారు. అప్పటికే వాంగ్ చావు బ్రతుకులా మధ్య ఉంటాడు. తండ్రికి తమ నిర్ణయం చెప్తారు కొడుకులు.తండ్రి ఒప్పుకోడు. కానీ వారి నిర్ణయం మారదనే అంతర్లీన సందేశంతో నవల ముగుస్తుంది.

          నవల  ప్రారంభంలో హాంగ్ కుటుంబంలోని ఓ బానిసను కొనుక్కుని వివాహం చేసుకునే స్థాయిలో ఉన్న వాంగ్ ఆ తర్వాత ఆ కుటుంబాపు భూమి కొనుక్కునే స్థాయికి ఎదిగాడు.ఎన్ని కష్టాలు వచ్చినా,కరువు కాటకాల బారిన పడినా సరే ఏ నాడు భూమిని అమ్మే ప్రయత్నం చేయలేదు.ఎప్పుడు భూమిని పెంచుకునే క్రమంలోనే ఉన్నాడు.కానీ అవసాన దశలో అతని కొడుకులు ఆ భూమిని నిలుపుకునే ప్రయత్నం చెయ్యకపోగా దానిని అమ్మాలనే నిర్ణయంతో ఉన్నారు. మనిషి ఎంత తాపత్రయ పడినా,తన చేతుల్లో లేని విషయాన్ని ఏం చేయలేడని ఇక్కడ స్పష్టం అవుతుంది.

          అలాగే వాంగ్ మొదట కుటుంబం ఆకలితో ఉన్నప్పుడూ తమకున్న ఎద్దును కూడా చంపలేని సున్నిత మనస్కుడు.కానీ తనతో భార్యగా వచ్చిన దగ్గర నుండి గొడ్డు చాకిరి చేసి,అతనికి పొలం నిలుపుకోవడంలో,లాభాలు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన భార్య విషయంలో మాత్రం ఆ మాత్రం దయ చూపించలేకపోయాడు. చివరి రోజుల్లో ఇంకో అమ్మాయిని తీసుకువచ్చి తాను చిన్నప్పటి నుండి పెరిగిన బానిస మనసును మళ్ళీ ఆమె మనసులో ప్రవేశపెట్టాడు.మొదట్లో ఆమె పెద్ద వారికి బానిస అయితే,చివర్లో భర్తకు బానిసలా ,కుటుంబానికి బానిసలా పని చేసింది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె అంతే చాకిరి చేసినా అది తన కుటుంబం కోసం అని సర్ది చెప్పుకున్నా,భర్త ఇంకో స్త్రీని తీసుకురావడం అన్నది ఆమెకున్న యదార్ధ స్థానాన్ని ఆమెకు గుర్తు చేసినట్లైంది. చివర్లో వాంగ్ ఆమె పట్ల పశ్చాత్తాప పడ్డ అది నిరుపయోగమే అయ్యింది.

          తన జీవితమే భూమి అని భావించి ఎన్ని కష్టాలు వచ్చిన దానిని మాత్రం అమ్మకుండా ఉన్న వాంగ్ చివరకు కొడుకుల హయాంలోకి వచ్చేసరికి ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. దీనికి కొనసాగింపుగా సన్స్ ,ఏ హౌస్ డివైడెడ్ నవలలు కూడా వచ్చాయి.ఈ నవల చదువుతూనే పూర్తిగా వాంగ్ కుటుంబ ఆవరణలోనే మనము ఉన్నామనే భావన కలుగుతుంది.

          తన ఉనికిని నిలుపుకోవాలనే తపన మనిషిలో ఎంత గాఢంగా ఉంటుందో వాంగ్ పాత్ర స్పష్టం చేస్తుంది. అలాగే సంపద మనుషుల్ని ఎలా సోమరిపోతుల్ని చేస్తుంది హాంగ్ కుటుంబం తెలుపుతుంది.కానీ హాంగ్ కుటుంబం లానే వాంగ్ కుటుంబం కూడా అదే మార్గంలో పయనించడం అన్నది మనిషి సంపాదించిన సంపద ఇంకే పరిస్థితులను తనతో తీసుకువస్తుందో స్పష్టం చేస్తుంది. బక్ శైలి,కథాంశం ,నడిపిన తీరు నవలను ఎక్కడ బోర్ కొట్టకుండా చదివింపజేస్తాయి.మీకు వీలుంటే తప్పక ఈ క్లాసిక్ చదవండి.

                         *    *    *

 

 

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!