మామూలు మనిషి

 సీజనల్ సమీక్షలు

మామూలు మనిషి

    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


           భారతీయ వెబ్ సిరీస్ లో అందరినీ ఎక్కువ ఆకర్షించిన వెబ్ సిరీస్ 2019 లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ -1.మనోజ్ బాజ్ పే ,ప్రియమణి ముఖ్య పాత్రలుగా ఉన్న ఈ వెబ్ సిరీస్ విజయానికి కారణం ఓ పక్క కుటుంబాన్ని,ఇంకో పక్క దేశం ఆపదలో చిక్కుకున్న పరిస్థితులను కూడా వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించడం వల్లే.ఈ సిరీస్ లో నాయకుడు అయిన శ్రీకాంత్ వృత్తి పరంగా,ఇటు కుటుంబపరంగా కూడా సతమతమవుతూనే ఉంటాడు. తెలివి,తన వృత్తి పట్ల అంకితభావం,దేశ భక్తి,మానవత్వం ఉన్న శ్రీకాంత్ లో కుటుంబ బాధ్యతలు,వృత్తి బాధ్యతల్లో దేనికి సంపూర్ణ న్యాయం చేయలేని పరిస్థితి కూడా ఉంది. నిజానికి జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో బలహీనతలు ఉంటాయి,అన్నీ సక్రమంగా చేయడానికి సమయం కూడా ఉండని పరిస్థితులు కూడా సర్వసాధారణం.కానీ నాయకుడిని సూపర్ హ్యూమన్ గా చిత్రీకరించడం కూడా జరుగుతూనే ఉంటుంది.కానీ ఈ సిరీస్ లో మాత్రం వాస్తవానికి,హీరోయిజం కు మధ్య సమన్వయం చక్కగా కుదిరింది.అందుకే ఇది ప్రేక్షకాదరణ పొందింది.

          అరేబియన్ సముద్రానికి దగ్గర ఉన్న కొచ్చిలో ఓ షిప్ లో ప్రయాణం చేస్తున్న ముగ్గురు ఐఎస్ఐఎస్ టెరరిస్టులను భారతీయ కోస్టల్ గార్డ్ అధికారులు పట్టుకుంటారు. టాస్క్ నేతృత్వంలో ఫోర్స్ వన్ ను ఈ ఆపరేషన్ చేయాల్సిందిగా ఆజ్ఞలు వస్తాయి. టాస్క్ ఆఫీసర్ శ్రీకాంత్ ఇంట్లో సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. అతను అటెండ్ చేయాల్సిన  ఈ ఆపరేషన్ మధ్యలో అతను తన కూతురు స్కూల్ నుండి ఫోన్ రావడంతో మధ్యలోనే వెళ్ళిపోతాడు. ఆ ముగ్గురు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ముగ్గురిలో ఒకతను కాల్పుల్లో చచ్చిపోతాడు. ఈలోపు శ్రీకాంత్ తిరిగి వస్తాడు. ఆ ముగ్గురిలో మూసా అనే అతను శ్రీకాంత్ వల్ల సరెండర్ అవుతాడు.మూసాను,అతనితో పాటు ఉన్న ఇంకొక అతన్ని కాల్పుల్లో గాయపడటం వల్ల హాస్పటల్ లో ఉంచుతారు. ఆ రెండో అతను కోమాలో ఉంటాడు.        

          ఇక్కడ శ్రీకాంత్ మూసాను ఒప్పించే ప్రయత్నంలో ఎంత తెలివిగా అతనికున్న అమ్మ సెంటిమెంటును ఉపయోగిస్తాడో చూపించడం వల్ల అతని వైఫల్యాలను,తెలివిని దర్శకుడు ఒకేసారి ప్రేక్షకులకు పరిచయం చేస్తాడు.

          పాకిస్తాన్ లో మేజర్ సమీర్ మిషన్ జుల్ ఫిఖర్ ప్లాన్ చేస్తాడు. దాని ద్వారా భారతదేశంలో అల్లర్లు సృష్టించి ఆ సమయంలో పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య యుద్ధం జరిగేలా చూసి, ఆ సమయంలో మిలిటరీ అధీనంలోకి పాకిస్తాన్ ను తీసుకురావడమే ఈ మిషన్ లక్ష్యం.

          దానిలో భాగంగా ఓ స్కూటర్ లో బాంబ్ పెడతారు. దానిని  డిఫ్యూజ్ చేసినా సరే అది పేలుతుంది. అదే సమయంలో ఐఎస్ఐఎస్ కు పని చేస్తున్న ముగ్గురు హ్యాకర్లను వారు పట్టుకుంటారు. వారు ఓ డ్రాప్ బాక్స్ ఉందని, అందులో నుండి ఒకతను ఎప్పుడు ఏవో సందేశాలు తీసుకుంటూ ఉంటాడని,అతను విక్టోరియా కాలేజ్ విద్యార్థి అని,కానీ అతన్ని తామేప్పుడు కలవలేదని చెప్తారు.

            విద్యార్థి కరీం. ముస్లింల పట్ల హిందువులు ఓ సారి చేసిన దాడికి వ్యతిరేకంగా అతను తన మిత్రులతో కలిసి ఆ హిందూ పెద్దలతో బీఫ్ తినిపించాలని నిర్ణయించుకుని దానికి పథకం తయారు చేసుకుంటారు. ఆ డ్రాప్ బాక్స్ దగ్గర కరీం టాస్క్ కంట్లో పడతాడు. టాస్క్ వారిని అనుమానించి వెంబడించిన ప్రయత్నంలో వారిపై విద్యార్ధులు కాల్పులు మొదలుపెట్టడంతో వారిని టాస్క్ కాల్చేస్తారు. అలా ఆ విద్యార్ధులు ఆ కాల్పుల్లో మరణిస్తారు.కానీ వారికి ఆ మిషన్ కు ఏ సంబంధం ఉండదు.కేవలం ముస్లిములను అవమానించిన వారికి బుద్ధి చెప్పడమే వారి ప్రయత్నం.కానీ ఈ ఆ బాంబ్ బ్లాస్టును సెట్ చేసిన విక్టోరియా కాలేజీకి చెందిన ఇంకో విద్యార్థి సాజిద్ మాత్రం ఇంటరాగేషన్ తర్వాత బయటపడతాడు.

          దీని వల్ల శ్రీకాంత్ తాను అనవసరంగా ఆ విద్యార్ధుల మరణానికి కారణమయ్యానని బాధ పడతాడు. ఇది కేవలం మిషన్ నుండి టాస్క్ ను డీవియేట్ చేయడానికి ఐఎస్ఐఎస్ చేసిన కుట్ర అని వారికి అర్ధమవుతుంది. ఇది బయట శ్రీకాంత్ వృత్తి పరంగా జరుగుతున్న ఉదంతాలు.

          ఇక శ్రీకాంత్ వ్యక్తిగత జీవితానికి వస్తే అతని భార్య సుచిత్ర ఓ లెక్చరర్.ఆమెకు,శ్రీకాంత్ కు కుటుంబ బాధ్యతల విషయంలో ఘర్షణ నడుస్తూ ఉంటుంది. దాని వల్ల పిల్లల మనసుల్లో కూడా తల్లిదండ్రుల మధ్య గొడవలు ఉన్నాయనే అభిప్రాయం ఉంటుంది. సుచిత్రకు ఇంకేదైనా ఛాలెంజింగ్ గా చేయాలని కోరిక. ఆమె స్నేహితుడు అరవింద్ ఆమెకు తాను ఇంకొకరితో మొదలుపెట్టిన ఓ స్టార్ట్ అప్ కంపెనీలోకి ఆహ్వానిస్తాడు.అతని సలహా మేరకు లెక్చరర్ గా ఉద్యోగం మానేసి దానిలో చేరుతుంది. శ్రీకాంత్ కు అరవింద్ కు ఆమెకు మధ్య సంబంధం ఉందేమోనని అనుమానిస్తాడు.

          సాజీద్ కు ఐఎస్ఐఎస్ నుండి సమాచారం వస్తుంది. కరీంను కేవలం మిషన్ ను కాపాడటం కోసం పావుగా వాడటం జరిగిందని అతనికి అర్ధమవుతుంది. కరీం,అతని మిత్రుల విషయంలో శ్రీకాంత్ ఇన్వెస్టిగేషన్ కూడా ఎదుర్కుంటాడు. అంతా తన తప్పే అని భావిస్తాడు . అదే సమయంలో దానికి శిక్షగా అన్నట్టు శ్రీకాంత్ ను శ్రీనగర్ బదిలీ చేస్తారు. పైకి అలా కనిపించినా మిషన్ జుల్ఫికర్ అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారన్న అనుమానంతో దానిని శ్రీకాంత్ చేధించాలని అక్కడికి అతనికి బదిలీ చేయిస్తారు.

          ఈ మిషన్ ను అసలు నిర్వహించాల్సిన మూసా తెలివిగా ఆ హాస్పటల్ లోని ఓ నర్సును తనను ప్రేమించేలా చేసి ఆమె ఫోన్ నుండి ఓ కాల్ చేసి, ఆ తర్వాత తనతో అదే హాస్పటల్ లో ఉన్న తన బృంద సభ్యుడి రూమ్ కు తాళం తీసుకుని అతనికి ఓ విషపు ఇంజెక్షన్ చేసి అతన్ని హత్య చేస్తాడు. శ్రీకాంత్ వెళ్లిపోయాక ఆ హాస్పటల్ కు రక్షణ కూడా తగ్గించేస్తారు. ఆ తర్వాత మూసాను తప్పించడానికి ఆ బృందం వారు వస్తారు. అదే సమయంలో శ్రీకాంత్ హెచ్చరికలు అందుకుని టాస్క్ ,ఫోర్స్ 1 వెళ్ళినప్పటికీ మూసాను పట్టుకోలేకపోతారు.కొందరు ఆఫీసర్స్ కూడా మరణిస్తారు.మూసా ఆ నర్సును కూడా హత్య చేసి అక్కడ నుండి తనను తీసుకువెళ్ళడానికి వచ్చిన బృందంతో పారిపోతాడు.

          శ్రీనగర్ లో శ్రీకాంత్ చాకచక్యం వల్ల ఢిల్లీకి  నర్వ్ గ్యాస్ పంపి అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేయాల్సిన పథకం రద్దవుతుంది. పాకిస్తాన్ ప్రధాని జనరల్ అన్సారితో మాట్లాడి అతని కోరిక మేరకు అతన్ని మిలిటరీ చీఫ్ చేస్తాడు. ఆ తర్వాత జనరల్ సమీర్ ను బంధిస్తారు.అలా మిషన్ ఆగిపోయినా మూసా మాత్రం ఆ మిషన్ ఎలా అయినా పూర్తి చేయాలనే నిర్ణయించుకుంటాడు. శ్రీనగర్ నుండి శ్రీకాంత్ తిరిగి వస్తాడు.

          కరీం చనిపోయాక అతని ఫోన్ అధికారులు స్వాధీనపరచుకుంటారు. అదే సమయంలో కరీం గర్ల్ ఫ్రెండ్ అయిన జొనాలికి ఆ ఫోన్ నుండి ఓ మెసేజ్ వస్తుంది. దానితో ఆ విషయం పట్ల కుతూహలం కలిగి,ఆమె అతను ఎప్పుడు తనతో పాటు కెమెరా ఉంచుకుంటాడని గుర్తు తెచ్చుకుని దాని కోసం వెతికితే అది దొరుకుతుంది.

          మూసా ఓ కెమికల్ ప్లాంట్ లో మేనేజర్ గా పని చేస్తున్న వైభవ్ ను బెదిరించి దాని ద్వారా ఢిల్లీలో కూడా భోపాల్ గ్యాస్ ట్రాజెడీ లా అంతే పెద్ద విస్పోటనం చేయాలని నిర్ణయించుకుని సాజీద్ తో సహా మొత్తం ఆ కెమికల్ ప్లాంట్ నుండి కొన్ని గంటల్లో గ్యాస్ విడుదల అయ్యేలా చేస్తాడు.వైభవ్ ద్వారా ఏదో చేయబోతున్నారని గ్రహించిన టాస్క్ వైభవ్ ఆఫీసుకు వెళ్ళిన అక్కడ వారు కనబడరు.తర్వాత మళ్ళీ అనుమానమొచ్చి వెళ్తే అప్పటికే గ్యాస్ ఫిక్స్ అయ్యి గార్డ్స్ ఉంటారు.టాస్క్ లోని ఇద్దరు ఆఫీసర్స్ కు అనుమానమొచ్చి మళ్ళీ ఆ ఆఫీసుకు వెళ్తారు.

          మూసాను ఏ విధ్వంసం చేయకుండా ఆపడానికి అతని తల్లిని పట్టుకుంటారు టాస్క్ అధికారులు.ఆమె చేత టెలివిజన్ లో ఓ ప్రోగ్రామ్ ఇప్పిస్తారు. అది చూసిన మూసా తన తల్లిని కాపాడటానికి మళ్ళీ ఆ ఆఫీసుకు బయల్దేరతాడు.కానీ ఆ మిషన్ ఎవరి కోసం ఆగకూడదని అనుకున్న సాజీద్ తో అతనికి గొడవ అవుతుంది. ఆ క్రమంలో మూసా చనిపోతాడు. ఇంకో పక్క ఆ ఇద్దరు టాస్క్ ఆఫీసర్స్ తమ ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటారు. దీనితో సీజన్-1 ముగుస్తుంది.

          ఈ సీజన్ లో మామూలు మనుషుల ప్రవర్తన,పరిస్థితులకు లోబడే మనుషులు ఎలా ఉంటారో,కుటుంబం వృత్తి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా శ్రీకాంత్ ,అతని కుటుంబం వల్ల కథలో ఇమడ్చడం వల్ల ఈ సీజన్ ప్రేక్షకాదరణ దక్కింది, ఆ ఎలిమెంట్ లేకపోతే అన్నీ కథల్లో ఒకటిగానే మిగిలిపోయేది.

                   *    *    *

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!