మామూలు కథే!

సినీ సంచారం     

మామూలు కథే!

                                      -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


     న్నో సినిమాలు....ఎన్నో కథలు...కానీ కథలకు ఉండే మూలాలు మాత్రం హ్యూమన్ ఎమోషన్స్. ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాల్లో సుఖాంతాలే ఎక్కువ. కానీ  ఎన్ని వైవిధ్యాలు ప్రవేశపెట్టబడినా సరే కుటుంబ చిత్రాలు మాత్రం ఎప్పుడూ  హిట్ ఫార్ములానే. ఆ హిట్ ఫార్ములా తప్పకుండా ఉండాలంటే ఆ కథలో కొత్తదనం కూడా తప్పనిసరే. ఆ కొత్తదనమే సంవత్సరంలో విడుదలయ్యే వందల సినిమాల్లో కొన్నింటిని నిర్మాతల,ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా చేస్తాయి. తమిళ,హిందీ చిత్రాలతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న మాధవన్ నటనా విలక్షణత చూడాలనుకుంటే తప్పక చూడాల్సిన బాలీవుడ్ సినిమా రామ్ జీ లండన్ వాలే. ఈ సినిమా చెల్లెలి పెళ్లి కోసం అన్న పడ్డ తపనగా అనిపించినా సరే, దేశం వదిలి వెళ్ళినా విడువని తను పెరిగిన సాంప్రదాయాన్ని విడిచిపెట్టలేని ఓ సాధారణ వ్యక్తి కథ కూడా.

     బీహార్ లో తండ్రి నుండి వారసత్వంగా గొప్ప వంటవాడిగా మారిన వ్యక్తి రామ్ జీ. తండ్రి బాల్యంలోనే చనిపోవడంతో అతని జీవితంలో చెల్లి పార్వతి,తన వంటలు మాత్రమే ప్రపంచంగా మిగిలేలా చేశాయి. తన చెల్లెలి పెళ్ళి ఘనంగా చేయడమే అతని చిరకాల కల. ఓ మంచి సంబంధం చూస్తాడు.కట్నం ఇవ్వడం కోసం తన చెల్లెలి పెళ్ళికి డబ్బు ఇస్తే తాను  ఆ ఊరిలోని ఓ పెద్ద మనిషి కూతుర్ని చేసుకుంటానని మాట ఇస్తాడు.అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి అనుకుంటాడు రామ్ జీ. వివాహం అయిపోతుంది.కట్నం ఇవ్వాల్సిన సమయం వస్తుంది.కానీ పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోవడంతో ఆ కట్నం రామ్ జీ ఇవ్వలేకపోతాడు. అదే సమయంలో లండన్ లో ఓ పెద్ద రెస్టారెంట్ యజమాని తన స్నేహితుడి ద్వారా తనకు ఓ భారతీయ వంటవాడు కావాలని అడగటంతో, చెల్లెలి పెళ్ళి కట్నం ప్రతి నెల అత్తారింటికి పంపే ఒప్పందంతో అక్కడికి వెళ్తాడు.కానీ అతను అక్కడికి వెళ్ళేసరికి ఆ యజమాని మరణించడంతో అతనికి ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోతుంది.కానీ తిరిగి తన ఊరు వెళ్ళడానికి మనసు అంగీకరించదు.

     అక్కడ తన వర్క్ పర్మిట్,వీసా,పాస్ పోర్ట్ ఉన్న బ్యాగ్ కూడా దొంగిలించబడుతుంది.రాంజీ ఓ చిన్న పిల్లవాడిని యాక్సిడెంట్ కాకుండా కాపాడటంతో ఆ బాబు తల్లిదండ్రులు అతన్ని తమ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. మాటలు రాని,తినడం రాని ఆ పిల్లవాడు రాంజీ రాకతో ఆ రెండు పనులు చెయ్యగలగడంతో అతని మీద ఆ భార్యాభర్తలకు నమ్మకం కూడా కలుగుతుంది. ఆ భార్యాభర్తలు ఓ రెస్టారెంట్ నడుపుతూ ఉంటారు.కానీ వర్క్ పర్మిట్,వీసా,పాస్ పోర్ట్ లేని వారికి ఉద్యోగం ఇవ్వడం నేరం అయినప్పటికీ కూడా రాంజీను తమ రెస్టారెంట్లో చెఫ్ గా  గురు భార్యా,కొడుకుల సంతోషం కోసం  చేర్చుకుంటాడు. ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని పట్టుకోవడంతో అతన్ని కాపాడటానికి  ఏదైనా చేయమని గురు తన లాయర్ స్నేహితుడైన జైను అడుగుతాడు. జై తాను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి అయిన సమీరాను ఆ పెళ్ళి చేసుకున్న మూడు నెలల తర్వాత విడాకులు తీసుకోవచ్చని  అందుకు ఒప్పించి ఆమెకు తెలియకుండా డబ్బు తీసుకుంటాడు.

     సమీరాకు,రాంజీ కు వివాహం చర్చ్ లో జరిపిస్తారు గురు దంపతులు,జై. రాంజీ పేరును రాబర్ట్ గా మార్పిస్తారు. ఇమ్మిగ్రంట్ ఆఫీసర్స్ మధ్యలో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు కనుక రాంజీ కూడా సమీరా ఇంట్లో ఆమెతో పాటే ఉండాల్సి వస్తుంది. సమీరాకు రాంజీ పద్ధతులు నచ్చకపోయినా తప్పక సర్దుకుపోతూ ఉంటుంది. ఆ క్రమంలో రాంజీ జైకు అప్పటికే పెళ్ళయిపోయిందని, ఓ కొడుకు కూడా ఉన్నాడని వారిని వదిలేశాడని అతని మొదటి భార్య ద్వారా తెలుసుకుంటాడు. అదే విషయం సమీరకు కూడా తెలియజేస్తాడు. దానితో జై మోసం తెలుసుకున్న సమీరా అతన్ని నిలదీసి అడుగుతుంది.అతను ఏ మాత్రం పశ్చాత్తాపపడకపోగా ఆమె తనతో సరిగ్గా ఉండకపోతే ఆఫీసర్స్ కు చెప్పి ఆ పెళ్ళి గురించి గుట్టు రట్టు చేస్తానని బెదిరిస్తాడు. ఆ తర్వాత రాంజీ తన మీద చూపుతున్న శ్రద్ధ చూసిన సమీరా అతన్ని ప్రేమిస్తుంది.

     ఈ గొడవలతో సతమతమవుతున్న రాంజీ సమయానికి డబ్బులు పార్వతి ఇంటికి పంపకపోవడంతో ఆమెను ఇంటి నుండి గెంటేస్తారు. పార్వతి గురించి తెలుసుకున్న సమీరా ఆమెను బాల్యం నుండి ప్రేమించిన అతనితో ఆమె వివాహం జరిగేలా,ద ఆనితో పాటు జై ఆ పెళ్ళి చేసుకోవడం కోసం తీసుకున్న డబ్బు జాయింట్ అకౌంట్ లో ఉండటం వల్ల ఆ డబ్బు పార్వతికి అందేలా చేసి ఆమె జీవితాన్ని నిలబెడుతుంది. ఇమ్మిగ్రంట్ ఆఫీసర్స్ ఇంటర్వ్యూ కోసం రాంజీ,సమీరా ఒకరి గురించి ఇంకొకరు బాగా తెలుసుకుంటారు. ఆ ఇంటర్వ్యూ ఇద్దరు అన్నీ బాగా చేశాక,చివర్లో రాంజీ తన చెల్లెలి జీవితం నిలబెట్టడం కోసం సమీరా తాను పెళ్ళి చేసుకోవడానికి ఇచ్చిన డబ్బును ఎలా ఇచ్చిందో చెప్పడంతో పట్టుబడతాడు.అతన్ని అరెస్ట్ చేసి వెంటనే బలవంతంగా భారత దేశం పంపే ప్రయత్నం జరుగుతున్న సమయంలో అతను బ్రిటన్ కంపెనీ స్పాన్సర్ చేస్తున్న ఓ చెఫ్ కాంపిటీషన్ లో విజేత అవ్వడంతో వారు ఎంబసీ నుండి అతను పోగొట్టుకున్న డాక్యుమెంట్స్ ఇచ్చేలా చేస్తారు.కానీ తాను లండన్ వచ్చింది పార్వతి కోసమే అని తిరిగి భారత దేశం వెళ్ళిపోతాడు రాంజీ.              

     ఆ తర్వాత సమీరా కూడా అక్కడికి వెళ్ళడం,వారి వివాహం జరగడం,అతను కొత్త రెస్టారెంట్ తెరవడంతో సినిమా సుఖాంతం అవుతుంది.

     కథ మామూలు అంశమే అయినప్పటికీ విదేశానికి వెళ్ళిన రాంజీ భారత దేశంలో స్త్రీకి ఉన్న ప్రాముఖ్యతను ఎలా విదేశానికి వెళ్ళిన గౌరవించాడో,అమాయకుడైన అతను అక్కడి సంస్కృతితో ఎన్ని ఇబ్బందులు పడినా తన మంచి మనసుతో ఎలా విదేశంలో కూడా మనగలిగాడు అన్నది ఈ సినిమా చూసేలా చేస్తుంది. నటనా పరంగా అమాయకత్వం,తెలియనితనం,ఇంగ్లీష్ రాకపోవడం,అతన్ని కొంత అనాగరికుడిగా చూసినా  తన భావాలతో అందర్నీ ఆకట్టుకోవడం వంటివి ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తాయి. మామూలు కథల్లో ఉండే మామూలు భావాలే మనుషుల్ని ఎలా కదిలిస్తాయో ఈ సినిమా స్పష్టం చేస్తుంది.

   *    *    *

     

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ