డార్క్ స్కూల్

సినీ సంచారం

డార్క్ స్కూల్

    -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          హారర్ సినిమాల్లో వైవిధ్యత లేకపోతే చూడాలనిపించదు.ఒకే తరహాలో చనిపోయిన వారు బ్రతికున్న వారిపై వివిధ కారణాల  వల్ల పగ తీర్చుకోవడం,లేకపోతే పాడుపడిన బంగ్లా కథలు ఇప్పటికే పాతబడిపోయాయి. మరి కొత్తదనం లేకపోయినా చూడలనిపించేలా తీసిన సినిమానే 2018 లో వచ్చిన డౌన్  ఏ డార్క్ హాల్ సినిమా. అమెరికన్ రచయిత్రి లూయిస్ డంకన్ అనే రచయిత్రి నవల ఆధారంగా అదే పేరుతో తీసిన సినిమా ఇది.

          కిట్ అనే టీనేజర్ తన అగ్రెసివ్ ప్రవర్తనతో తల్లిదండ్రులకు ఓ సమస్యగా మారుతుంది. అలా యవ్వనంలో తల్లిదండ్రులకు సమస్యగా మారే వారిని ఓ అభిరుచి ప్రకారం వారికి ఓ కొత్త జీవితాన్ని ఆహ్వానించేలా ఓ బ్లాక్ వుడ్ బోర్డింగ్ స్కూల్ నడుస్తూ ఉంటుంది. అక్కడకు కిట్ ను ఆమె తల్లిదండ్రులు పంపిస్తారు.

          ఆ స్కూల్ లో ఆమెకు ఆమెతో పాటు అదే పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన నలుగురు  అమ్మాయిలు పరిచయమవుతారు.వారు వెరోనికా,యాష్లి,సిరా ,లిజ్జి.ఆ స్కూల్ లోకి వచ్చాక సెల్ ఫోన్ వాడటానికి ఉండదు. వారు అక్కడికి వచ్చినప్పటి నుండి వారికి మ్యూజిక్,పెయింటింగ్,పోయిట్రీ,హిస్టరీ వంటి ఎన్నో క్లాసులు జరుగుతూ ఉంటాయి.

          ఆ  నలుగురు అమ్మాయిల్లో సిరా పెయింటింగ్ ను ఓ ఆబ్సెషన్ లా మార్చుకుని, తిండి,నిద్ర కూడా మానేసి ఎప్పుడు పెయింటింగులు  వేస్తూ ఉంటుంది. యాష్లి మంచి కవిత్వం రాస్తూ ఉంటుంది. కిట్ మరియు లిజ్జీలకు ఇదంతా ఎందుకో తెలియని ఓ ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్క లిజ్జి తప్ప అందరూ ఏదో ఒక ప్రతిభను సాధిస్తారు.కిట్ కూడా పియానో వాయిస్తూ ఉంటుంది.

          సిరా పెయింటింగ్స్ చివర్లో సంతకం టిసి అని ఉండటం చూసి, లైబ్రరీలో ఆమె కొన్ని పుస్తకాల ద్వారా సిరా థామస్ కోలే అనే పెయింటర్ పెయింటింగ్స్ ను తిరిగి వేస్తుందని తెలుసుకుంటుంది.అలాగే మిగిలిన వారు కూడా చనిపోయిన మేధావుల కళలనే తిరిగి సృష్టిస్తున్నారని ఆమెకు అర్ధమవుతుంది.

          కిట్ ,వెరోనికాను ఒప్పించి ఆ స్కూల్ లో ఎవరు వెళ్ళని ఓ చోటుకు వెళ్ళి శోధిస్తే ఆ రహస్యం ఏమిటో తేలిపోతుందని చెప్పి ఆమెతో కలిసి అక్కడ వెతకడం ప్రారంభిస్తుంది. అక్కడ ఉన్న స్కూల్ ఓల్డ్ రికార్డ్స్ ద్వారా అప్పటికే ఆ స్కూల్ లో అంతకుముందు అడ్మిట్ అయిన అమ్మాయిలందరూ మరణించారని వారికి అర్ధమవుతుంది. మరణించిన వారు ఆవహించడం వల్ల వారంతా మరణించారని కూడా స్పష్టం అవుతుంది.

          ఈ లోపు ఆ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అయిన డ్యురేట్ అక్కడికి రావడంతో కిట్ ను తప్పించి వెరోనికా ఆమెకు దొరికిపోతుంది. వెరోనికాను ఆ స్కూల్ లో ఎవరికి తెలియని ప్రదేశంలో బంధిస్తుంది డ్యురేట్. అక్కడ ఉన్న అమ్మాయిలందరూ మరణించిన మేధావుల కళను కొనసాగించడానికి వచ్చారని,ఎవరు తన మాట జవదాటకూడదని డ్యురేట్ వారిని హెచ్చరిస్తుంది.

          కిట్ ఎలాగో పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఈ లోపు మిగిలిన వారితో తప్పించుకుందామనుకుంటుంది కిట్. అప్పటికే సిరా అలా నిద్రా,ఆహారం లేకుండా పని చేయడం వల్ల మరణిస్తుంది. యాష్లి ఆ ఆత్మ ఆవహాన భరించలేక ఆ భవనం పై నుండి దూకి మరణిస్తుంది.

          వెరోనికాను తప్పించే ప్రయత్నంలో కొన్ని వెలుగుతున్న కొవ్వొత్తులు పడటంతో ఆ భవనమంతా మంట వ్యాపిస్తుంది. లిజ్జి ఆ మంటల్లో మరణిస్తుంది. డ్యురేట్ కూడా ఆ మంటల్లో మరణిస్తుంది. కిట్ మాత్రం బ్రతికి బయటపడుతుంది.

          ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్ కాస్త కొత్తగా ఉండటం వల్ల సినిమా మొదటి నుండి ఆసక్తికరంగానే ఉంటుంది. హారర్ సినిమాలు కూడా మీ సినీ అభిరుచుల్లో ఉంటే తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

  *   *   *

 

         

  

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!