ఆహ్వానం లేని అతిథి

 చదువరి

                             ఆహ్వానం లేని అతిథి

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          చౌన్సీ జి.పార్కర్ రాసిన ద విజిటర్ నవలలో ఈ ప్రపంచంలోని ప్రతి జీవి తన జీవితంలో అల్లకల్లోలం సృష్టించబడితే దానికి ఎలా స్పందిస్తుంది,ఎంత జాగ్రత్తగా ఉంటుంది అన్న విషయం స్పష్టం అవుతుంది.

          మాట్లాడలేని,తన మనసులో ఉన్న ఏ విషయాన్ని మనుషుల లోకంలో జీవించే పరిస్థితులు ఉన్నా, వారితో ఏ  విషయం పంచుకోలేని జీవులు పక్షులు,జంతువులు.కొన్ని జంతువులను,పక్షులను మనిషి తన ఇష్టానుసారం పెంపుడు జంతువులుగా పెంచుకుంటాడు. వాటికి మనిషి నుండి ఎటువంటి ఆపద వాటిల్లదు. మనిషి వాటిని ప్రేమిస్తాడు,పెంచుకుంటాడు.కానీ తమ జీవనం కొనసాగించడానికి తప్పక మనుషుల జీవితంలో  భాగం అవ్వాల్సిన పరిస్థితి వచ్చి,మనిషికి వాటికి మధ్య శతృత్వం ఏర్పడిన పరిస్థితుల్లో అవి ఎలా మనగలుగుతాయి ? అన్న అంశాన్ని స్పృశిస్తూనే,ఓ మనిషిని ఓ ఎలుక ఎలా ముప్పు తిప్పలు పెట్టిందో చెప్పే నవల ఇది. ఇది 1983 లో Of Unknown Origin’ సినిమాగా కూడా వచ్చింది. 

          బార్ట్ ఓ బ్యాంకులో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్నాడు. అతనికి భార్య,పిల్లలు. ఎంతో సంతోషమైన కుటుంబం వారిది. బార్ట్ కు న్యూయార్కులో తన తాతల కాలం నుండి సంక్రమించిన ఓ ఇల్లు ఉంది. భార్య,పిల్లలు మైయానిలో ఉంటే ,బార్ట్ ఆ ఇంట్లో ఉంటూ వీకెండ్స్ మాత్రం భార్యా,పిల్లల దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటాడు. ఎంతో ప్రశాంతంగా అతని జీవితం సాగిపోతూ ఉంటుంది.

          అతను ఓ రోజు తన ఇంట్లో ఉండగా ఓ ఎలుక నీడ చూస్తాడు. ఎలుక ఇంట్లో ఎక్కడ ఉందో అని వెతుకుతాడు.కానీ అది అతనికి కనిపించదు. ఓ రోజు టీవీలో ఓ ఎలుక మనుషులను ఎలా గాయపరుస్తుందో అన్న వార్త చూస్తాడు. దానితో తన ఇంట్లో ఉన్న ఎలుకతో జాగ్రత్త పడి ఎలా అయినా దానిని చంపితే తప్ప తన సమస్య తీరదని భావిస్తాడు.      ఎలుకకు ఎలుక బోన్లు పెడతాడు. దానిలో దానిని ఆకర్షించే ఎన్నో తిండి పదార్దాలు పెడతాడు.కానీ ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న వాషింగ్ మెషీన్ ను ఆ ఎలుక పాడు చేస్తుంది. ఇక అప్పటి నుండి ఎలుకను చంపడం అతని జీవితంలో అతి పెద్ద ఆలోచనగా మారుతుంది. ఎలుకలను చంపే వారిని సంప్రదిస్తాడు. ఎన్నో చిట్కాలు ప్రయోగిస్తాడు.కానీ ప్రయోజనం ఉండదు.

          ఎప్పుడు ప్రతి వారంతరం తన భార్యా,పిల్లల దగ్గరకు వెళ్ళే బార్ట్ ఆ వారం ఎలుక వల్ల వెళ్ళలేకపోతాడు.ఆ తర్వాత ఆ ఎలుక అతని ఫోన్ లైన్ ను పాడు చేస్తుంది. ఆ సమయంలో దానిని బాగు చేయడానికి వచ్చిన వారిని తన ఇంట్లో చొరబడిన వారీగా భావించినా,వారు వచ్చిన పని తెలుసుకుని సంతోషిస్తాడు బార్ట్. ఆ తర్వాత ఎలుకను వెతుకుతున్న క్రమంలో అతనికి ఓ సారి ఎలుక పిల్లలు కనిపిస్తాయి. దానితో అది ఆడ ఎలుక అని తెలుసుకుంటాడు.దాని పిల్లలను చంపేస్తాడు.అప్పటికీ ఆ ఎలుక తప్పించుకుంటుంది.

          అప్పటి వరకు ఆ ఇంట్లో తన జీవనం కొనసాగించడమే ఆ ఎలుక ఉద్దేశ్యం అయినప్పటికీ తన పిల్లలను చంపడంతో దానికి ప్రతీకారం తీసుకోవడం ఇప్పుడు ఆ ఎలుక కార్యాచరణగా మారుతుంది. ఆ విషయం ఒక్క బార్ట్ కే అర్ధమవుతుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా అర్ధం చేసుకోరు,తేలికగా కొట్టి పారేస్తారు.

          అప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న ఎలుక అతన్ని రోజు రెచ్చగొడుతూ ఉండేది. ఓ రోజు అతని దుప్పటి వరకు వచ్చి ,దాన్ని తీసి తనను దాడి చేస్తుంది అని బార్ట్ నిర్ణయించుకోగానే,ఆ చివరి క్షణాల్లో అతన్ని వదిలేస్తుంది.ప్రతి రోజు ఆ పెద్ద ఇంట్లో నుండి ఎక్కడో ఓ చోట నుండి శబ్దం చేస్తూ అతన్ని రెచ్చగొట్టడం,ఇంట్లో ఉన్నవన్నీ నాశనం చేయడం,బార్ట్ బెడ్ రూమ్ అంతా తన రెట్టలతో నింపడం ఇలా ఎన్నో చేస్తూ అతన్ని రోజు ఏడిపిస్తూ ఉంటుంది. ఆ ఎలుక వల్ల అతను ఆఫీసుకు కూడా సరిగ్గా వెళ్ళలేకపోతాడు.నిద్ర సరిగ్గా ఉండదు. దానిని రోజు చంపే ప్రయత్నం చేయడం,అంత పెద్ద ఇంట్లో ఎలుక దాని రహస్య మార్గాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల,చీకట్లో చూడగలగడం వల్ల  ఎప్పుడూ అతనికి చిక్కదు.చిక్కిన రెండు సార్లు ఎంతో తెలివిగా తప్పించుకుంటుంది. ఎలుకకు బోను పెడుతున్న సందర్భంలో ఎలుక రెచ్చగొట్టడం వల్ల అతని చేతి వ్రేళ్ళు ఆ బోనులో పడటం వల్ల హాస్పటల్ పాలవుతాడు.

          ఆ ఎలుక వల్ల ప్రమోషన్ విషయంలో కూడా వెనుకబడతాడు బార్ట్. అప్పటికే మూడు వారాలు ఇంటికి వెళ్ళకుండా ఉండటం వల్ల అతనికి,అతని భార్యకు మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. ఎప్పటికీ ఆ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్న బార్ట్ ఇక ఆ ఇల్లును అమ్మాలని నిర్ణయించుకుంటాడు.ఆ ఇల్లు చూసుకోవడానికి రోజు నిర్ణయించబడుతుంది. ఆ రోజు ఎలుక అతన్ని దాడి చేస్తుంది. ఆ తర్వాత అది బార్ట్ కు దొరికిపోతుంది.

          చిన్న ప్రాణం,పిల్లలను పోగొట్టుకున్న తల్లిగా నిస్సహాయంగా చూస్తున్న దాని చూపులు చూసి,తనకు చేసినవన్నీ మర్చిపోయి జాలిపడతాడు. ఆ క్షణాన్ని ఆసరాగా చేసుకుని అతని మీద మళ్ళీ దాడి చేస్తుంది ఆ ఎలుక. దానితో ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో దాన్ని హత్య చేస్తాడు.

          ఆ తర్వాత అతని భార్య రావడం,మొత్తానికి ఇంకో బేరగాడికి ఎలాగో ఆ ఇల్లును అమ్మేయడం,వాళ్ళు ఇంకో అపార్ట్మెంట్ కొనుక్కుని కుటుంబం అంతా అక్కడికి వెళ్ళిపోవడంతో నవల ముగుస్తుంది.బార్ట్ మనశ్శాంతిని దూరం చేసి,అతన్ని మూడు వారాలు ముప్పు తిప్పలు పెట్టి, ఎప్పటికీ ఇల్లు అమ్మకూడదని నిర్ణయించుకున్న అతని చేత ఆ ఇల్లు అమ్మే నిర్ణయం తీసుకునేలా చేయడం ఇవన్నీ ఆ ఎలుక సాధించిన విజయాలే. తన పిల్లలు చనిపోయేవరకు తన ఉనికి తెలియకుండా ఏ ట్రాప్స్ కు దొరకకుండా ఉన్న ఆ తల్లి ఎలుక,తన పిల్లలు మరణించగానే తన మనుగడ మీద కాకుండా తన పిల్లలని చంపినందుకు ప్రతీకారం తీసుకోవాలని మాత్రమే తలచి చివరి వరకు పోరాడింది. అందుకే అంటారేమో పరిస్థితులే ఎవరినైనా రూపొందిస్తాయి అని. 

          మనిషికి ప్రకృతి సిద్ధమైన ఎన్నో శారీరక,మానసిక శక్తులు ఉన్నాయి.దానికి తోడు సాంకేతికత ఆసరా కూడా ఉంది. తన ప్రాంతంలో స్థాన బలం కూడా మనిషికి ఎక్కువే.కానీ మనిషి మీద పరోక్షంగా ఆధారపడి బ్రతుకుతూ,అతని శత్రువుగా జీవించే ప్రాణులకు కూడా అన్నే శక్తులు ఉన్నాయి. తమ ప్రాణాలను కాపాడుకోవడం ఒక్కటే వాటి లక్ష్యం,కానీ మనిషికి ఉన్న ఎన్నో పనుల్లో అది కూడా ఒకటి,అంతే. ఈ సృష్టిలోని ప్రతి జీవి తన మనుగడ కోసం పోరాటం చేయాలి. అది ఎలా చేసినా తప్పు కాదు.ఎందుకంటే ఎవరి జీవితం వారికి విలువైనదే కనుక.

               *     *   *

         

Comments

Popular posts from this blog

సంస్కార స్పర్శను గుర్తు చేసే కథలు

జీవితమే అనుభూతుల విందు!

చరిత్ర మరువకూడని వీరుడు!