సమర్ధింపు
చదువరి
సమర్ధింపు
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
ఓ కథ ఎలా
ఉండాలి అంటే అది ఏ రకపు జీవితాన్ని ప్రవేశపెట్టినా సరే చివరకు ఆ కథలో ప్రధాన పాత్ర
మాత్రం మంచి పనులు చేస్తూ,అందరిని మెప్పించేలా ఉండాలి. అటువంటి
పాత్రనే దాదాపుగా ప్రధాన పాత్రగా ఎంచుకుని,ఆ పాత్ర చుట్టూ
ఇంకెన్నో పాత్రలు ఆ పాత్ర గొప్పతనాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉండేలా కథ మలుపులు
తిరుగుతుంది.కానీ నిజానికి వాస్తవంలో మనందరిలో ఎవరిలోనూ కూడా ఆ ప్రధాన పాత్ర
పూర్తిగా ఉండదు,ఆ పాత్రలోని కొన్ని అంశాలే ఉంటాయి. కానీ అదే
పాత్ర ఎవరితోనూ కలవలేకుండా, ప్రతి ఒక్క మనిషితోనూ ఇమడలేక
ఉండే జీవితం దాదాపుగా మనిషి జీవితంలో
యవ్వనంలో ఉంటుంది. అటువంటి ఓ టీనేజర్ తన జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్కరితో ఎలా
సత్సంబంధాన్ని నిలుపుకోలేక,ఎవరితోనూ సరిగ్గా ఉండలేక, తన జీవితంలో జరిగిన ఉదంతాలు,కలిసిన మనుషుల ఆధారంగా
తనేంటో పాఠకులకు పరిచయం చేసుకునే నవలే జె.డి.సాలింజర్ రాసిన ‘ద కాచర్ ఇన్ ద రై.’ 1945-46 మధ్య
సీరియల్ గా వచ్చి,1951 లో నవలగా వచ్చిన ఈ పుస్తకం 1961
నుండి దాదాపు 1982 వరకు యునైటెడ్ స్టేట్స్ లోని స్కూల్స్ లో,లైబ్రరీలలో నిషేధానికి గురైంది. దీనికి కారణం ఈ కథలోని ముఖ్య పాత్ర మతం
గురించి,సెక్స్ గురించి తన అభిప్రాయాలు చాలా స్వేచ్చగా
చెప్పడం వలన. జీవితంలో యవ్వనంలో ఉండే వ్యక్తుల ఆలోచనలు నిజంగా ఎలా ఉంటాయో స్పష్టం
చేసే నవల ఇది.
ఈ నవలలో ముఖ్య పాత్ర 16 ఏళ్ల హోల్డెన్
కాలిఫీల్డ్. అతను ఓ హాస్పటల్ లో ఓ యాక్సిడెంట్ వల్ల ఉన్నప్పుడూ క్రితం సంవత్సరం క్రిస్టమస్ సమయంలో తన జీవితం
గురించి చెప్తూ తన స్నేహితులతో,తన కన్నా పెద్దవారితో,తన జీవితంలో తారస పడిన వారితో తన ప్రవర్తన ఎలా ఉందో చెప్తాడు. ఈ నవలలో బాష
పూర్తిగా ఆ టీనేజర్ బాషే. దాని వల్లే ఈ నవల నిషేధానికి గురైంది.
హోల్డెన్ గత సంవత్సరంలో శనివారం క్రిస్టమస్
కు ముందు వారం జరిగిన సంఘటనలతో మొదలుపెడతాడు. ప్రెన్సీ ప్రేప్ స్కూల్ లో చదువుతున్న హోల్డెన్ చదువుతున్న నాలుగో స్కూల్. అంతకు
ముందు మూడు స్కూళ్ళల్లో నుండి
పంపించివేయబడ్డాడు. ఒక్క పుస్తకాలు చదివే అలవాటు ఉండటం వల్ల ఒక్క ఇంగ్లీష్ మాత్రం
పాస్ అయ్యే హోల్డెన్ మిగిలిన సబ్జెక్ట్లు ఫెయిల్ అవుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఉన్న
స్కూల్ లో కూడా అలానే ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడ కూడా అతన్ని ఎక్స్ పెల్ చేస్తారు.
ఆ రోజు శనివారం.బుధవారం అతను
తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పి, అతన్ని ఇంటికి పంపించాలి.
పెన్సిలవేన్యా లో స్కూల్ ఉంటే,అతని ఇల్లు మాన్ హట్టన్ లో. హోల్డెన్
కు అందరి కన్నా ఇష్టమైన వ్యక్తి అతని చెల్లెలు ఫోబ్. అతని అన్నయ్య డి.బి. ఓ
రచయిత.హాలీవుడ్ లో పని చేస్తూ ఉంటాడు.
ఇక ఇక్కడ నుండి అతని రూమ్ మేట్స్,
టీచర్స్ గురించి చెప్తాడు హోల్డెన్ ఒక్కో
సంఘటన మూలంతో. ఇంటికి వెళ్లబోయే ముందు ఓ సారి కలవమని అతని హిస్టరీ టీచర్ స్పెన్సర్
పిలుస్తాడు.అతని ఇంటికి వెళ్తాడు.స్పెన్సర్ వృద్ధుడు. స్పెన్సర్ హోల్డెన్ హిస్టరీ
పేపర్ తీసి అతని రాసింది అతని చేతే చదివిస్తాడు. దానితో అతని మీద కోపం వస్తుంది.
ఇకపోతే హోల్డెన్ ఈ నవలలో ఏ వ్యక్తిని కలిసిన వారి భౌతిక రూపం,వారు ప్రవర్తించే తీరు మీద తనకుండే,లేదా
అపరిచితులైతే అప్పుడు తాను ఏర్పరచుకునే అభిప్రాయాల గురించి కూడా చెప్తూ ఉంటాడు.
ఇకపోతే
తిరిగి తన రూమ్ కి వచ్చాక తన పక్క రూమ్ లో ఉండే యాక్లి గురించి,అతని
అశుభ్ర అలవాట్ల గురించి హోల్డెన్ చెప్తాడు. అతనికి తన మొహం మీద వచ్చిన పింపుల్స్
ని గిల్లే అలవాటు ఉందని, సరిగ్గా బ్రష్ చేయడని అతని గురించి
చెప్తాడు. ఇకపోతే హోల్డెన్ రూమ్ మేట్ అయిన స్ట్రాడ్ లేటర్ ఆ రోజు జేన్ అనే
అమ్మాయితో డేట్ కు వెళ్తాడు. ఆ అమ్మాయి హోల్డెన్ స్నేహితురాలు గతంలో. అతను తిరిగి
వచ్చాక ఆమెతో ఏం చేసావని పదే పదే అతన్ని అడుగుతూ ఉంటాడు హోల్డెన్. దానితో ఇద్దరి
మధ్య గొడవ అవుతుంది.ఇక ఆ గొడవ తర్వాత ఇక అక్కడి నుండి వెళ్ళిపోయి ఏదో ఒక హోటల్ లో
ఉండి,ఆ తర్వాత బుధవారం ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు
హోల్డెన్.
న్యూ యార్క్ కు వెళ్తున్న ట్రెయిన్ లో తనతో
పాటు ప్రెన్సీ లో చదివే ఓ విద్యార్థి
తల్లిని కలుస్తాడు హోల్డెన్. కానీ తన పేరు కాకుండా వేరే విద్యార్థి పేరు
చెప్తాడు.ఇక ఆమె పట్ల కూడా తన అభిప్రాయాలూ ఏర్పరచుకుంటూ ఉంటాడు.ఆమె అతనితో మంచిగా
ఉన్నా సరే ఆమె రూపం గురించి ఇక ఆమె తన కొడుకు గురించి అనుకునే దానిని గురించి ఇలా
ఆమె గురించి అభిప్రాయాలూ ఏర్పరచుకుంటూనే ఉంటాడు.
హోటల్ కు వెళ్ళడానికి అతను ఎక్కిన క్యాబ్
డ్రైవర్ గురించి కూడా తనకు ఏర్పడిన అభిప్రాయం గురించి చెప్తాడు. ఆ హోటల్ లో రూమ్
తీసుకున్నాక, అక్కడి నుండి మిగిలిన రూమ్స్ లలో ఉన్న వారిని చూస్తూ
వారి మీద కూడా తనకు తోచిన అభిప్రాయాలూ ఏర్పర్చుకుంటూ ఉంటాడు. తనకు తెలిసిన ఓ అమ్మాయికి
ఫోన్ చేస్తాడు. అది అర్ధరాతి అవ్వడం వల్ల మొదట్లో ఆమె విసుక్కున్నా ఆ తర్వాత
అతనితో సౌమ్యంగా ఉన్నా అతను డేట్ అడగడు. ఆ తర్వాత ఆ హోటల్ కింద ఉన్న బార్ లో 30 లో
ఉన్న ముగ్గురు స్త్రీలతో డ్యాన్స్ చేస్తూ గడుపుతాడు. కానీ అతను మైనర్అవ్వడం వల్ల
అతనికి డ్రింక్స్ ఇవ్వరు.
అక్కడి నుండి బయటకు వచ్చాక జేన్ గురించి
ఆలోచిస్తాడు.గతంలో ఆమెతో ఉన్నప్పుడూ ఆమె తనకు ఎంత స్నేహితురాలో ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ తర్వాత క్యాబ్ లో అటు ఇటు ఏ నిర్ణయం లేకుండా తిరుగుతూ చివరకు రూమ్ కు వస్తాడు.
అదే సమయంలో లిఫ్ట్ లో పని చేసే మౌరీస్ ఓ అమ్మాయిని పంపిస్తానంటే సరే అంటాడు. ఓ
వేశ్య వస్తుంది.తీరా వచ్చాక ఆమెను కాసేపు కూర్చోపెట్టి ఆమెకు చెప్పిన డబ్బు
ఇచ్చేసి పంపేస్తాడు. కానీ తనకు ఇంకా ఇవ్వాలని చెప్తుంది.మౌరీస్ తనకు అంతే అని
చెప్పాడని అతను చెప్తాడు.తర్వాత ఆమె మౌరీస్ తో వస్తుంది. మొత్తానికి హోల్డెన్ మీద దాడి
చేసి మరి ఆ డబ్బులు తీసుకుంటారు.
ఇక ఆ తర్వాత రోజు ఆదివారం నాడు తాను గతంలో
డేటింగ్ చేసిన శాలి అనే అమ్మాయికి ఫోన్ చేసి మ్యాట్నికి ప్లాన్ చేస్తాడు. ఈ లోపు
అతను టిఫిన్ చేస్తూ ఉండగా అతనికి ఇద్దరు నన్స్ తారసపడతారు.వారికి పది డాలర్స్
చారీటిగా ఇస్తాడు హోల్డెన్. ఆ తర్వాత శాలితో కలిసి సినిమాకు వెళ్తాడు.అక్కడ ఆమె ఇంకో అబ్బాయితో
మాట్లాడటంతో అతనికి కోపం వస్తుంది.దురుసుగా ఆమెతో వ్యవహరిస్తాడు. ఆ తర్వాత ఆమెతో కలిసి ఐస్ స్కేటింగ్ కు
వెళ్తాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అతను గతంలో చదివిన వూటన్ స్కూల్
లో అతనికి సీనియర్ అయిన కార్ల్ లూస్ కి కాల్ చేసి అతన్ని కలుస్తాడు.కానీ మంచి
సంభాషణ లేకపోవడం వల్ల అతను మధ్యలోనే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తాగి కోపంతో శాలికి
ఫోన్ చేస్తాడు. ఏదో ఆమెకు కూడా చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత ఓసారి చెల్లెలును
చూద్దామని ఇంటికి దొంగచాటుగా వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి తన చెల్లెలితో కాసేపు
గడిపాక తన గతపు ఇంగ్లీష్ టీచర్ యాంటోలినికి ఫోన్ చేస్తాడు.ఆయన ఎప్పుడైనా తన ఇంటికి
రమ్మని ఆహ్వానిస్తాడు.
తన
అన్నను మళ్ళీ స్కూల్ లో నుండి బయటకు తరిమేశారని ఫోబికి అర్ధమవుతుంది. నీకు ఏదైనా
నచ్చేది చెప్పమని ఫోబి చెప్పలేకపోతాడు
హోల్డెన్. కానీ మనసుఓ మాత్రం వరి లాంటి తోటల్లో తాను అందరూ పరిగెడుతూ ఆడుకుంటూ
ఉంటే తాను వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాన్ని ఊహించుకుని అది తనకు
ఇష్టమైనది అనుకుంటాడు హోల్డెన్. ఈ లోపు అతని తల్లిదండ్రులు రావడంతో తప్పించుకుని
యాంటోలిని ఇంటికి వెళ్తాడు.ఆయన హోల్డెన్ ను ఎంతో బాగా చూసుకుంటాడు. హోల్డెన్ కు
పక్క ఏర్పాటు చేసి అతని తల నిమురుతూ ఉంటాడు. ఆయన తనను ఏమైనా చేస్తాడేమో అనుకుని
యాంటోలిని కి సాకు చెప్పి సెంట్రల్ స్టేషన్ కు వెళ్ళిపోతాడు.
తాను ఇక్కడ నుండి పారిపోవాలని
అనుకుంటాడు.ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటూ తన జీవితం తాను గడపాలని నిర్ణయించుకుంటాడు.
చివరిసారిగా చెల్లెల్ని చూద్దామనుకుని ఆమె స్కూల్ కి తనను కలవమని ఓ నోట్ పంపిస్తాడు.
తాను కూడా వస్తానని తన సూట్ కేస్ తెచ్చుకుంటుంది ఫోబి.ఆమెను మందలించి తాను కూడా
వెళ్ళడం మానేస్తాడు హోల్డెన్ . ఇక్కడితో నవల ముగుస్తుంది.
ఈ నవలలో ఉదంతాలు,మనుషులు
అందరూ హోల్డెన్ వారి గురించి ఎలా ఆలోచిస్తాడో చెప్పడానికి ,అతని
ఆలోచనలు ఎప్పుడు ఎదుటివారితో కలవకుండా,కలవాలని
ప్రయత్నించి కూడా విఫలమయి,ఓ టీనేజ్ లో ఉన్న అబ్బాయి ఎలా సందిగ్ద నిర్ణయాలు తీసుకుంటాడో స్పష్టం
చేస్తాయి.ఈ నవలలోని బాష కూడా పూర్తిగా టీనేజర్ బాష.
ఆంగ్ల సాహిత్యంలోని మొదటి 100 పుస్తకాల్లో
ఇది కూడా ఒకటి. రచనల్లో వైవిధ్యత ఇష్టపడేవారు,ముఖ్యంగా రచయితల తప్పకుండా
చదవాల్సిన నవల ఇది.
*
* *

Comments
Post a Comment