సమన్వయ కర్త

   సినీ సంచారం

    సమన్వయ కర్త

     -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


          కొన్ని సినిమాలు మనకు ఎప్పుడు తారసపడని ఎన్నో జీవితాల్లో భాగం అయ్యేలా చేస్తాయి. అందుకే సినిమా కేవలం వినోదానికే కాకుండా,విజ్ఞానానికి కూడా మాధ్యమంగా నిలిచింది. ప్రభుత్వంలో  భాగంగా పని చేసే  పోలీస్ వ్యవస్థ స్థాయిని అనుసరించి చిన్న చిన్న నేరాలను మొదలుకుని దేశ భద్రతను,పౌరులను భయపెట్టే విధ్వంస పరిస్థితులను కూడా ఎదుర్కునేలా ప్రతి దేశం తమ వ్యవస్థలను ఎప్పటికప్పుడు సుశిక్షితం చేసుకుంటూ ఉంది. మనందరికి పోలీసు వృత్తి గురించి కొంతమేరకు తెలుసు. కానీ వారు అనుసరించే మార్గాలు మనలో కొద్ది మందికే తెలుసు. ముఖ్యంగా దేశంలో ఏదైనా ప్రమాదకర పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పరిస్థితి నుండి బయటపడేవరకే ఆలోచిస్తాము మనం.కానీ దాని నుండి బయట పడటం,ఎప్పటికప్పుడు అటువంటి ప్రమాదకర పరిస్థితులకు తమను తాము సిద్ధం చేసుకునే వారు చేసే ఇంకో పని నెగోషియేషన్. ఇంకా స్పష్టంగా మన బాషలో చెప్పాలంటే నేరం చేసే ప్రతి హంతకుడికి ఓ మోటివ్ లేదా కొన్ని కోరికలు ఉంటాయి. ఓ దేశంలోని కొందరు  ఇంకో దేశపు విమానాన్ని హైజాగ్ చెయ్యాలని,అందులోని పౌరులను పావులుగా వాడి తమకు  సంబంధించిన ఏదైనా కోరికను నెరవేర్చుకోవాలనుకుంటారు. అటువంటి పరిస్థితులు లేదా ఏ హంతుకుడైనా ఏదైనా బెదిరింపులతో మొదలుపెట్టినప్పుడు దానిని కుదిరితే సామరస్యంగా లేదా వీలైనంత తక్కువ నష్టంతో పరిష్కరించేందుకు ఆ వ్యవస్థకు ఉపయోగపడే వ్యక్తే నెగోషియేటర్. ఇతను కూడా పోలిసే కానీ ఈ నెగోషియేషన్ అతని ప్రత్యేకత. అటువంటి ఓ నెగోషియేటర్ అనుకోకుండా తనతో పని చేసే వారి చేతే హత్య నేరంలో ఇరికించబడితే ఎలా తెలివిగా ఆ నేరాన్ని తన నెగోషియేషన్ నైపుణ్యాలతో బయటపెట్టి తప్పించుకున్నాడో తెలిపే సినిమానే 1998 లో గారి గ్రే దర్శకత్వంలో శామ్యూల్ ఎల్.జాక్సన్ ,కెవిన్ స్పేసి ముఖ్య పాత్రలుగా వచ్చిన ద నెగోషియేటర్ సినిమా.

          ఈ సినిమా చూసేవరకు కూడా నాకు ఇంత ప్రొఫెషనల్ నెగోషియేషన్స్ చేయడం అన్న అంశం గురించి అవగాహన లేదు. ఓ మనిషిని హత్య చేయాలనుకున్న వ్యక్తినో,లేక డబ్బు కోసం ప్రయత్నించే చిన్న నేరస్తుడినో,లేక దేశ భద్రతను ముప్పులో పెట్టే టెరరిస్ట్ తోనో, ఎవరితో అయినా సరే నెగోషియేట్ చేయడం అంత సులభమైన పని కాదు. ఈ సినిమా దాదాపు రెండున్నర్ర గంటల సేపు ఉంటుంది. మొదటి అరగంట మినహాయిస్తే మిగిలిన సినిమా అంతా నెగోషియేషన్,అంతే. కానీ ఆ నెగోషియేషన్స్ లో నెగోషియేటర్ ఎంత నేర్పుగా ఉండాలో అన్న చిన్న చిన్న అంశాలు ఈ సినిమాను చూసేలా చేస్తాయి.

          డాని రోమన్ (శామ్యూల్ ఎల్.జాక్సన్ )  ప్రొఫెషనల్  నెగోషియేటర్. అతను చికాగో పోలీస్ డిపార్ట్మెంటులో పని చేస్తూ ఉంటాడు. సినిమా అతను ఎలా ఒకతను తన భార్యను తీసుకురాకపోతే కూతుర్ని చంపేస్తానని బెదిరిస్తున్న ఓ వ్యక్తితో ఎలా నెగోషియేట్ చేసి ఆ పాపను కాపాడాడు అన్న అంశంతో రోమన్ ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో మొదలవుతుంది. రోమన్ తో కలిసి పని చేసే వ్యక్తి నేట్. ఓ రోజు రాత్రి నేట్  తమ డిపార్ట్మెంటులో ఫండ్స్ ఎవరైతే మాయమయ్యేలా చేస్తున్నారో తనకు తెలిసే అవకాశం ఉందని,అది కూడా ఓ ఇన్ఫార్మర్ వల్ల అని,తమ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటుకు కూడా దానిలో భాగం ఉందనే అనుమానంతో ఆ ఇన్ఫార్మర్ వారికి ఈ విషయం చెప్పలేదని,తమతో పని చేసేవారే అది చేస్తున్నారని చెప్తాడు. ఆ తర్వాతి రాత్రే అతను హత్య చేయబడతాడు. అదే సమయానికి అతన్ని అక్కడ కలవడానికి వెళ్ళిన రోమన్ ను ఆ హత్య చేసినట్టుగా భావించి అతన్నే నేరస్తుడిని చేస్తారు. కానీ ఇదంతా ఆ విషయం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేట్ అది త్వరలోనే కనుక్కుంటాడని భావించి అతన్ని హత్య చేసి,తనను ఇరికించారని భావిస్తాడు రోమన్. ఇక తనను తాను కాపాడుకోవడానికి  ఇంకే మార్గం లేక ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో ఉన్న నీబమ్,అతని అసిస్టెంట్స్ ,మరియు పోలీస్ కమాండర్ మరియు రోమన్ మిత్రుడైన ఫ్రాస్ట్ ను బంధించి ఆ ఆఫీసులోనే వారిని ఎటు వెళ్ళకుండా కట్టడి చేస్తాడు.తాను నెగోషియేటర్ అయిన సెబియన్ తో మాత్రమే మాట్లాడతానని చెప్పి పెట్టేస్తాడు.

    సెబియన్ అతనితో నెగోషియేట్ చేయడానికి వస్తాడు. ఇద్దరు నెగోషియేటర్స్ వృత్తి పరంగా. రోమన్ అక్కడ ఉన్న నీబమ్ ద్వారా అతని కంప్యూటర్ రికార్డుల ద్వారా నేట్ ఫోన్ కాల్స్ రికార్డ్ చెయ్యబడ్డాయని తెలుసుకుంటాడు.  సెబియన్ మాట్లాడుతూ ఉండగానే  రోమన్  మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేస్తారు. తర్వాత సెబియన్ తన మాట మాత్రం మీదే పని చేయాలని,తాను ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎవర్ని పేల్చకూడదని చెప్తాడు.అలాగే అని అంగీకరిస్తారు. సెబియన్ రెండో  సారి నెగోషియేట్ చేయడానికి  అప్పటికే పోయిన కరంట్ వచ్చే;ఆ చేయమని,అలా చేస్తే ఒకరిని వదిలేస్తానని చెప్పి,మాట ప్రకారం ఫ్రాస్ట్ ను వదిలేస్తాడు. కానీ ఈ నెగోషియేషన్స్ జరుగుతూ ఉండగానే మళ్ళీ కాల్పులు జరుగుతాయి.దానిలో నీబమ్ చనిపోతాడు.అది యాక్సిడెంట్ కాదని అర్ధమవుతుంది. దానితో పాటు సాక్ష్యాలున్న  కంప్యూటర్ ను కూడా పేల్చేస్తారు. ఈలోపు ఎఫ్.బి.ఐ రంగంలోకి దిగుతుంది. సెబియన్ అవసరం లేదని చెప్తుంది.

          రోమన్ ను కావాలనే  ఇరికించారని అర్ధం చేసుకున్న సెబియన్ అతనికి సాయం చేసి అక్కడి నుండి తప్పించుకునేలా చేస్తాడు.అక్కడి నుండి ఇద్దరు సాక్ష్యాల కోసం నీబమ్ ఇంటికి వెళ్తారు.అక్కడ ఏం సాక్ష్యాలు దొరకవు. ఈ లోపు పోలీసులు ఆ ఇంటిని కూడా చుట్టుముడతారు. ఫ్రాస్ట్ వస్తాడు. ఆ సమయంలో ముందు వచ్చిన ఇద్దరితో మాట్లాడిన దానిని బట్టి వారు ఆ స్కామ్ చేయలేదని అర్ధం చేసుకుంటారు ఇద్దరు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఫ్రాస్ట్ ను చూశాక అతనే చేశాడని సెబియన్ కు అర్ధమవుతుంది. అతన్ని మభ్యపెట్టి రోమన్ ప్రాణం పోకుండా కాల్చి,ఆ సాక్ష్యాలు ఇచ్చేస్తానని,అతను నేట్ ను హత్య చేస్తే,తాను రోమన్ ను చేశానని, ఫ్రాస్ట్ తో నెగోషియేషన్స్ చేస్తాడు. అదంతా అప్పటికే రోమన్ సెబియన్ నుండి తీసుకున్న రేడియోలో రికార్డు అవుతూ ఉంటుంది. దానితో బయట ఉన్నవారికి కూడా ఫ్రాస్ట్ నేట్ ను హత్య చేయించాడని అర్ధమవుతుంది.అలా రోమన్ ఆ హత్యా నేరం నుండి తప్పించుకోవడంతో సినిమా ముగుస్తుంది.

          నెగోషియేట్ చేసే వ్యక్తి  తనకున్న స్వల్ప పరిచయంలోనే అపరిచితుల మనస్తత్వాన్ని అర్ధం చేసుకుని, అతనికి నచ్చేలా మాట్లాడుతూ,ఎప్పుడూ నో చెప్పకుండా తెలివిగా ఎక్కువ నష్టం వాటిల్లకుండా  సామరస్యంగా సమస్యను పరిష్కరించగలగాలి. ఇటువంటి సినిమాలు మనకు ప్రపంచ రాజకీయాలు ఎటువంటి సూత్రాల మీద నడుస్తాయో స్పష్టం చేస్తాయి.

  *    *    *

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ