నియంతృత్వం

 చదువరి

                        నియంతృత్వం

                                 -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)

 

          ప్రజలు తమకంటూ ఓ ప్రత్యేక బాష, ఆచార సంప్రదాయాలు ఉన్నప్పుడూ ఆ విశిష్టతను కోల్పోకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి ఆ ప్రాంతపు ప్రత్యేక ప్రాంతపు గుర్తింపు కోసం ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అటువంటి వాటిల్లో బాస్క్ కూడా ఒకటి. స్పైయిన్ లో నాలుగు, ఫ్రాన్స్ లో మూడు ప్రోవిన్సులను కలిగి ఉన్న బాస్క్ ప్రాంతపు ప్రజలకు ప్రత్యేక బాష,ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. దానిని ఆటనమస్ గా 1936 లోనే ప్రకటించినా వారి పట్ల స్పెయిన్ ,ఫ్రాన్స్ వైఖరిలో పెద్ద మార్పులు రాలేదు. బాస్క్ జనుల పట్ల వారు ఎప్పుడూ క్రూరంగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో వారి స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఏర్పడిన సంస్థ ETA. దీనిని స్పెయిన్,ఫ్రాన్స్ ఓ టెరరిస్ట్ సంస్థగానే భావించాయి. ఈ నేపథ్యాన్ని కథాంశంగా తీసుకుని సిడ్నీ షెల్డన్ రాసిన నవలే ద సాండ్స్ ఆఫ్ టైమ్.

          1976 లో బాస్క్ ప్రజలు స్పానిష్ ప్రభుత్వం నుండి తమ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. ETA ముఖ్య నాయకుడైన జైమి మిరో ఉద్యమంలో తన మిత్రులైన  రిచార్డ్ ,ఫెలిక్స్ లను బుల్  ఫైట్ జరుగుతున్న సమయంలో ఎంతో తెలివిగా పథకం ప్రకారం తప్పిస్తాడు. దానితో స్పెయిన్ ప్రధాన మంత్రి కల్నల్ రామన్ ఎకోకా (ETA వ్యతిరేక బృందమైన GOE కు నాయకుడు)కు జేమి మిరో ను పట్టుకునే పని అప్పగిస్తాడు. ఎకోకా భార్య గర్భవతిగా ఉన్నప్పుడూ ETA చేసిన హత్యాకాండలో మరణిస్తుంది. ఆ సమయంలో చర్చ్ కూడా ETA కు మద్ధతుగా ఉండటంతో అటు చర్చ్ పట్ల ,ఇటు ETA పట్ల కక్షను పెంచుకుంటాడు ఎకోకా.

          ఏవిలా లో ఉన్న ఓ కాన్వెంట్ లో నన్స్ ఉంటారు. కేవలం సైన్ బాషను మాత్రమే వారు ఉపయోగిస్తారు. ఆ చర్చ్ లో జేమి ఉన్నాడన్న అనుమానంతో ఆ చర్చ్ మీద దాడికి పూనుకుంటాడు ఎకోకా. ఆ సమయంలో ఆ కాన్వెంట్ మెయిన్ హెడ్ గా ఉన్న బెటినా తనకు నమ్మకస్థురాలైన సిస్టర్ తెరిసా కు ఓ గోల్డ్ క్రాస్ ఇచ్చి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరలోని కాన్వెంట్ లో ఇవ్వమని ఆ దుండగుల చేతిలో దానిని పడకుండా చెప్తుంది. ఎకోకా నాయకత్వంలో వారు అక్కడ దాడి చేసినా అక్కడ జేమి వారికి   దొరకడు. ఆ సమయంలోనే నలుగురునన్స్ అక్కడ నుండి తప్పించుకుంటారు. వారు లూసి, మేగన్, తెరిసా ,గ్రేసీలా. ఈ నలుగురు ఎలా నన్స్ గా మారాల్సి వచ్చిందో రచయిత మనకు ఇప్పుడు పరిచయం చేస్తాడు.

          లూసి ఓ మాఫియా డాన్ కూతురు. ఎంతో సౌఖర్యంగా పెరిగిన ఆమె జీవితం తండ్రికి ,సోదరులకు శిక్ష పడటంతో మారిపోతుంది. ఆమె తన తండ్రికి,అన్నలకు శిక్ష పడేలా చేసిన వారి మీద కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. వారింట్లో పని చేసే ఓ అంగరక్షకుడు వల్లే ఇది జరిగింది అని కోర్టులో సాక్ష్యం చెప్పినప్పుడు తెలుసుకున్న ఆమె అతన్ని,తన తండ్రి చేసిన సాయం వల్ల ఎదిగి వ్యతిరేక తీర్పు ఇచ్చిన జడ్జిలను హత్య చేస్తుంది. లూసి తండ్రి ఆమె కోసం స్విస్ అకౌంట్ లో దాచిన మిలియన్ డాలర్ల గురించి చెప్పి ఎలా అయినా వాటితో సుఖంగా ఉండమని చెప్తాడు. ఆ క్రమంలో హత్యానేరాల నుంచి తప్పించుకోవడానికి ఆమె ఓ రెండు,మూడు నెలలు పోలీసుల కంట పడకుండా ఉండటానికి ఈ కాన్వెంట్ లో నన్ గా మారుతుంది.

          తెరిసాది ఇంకో కథ. ఆమెకు తల్లి,తండ్రి,చెల్లెలుతో జీవితంలో ఎదురుకున్న  అనుభవాలు ఆమెను అలా మారుస్తాయి. తెరిసా కన్నా ఆమె చెల్లెలు గొప్ప అందగత్తె.తెరిసా ఆమె అంత అందంగా ఉండదు. బాల్యం నుండే అందరూ ఆమె చెల్లెలుకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనే విషయానికి ఆమె అలవాటు పడిపోతుంది.కానీ తెరిసాకు అద్భుతమైన స్వరం ఉంది. ఆమె గొప్ప సింగర్ అవ్వబోయే అవకాశం వచ్చిన ఆమె చెల్లి దానిని చెడగొడుతుంది. దానితో క్రుంగిపోయిన తెరిసా పాడే అవకాశం వచ్చిన వదిలేస్తుంది. తనకున్న గుర్తింపు అక్కకు వస్తుందేమో అని ఆమె జీవితంలో అడుగడుగునా అడ్డంకులు ఏర్పరుస్తూ ఉంటుంది ఆమె చెల్లెలు.చర్చ్ లో ఆమె పాటలు విన్న రీనో తెరిసాను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లచేసుకోవాలనుకుంటాడు. సరిగ్గా ఆ పెళ్లి జరిగే రోజే అతన్ని ప్రలోభపెట్టి ఆమె చెల్లెలు అతనితో కలిసి వెళ్లిపోతుంది. దానితో పూర్తిగా క్రుంగిపోయిన తెరిసా ఆత్మహత్య ప్రయత్నం కూడా చేస్తుంది.అలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత  రీనో ఆమెకు  ఉత్తరం రాస్తాడు. ఆమె చెల్లెలు   ఓ బిడ్డ పుట్టాక  తమను  విడిచి వెళ్ళిపోయిందని,తనను క్షమించమని,ఆ బిడ్డతో ఆమె దగ్గరకు వస్తున్నానని రాస్తాడు. ఆ పరిస్థితుల నుండి తప్పించుకునే క్రమంలో నన్ గా మారుతుంది తెరిసా.అలా 30 ఏళ్ళు అదే కాన్వెంట్ లో గడిపేస్తుంది ఆమె.

   మేగన్ ది ఇంకో కథ. ఆమె బాల్యం నుండి అనాథాశ్రమంలో పెరిగింది. చాలా చురుకైన అమ్మాయి. 15 ఏళ్ళు గడిచాక  ఆ ఆశ్రమంలో ఉండటానికి అవకాశం ఉండదు. ఇక ఎలా బ్రతకాలో తెలియని క్రమంలో నన్ గా మారుతుంది ఆమె.

          గ్రేసీలా తల్లి వేశ్య.ఎంతో మంచి ప్రవర్తననతో గ్రేసీలా ఉన్నా ఆమెను మాత్రం వేశ్య  కూతురిగానే చూస్తారు. తల్లి జీవనంతో విసిగిపోయిన ఆమె తండ్రితో గడపడానికి వచ్చిన ఓ వ్యక్తితో కలిసినప్పుడు తల్లి రావడం,ఆమెను గాయపర్చడం, ఆ తర్వాత ఆమె హాస్పటల్లో ఉండటం,ఇక ఇంటికి వెళ్ళే పరిస్థితి లేని సందర్భంలో ఆమె నన్ గా మారుతుంది.

          ఈ నలుగురిలో లూసి మాత్రమే  రోజుల క్రితం వచ్చిన నన్.ఆమె నాయకత్వంలో ఆమిగిలిన నన్స్ ఆ దుండగులకు దూరంగా తప్పించుకుంటున్న క్రమంలో వారికి ఓ వ్యక్తి తారసపడతాడు. తాను కూడా ఓ చర్చ్ లో ఉండేవాడినని దాని మీద కూడా రెండు రోజుల క్రితం దాడి జరిగిందని,తాను వారిని దగ్గరలోని చర్చ్ కు చేరుస్తానని మాయమాటలు చెప్తాడు. అతను ఓ దొంగ. ఓ బట్టల కొట్టులో దొంగతనంగా ప్రవేశించి వారిని బట్టలు  మార్చుకోమని చెప్తాడు. వారందరూ మార్చుకున్నాక గ్రేసీలాను మాత్రం ఉండేలా చేసి మిగిలిన వారిని నడుస్తూ ఉండమని చెప్తాడు. ఆమె మీద అత్యాచారం చేయబోతున్న సమయంలో కొంత దూరం నడిచాక మేగన్ కు అనుమానం రావడంతో వెనక్కి రావడంతో ఆమెను రక్షిస్తారు. అతన్ని అక్కడ కట్టేసి అక్కడ నుండి బయల్దేరతారు. ఉదయమే ఆ షాప్ యజమాని రావడం,అతన్ని పోలీసులకు పట్టించడంతో అతని ద్వారా నన్స్ గురించి సమాచారం తెలుస్తుంది. లూసి సమయం చిక్కినప్పుడు తెరిసా దగ్గర నుండి ఆ గోల్డ్ క్రాస్ దొంగిలించి దానితో వచ్చిన డబ్బుతో ఎలాగో స్విట్జర్లాండ్ వెళ్ళాలనుకుని ,అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

          ఆ నన్స్ కు జేమి  బృందం తారసపడుతుంది. వారిని దగ్గరలోని కాన్వెంట్ లో దింపి తమ పయనం కొనసాగించాలనుకుంటారు వారు. జేమి ,అతనితో పాటు అంపారో అనే అమ్మాయి,ఇంకా ఫెలిక్స్ ,రికార్డో  ,రుబియో ఉంటారు. వీరు మూడు బృందాలుగా విడిపోతారు. రుబియో ,లూసి,తోమర్ ఓ బృందంగా, గ్రేసీలా -రికార్డో ఓ జట్టుగా,జేమి,అంపాలో,మేగన్ జట్టుగా విడిపోతారు.ముగ్గురు కలిసి ఓ చోట కలుసుకునేలా పథకంతో సాగుతారు.

          తెరిసా బృందం ఉన్న దగ్గరలో కింద ఎకోకా సైనికుల బృందం క్యాంపుతో ఉంటుంది.తెరిసా జేమి బృందం మాట్లాడుకున్నదాన్ని బట్టి వారిని నమ్మదు. ఆ గోల్డ్ క్రాస్ లూసి దగ్గర ఉంచి,ఆ క్యాంపు దగ్గరకు వెళ్ళి వారి ఆచూకీ చెప్తుంది. దాని వల్ల తోమర్ మరణిస్తాడు.లూసి-రుబియో తప్పించుకుంటారు.కానీ తెరిసా ఎంత అడిగినా అంతకు మించి జేమి ఆచూకీ చెప్పలేకపోవడం వల్ల ఎకోకా ఆమెను చిత్రహింసలు పెట్టైనా సరే ఆమె నుండి నిజాలు తెలుసుకోమని చెప్తాడు.ఆ సైనికులు ఆమెను ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేస్తున్న సమయంలో ఆమె ఇక ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో  ఓ సైనికుడి నుండి గన్ లాక్కుని కొందరిని పేల్చి చివరకు వారి చేతుల్లో మరణిస్తుంది.

          ఆ తర్వాత క్రమంగా లూసి -రుబియో ,గ్రేసీలా-రికార్డో ప్రేమలో పడతారు.మొదట తన స్వార్ధం గురించి మాత్రమే ఆలోచించిన లూసి ఆ తర్వాత రుబియోను ప్రేమించాక అతని కోసం ఉండిపోతుంది.అతను గాయపడితే సేవ చేస్తుంది.ఆ తర్వాత ఆమెను,అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. వారిని జేమి విడిపిస్తాడు.

           తను వేసే ప్రతి పథకం ముందే ఎకోలా కు తెలిసిపోవడంతో జేమికి అనుమానం వస్తుంది.అంపాలో,జేమి ప్రేమించుకున్నా అంపాలా మేగన్ పట్ల జేమి ఆకర్షితుడవ్వడంతో ఎప్పుడు ఆమెను అతనికి దూరం ఉంచే ప్రయత్నం చేస్తుంది.తమలో ఉండి ఆ పథకాలు బయటకు చెప్తుంది ఫెలిక్స్ అని భావిస్తాడు జేమి.కానీ మేగన్ ద్వారా అదంతా చేస్తుంది అంపాలో అని తెలుస్తుంది. అప్పటికే మేగన్,జేమి ప్రేమలో ఉంటారు.

          ఈ కథ జరుగుతున్న సమయంలోనే న్యూ యార్క్ లోని స్కాట్ ఇండస్ట్రీస్ యజమాని  ఇలియట్ స్కాట్  క్యాన్సర్ తో జీవితం చరమాంకంలో ఉంటుంది. ఆ సమయంలో ఆమె చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అనుకుంటుంది.ఆమె భర్త అన్న గారైన బ్రైయాన్ స్కాట్ తన తమ్ముడికి ఎక్కువ విలువ ఇవ్వడు.అందులోనూ తమ దగ్గర పని చేసే ఇలియట్ ను పెళ్లి చేసుకోవడంతో అతన్ని జీతగాడిగానే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత బ్రైయాన్ కు ఓ కూతురు పుడుతుంది. ఆ పాప పుట్టడంతో ఇక ఆ పరిశ్రమలు తన భర్తకు దక్కే అవకాశం  లేదని భావిస్తుంది ఇలియట్. అదే సమయంలో ఓ ప్లేన్ లో బిజినెస్ పని మీద బ్రైయాన్ కుటుంబం,ఇలియట్,ఆమె భర్త వెళ్తున్నప్పుడూ ఆ ప్లేన్ క్రాష్ అవ్వడం వల్ల ఇలియట్ ,ఆమె భర్త ,ఆ పాప తప్ప మిగిలిన వారు మరణిస్తారు. ఇలా ఇన్నాళ్ళకు తన భర్తకు ఎదిగే అవకాశం వచ్చిందని భావించిన ఇలియట్ ఆ పాపను ఓ ఫార్మ్ హౌస్ ముందు విడిచిపెట్టి ఆమె తల్లితండ్రులతో పాటు మరణించిందని లోకాన్ని నమ్మిస్తుంది.

          కానీ ఇలియట్ బావ తన విల్లులో ఆ పరిశ్రమలు మొత్తం తమ్ముడి పేర,కొంత ఆస్తి కూతురి పేర రాయడంతో వారిద్దరికీ పశ్చాత్తాపం కలిగిన ఏమి చేయలేని పరిస్థితి. ఇది జరిగిన సంవత్సరానికే ఇలియట్ భర్త మరణించడంతో ఆ మొత్తం సామ్రాజ్యానికి ఇలియట్ మహారాణి అవుతుంది. తన మరణం తర్వాత వారసురాలిగా తన బావ కూతుర్నే చేయాలాని నిర్ణయించుకుని డిటెక్టివ్ సాయంతో ఆ పాప మేగన్ అని తెలుసుకుంటుంది. అలా మేగన్ ను మరలా దత్తత తీసుకుని  స్కాట్ ఇండస్ట్రీస్ కు యజమానిని చేస్తుంది.

          ఆ తర్వాత  జేమిని పట్టుకుంటారు.అతనికి మరణ శిక్ష విధిస్తారు. తన డబ్బు,అధికారంతో అతన్ని తప్పించాలని మేగన్ ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కాదు,చివరకు అతనికి శిక్ష అమలు చేస్తున్న వారిని ప్రలోభపెట్టి అతను మరణించినట్టే సమాజానికి  తెలియజేసి,అతన్ని రక్షించుకుంటుంది మేగన్.

          అలా మేగన్ -జేమి ఒకటవుతారు.లూసి స్విట్జర్లాండ్ లో అకౌంట్ లో ఉన్న డబ్బులు తీసుకుని రూబిని వివాహం చేసుకుని స్థిరపడుతుంది. ఆమెతో ఉన్న గోల్డ్ క్రాస్ ను బెటెన్ కు తిరిగి పంపించేస్తుంది. గ్రేసీలా రీకార్డో ను ప్రేమించినా తనకు వివాహం వద్దనుకుని కాన్వెంట్ కు నన్ గా తిరిగి వెళ్ళిపోతుంది.

          కొన్ని నవలలు మనకు ప్రపంచం లో జరుగుతున్న ఎన్నో  విషయాలను కూడా పరిచయం చేస్తూ మనను కొత్త పరిస్థితుల్లో,కొత్త లోకంలో ఉండేలా చేస్తాయి. నన్స్ గా జీవితం గడిపేవారికి బయటి జీవితం గురించి ఎలా ఏం తెలియకుండా ఉంటుందో అన్నది ఈ నవలకు ఓ కోణం అయితే  బయటి లోకంలో ప్రజల సమస్యలు ఇంకో కోణం.రెండు విరుద్ధ  కోణాల మధ్య సమన్వయం ఏర్పరచడానికి రచయిత ఎన్నుకున్న శైలి ఎక్కడా  బోర్ కొట్టించకుండా ఆసాంతం చదివింపజేస్తుంది. జీవితం మీద మనుషులకు ఏ పరిస్థితుల్లో ఆశ పోతుందో,మనిషి ఆ పరిస్థితుల్లోనే  దేవుడి మార్గాన  పయనించాలని అనుకుంటాడని ఈ నవలలో నన్స్ జీవితాలు స్పష్టం చేస్తాయి. మీరు ప్రపంచం పట్ల  అవగాహన పెంచుకునే రచనలు చదవాలనుకుంటే తప్పక ఈ  నవల చదవండి.

                                      *     *     *

Comments

Popular posts from this blog

Survival Protection Instinct

ఉద్యోగ పర్వంలో సగటు మనిషి

'చివరకు మిగిలేది' నవలా సమీక్ష