మారని జీవితం

 చదువరి

మారని జీవితం

                           -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)



          జీవితంలో మనకు ఏ కష్టం వచ్చినా సరే మనం తీసుకున్న నిర్ణయాల గురించి మనం మళ్ళీ ఆలోచించి, అలా కాకుండా ఇంకోలా చేసి ఉంటే మన జీవితం ఇంకెంతో  బావుండేదని, మన నేటి పరిస్థితులకు మనం గతంలో తీసుకున్న నిర్ణయాలే కారణమని అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో మనం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అదే జీవన శైలి ఇంకో రూపం తీసుకుని మనతో పయనిస్తుంది తప్ప, దానిలో ఏ మార్పు ఉండదు అనే మూల జీవిత సిద్ధాంతాన్ని తన నవలకు ప్రధాన సూత్రంగా మలచి ప్రముఖ ఆంగ్ల రచయిత జెఫ్రీ ఆర్చర్ 2018 లో రాసిన నవల హెడ్స్ యూ విన్.

          ఈ నవలలో ప్రధాన పాత్ర అలెగ్జాండర్ రష్యాలో లెనిన్ గ్రాడ్ లో  తల్లిదండ్రులతో నివసిస్తూ ఉంటాడు. నవల ప్రారంభంలోనే అతను తన స్కూల్ మిత్రుడైన వ్లాదిమిర్ తో మాట్లాడుతున్నప్పుడు వారు జీవితంలో ఏం అవ్వాలనుకున్నారు అనే విషయం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అలెగ్జాండర్ తాను రష్యా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నానని, వ్లాదిమిర్ తాను కె.జి.బి చీఫ్ అవ్వాలనుకుంటున్నానని తమ ఆలోచనలను పంచుకుంటారు. నవలను ఎలా ప్రారంభించాలి,ముఖ్యంగా నవలలో  మొదట ప్రతిఫలించిన ఆలోచన ఎలా నవల చివరి వరకు పయనించింది అన్న అంశంతో  నవలా శైలిని మలచడం జెఫ్రీ ఆర్చర్ ప్రత్యేకత. స్వయంగా రాజకీయవేత్త అయ్యి ఉండటం,జీవితంలో ఎన్నో కష్టతరమైన సందర్భాలను ఎదుర్కుని ఉండటం వల్ల, జెఫ్రీ ఆర్చర్ నవలల్లో మూలం అతని జీవితంలోని అనుభవాలలో నుండే జన్మించిందని అతని జీవితం గురించి కొంత అవగాహన ఉన్నవారికి అనిపించక మానదు.

          అలెగ్జాండర్ తండ్రి తన దేశభక్తితో మెడల్ కూడా అందుకున్నాడు. అతన్ని తమ పార్టీలో కలుపుకోవాలని నాడు అధికారంలో ఉన్న కమ్యూనిస్టులు ప్రయత్నించినా దానికి అతను ఒప్పుకోలేదు. డాక్స్ సూపర్ వైజర్ గా పని చేస్తున్న అతను తనతో కలిసి పని చేస్తున్న తన తోటి వారందరికి సమాన న్యాయం జరగాలనే సంకల్పంతో స్వతంత్రంగా ఓ ట్రేడ్ యూనియన్ స్థాపించాలని నిర్ణయించుకుని, తనకు మద్ధతునిచ్చే వారిలో ఓ 12 మందిని ఎన్నుకుని అది రహస్యంగా ఉంచి,చర్చ్ లో మీటింగ్స్ జరుపుతున్న సమయంలో, అలెగ్జాండర్ నివశిస్తున్న ఫ్లాట్స్ లోనే పై ఫ్లాట్ లో ఉంటున్న వ్లాదిమిర్ అలెగ్జాండర్ తండ్రిని రహస్యంగా వెంబడించి అది కనుక్కుని మేయర్ కి చెప్పి, అతని మెప్పు పొంది అలా కెజి ఎఫ్ కు స్పైగా మారతాడు. ఆ తర్వాతి రోజే డాక్ లో కావాలని ప్రమాదం జరిపించి అలెగ్జాండర్ తండ్రిని హత్య చేయిస్తారు. తండ్రి మరణంలో పాత్ర వ్లాదిమిర్ కు కూడా ఉందని అప్పుడే గ్రహిస్తాడు అలెగ్జాండర్. తండ్రి మరణంతో అలెగ్జాండర్ జీవితం మారిపోతుంది. ఎంతో బాగా చదువుతూ, చెస్ బాగా ఆడే అతనికి యూనివర్సిటీలో సీట్ రాకపోగా, అతన్ని తన తండ్రి పని చేసే డాక్స్ లో పని చేయాల్సిందిగా ఆదేశిస్తారు. అదే సమయంలో సరిగ్గా చదవని వ్లాదిమిర్ కు మాత్రం యూనివర్సిటీలో చదువుకునే అవకాశం రావడంతో  అలెగ్జాండర్ అనుమానం బలపడుతుంది. దానితో పాటు డాక్స్ లోని ఆఫీసర్స్ క్లబ్ లో ఎప్పటి నుందో కుక్ గా పని చేస్తున్న అలెగ్జాండర్ తల్లి ఎలీనా కు మేయర్ నుండి లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉంటాయి.

          ఎలీనా సోదరుడు అయిన కొల్యా, తన బావ ఆశయాలను గౌరవించే వ్యక్తి. తన చెల్లెలును,మేనల్లుడిని కాపాడుకోవాలంటే వారిని ఆ దేశం నుండి తప్పించడం ఒక్కటే మార్గమని ఆ ప్రయత్నం చేస్తాడు. ఓ రోజు ఫూట్ బాల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళి ఎక్కువ మంది లేని సమయంలో  షిప్స్ అన్లోడింగ్ చేసే సమయంలో ఏదో ఒక షిప్ లో అజ్ఞాతంగా ఆ దేశం దాటిస్తే వారి జీవితాలు బావుంటాయని వారికి తన పథకం చెప్తాడు.

            రోజు వారు అలా వెళ్లిపోవాల్సిన సమయంలో మేయర్ ఏలినాను వేధిస్తూ ఉన్న సమయంలో అలెగ్జాండర్ వచ్చి అతని మీద దాడి చేసి, అతన్ని కట్టేసి లావేట్రీ లో ఉంచి అమ్మతో కలిసి ఆ షిప్స్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ రెండు షిప్స్ ఉంటాయి. ఒకటి బ్రిటన్ కు వెళ్ళేది అయితే, ఇంకోటి అమెరికాకు  వెళ్ళేది. ఆ రెండింట్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానిని నిర్ణయించడానికి అలెగ్జాండర్ నాణెం ఎగరవేస్తాడు. ఇక్కడ అసలు కథ మొదలవుతుంది.

          జెఫ్రీ ఆర్చర్ ఆ రెండు దేశాల్లో రెండు సమాన కాలాలతో అదే అలెగ్జాండర్ ,ఆమె తల్లి జీవితాల కథను నడుపుతాడు. వారు రెండు విభిన్న దేశాల్లో అడుగు పెట్టినప్పటికీ, వేరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారి జీవితాల్లో ఉండే ప్రధాన ఘటనలు మాత్రం ఒకేలా ఉంటాయి. జీవితం గురించిన ఈ గొప్ప సత్యమే ఈ నవలను చదివింపజేస్తుంది. చదివే పాఠకులకు ఒకేసారి వివిధ పరిస్థితుల్లో, ఒకే మనుషులు, చివరకు ఒకే రకమైన ముఖ్య ఘటనలతో ఉండటం కొంచెం గందరగోళంగా అనిపించినా సరే, ఈ నవలా శైలి మాత్రం పాఠకుల్ని చదివింపజేస్తుంది. ఆఖరికి ముగింపు కూడా పాఠకులు ఊహించని రీతిలో ఉంటుంది. పాఠకులకు స్పష్టత ఉండటం కోసం బ్రిటన్ లో అలెగ్జాండర్ పేరును  సాషాగా లండన్ లో, అలెక్స్ గా అమెరికాలో ఉంచుతాడు రచయిత. 1968 లో నవల ప్రారంభం అవుతుంది.

          బ్రిటన్ వెళ్ళే షిప్ ఎక్కిన సాషా తల్లి ఎలీనా వంటలను షిప్ లో భుజించిన ఓ ఇటాలియన్ రెస్టారెంట్ యజమాని మోరెట్టి ఆమెను, ఆమె కొడుకును తనతో పాటు బ్రిటన్ లో ఉన్న తన రెస్టారెంటుకు చీఫ్ గా తీసుకుని వెళ్తాడు. ఆ రెస్టారెంట్లో మెయిన్ చెఫ్ గా ఆమెను నియమించి, ఆమె,ఆమె కొడుకు ఉండటానికి తన రెస్టారెంట్ పైనే ఉన్న ఫ్లాట్ కూడా ఇస్తాడు. ఇది వారు బ్రిటన్ కు వెళ్ళిన కథ.

          అమెరికా వెళ్ళే షిప్ ఎక్కిన అలెక్స్ ఆ షిప్ లో ఉన్న మెయిన్ కుక్ ఎలీనా వంటల్ని చూసి,ఆమెను వెళ్లకుండా ఉంచే ప్రయత్నం చేస్తాడు. గతంలో కూడా అతను అలా దేశం నుండి పారిపోతున్న వారిలో కొందరిని అలానే తన పని తగ్గించుకోవడానికి అక్కడే ఉంచేస్తాడని తెలుసుకున్న ఎలీనా కొడుకుతో తప్పించుకునే ప్రయత్నం చేసినా సరే వారిని పట్టుకుంటాడు. అదే సమయంలో రష్యా నుండి అమెరికా వెళ్తున్న ఇంకో శరణార్ధి అయిన డిమిట్రీ వారిని తనతో పాటు అమెరికాకు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత కథలో మనకు డిమిట్రీ కొల్యా స్నేహితుడని అందుకే సాయం చేశాడని అర్ధమవుతుంది. అలా అమెరికాలో అడుగుపెట్టి డిమిట్రీ ఇంట్లోనే జీవిస్తూ ఉంటారు తల్లీకొడుకులు.

          ఇక్కడ యూనివర్సిటీ స్థాయిలో అటు సాషాకు ఇటు అలెక్స్ కు కూడా రెండు విభిన్న నిర్ణయాలను అనుసరించినా కొన్ని ఇబ్బందులు మాత్రం ఒకేలా ఉంటాయి. సాషా తెలివితేటలు గమనించిన స్కూల్ యాజమాన్యం అతన్ని ఎంతో గౌరవించి మరి చేర్చుకుంటుంది.ఫుట్ బాల్ బాగా ఆడే సాషాకు ప్రత్యర్ధిలా ట్రెమ్లెట్ ఉంటాడు.సాషా బాగా ఆడటం వల్ల మొదటి గోల్ కీపర్ గా ఉన్న అతను రెండో గోల్ కీపర్ గా మారడంతో అతని మీద కోపం పెంచుకుంటాడు  ట్రెమ్లెట్. అది కాకుండా ఓ  సారి ఓ అమ్మాయిని బలవంతం చేయబోతుంటే ఆమెను కాపాడే ప్రయత్నంలో  అతన్ని అడ్డుకోవడం,గొడవ పడటం జరుగుతుంది. ట్రెమ్లెట్ తండ్రి కౌన్సిలర్ కూడా కావడంతో ఆ నేరం సాషా మీద మోపాలని ప్రయత్నించినా ఆమె నిజం చెప్పడంతో ఆ ముప్పు నుండి తప్పించుకుంటాడు సాషా. ఇక్కడ అలెక్స్ తల్లి ఓ పీజా పార్లర్ లో చెఫ్ గా కాకుండా డిష్ వాషర్ గా పని చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అలెక్స్ చదువుకుంటున్నా సరే ఎలాగోలా సంపాదించాలనే తాపత్రయంతో చెస్ మీద వారంతారాల్లో జరిగే బెట్టింగ్స్ లో ఇవాన్ అనే వ్యక్తి ప్రోద్బలంతో ఆడుతూ సంపాదిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇతని వల్ల చిక్కుల్లో పడే పరిస్థితులు ఉన్నా సాషా లానే తప్పించుకుంటాడు.

          ఇలా ఇద్దరి జీవితాలు ఎలా ఉన్నా సరే ముఖ్య ఘటనలు మాత్రం ఒకేలా ఉంటాయి. అందులో ఒకటి సాషా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ సంపాదిస్తాడు. ఆ తర్వాత యూనియన్ రాజకీయాల్లో పాత్రధారి అయ్యి మొత్తానికి తన ప్రత్యర్ధి అయిన హంటర్ తో మొదలైన ఈ పయనంలో చివరకు మెర్రిఫీల్డ్ డివిజన్ లో గెలుస్తాడు రెండోసారి. కానీ ఇక్కడ ముఖ్య సంఘటన ఏమిటంటే అతన్ని ఓడించడానికి అతన్ని ఇంటికి ఆహ్వానించి అతనే ఆమె దగ్గరకు వచ్చి ఓ ఫైల్ దొంగిలించాడని చెప్తుంది ఆమె. అలా రాజకీయాల్లో మొదటి సారి స్వల్ప తేడాతో ఒదినా రెండో సారి గెలుస్తాడు.        

          ఇక్కడ ఎలెక్స్ వ్యాపారం మీద దృష్టి సారించి మార్కెట్లో ఉన్న 11 స్టాల్స్ అద్దెలు కడుతూ వ్యాపారవేత్తగా కూడా ఎదుగుతున్న క్రమంలో అతను ఆర్మీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో అతని తల్లి,డిమిట్రీ వాటిని చూసినా వారికి అనుభవం లేకపోవడంతో నష్టపోతారు. ఆర్మీ నుండి తిరిగి వచ్చాక మళ్ళీ వాటిని లాభాలలో నడిపిస్తాడు. ఆ తర్వాత లోవేల్ అనే ఆర్మీ ఆఫీసర్ యుద్ధంలో తన ప్రాణాన్ని కాపాడిన అలెక్స్ పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటాడు. తన పుట్టినరోజుకి ఆహ్వానిస్తాడు.అతని చెల్లెలు ఎవ్లీన్ అతన్ని మోసం చేసి లోవేల్ కలక్షన్ లో ఉన్న పాయింటింగ్ తనదే అని చెప్పి దానికి ఐదు మిలియన్ డాలర్ల చెక్ తీసుకుని తనకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి,తర్వాతి రోజే భర్తతో కలిసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. విషయం తెలుసుకున్న లోవేల్ అలెక్స్ ను నమ్మి ఆ డబ్బు ఇచ్చి ఆ పెయింటింగ్ కూడా నకలు అని తెలుసుకుంటాడు. అప్పటికే అలెక్స్ రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు. అదే సమయంలో అతను గే అని నిరూపించే కొన్ని సాక్ష్యాలు ఎవ్లీన్ మీడియాకు ఇస్తుంది. లోవేల్ ఆత్మహత్య చేసుకుని మరణిస్తాడు. దానికి కారణం వేరే ఉందని అతని లాయర్ ద్వారా అలెక్స్ కు తెలుస్తుంది. లోవేల్ ఓ బ్యాంకును నడుపుతూ దానికి చైర్మెన్ గా ఉన్నప్పటికీ అతను నామమాత్రంగా మాత్రమే ఉండటం,అతని చెల్లెలు ,ఆకక్ది ఉద్యోగులైన ఆక్రోడ్ మరియు ఇంకొందరితో కలిసి బ్యాంకును నష్టాల పాలు చేయడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తుంది. లోవేల్ తన వీలునామాలో తన పెయింటింగ్స్ కలక్షన్తో పాటు తన తర్వాత బ్యాంకు చేయిర్మెన్ గా అలెక్స్ వ్యవహరించాలని చెప్పడంతో పాటు,తన ఆస్తులు కూడా అతనికే రాస్తాడు. సాషా కథలో అతన్ని హంటర్ ఇబ్బంది పెడితే ఇక్కడ అలెక్స్ ను ఎవ్లీన్ అలాగే ఇబ్బందులు పెడుతుంది.

          ఇటు అలెక్స్ బ్యాంకు సమస్యలన్నీ పరిష్కరించి,ఎవ్లీన్ కు బుద్ధి చెప్తాడు. ఆ బ్యాంకు వల్లే అతను తన స్వదేశానికి వెళ్తాడు. అలాగే ఇక్కడ సాషా తాను రాజకీయవేత్త అవ్వడం వల్ల రష్యా వెళ్తాడు. ఆ తరవాత అలెక్స్,సాషా ఇద్దరు ప్రేమించే వివాహం చేసుకుంటారు.

          ఆ తర్వాత అటు అలెక్స్ ,ఇటు సాషా తమ తల్లి అయిన ఎలీనా పేరుతో రెండు  రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారు. ఇలా ముఖ్య ఘటనలు మాత్రం ఇద్దరి జీవితాల్లో ఉంటాయి. రష్యాలో నాయకత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, అదే అలెగ్జాండర్ అక్కడి ప్రెసిడెంట్ గా పోటీ చేసి గెలవడానికి మంచి అవకాశం అని అటు సాషా కు ,ఇటు అలెక్స్ కు కూడా సన్నిహితులు చెప్పడంతో రష్యాకు పయనమవుతారు. సాషా విమాన పయనంలోనే వ్లాదిమిర్ తలపెట్టిన ప్రమాదం వల్ల కుటుంబంతో సహా మరణిస్తాడు. ఇకపోతే అలెక్స్ రష్యా లో అడుగుపెట్టాక ప్రజలు ఎంతో సానుకూలంగా స్పందించినా అతను తిరిగి వెళ్ళేటప్పుడు అప్పటి ప్రధాని వ్లాదిమిర్ తో కలిసి అతను తిరిగి వెళ్ళే విమానానికిప్రమాదం చేసి హత్య చేయాలనే ఆలోచన చేయడంతో నవల ముగుస్తుంది.

          పరిస్థితులు ,నిర్ణయాలు వేరైనా రెండు సందర్భాల్లో వారు ఎదుర్కున్న సంఘర్షణలు మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయి. ఈ నవల 2018 లో వచ్చింది. దీనికి సీక్వెల్ గురించి రచయిత ఏ ప్రకటన చేయలేదు. దీనికి ఇంకా కొనసాగింపు ఉన్నా లేకపోయినా సరే, జీవితంలో ఏది జరిగినా,దాని నుండి తప్పించుకోవాలని ప్రయత్నించేవారికి అది మరింత దగ్గరవుతుంది తప్ప దాన్ని అయితే మనం తప్పించలేము అనే సందేశం ఈ నవల స్పష్టం చేస్తుంది.  కొత్త తరహాలో 30 ఏళ్ల కాలాన్ని ఒకే పాత్రలతో రెండు విభిన్న ప్రాంతాల్లో నడపటం,ముగింపు దగ్గర కూడా అదే పట్టు ఉండేలా చూడటం నిజంగా ఈ నవలా రచయిత విశిష్టతే అని ఒప్పుకోక తప్పదు. జెఫ్రీ ఆర్చర్ అభిమాని మీరైతే తప్పకుండా చదవాల్సిన నవల ఇది.

                        *     *     *

         

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ