హ్యాండ్ మెయిడ్ జీవితం

 చదువరి

           హ్యాండ్ మెయిడ్ జీవితం

                            -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)


            మార్గరెట్ అట్వుడ్ రచించిన ద హాండ్ మెయిడ్స్ టేల్సంచలనం సృస్థించింది. ఇదిటెలివిజన్ సిరీస్ గా కూడా వచ్చింది. ఊహాజనికంగా రాసిన ఈ నవలలో అమెరికాను రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్  ఆక్రమించుకుని పూర్తిగా స్త్రీ స్వాతంత్ర్యాన్ని హరిస్తే, ఆఖరికి ఓ బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండకుండా ఉండాలనే నిబంధనల మధ్య అప్పటి వరకు ఉద్యోగాలు చేసుకుంటూ స్వేచ్చగా ఉన్న స్త్రీ ఒక్కసారిగా బానిసత్వంలో మగ్గాల్సి వస్తే ఎలా ఉంటుందో తెలియజేస్తూనే,ఎలా ఆ స్త్రీలను హ్యాండ్ మెయిడ్స్ గా తర్వాత మార్చారో,వారిని కేవలం తల్లులు కాలేని  ఆఫీసర్స్ కు పిల్లల్ని పుట్టించే యంత్రాలుగా ఎలా చేశారో ఆ పరిస్థితిని ఓ హ్యాండ్ మెయిడ్ తన జీవితపు కథలా చెప్పడమే ఈ నవల.

          ఆఫ్రెడ్  ఓ హ్యాండ్ మెయిడ్. సెరీనా జాయ్ గతంలో ఓ సింగర్. ఆమె భర్త ఓ కమాండర్. వారికి పిల్లలు లేరు. ఆ పిల్లల కోసం ఆఫ్రెడ్ ఎంచుకోబడుతుంది. ఆఫ్రెడ్ ఆమె అసలైన పేరు కాదు. ఆఫ్ అనే దానికి వారు ఏ కమాండర్ నియంత్రణలో ఉంటారో వారి పేరు ఆ హ్యాండ్ మెయిడ్ పేరుగా పరిగణించబడుతుంది. ప్రతి నెల ఎప్పుడైతే ఆఫ్రెడ్ నెలసరి అయ్యాక పిల్లల్ని పుట్టించగల రోజుల్లో ఉంటుందో సెరీనా జాయ్ పక్కన ఉండగా ఏ మాత్రం రోమాన్స్,మాటలు లేకుండా ఆ కమాండర్ తో సెక్స్ చేయాల్సి వస్తుంది. ఇది కేవలం పిల్లల్ని కనడం కోసమే తప్ప దీనిని ప్రేమగా ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాండ్ మెయిడ్స్ మార్చుకోకూడదు.అలా చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం. అందరి స్త్రీల స్వేచ్చలానే ఆఫ్రెడ్ స్వేచ్చ కూడా పూర్తిగా హరించబడింది. ఆమె కేవలం షాపింగ్ ,వాకింగ్ సమయాల్లో మాత్రమే బయటికి వెళ్ళే స్వేచ్చ ఉంటుంది.హ్యాండ్ మెయిడ్స్ ఉండే రూమ్స్ కూడా కిటికీలు కూడా దాదాపు మూసివెయ్యబడి ఉంటాయి. గిలియడ్ సీక్రెట్ పోలీస్ సర్వీస్ ఎప్పుడు వారి మీద నిఘా వేసి ఉంటుంది.

          ఆఫ్రెడ్ హ్యాండ్ మెయిడ్ గా తన జీవితాన్ని చెప్తునే తన గతాన్ని కూడా ఒకేసారి కాకుండా సందర్భానుసారం చెప్తూ ఉంటుంది. దాని ద్వారా పాఠకులు ఆమె జీవితాన్ని ఒక సంఘటన తర్వాత ఇంకో సంఘటనగా నిర్మించుకోగలుగుతారు. రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ రాక ముందు తన గత జీవితంలో ఆఫ్రెడ్ లూక్ అనే వివాహితుడితో సంబంధం కలిగి ఉంటుంది. ఆఫ్రెడ్ తల్లి స్త్రీవాది. ఆఫ్రెడ్ స్నేహితురాలు మొయిరా స్వంతంత్రవాది. పెరుగుతున్న పొర్నోగ్రఫీ,వ్యభిచారం,అత్యాచారాలు, పెరుగుతున్న కాలుష్యం వల్ల తగ్గుతున్న స్త్రీ ఉత్పత్తి వ్యవస్థ మూలాలుగా రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ అవతరించింది. మిలిటరీ సాయంతో ప్రెసిడెంట్ ను,కాంగ్రెస్ సభ్యులను హత్య చేసి ఓ  కూప్ ప్రకటించి తమ అధికారాన్ని తాత్కాలికంగా ప్రకటించుకుంది రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్. స్త్రీల హక్కులు,ఉద్యోగాలు చేసే స్వేచ్చ,ఆర్థిక స్వాంతంత్ర్యం అన్నీ హరించింది. ఆ పరిస్థితుల్లో ఆఫ్రెడ్ లూక్ మరియు తన కూతురుతో కలిసి సరిహద్దు దాటి కెనడా వెళ్ళే ప్రయత్నం చేయబోతుండగా వారిని పట్టుకున్న రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ అందర్నీ వేరు చేసింది.నాటి నుండి ఆఫ్రెడ్ లూక్ ను,తన కూతురిని చూడలేదు.

          ఆఫ్రెడ్ ను పట్టుకున్నాక ఆమెను రెడ్ సెంటర్ కు పంపిస్తారు.అక్కడ రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ సిద్ధాంత మూలాలను బోధించి, హ్యాండ్ మెయిడ్ గా మారడానికి కావల్సిన  శిక్షణ ఇస్తారు. ఆంట్ లిడియా అక్కడి హ్యాండ్ మెయిడ్స్ కు సూపర్ వైజర్ గా వ్యవహరించింది. మొయిరా ను కూడా అదే సెంటర్ కు తీసుకువచ్చినా ఆమె అక్కడి నుండి తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఆమె గురించి ఆఫ్రెడ్ కు తెలియదు.

          శిక్షణ పూర్తి అయ్యాక ఆఫ్రెడ్ ను ఓ కమాండర్ కు హౌస్ మెయిడ్ గా అప్పగిస్తారు.అప్పటి నుండి ఆమె రొటీన్ నార్మల్ అయిపోతుంది. రోజు అఫ్గ్లెన్ అనే ఇంకో హ్యాండ్ మెయిడ్ తో కలిసి షాపింగ్ కు వెళ్ళి రావడం, అలా బయటకు వచ్చినప్పుడు ఒకప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీగా ఉన్న సంస్థ గోడ మీద ఎవరైతే రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వారిని ఉరి తీసి అక్కడే వారి శవాలను వేలాడదిస్తారు. షాపింగ్ కు వెళ్ళిన ప్రతి సారి మారే శవాలను చూస్తూ ఉంటుంది ఆఫ్రెడ్. ఆఫ్రెడ్ తరచుగా డాక్టర్ దగ్గరకు  వెళ్ళాల్సి వస్తుంది. డాక్టర్ ఆమెకు తాను ఆమెను గర్భవతిని చేస్తానని చెప్తాడు. ఒకవేళ కమాండర్స్ వల్ల సంతానం కలగకపోతే దొంగచాటుగా ఇంకోలా సంతానం పొందే ప్రయత్నం చేయడం కూడా సహజమే.కానీ పట్టుబడితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.అందుకే డాక్టర్ ను తిరస్కరిస్తుంది ఆఫ్రెడ్.

          అలా రొటీన్ గా ఉంటున్న ఆమె జీవితంలో ఓ మార్పు వస్తుంది. కమాండర్ తన కార్ డ్రైవర్ అయిన నిక్ ద్వారా తనను తన ఆఫీసులో రాత్రి కలవమనే సందేశం పంపిస్తాడు. వెళ్ళాక ఆమెతో స్క్రిబుల్ ఆడతాడు. ఇంకా ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఆమెకు నిషేదించబడిన పత్రికలు చూపిస్తాడు. ప్రతి రాత్రి వెళ్ళే ముందు ఆమెను ముద్దు పెట్టుకోమని మాత్రం అడుగుతాడు.

          షాపింగ్ కు అఫ్గ్లెన్ తో కలిసి వెళ్తున్న  సమయంలో ఆమె మే డే సభ్యురాలని ఆఫ్రెడ్ కు చెప్తుంది. మే డే అనే రహస్య సంస్థ రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ కు వ్యతిరేకంగా పని చేసే సంస్థ. ఓ సారి రాత్రి కమాండర్ దగ్గరకు వెళ్లినప్పుడు అతను ఆమెను తన భార్య సెరీనా మేకప్ ,మరియు కొన్ని దుస్తులు తెచ్చి ఆమెను వేశ్యలా తయారు చేసి కమాండర్స్ మాత్రమే తమ అక్రమ సంబంధం కలిగిన స్త్రీలతో వెళ్ళే పబ్ కు తీసుకువెళ్తాడు. అంతకు పూర్వం కూడా ఓ స్త్రీతో అతను సన్నిహిత సంబంధం కలిగి ఉండటం గ్రహించిన అతని భార్య ఆమె మరణించేలా చేసిందని కూడా చెప్తాడు. అక్కడ మొయిరాను కలుస్తుంది ఆఫ్రెడ్. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసిన చివరకు ఇక్కడ ఇలా ఉండాల్సి వచ్చిందని ఆమెకు తెలుస్తుంది.

          సెరీనా ఆఫ్రెడ్ ను పిలిపిస్తుంది.ఆమె దాదాపు ముప్పయి దాటి ఉండటంతో ఇక ఎక్కువకాలం పిల్లల్ని కనే పరిస్థితులు ఉండకపోవడం వల్ల నిక్ తో కనమని అడుగుతుంది. సెరీనా ప్రోద్బలంతో అలానే అతన్ని రాత్రుళ్లు రహస్యంగా కలుస్తూ ఉంటుంది ఆఫ్రెడ్. ఇక అఫ్గ్లెన్ మే డే సభ్యురాలు అని తెలియడంతో ఆమెను రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ కు పట్టించారని తెలుస్తుంది. తర్వాతి రోజు షాపింగ్ కు వెళ్ళేటప్పుడు ఇంకో హౌస్ మెయిడ్ ఆమె బదులు ఉంటుంది.ఆమె ద్వారా పట్టుబడే పరిస్థితి వచ్చిందని తెలుసుకున్న అఫ్గ్లెన్  ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది.

          సెరీనా తన దుస్తుల మీద ఉన్న మేకప్ వల్ల ఆఫ్రెడ్ గురించి తెలుసుకుని ఆమెను శిక్షిద్దామనుకున్న సమయంలో ఓ బ్లాక్ వాన్ వస్తుంది. అది మే డే వారిదని,దాని ద్వారా ఆమె తప్పించుకోవచ్చని నిక్ ఆమెతో చెప్తాడు.అలా ఆమె ఆ వ్యాన్ లో వెళ్లిపోవడంతో ఆమె కథ ముగుస్తుంది. కానీ ఆ తర్వాత ఆమె స్వేచ్చను పొందిందా లేకపోతే ఆమెకు ఏమైంది అన్నది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోతుంది.

          ఇక నవల చివరలో 2195 లో రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ పడిపోవడం అన్న విషయాన్ని  ప్రొఫెసర్ పిక్సెటో ఇచ్చిన ఉపన్యాసంలో పాఠకులు తెలుసుకుంటారు. గిలియడ్ సిద్ధాంతాలు,ఆచారాల గురించి చెప్తూ,ఆఫ్రెడ్ జీవితం గురించి చెప్తూ,నిక్ ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఆ తర్వాత ఆమె తప్పించుకుండా లేక మళ్ళీ పట్టుబడిందా అన్నది మాత్రం ప్రశ్నార్ధకమే అని చెప్పడంతోనే ఇది కూడా ముగుస్తుంది.

          రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్ అనే ఊహాజనిత నియంత ఎలా స్త్రీలను బానిసత్వంలోకి మరల్చి,ఆమె జీవితాన్ని ఎలా నియంత్రించారో అన్నది కూడా ఊహే అయినప్పటికీ,ఇంకా నేటి ప్రపంచంలో దాదాపు అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్న,గతంలో కొన్ని రాజ్య సంప్రదాయాల కోసం అలా జీవించిన స్త్రీల జీవితాలు మాత్రం మనకు ఈ ఊహాలోనే వాస్తవంగా కనిపిస్తాయి. లైట్ రీడింగ్ నవల మాత్రం ఇది కాదు.సీరియస్ గా చదువుతూ,మధ్యలో ఎక్కువ సంఘటనలను కేవలం పరసరాల వర్ణనతో సాగించే నవల. అందుకే కథ తక్కువే అయినా ఆ పరిస్థితులు మాత్రం పాఠకుల మనసుల్లో నిలిచిపోతాయి.

  *    *   *

Comments

Popular posts from this blog

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ

గాజుబొమ్మ