కొత్త రూపం

 సీజనల్ సమీక్షలు

                కొత్త  రూపం

                        -రచనశ్రీదత్త (శృంగవరపు రచన)  



           గ్రాండ్ హిట్ అయిన బ్రీత్ -1 తర్వాత  రెండేళ్ళకు విడుదలైన బ్రీత్-2 లో ముఖ్య పాత్రలుగా  అభిషేక్ బచ్చన్ ,నిత్యా మీనన్ నటించారు.బ్రీత్-1 లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన కబీర్ సావంత్ మాత్రం ఈ సిరీస్ లో కూడా అదే పాత్రలో నటించాడు. ఇది కూడా మొదటి తండ్రి,బిడ్డల మధ్య ఎమోషన్ లానే ప్రారంభించినా కథ నడిచేసరికి కాస్త గందరగోళం ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉంటుంది. బ్రీత్-1 స్థాయిలో బ్రీత్-2 లేదని మాత్రం చెప్పవచ్చు.

          అవినాష్ సబర్వాల్ ఢిల్లీ లో ఓ సైకియాట్రిస్ట్. అతనికి ఓ ఆరేళ్ళ కూతురు,సియా.ఆ పాప బాల్యం నుండే డయాబెటిక్.  ఓ రోజు బర్త్ డే పార్టీకి వెళ్ళిన ఆ పాప కిడ్నాప్ కు గురవుతుంది. దాదాపు ఎన్నో నెలలు ఆ కిడ్నాపర్ నుండి ఫోన్ కూడా రాదు. తర్వాత దాదాపు ఆశలు వదులుకున్నాక వారికి ఓకొరియర్, ఫోన్ కాల్ వస్తాయి. వారి పాప వారికి దక్కాలంటే ఓ వ్యక్తిని హత్య చేయాలన్నది  దాని సారాంశం. ఆ వ్యక్తి పేరు ప్రిత్పాల్ సింగ్. అతని మరణానికి కారణం అతని కోపం కారణం అవ్వాలన్నది కూడా ఆ కిడ్నాపర్ స్పష్టం చేస్తాడు.

          తన కూతుర్ని కాపాడుకోవడానికి ఆ హత్య చేయాలని నిర్ణయించుకుంటాడు అవినాష్. అతని భార్య అభా కూడా అందుకు అంగీకారం తెలుపుతుంది. ప్రిత్పాల్ సింగ్ ను ఫాల్ చేశాక అతనికి ఉన్న బలహీనత అతి శుభ్రత అని అర్ధమవుతుంది అవినాష్ కు. అతను ఓ కిచెన్ వేర్ నడుపుతూ ఉంటాడు. ఆఖరికి కరెన్సీ నోట్లను కూడా నీళ్ళతో కడిగి ఆరబెడతాడు అతను. అతని ఇంటి ముందు చెత్త వేసి, అతని కారులో పావురాలను వదిలి,అతనికి ఎంతో కోపాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు అవినాష్. ఆఖరికి అతన్ని ఆ పట్టణంలో  ఉన్న అతి పెద్ద చెత్త కుప్ప దగ్గరకు తీసుకు వెళ్ళి అతన్ని హత్య చేస్తాడు.ఆ సమయంలో ముందు ప్రిత్పాల్ సింగ్ తన పెన్నుతో పొడిచి తప్పించుకోవాలని కూడా చూస్తాడు. ఆ హత్యా వీడియోను హంతకుడు పంపమన్న నంబర్ కు వాట్సప్ చేస్తాడు అవినాష్. దానిలో ఓ ప్రోక్లైనర్ తో చంపినట్టు ఉంటుంది తప్ప ఎక్కడ హంతకుడు ఉండకుండా చూసుకుంటూ ఉంటాడు అవినాష్.

            కబీర్ సావంత్ ముంబై నుండి ఢిల్లీ  బదిలి మీద వస్తాడు. ఆ కేసు గురించి డిస్కషన్ జరుగుతున్న సమయంలో అతను మాత్రమే ప్రిత్పాల్ సింగ్ పెన్ మిస్సవ్వడం గుర్తించిన పై అధికారి ఆ కేసును అతనికి అప్పగిస్తాడు.అప్పటికే పోలీసులకు ఎన్నో కేసుల ఇన్వెస్టిగేషన్లో సహకరించిన అవినాష్ ఈ కేసులో కూడా తనకు తానే జాయిన్ అవుతాడు.

          అవినాష్ కు హంతకుడు ఆ హత్య తర్వాత నటాషా అనే లెస్బియన్ రచయిత్రిని హత్య చేయమని, ఆ హత్యకు కారణం కామం అయ్యి ఉండాలని చెప్తాడు. ఆమె లెస్బియన్ అవ్వడంతో అతని భార్య అభా ఆమెను కలిసి ఆమెను ఆకర్షించి ఓ ట్రిప్ కు వెళ్లినప్పుడు ఆమెను హత్య చేసే వాతావరణం కల్పించినప్పుడు అవినాష్ ఆమెను కారుకు కట్టేసి దానిని తోసేసి యాక్సిడెంట్ లా చేసి ఆ హత్యా వీడియో హంతకుడికి పంపిస్తాడు.కానీ ఈ హత్య చేసే ముందు ఆమెతో కలిసి ఓ హోటల్ కు వెళ్లినప్పుడు నటాషా పడుకున్నప్పుడు ఆమె ఫోన్లో తనతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసే క్రమంలో వీడియో ఓపెన్ అయ్యి ఓ బ్లర్ వీడియో ఫార్వార్డ్ అవుతుంది.  ఆ వీడియోలు అన్నీ మీడియాకు పంపించడం వల్ల మీడియా కూడా ఈ కేసుల పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది. ఇకపోతే కబీర్ సావంత్ ముంబై లో ఓ కేసు డీల్ చేస్తున్న సమయంలో ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆమెను తోసెయ్యడం వల్ల ఆమె కాళ్ళు పోతాయి.ఆమె మేఘన.

          ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్న కబీర్ సావంత్ కు ఆ  బ్లర్ వీడియోలో కనిపించిన హోటల్ మెనూ ద్వారా ఆ హోటల్ గురించి తెలుసుకుని అక్కడికి వెళ్తాడు.అక్కడ అభా లిప్ బామ్ ఉండిపోతుంది. దానిని సేకరిస్తాడు కబీర్.కానీ ప్రయాణం మధ్యలో దానిని మార్చి ఇంకో లిప్ బామ్ ను దాని స్థానంలో ఉంచుతాడు అవినాష్. ఇక ఈ సీజన్ లో సరిగ్గా మధ్యలో ఎపిసోడ్ లోనే ఇవన్నీ చేస్తుంది అవినాషే అని ప్రేక్షకులకు తెలుస్తుంది.

          అవినాష్ బాల్యంలోనే తల్లిని తండ్రి వేధించడం, ఆ తర్వాత యాక్సిడెంట్ లో వారు మరణించడం,అనాధగా పెరగడం,స్కూల్ లో పిల్లలు ఏడిపించడం వల్ల ఎంతో మనోవ్యధకు గురి అయిన సమయంలో అతనిలో స్ప్లిట్ పర్సనాలిటీ వస్తుంది. అతనిలో ఉన్న రెండో పర్సనాలిటీ  జే. జే గురించి అవినాష్ కు తెలియదు,కానీ అవినాష్ గురించి జేకు తెలుసు. అవినాష్ ను బాల్యం నుండి ఎవరైతే వేధించారో వారినే టార్గెట్ గా పెట్టుకుని అవినాష్ చేతే ఈ హత్యలు చేయిస్తూ ఉంటాడు జే.

          ఇక తర్వాత చేయాల్సిన హత్య అవినాష్ కు బాల్యం లో మిత్రుడైన హిమన్ షూ. కారణం భయం. బాల్యంలో అవినాష్ కు రూమ్ మేట్ మరియు అతని స్నేహితుడు అవినాష్ కు అనారోగ్యం ఉన్నప్పుడూ ఆ హాస్టల్ లో మందులు తీసుకు రావడానికి వెళ్తాడు. హిమన్ తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానని తెలిసి ఆ పరీక్ష పేపర్లు తగులబెట్టడానికి వెళ్తాడు.అదే సమయంలో లోపల అక్కడ మందులు తీసుకుంటూ అవినాష్ స్నేహితుడు అక్కడే ఉండిపోతాడు. దాని వల్ల అతను మరణిస్తాడు. దానికి జెయిల్ శిక్ష కూడా అనుభవిస్తాడు హిమన్. ఆ తర్వాత జెయిల్ లో ఉన్నప్పుడూ అక్కడ తోటి వారి నుండి ఎన్నో లైంగిక వేధింపులు ఎదుర్కుంటాడు హిమన్.అందుకే అతనికి చీకటి అంటే భయం.అవినాష్ లో ఉన్న జే గురించి తెలిసిన వారు ఇద్దరు.ఒకరు అతన్ని కొడుకుగా భావించి అతని తల్లిదండ్రులు మరణించినప్పటి నుండి అతని స్కూల్ లో హెడ్ మాస్టర్ గా ఉన్న కృష్ణ మూర్తి. ఇంకొకరు అతని వైలెంట్ ప్రవర్తనకు అసెస్ చేయడానికి  వచ్చిన సైకియాట్రిస్ట్. అవినాష్ ను కాపాడటానికి జే అవసరమని భావించిన కృష్ణమూర్తి జేను కూడా కొడుకులానే చూసుకుంటాడు.

          ఇకపోతే ప్రిత్పాల్ సింగ్ పెన్ దొరుకుతుంది. ఆ పెన్ మీద ఉన్న డిఎన్ ఏ ను ఎలాగో మార్పిస్తాడు అవినాష్. అవినాష్ హాస్టల్ లో  ఉన్నప్పుడూ నటాషా ఢిల్లీ నుండి నైనిటాల్ సెలవులకు వచ్చేది. ఆ సమయంలో అతనితో కలిసి అతను వారించినా అతని హాస్టల్ కు వచ్చి, పట్టుబడినప్పుడు అతనే బలవంతం చేసినట్టు చెప్తుంది. అవినాష్ బాల్యంలో ఓ కుక్క పిల్లను పెంచుకుంటాడు. ఆ పక్కనే ఉన్న హోటల్ కు వచ్చిన ప్రిత్పాల్ సింగ్ ఎంతో కోపంతో కార్ దారివ్ చేస్తూ చూసుకోకపోవడం వల్ల ఆ కారు కింద పడి ఆ కుక్కపిల్ల మరణిస్తుంది. ఇలా హత్యలకు ఎంచుకున్నవారందరు అవినాష్ గతంలోని వారే.

          సియాను కిడ్నాప్ చేయకముందే ఆమెను చూసుకోవడానికి గాయత్రి అనే మెడికల్ స్టూడెంట్ ను కూడా కిడ్నాప్ చేస్తాడు జే. వారు తప్పించుకునే ప్రయత్నం చేసినా అది తిప్పి కొడతాడు. ఆ తర్వాత జే ఓ వేశ్య అయిన షిర్లిని ఇష్టపడతాడు.ఆమె అతన్ని ఇరికించి తప్పించుకునే అవకాశం ఉన్న సరే నిజాయితీగా ఉండటం అతన్ని ఆకర్షిస్తుంది. కానీ అభా ఆమె ఒక్కర్తే ఉండటం చూసి ఆమెకు కూడా లిఫ్ట్ ఇస్తుంది. అభాను పిక్ చేసుకోవడానికి వచ్చిన అవినాష్ మాత్రం షిర్లితో అపరిచితుడిగానే ప్రవర్తిస్తాడు.అతనికి పెళ్లి కాలేదనుకున్న షిర్లి అది అబద్ధం అని తెలియడంతో అతని నుండి విడిపోవాలనుకుంటుంది. వేశ్యగా మానేసి అతన్ని పెళ్లి చేసుకుందామనుకున్న ఆమె బాధ పడుతుంది.తర్వాత హిమన్ ను కూడా అవినాష్ హత్య చేస్తాడు. అవినాష్ లో జే ఉన్నప్పుడూ అతను కుంటుతాడు.  

          నైనిటాల్ వెళ్ళి  జే గురించి కూడా తెలుసుకుని అవినాషే హంతకుడని గుర్తిస్తాడు కబీర్. చివరకు సియాను,గాయత్రిని రక్షించి జేను సైకియాట్రిక్ ఇన్ స్టిట్యూషన్ కు పంపిస్తాడు కబీర్. మూడేళ్ళ తర్వాత అభా అతన్ని కలవడానికి వస్తుంది.ఇప్పుడు తనలో జే లేడని చెప్తాడు అవినాష్.కానీ అప్పటికే అతనితో విడిపోదామనే నిర్ణయించుకున్నానని అభా చెప్తుంది. ఆ తర్వాత షిర్లి అతన్ని కలవడానికి వచ్చినప్పుడు ఓ స్లీప్ మీద C 16 అని రాసి ఇస్తాడు. అతను అప్పుడు మళ్ళీ కుంటుతూ నడవటంతో సీజన్ పూర్తి అవుతుంది. ఆ సి16 గురించి ఏమి చెప్పకుండానే ఈ సీజన్ ముగుస్తుంది.

          ఎంతో అస్పష్టత,గందరగోళం ఉన్న సీజన్-2 మాత్రం సీజన్-1 లాగా తండ్రి బిడ్డల మధ్య కాకుండా వ్యక్తి లోపలి వ్యక్తిని కాపాడే ఇంకో వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణగా మార్చినప్పటికీ ఎందుకో సీజన్ 1 ఇచ్చిన ఫీల్ ఇవ్వడంలో సీజన్ 2 విఫలమైందనే చెప్పాలి. మధ్యలో అయిపోయినట్టు ఉన్న సీజన్ తర్వాత కొనసాగుతుందనే భావనను సి16 మిస్టరితో ముగించి దర్శకుడు చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది.రెండు సీజన్స్ లోనూ హాలీవుడ్ స్థాయి చంపే పద్ధతులు కనిపిస్తాయి.సెవన్ , నాట్ సే ఏ వర్డ్ లాంటి సినిమా మూలాలు ఈ సీజన్-2 లో కనిపిస్తాయి.

   *    *    *

         

Comments

Popular posts from this blog

మరణ శిక్షలు లేని కలల లోకం!

మనిషిలో తాత్వికత

డబ్బున్నవారి కథ