పసుపు-కుంకుమ
లఘు చిత్ర లోకం
పసుపు-కుంకుమ
-రచనశ్రీదత్త
(శృంగవరపు రచన)
మరాఠి లఘు
చిత్రాల్లో సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత జి.ఏ.కులకర్ణి కథ రాసిన చైత్ర అనే కథ
లఘు చిత్రంగా వచ్చి ప్రశంసలు పొందింది. 2002 లో మూడు జాతీయ పురస్కారాలు పొందిన లఘు
చిత్రం ఇది. పశ్చిమ భారతీయ రాష్ట్రాలైన పుంజాబ్, మహారాష్ట్ర వంటి
రాష్ట్రాల్లో ‘హల్ది-కుంకుమ్’
(పసుపుకుంకాలు)ఉత్సవాన్ని స్త్రీలు తమ మాంగల్య సౌభాగ్యం కోసం ప్రతి సంవత్సరం తమ
ఆర్థిక తాహతుకు తగ్గట్టుగా తమ వీధిలో వారిని లేదా ఊరిలో వారిని పిలిచి ధాన్యం
ఇచ్చి, పసుపు-కుంకుమ ముత్తయిదువకు ఇచ్చి పంపిస్తారు.
ఈ
ఉత్సవం జరుగుతున్నప్పుడు ఉదయమే ఎవరు ఆ ఉత్సవం చేస్తున్నారో దండోరా ద్వారా
తెలియజేస్తారు. ముత్తయిదువులు కచ్చితంగా ఆ ఉత్సవానికి వెళ్తారు. అలా నాయక్ కుటుంబం
ఆ ఉత్సవం జరుపుకుంటుంది. అందరూ స్త్రీలు వచ్చారు. వారిలో ఓ స్త్రీ అయిన చైత్రతో ఆ
ఉత్సవం చేస్తున్న ఇంటి కోడలు దురుసుగా వ్యవహరిస్తుంది. ఇలాంటి వారు పదే పదే ధాన్యం
కోసం వస్తూనే ఉంటారని,ఆమె అంత క్రితమే వచ్చినా మళ్ళీ వచ్చిందని నిందిస్తుంది. దాని
వల్ల అవమానం పొందిన చైత్ర ఇంటికి ఒట్టి చేతులతో తిరిగి వస్తుంది.
తన
భర్తకు తన నగలు ఇచ్చి అవి అమ్మమని చెప్తుంది. అలా అమ్మగా వచ్చిన డబ్బుతో ఆ
ఊరందరిని పిలిచి పసుపుకుంకాల అవమానానికి సమాధానంగా ఉత్సవం చేస్తుంది. ఆ
ఉత్సవానికి వచ్చిన నాయక్ కుటుంబంలో పెద్దావిడ, తన కోడలి నోటి
దురుసుతనానికి క్షమించమని కోరుతుంది. ఆ తర్వాత సంవత్సరం నాయక్ కుటుంబాపు పెద్దావిడ
ప్రత్యేకంగా చైత్రను ఆహ్వానించడానికి వస్తుంది.ఆమె రాక గమనించిన చైత్ర లోపలికి
వెళ్ళి,తన కొడుకును ఆమెకు తాను స్నానం చేస్తున్నట్టు
చెప్పమని,కుంకుమ మర్చిపోకుండా పెట్టమని చెప్తుంది. అలాగే ఆ
కొడుకు చేస్తాడు. రమ్మని ఆహ్వానించి ఆమె వెళ్లిపోతుంది.
ఆ
తర్వాత ఆమె కొడుకు ఆమెను ఎందుకు తమ తండ్రి మరణాన్ని ఆమెకు తెలియకుండా ఉంచావని
అడగటంతో మనకు ఆమె భర్త మరణించినట్టు తెలుస్తుంది. తన ఆత్మగౌరవాన్ని
నిలుపుకోవడానికి ఆమె ఘనంగా ఉత్సవం చేసినప్పటికీ తదుపరి సంవత్సరానికి అసలు ఆ ఉత్సవం
చేసుకోవడానికి కావలసిన మాంగల్యమే ఆమెకు లేకపోవడం విషాధం అని ఈ కథ ద్వారా చెప్పడంతో
ముగుస్తుంది.
విభిన్న
కథలతో వస్తున్న లఘు చిత్రాలు మనకు అతి తక్కువ సమయంలో ఎన్నో విషయాలు ఆలోచించేలా
చేస్తాయి. అటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. మనుషుల మధ్య ఆత్మగౌరవ,అభిమాన
ఉనికి ప్రశ్నార్ధకంగా మారినప్పుడు ఆ మనిషి ఎలా ప్రవర్తిస్తాడో స్పష్టం చేసే కథ. తన
భర్త మరణాన్ని కూడా దాచిన వైనం మనుషుల్లో తమ ఉనికిని నిలబెట్టుకోవాలన్న తపన ఏ
మేరకు ఉందో స్పష్టం చేస్తుంది.
* * *

Comments
Post a Comment