ఉద్యోగస్థురాలు
చదువరి
ఉద్యోగస్థురాలు
-రచనశ్రీదత్త (శృంగవరపు రచన)
కొన్ని
కథలు వ్యథలు చెప్పుకుంటాయి. ఇంకొన్ని ఆ వ్యథలు అర్ధరహితమేనని కూడా తేలుస్తాయి.
ఇంకొన్ని వాస్తవం వేరని, ప్రత్యక్ష అనుభవం లేనివన్ని భ్రమలే అని
కూడా చెప్తాయి. ఈ మూడు కోణాల్లో తన కథలను రాసిన రచయిత పెనుమాక నాగేశ్వరావు గారు.
ఆయన కథల్లో ఓ మంచి కథ ‘ సుమతి -వసుమతి.’ ఉద్యోగం
చేయని స్త్రీ, ఉద్యోగాలు చేసే స్త్రీలు జీవితంలో తమ నిర్ణయాలను అనుసరించి తమ ఉనికితో
జీవితం సాగిస్తారని,దానికి కారణం ఆర్థిక స్వాతంత్ర్యం అని
భావిస్తారు.కానీ అందులో ఉన్న సత్యాన్ని ఇద్దరు స్నేహితురాళ్ళ జీవితాల ద్వారా
స్పష్టం చేసే కథే పెనుమాక నాగేశ్వరరావుగారి ‘ సుమతి -వసుమతి.’
సుమతి,
వసుమతి స్నేహితురాళ్ళు. ఇద్దరికి వివాహాలు అయ్యాయి. ఈ ఇద్దరిలో సుమతి గృహిణి అయితే,వసుమతి ఉద్యోగస్థురాలు. సుమతి తన జీవితం గురించి చెప్తూ వసుమతికి లేఖ
రాస్తుంది. తనకు ఉద్యోగం చేయాలనే కోరిక గాఢంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి అనారోగ్యం
కారణంగా వివాహం చేసుకుంది సుమతి.వివాహమయ్యాక ఏది కావాలన్నా భర్త మీద
ఆధారపడాల్సిందే అని, చేతికి రూపాయి ఇవ్వరని, తనకు ఏది అవసరం అనిపిస్తుందో తెస్తారు తప్ప,దాని
గురించి కూడా తనతో తన భర్త చెప్పడని, దీనికి కారణం తనకు
ఉద్యోగం లేకపోవడం వల్లే అని, ఉద్యోగం చేస్తున్న వసుమతి చాలా
అదృష్టవంతురాలని,ఆమెకు ఆ ఉద్యోగం ద్వారా ఎంతో స్వేచ్చ
లభిస్తుందని రాస్తుంది సుమతి.
స్త్రీకి
స్వేచ్చ భర్త మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప ఆమె సంపాదన మీద మాత్రం కాదని,
తాను ఉద్యోగం చేస్తున్న తన భర్తకు ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని,వాటిని ఖ్రచు చేసే విషయంలో తనకు ఏ స్వేచ్చ లేదని,
సుమతి భర్త లానే అతను కూడా నిర్ణయాలు తానే తీసుకుంటాడు తప్ప తనతో ఏది చర్చించడని
స్పష్టం చేస్తుంది వసుమతి తన సమాధానంలో. అష్టకష్టాల్లో ఒకటైన ‘ శత్రు స్నేహం’ వల్ల కొన్ని సార్లు అభిప్రాయ భేధాలు
ఉన్న వ్యక్తులతో వృత్తి లేదా ప్రవృత్తి రీత్యా స్నేహం చేయాల్సి వస్తుందని, చాలా మంది ఆడవారు అదే రకపు స్నేహాన్ని కొనసాగిస్తున్నారని రాస్తుంది
వసుమతి. అంతే కాకుండా ఇంట్లో పనులు చేసే ఆడవారు కూడా డబ్బు సంపాదిస్తారు,అలానే భర్తకు మాట ఎదురు చెప్పకుండా ఆ డబ్బు ఇచ్చేస్తారు కొందరు.
అయినంతమాత్రాన వారికి స్వేచ్చ ఉన్నట్టా ? అని ప్రశ్నిస్తుంది
వసుమతి ఆ లేఖలో. సంస్కారవంతుడైన మగవాడు భర్తగా వస్తే తప్ప స్త్రీకి ఆ ప్రత్యేక
ఉనికి, గౌరవం ఉండదనే అభిప్రాయంతో వసుమతి లేఖ ముగిస్తుంది.
మనిషికి
సంపాదన వల్ల కాక ఆ మనిషి తన ఉనికి కోసం ఏ మేరకు పోరాడతాడు అనే విషయం మీదే అతని
ఉనికి,గౌరవం,స్వేచ్చ ఆధారపడతాయి కానీ కేవలం సంపాదన మీద
మాత్రం కాదు. ఈ అంశం స్త్రీ-పురుషులిద్దరికీ వర్తిస్తుంది. ఏ మేరకు జీవితంలో
సర్దుకుపోవాలి,రాజీపడాలి అనే విషయం పట్ల స్పష్టత లేకపోతే
ఎవరైనా తమ జీవితంలో అసంతృప్తి వలయంలో కొట్టుమిట్టాడుతూ,
పరాధీన భావనతో బాధపడాల్సిందే.
ఓ
కథ మనుషుల్ని ప్రశ్నించాలి,ఆలోచింపజేయాలి,పరిష్కారం
ఏమిటో కూడా కొన్ని సార్లు సూచించగలగాలి. ఇటువంటి సమస్యలు వ్యక్తిత్వ మూలాల్లో
నుండే జన్మిస్తాయి,ఆ వ్యక్తిత్వ బలంతోనే పరిష్కరించబడతాయి.
ఒకవేళ మనిషి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ప్రస్తుత జీవితం చిందరవందర కూడా
కావచ్చు,కనుక ఏది తనకు మేలు చేస్తుంది అన్నది ఆ వ్యక్తికి
సంబంధించినదే.
* * *

Comments
Post a Comment